Previous Page Next Page 
మారనికాలంలో మారినమనుషులు పేజి 6

    "బరితెగించి మాట్లాడుతున్నావ్ పారూ! అది నీకే నష్టం. నావద్ద నుంచి కానీరాదు. నా ముఖంనీకు చూపించను. ఎలా బ్రతుకుతావో బ్రతుకు".
    మధుసూదనానికి పార్వతిని ఎడాపెడా వాయించాలనిపించింది. ఏ మూలో తన తప్పున్నట్లు తోచి వెనక్కు తగ్గాడు. బ్రతిమిలాడితే ఆడవాళ్ళు లొంగిపోతారు. జాలిగా ముఖంపెట్టి ప్రేమగా మాట్లాడుతూ దగ్గరకు లాక్కున్నాడు పార్వతిని.
    పార్వతి విసురుగా మధుసూధనం చేతులు త్రోసి అవతలకి జరిగింది. కోపంతో పొగలుకక్కుతూ "నా విషయంలో ఇంతవరకూ మీరు చేసిన ఘనకార్యం చాలు. నా భార్య, నా పిల్లలు అనుకున్ననాడు నేనే మీ దగ్గరకు వస్తాను." తిరస్కారంగా అంది.
    "సరే, ఆడదానివి నీవే అంత అహం ప్రదర్శిస్తుంటే, నాకేం పట్టింది. "క్షమించండి నాది పొరపాటయింది, అని నీవన్ననాడే తిరిగి నీ ముఖం చూచేది. గుర్తుంచుకో" అని విసురుగా పెద్ద పెద్ద అంగలేస్తూ బైటికి వెళ్ళిపోయాడు మధుసూదనం.
    ముఖం దోసిట్లో కప్పుకుని నుంచున్న చోటే కింద కూలబడింది పార్వతి.
                                                                                  5
    "ఎప్పటికీ నీమేలు మరచిపోను సరోజా!" సజల నయనాలతో అంది పార్వతి.
    "నువ్వుత్తపిచ్చిదానివే పారూ! కష్టపడ్డావ్ ఉద్యోగం సంపాదించావు. నే చేసిందేముంది?" సరోజ నవ్వుతూ అంది.
    "నీదేంలేదూ? ఎంత నిగర్విగా అంటున్నావే. వారు ఇంటికివస్తే," అతగాడితో గట్టిగా తేల్చేయి నెలకి వంద పైన పంపుతాడో, నిన్ను తీసుకెళతాడో తేల్చుకొని నాతో చెప్పు అన్న పిన్ని, వారు నన్ను కాదని వెళ్ళిపోయారని తెలిసి నానా మాటలంది. మొగాడిని రెచ్చగొట్టి యింట్లోంచి తరిమేయటం ఓ తెలివేనా? ఒకసారి ఇంటిమొహం చూచిన వాడిని పదేపదే వచ్చేటట్లుచేయాలిగాని! అయినా ఆ అవసరం నీ కెందుకు. నీకు నీ పిల్లలకూ దర్జాగా జరిగిపోతూందాయె" అంటూ నిముషానికొకసారి సాధింపు. ఆ తరువాత తిండికి మొహంవాచిన పిల్లలగోల అవసరానికి తలవొగ్గి బ్రతుకుతున్న నేను. ఇలాంటి బ్రతుకు పగవాడికి కూడా వద్దు సరూ!"
    "ఇప్పుడివన్నీ ఎందుకు పారూ?"
    "చెప్పనియ్యి సరూ! నా కాళ్ళమీద నేను బ్రతికే ప్రయత్నం చేస్తాను. అందాకా ముష్టిదాన్ననుకుని నన్నూ పిల్లలనూ భరించుపిన్నీ! అని తల పగలకొట్టుకొని ఏడ్చాను. సరేనంది పిన్ని! అందుకే ప్రతినిమిషం సాధిస్తున్నా, ఇలాంటి శుభదినం వస్తుందనే సహనంతో రోజులు గడిపాను. ఎసెస్ యల్. సి. అయినా తప్పి వుండబట్టి అదీ కంప్లీట్ చేసి టీచర్ ట్రైనింగ్ అయి, టీచర్ గా పోస్టు సంపాదించాను. వీటికి డబ్బు ఎక్కడినుంచి వచ్చింది? నువ్వు ఇవ్వబట్టేకదా? మీవారు కూడా సహృదయులు కాబట్టి గబగబా అన్ని ఏర్పాట్లు చేశారు. కాస్త కుదుటపడ్డ తరువాత ప్రతినెలా కొంత మొత్తం పంపుతుంటాను. ఇదంతా నీ దయకాదా?"
    "డబ్బు విషయం ఎత్తానా సరూ! ముందు నీసంగతి చూచుకో," సరోజ చిరుకోపంతో అంది.
    "వెళ్ళేది కొత్తవూరు. నా మంచి చెడ్డలు చూచుకొన్న తరువాత సంగతే నేచెప్పేదీను. ఉద్యోగం చేస్తూ చదువుతాను. పిల్లలను ప్రయోజకులను చేస్తాను. కాలానికి ఎదురీదటానికి ప్రయత్నిస్తాను" ధృడనిశ్చయంతో అంది పార్వతి.
    "అన్నమాట సాధించగల నేర్పూ, ఓర్పు నీలో వున్నాయి పారూ!"
    "దానికి నీలాంటివారి సహకారం కూడా వుండాలి. అది పుష్కలంగా వుంది."
    "ఎళ్ళుండేకదూ ఊరికి వెళ్ళేది?"
    "ఊ"
    "ఈ సంగతి మీవారికి తెలిస్తే ఏమంటారో?"
    "నన్ను కాదని బ్రతకగలుగుతున్నదే అని పళ్ళు నూరుతారు. స్త్రీ అబలగా వుంటే హర్షిస్తారు గాని సబలగా వుంటే భరించలేరు. ఈ పురుషపుంగవులు." పార్వతి కసిగా అంది.
    సరోజ కాస్త ఆలోచించి అంది.
    "నా ఉద్దేశ్యంలో స్త్రీ ఎప్పుడూ అబల సబల కానేరదు కాదు, శ్రీరామచంద్రుడు, నిండు చూలాలయిన సీతమ్మను నిర్దయగా అడవిలో వదిలి రమ్మన్నాడు. దుష్యంతుడు శకుంతలను ఎరుగను పొమ్మన్నాడు. వారు పిల్లలను కన్నారు. అడవుల్లో జీవించారు. యీ పుణ్యస్త్రీలను అబలలనాలా? సబలలనాలా. ఇప్పుడు మాత్రం ఓ స్త్రీ తనకాళ్ళమీద తాను బ్రతుకుతున్నా లోకులుకాకుల్లా పొడుస్తూనే వున్నారు. ఆమె అబలకాబట్టే కదా? నలుగురూ నాలుగు మాటలనేది?" పార్వతి ఏమంటుందో అని ఆగింది సరోజ.
    "నిజమే సరూ! నా సంగతే చూడు. పిన్ని ఇంటింటికీ నా సంసారం గురించి టాంటాం వేసినట్లుంది. బైటికి కాలుపెడితే తలోమాట విసురుతున్నారు. వారి సానుభూతిలో ఎంత వ్యంగ్యం దాగుందో తెలియని మూర్ఖురాలిని కాదు. ఎదురుతిరిగి ఏదయినా అనాలని వుంటుంది. ఆవేశాన్ని అణచుకుంటాను. ఒక్కోసారి చావాలనివుంటుంది. పిల్లలు గుర్తుకు వస్తారు. పిల్లలకు రెక్కలు వచ్చిందాకా చావు మాట తలపెట్టకూడదనుకుంటాను" చీర చెంగుతో కళ్ళు అద్దుకుంది పార్వతి.
    "పారూ! యీ సమస్య ఎప్పుడూ వుండేదే, భర్త చేత దెబ్బలుతింటూ పడివుంటే ఆమెకు లోకులు కావలసినంత సానుభూతి అందిస్తారు. తనమానాన తను బ్రతుకుతున్నా ఒంటరి స్త్రీని కాకుల్లా పొడుస్తారు. ఎక్కడికెళ్ళినా నీకు కొన్ని బాధలు తప్పకపోవచ్చు. వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడు."
    "పిల్లలకోసం. తప్పదుసరూ! వాళ్ళ సుఖంకోసం ఎంతయినా కష్టపడతాను."
    "పడకతప్పదు పారూ!" మనసులో అనుకుంది సరోజ.

 Previous Page Next Page