కానీ తను ప్రేమరోగం తగులుకుని టెంపరరీగా ఇనాక్టివ్ అయిపోతుంది.
ఎలా మరి?
మళ్ళీ రైలింజన్ లాగా కాసేపు గుప్పుగుప్పుమని పొగ వదిలాడు బాబూజీ.
అసలు ఎక్కడ మొదలుపెట్టాలి? ఎలా మొదలుపెట్టాలి?
తర్వాత అతనికి హఠాత్ గా ఏదో స్పురించింది.
గబగబా లేచి అల్మరాలో వున్న పాత పేపర్స్ తీసి వెదకటం మొదలెట్టాడు.
చటుక్కున అతని చూపు ఒక న్యూస్ మీద నిలిచిపోయింది.
"గూఢచారిగా అనుమానింపబడుతున్న చండీదాస్ కేసు విచారణ.."
త్వరత్వరగా చదివాడు బాబూజీ.
"భారతదేశపు రహస్యాలు విదేశాలకి చేరవేస్తున్న అనుమానంపైన హైదరాబాదులోని ఒక కేంద్రప్రభుత్వ ఆధీనంలో వున్న ఇండస్ట్రీలో పని చేస్తూ ఉన్న చండీదాస్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు పాఠకులకి తెలుసు. ఆ కేసు రేపటినుంచి విచారణకి రాబోతుంది. చండీదాస్ తరపున ప్రముఖ న్యాయవాది ముకుంద్ భలేరావుగారు వాదించబోతున్నారు"
పేపర్స్ పక్కన పడేసి లేచి ఫోన్ దగ్గరికి నడిచాడు బాబూజీ.
ఆ ముకుంద్ భలేరావు తనకు తెలుసు. అతను మహాదాస్ట్రియన్.
తమ క్లబ్స్ లో మెంబర్ షిప్ కావాలని ఇప్పటికి ఓ పదిసార్లు అడిగి వుంటాడు. తమ క్లబ్స్ కి తనే సెక్రటరీ.
ఆ క్లబ్స్ లో మెంబర్ షిప్ కోసం పదేళ్ళకి సరిపడా వెయిటింగ్ లిస్టుంది. తను తలుచుకుంటే పదిగంటల్లో ఇప్పించగలడు మెంబర్ షిప్. ఆ క్లబ్సులో మెంబర్ షిప్ కొనుక్కున్నంత స్టాటస్ సింబల్.
రింగ్ చేశాడు బాబూజీ.
"హలో: భలేరావ్ హియర్" అని వినబడింది లైన్లో అవతలున్న కంఠస్వరం.
"హలో: మిస్టర్ భలేరావ్: ఏమయింది మీ క్లబ్ మెంబర్ షిప్?" అన్నాడు బాబూజీ ఏమీ తెలియనట్లు.
ముకుంద్ భలేరావ్ నవ్వాడు "మీకు తెలీకుండా ఏమవుతుందిసార్? మీరు తల్చుకోవాలి. అప్పటిదాకా ఏమీ కాదు."
"మీరు సాయంత్రం క్లబ్సువేపు ఒకసారి రండి మాట్లాడుకుందాం"
"తప్పకుండా వస్తాను" అన్నాడు భలేరావు సంతోషంగా.
సాయంత్రం క్లబ్బులో కలుసుకున్నారు. ఇద్దరూ కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు డ్రింక్స్ వచ్చాయి.
"మీ క్లబ్ మెంబర్ షిప్ ఓకే అయిపోతుంది" అన్నాడు బాబూజీ వరం ఇస్తున్నట్లు.
భలేరావు మొహం ఆనందంతో వెలిగిపోయింది,
"మిస్టర్ భలేరావ్: ఇప్పుడే కేసు డీల్ చేస్తున్నారు మీరు" అని అన్నాడు బాబూజీ యధాలాపంగా.
"రెండు మర్డర్ కేసులు, ఇంకో తమాషా కేసు" అన్నాడు భలేరావ్.
"తమాషా కేసా? ఏమిటది?"
"ఒక గూఢచారి కేసు"
"ఓహో అలాగా:" అన్నాడు బాబూజీ చాలా తేలిగ్గా.
ఆ విషయం గురించి తనకు పెద్ద ఇంట్రెస్ట్ లేదనే భావన ముకుందానికి కలగజేయడానికి గానూ మెనూ కార్డు తీసుకుని చదువుతున్నట్లు నటించటం మొదలెట్టాడు.
అదే తను చేసిన పొరపాటు.
భలేరావు పేరుమోసిన క్రిమినల్ లాయరు. అవలించకుండానే పేగులు లెక్కపెట్టగలడు అతను. బాడీ లాంగ్వేజ్ బాగా తెలుసు అతనికి నిలబడ్డ తీరునీ, కూర్చున్న తీరునీ, చేతుల కదలికనీబట్టి ఎదుటి మనిషి ఎలాంటి స్థితిలో వున్నాడో, నిజం చెబుతున్నాడో, నాటకం ఆడుతున్నాడో కనుక్కోగలడు.
తను చెప్పబోయే దానిమీద బాబూజీకి చాలా ఇంట్రెస్ట్ వుందని అర్థమయింది భలేరావుకి.
దానికి మరో రుజువు, ఇన్నాళ్ళనుంచి తను అడుగుతున్నా ఇవ్వనిక్లబ్ మెంబర్ షిప్ పిలిచి ఇస్తాననడం.
కానీ -
ఒక గూఢచారి గురించి బాబూజీకి ఎందుకు ఇంత ఇంట్రెస్టోఅర్థం కాలేదు.
మనసులో ఒక మూల ఆ అనుభవాన్ని అలాగే వుంచుకుని బాబూజీతో చండీదాస్ గురించి చెప్పడం ప్రారంభించాడు.
చండీదాస్ సెంట్రల్ గవర్నమెంటు ఆధీనంలో ఒక ఇండస్ట్రీలో పని చేస్తున్నాడు. తరచుగా లీవులు పెట్టడం అలవాటు అతనికి.
యాజమాన్యం అతన్ని ఎన్నోసార్లు మందలించింది, వార్నింగ్ ఇచ్చింది. అతనికి పెళ్ళీ పెటాకులు కాలేదు. సంసారబాధ్యతలు లేవు యే వ్యసనమూ ఉన్నట్లు దాఖలాలు లేవు. అతను ఎక్కడికి, ఎందుకు వెళుతుంటాడో మిస్టరీగా వుండేది.
ఒకరోజున రాజస్థాన్ లోనీ జెయిస్మాల్మీర్ లో అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జెయిస్మాలీర్ అంటే సరిగ్గా ఇండియా - పాకిస్థాన్ ల మధ్య ఉన్న నగరం. సరిహద్దుకి అటువైపున భారతసైనికులూ, అటువైపున పాకిస్థాన్ సైనికులూ గస్తీ కాస్తూ ఉండటం కనబడుతుంది. శాంతి సమయంలో మంచి మూడ్ లో వుంటే, వాళ్ళు ఒక టీ కాఫీ ఫలహారాలు ఇచ్చి పుచ్చుకుంటూ కూడా ఉంటారు వాళ్ళు.