Previous Page Next Page 
దావాగ్ని పేజి 55


    అక్కడ బంధించారు చండీదాసుని.

 

    "ఎందుకు?"

 

    ఓసారి క్రీగంటితోనే బాబూజీని పరిశీలించి అన్నాడు ముకుంద్ భలేరావు.

 

    "ఎందుకంటే చండీదాస్ ఒక మెర్సినరీతో ఏదో రహస్యంగా మంతనము జరుపుతున్నాడు కాబట్టి.

 

    బాబూజీ చేతిలోని స్కాచ్ గ్లాసు కిందపడినంత పనయింది.

 

    గూఢచారుల సంగతి కొద్దిగా కదిపితే కావాల్సిన సమాచారం కొంచెం దొరుకుతుందేమో అనుకున్నాడు తను.

 

    కానీ నేరుగా ఒక మెర్సినరీ గురించి ప్రస్తావన వస్తుందనుకోలేదు.

 

    మెర్సినరీ:

 

    కిరాయి సైనికుడు.

 

    తను వెయ్యవలసిన ప్లానేమిటో ఒక్కసారిగా స్పురించింది బాబూజీకి.

 

    జనరల్ భోజా మీదకి నలుగురయిదుగురు కిరాయి సైనికులను పంపుతాడు తను.

 

    సింపుల్ గా, ఎఫిషియెంట్ చేసుకొచ్చేస్తారు వాళ్ళు కావలసిన పనిని.

 

    "ఊ చెప్పండి" అన్నాడు ఉత్సాహంగా ముందుకి వంగి.

 

    "ఒక కిరాయి సైనికుడితో మంతనాలు జరుపుతున్నాడు చండీదాస్ అతన్ని నిర్భంధించి థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. అతను చెప్పే వాదన చిత్రంగా వుంది"

 

    "ఏమంటాడు"

 

    "తన దేశభక్తిని ఎవరూ శంకించవలసిన అవసరం లేదుట. ఆ మాటకి వస్తే తనకి ఉన్నంత దేశభక్తి ఎవరికి లేదట. అవసరం వస్తే దేశంకోసం ప్రాణాలు ఇస్తాడుట."   

 

    "మరి?"

 

    చిన్నగా దగ్గి అన్నాడు ముకుంద్ భలేరావు. "చండీదాస్ కి ఒక పుస్తకం రాయాలని వుందిట. గూఢచారుల గురించీ, మెర్సినరీల గురించీ - అది ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్ అయి తనకు మిలియన్ల డాలర్లు సంపాదించి పెడుతుందని అతడి నమ్మకం.        

 

    "నిజంగా రాయగలడా అతను?"

 

    "మీరే చూడండి" అంటూ తన బ్రీఫ్ కేస్ లో నుండి ఒక పుస్తకం తీశాడు భలేరావు. బాబూజీకి అందించాడు.    

 

    తన చేతులు వణుకుతున్నాయని గ్రహించాడు బాబూజీ పుస్తకాన్ని అందుకొని తిరగెయ్యడం మొదలెట్టాడు.

 

    అది తెల్లకాగితాలను బౌండ్ చేసిన పుస్తకం... గజిబిజి రాతతో పేజీలనిండా ఏదో రాసివుంది.  

 

    "నిజంగా నీ మెర్సినరీ గురించి, గూఢచారుల గురించీ చాలా వివరాలు సేకరించాడు నాక్లయింటు" అన్నాడు 'భలేరావు' "కావాలంటే ఒక రోజు వుంచుకుని చదవండి.... ఎల్లుండి నేను దాన్ని నా క్లయింటు నిర్దోషిత్వాన్ని నిరూపించే సాక్ష్యంగా కోర్టులో ప్రవేశపెట్టబోతున్నాను."  

 

    "థాంక్స్: థాంక్స్ ఎలాట్:" అని ఉద్వేగంతో అని, అంతలోనే తనను తాను తమాయించుకొని, "చిన్నప్పట్నుంచి ఇలాంటి కధలంటే నేను చెవి కోసుకునేవాడిని" అన్నాడు బాబూజీ.

 

    "ఒక్కొక్కళ్ళకీ ఒక్కొక్క ఇంట్రస్టు:" అన్నాడు లాయరు భలేరావు నవ్వుతూ. "ఇంకా ఎనిమిది వాల్యూములు ఉన్నాయి నా దగ్గర: అతి విలువైన సమాచారం:" అని, మిస్టర్ బాబూజీ: మీ గ్రూప్ ఆఫ్ కంపెనీలకి రిటెయినర్ గా ఒక మంచి లాయరు కావాలని వెదుకుతున్నారని విన్నాను. అందుకు తగిన క్వాలిఫికేషన్లు నాలో వున్నాయనుకుంటున్నాను. మీరేమంటారు?" అన్నాడు గడుసుగా. బాబూజీ ఏదో పెద్ద ఎత్తులోనే ఉన్నాడని భలేరావుకి అర్థం అయింది. ఇలాంటప్పుడే ప్రెజర్ తెచ్చి తన పబ్బం గడుపుకోవాలి.  

 

    చండీదాస్ కేసు మీద అతిగా కుతూహలం చూపించటం బాబూజీ చేసిన తప్పయితే, దాన్ని ఎక్స్ ప్లాయిట్ చేసి, లబ్దిపొందాలని ఆత్యాశకు పోవటం భలేరావు చేసిన తప్పు.

 

    బాబూజీ మీద ఎవరూ ప్రెజర్ తెచ్చీ, బ్లాక్ మెయిల్ చేసి బతికి బట్టకట్టలేరు.

 

    గడుసుతనంగా అంటున్నాననుకుని తను పలికిన ఆ ఒక్కవాక్యం తనకి మరణశాసనంలా మారుతుందనుకోలేదు ముకుంద్ భలేరావుకి.

 

    మంచులాంటి ఓ చూపు చూసి, "అలాగే: దాన్దేముంది: మీ దగ్గర ఉన్న మిగతా వాల్యూములు ఇవ్వండి.... త్వరలోనే మీ పోస్టు సంగతి చూస్తాను..." అన్నాడు బాబూజీ.

 

    సంతోషంగా మిగతా వాల్యూములు ఇచ్చేశాడు భలేరావు.

 

    బాబూజీ కంపెనీలకు రిటెయినర్ అంటే,: హీనపక్షం నెలకో లక్ష కళ్ళజూడొచ్చు.

 

                                                       *    *    *    *

 Previous Page Next Page