Previous Page Next Page 
హద్దులున్నాయి జాగ్రత్త పేజి 54


    
    చాలా రోజులకి మనసు దాహం ఏదో తీరినట్లనిపించింది. అతని ఫోన్ నంబర్ తీసుకుని నా నెంబర్ యిచ్చి వచ్చేశాను.
    
    ఆ తర్వాత దాదాపుగా ప్రతిరోజూ అతను నాతో మాట్లాడసాగాడు. మాట్లాడడానికి టాపిక్ దొరకకపోవడం ఏనాడూ జరగలేదు. అతను మార్నింగ్ కాఫీ తాగుతూ, న్యూస్ హెడ్ లైన్స్ చదువుతూ వాటి గురించి డిస్ కస్ చేయడం, ఒకనాడు సాహిత్యం గురించీ, ఇంకోరోజు సంగీతం గురించీ, ఎంతో హ్యూమర్ గా మాట్లాడేవాడు.
    
    నాగావళి పెళ్ళికి పిలవడానికి నాగావళిని తీసుకుని మా ఇంటికి వచ్చాడు. ఆమెకీ దాదాపు పునీత వయసే వుంటుంది. వాళ్ళ నాన్నలాగే బాగా కలుపుగోలుగా మాట్లాడింది.
    
    ఆ రోజే పునీతకి కూడా పెళ్ళి చేయాల్సిందే కదా అన్న తలంపు నా మనసులోకొచ్చి మధనపడ్డాను. పునీత వెళ్ళిపోతే ఈ ఇంట్లో నేనేం చూసుకుని సమయం గడపాలి? ఎవరికోసం వంట చెయ్యాలి? ఎలా బ్రతకాలి?
    
    పునీతా, నాగావళి మంచి స్నేహితులైపోయారు.
    
    మా ఇంట్లోని పాత గ్రామ్ ఫోన్ చూసి నాగా థ్రిల్ అయిపోయింది.
    
    సన్నగా నా గాత్రం ఆనందభైరవిలో రవళిస్తుండగా వంటింట్లో కాఫీ కలుపుతూంటే "రావచ్చా?" అంటూ ద్వారబంధం పట్టుకుని నిలబడి అడిగాడు ధీరజ్.
    
    నేను నవ్వి స్టూలు జరిపాను.
    
    "మీ వారు చాలా దురదృష్టవంతులు! ఇంత ఆహ్లాదాన్ని, అందాన్ని మిస్ అయిపోతున్నారు" అన్నాడు.
    
    "సా....విరహే తవదీనా రాధా..." అని నా గొంతు ఆర్ద్రంగా వినిపిస్తోంది.
    
    అతని కాంప్లిమెంట్ కాస్త ఇబ్బందనిపించింది.
    
    "మీ అందం మధుబాలా, వహిదారెహమాన్ ల లాంటిది. మనిషిని అలజడి లేకుండా స్థిమితంగా ఆహ్లాదంగా వుంచుతుంది. పారిజాత సౌరభంలా సున్నితమైన ఆనందాన్నిస్తుంది" అన్నాడు.
    
    నేను కలవరపడ్డాను.... ఇబ్బంది పడ్డాను..... ఆ తర్వాత సిగ్గుపడ్డాను.
    
    పైన పెళ్ళీడుకొచ్చిన మా ఇద్దరి పిల్లలూ హృతిక్ రోషన్ గురించి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు.
    
    క్రింద మేం ఉమర్ ఖయ్యాం గురించీ మీర్జాగాలీబ్ గురించీ రుబాయీలు చెప్పుకుంటున్నాం.
    
    'నా హృదయాన్ని బంధించే ఈ సంకెళ్ళు.
    
    నా రిక్త హస్తాలూ, ఇరుకు వూపిరీ....
    
    వీటిని భరించలేకుండా వున్నాను'....
    
    కానీ ఆలోచించు.....పాపమనేదే లేకపోతే ఈశ్వరుడి క్షమకి చోటెక్కడుంది?
    
    అతను చెప్పే రుబాయీలకి నవ్వొచ్చింది.
    
    'నువ్వు పాపం చేసినా....
    
    నిన్ను క్షమించడానికి ఈశ్వరుడు సిద్దంగా వున్నాడు.
    
    ఇంకా విచారమెందుకు?'
    
    పునీతా, నాగావళీ, 'నువ్వు' అంటే 'నువ్వు' అనుకుంటున్నారు. ఇంకాసేపట్లో 'ఒసేయ్' అనుకోగలరు. ఆ వయసు అలాంటిది.
    
    ధీరజ్ వాళ్ళు వెళ్ళిపోయాక నేను బెడ్ రూమ్ లోకి వెళ్ళి నిలువుటద్దం ముందు నిలబడ్డాను. చాలా రోజులయింది అలా అద్దం ముందు నిలబడి.
    
    'అహల్య చాలా అందంగా వుంది. ముఖ్యంగా ఆ కళ్ళల్లో మెరుపు ఎంతో బాగుంది...' అనిపించింది.
    
                                                             * * *
    
    నాగావళి పెళ్ళికి నేనూ, పునీతా వెళ్ళాం.
    
    గంధం కలర్ ప్లెయిన్ సిల్క్ చీరలో మెడలో డైమెండ్స్ లాకెట్ వున్న సన్నని చైన్ వేసుకుని, మెడ మీదుగా జుట్టుని కొప్పుగా వేసుకుని చుట్టూ మల్లెపూలు పెట్టుకుని వెళ్ళాను. అందరూ చాలా ఆడంబరంగా తయారయి వచ్చారు. అయినా నేనే ఇక్కడ సెలెబ్రెటీగా మారాను.
    
    ధీరజ్ నాచేత పాడించి కానీ వూరుకోలేదు. పెళ్ళిపందిరిలోంచి చివరగా బయటపడింది మేమే అనుకుంటా.
    
    ఇంటికొచ్చేసరికి రఘు హాల్లో టీవీ చూస్తూ కనిపించాడు.
    
    "ఎక్కడికెళ్ళారు?" అన్నాడు.
    
    పునీత అతని మెడ చుట్టూ చేతులు వేసి నాగావళి పెళ్ళి గురించి చెపుతుంటే నేను పైకెళ్ళి బట్టలు మార్చుకున్నాను.
    
    రఘు మంచి మూడ్ లో వున్నాడనుకుంట. నేను నైటీ వేసుకోగానే వచ్చి దగ్గరికి లాక్కున్నాడు.
    
    "మీతో మాట్లాడాలి" అన్నాను.
    
    "చెప్పు..." నా జుట్టుని ముఖం మీద వేసుకుంటూ అన్నాడు.
    
    "ధీరజ్ అని డాక్టర్ నాకీ మధ్యనే పరిచయం అయ్యాడు. అతనికి పునీత ఈడు కూతురుంది."
    
    "అతనితో నీకేమైనా ఎఫైరా? అయినా సరే....ప్రొద్దుట మాట్లాడుకుందాం.....పడుకో!" నన్ను బలవంతంగా మంచం మీదకి తోస్తూ అన్నాడు.
    
    "నీకు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా?" కోపంగా అడిగాను.
    
    "ఊహూ!" నన్ను ఆక్రమిస్తూ అన్నాడు.
    
    "పునీతకి కూడా పెళ్ళి వయసొస్తోంది...." నా మాట పూర్తిచెయ్యనివ్వలేదు.
    
    అతను బాగా నిషాలో వున్నాడు. నేనిప్పుడు ఏం చెప్పినా అతని బుర్రకెక్కదని నాకర్ధమై మౌనంగా మారాను.
    
    కానీ నా ఊహ తప్పు రఘుకి ధీరజ్ అన్న పేరు మాత్రం గుర్తుండిపోయింది.
    
                                                          * * *
    
    మగాడు ఎంత సంపాదించినా తన ఆస్తిని మీ ఆడాళ్ళల్లా ఎగ్జిబిట్ చేస్తూ తిరగలేడు. నిన్న చూసారా పెళ్ళిలో ఆడాళ్ళంతా పోటీపడి నగలూ ఖరీదైన పట్టుచీరలతో వచ్చారు. అది చాలు వాళ్ళ అతిశయాన్ని ప్రదర్శించడానికి కానీ మగాడి అహం అలా తృప్తిచెందదు. డబ్బు సంపాదించాకా ఆస్తి సమకూర్చుకుంటాడు. ఇళ్ళు, వాకిళ్ళు, కార్లు.... ఆ తర్వాత డ్రింక్స్, విమెన్! ఆ చివరిది అతని ఈగొని చాలా శాటిస్ ఫై చేస్తుంది. తను నిజంగా ఐశ్వర్యవంతుడన్న నమంకం అతనికి కలిగిస్తుంది. జాక్ పాట్ లో సునాయాసంగా వచ్చిన లక్షలకన్నా, ఒక స్త్రీ 'నీవల్ల నేనెంతో తృప్తిచెందాను' అన్న భావం వ్యక్తం చేస్తే, అతనికి కలిగే సంతోషం ఎక్కువ. దురదృష్టం కొద్దీ ఇండియన్ విమెన్ భర్త సంపాదించడం మొదలు పెట్టగానే.... తన ఆస్తిని ఇతరులకి ఎలా ఎగ్జిబిట్ చెయ్యాలా అనే తపనలో పడి అతని ఆనందాలని, అవసరాలని నిర్లక్ష్యం చేస్తుంది. ఆ టైం చాలు అతను చెయ్యి జారిపోడానికి. భగవంతుడు అతనికి పెట్టిన ప్రవృత్తి అది."
    
    "సమర్ధించుకుంటున్నారా?" నేను ధీరజ్ మాటలకి రెచ్చిపోయిన కోపంతో అడిగాను.
    
    "మీరు అంగీకరించకపోయినా ఇవి ఫాక్ట్స్" నవ్వుతూ చెప్పాడు.
    
    "నేనంగీకరించలేను. డబ్బు భార్యాభర్తల సంబంధానికి అడ్డని నేననుకోను" అన్నాను.
    
    "సగటు మనిషి కలలు కంటాడు. తీరే ఆర్ధికస్తోమత లేక సర్దుకుపోతాడు. తీర్చుకోగలిగినప్పుడు నీతీ, ధర్మం అని ఆలోచించదడు. మనిషంత స్వార్ధజీవి ఇంకోటిలేదు" అతను రెచ్చగొడుతున్నట్లుగా మాట్లాడాడు.

 Previous Page Next Page