Previous Page Next Page 
హద్దులున్నాయి జాగ్రత్త పేజి 55


    "భార్య కూడా అలాగే ఆలోచిస్తే....ఈ ఆస్తీ, నగలూ అన్నీ బోర్ కొట్టి ఇంకో కంపెనీ కోరుకుంటే? వివాహ వ్యవస్థ ఏమైపోతుందీ?" ఆవేశంగా అడిగాను.
    
    "సాధారణంగా ఏమీ అయిపోదు" అన్నాడు.
    
    "అంటే మీరు దాన్నే సమర్ధిస్తున్నారా?" ఆశ్చర్యంగా అడిగాను.
    
    "కానీ స్త్రీ పిల్లల గురించి ఆలోచించి అలాంటి స్టెప్స్ తీసుకోదు. అదే భారతదేశాన్ని మిగతా దేశాలనుండి ప్రత్యేకంగా నిలబెడుతోంది.
    
    "అలాంటి ప్రత్యేకత కోసం ఇలా స్త్రీ బలిదానాలు చేస్తూపోవాలా?" హేళనగా అడిగాను.
    
    అతను నవ్వాడు. "మీరు నన్ను ప్రశ్నించలేదు.... మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటున్నారు. ప్రశ్నా, జవాబూ మీరే చెపుతున్నారు."
    
    నేను ఆలోచిస్తూ వుండిపోయాను.
    
    ధీరజ్ లేచి బాల్కనీలోకెళ్ళి నిలబడ్డాడు. అతను తెల్లని పైజామా, లాల్చీలో వున్నాడు. షేవ్ చెయ్యని సగం నెరిసిన గెడ్డం కూడా హుందాగానేవుంది.
    
    "అహల్యా.....థర్టీన్త్ కి నేను స్టేట్స్ వెళ్ళిపోతాను. అంటే ఇంకో పది రోజులు..." అన్నాడు.
    
    నేను బాధగా చూసాను. ఈ నెల రోజులుగా నేనెంత సంతోషంగా గడిపానో, మారిన నా కట్టూ, బొట్టూ, అద్దం ముందు నేను గడిపిన కాలం చెబుతాయి.
    
    "అయామ్ గోయింగ్ టూ మిస్ యూ" మనస్ఫూర్తిగా అన్నాను.
    
    "నాగా పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇంకా నాకు ఇండియా రావల్సిన పనిలేదు. వస్తే వాళ్ళే నా దగ్గరకి వస్తారు.
    
    చాలా బాధగా చూసాను. నా కళ్ళల్లో నీటి తెర అతని రూపాన్ని మసకబారేట్లు చేసింది.
    
    "పునీత పెళ్ళి అయిపోతే మీకూ పెద్దగా బాధ్యతలుండవు. ఔనా?"
    
    "అదే నా బాధ."
    
    "బాధా? సంతోషపడాలి. బంధాల్ని, బాద్యతల్నీ వదిలించుకోవడం మనిషి ఎఛీవ్ మెంట్ కి నిదర్శనం."    
    
    "అప్పుడు ఏం చెయ్యాలి?"    

    "నాతో వచ్చేస్తారా?" అతను హఠాత్తుగా నా పక్కకి వచ్చి తన పెదవులు నా చెవికి ఆనేట్లుగా పెట్టి అడిగాడు.
    
    పిడుగుపాటు తిన్నదానిలా చూశాను.
    
    "మిగిలిన జీవితమైనా సంతోషంగా గడుపుదాం" చిన్నగా నవ్వుతూ చెప్పి దూరంగా జరిగి "ఒక ప్రపోజల్ మాత్రమే!" అన్నాడు.
    
    "నో....నో...నో..." తల అడ్డంగా వూపాను.
    
    రఘుని, పునీతని ఈ దేశాన్నీ వదిలి అతనితో వెళ్ళిపోయేటంత బంధమా మాది? అసలెలా అడిగాడు? అలా వెళ్ళిపోడం అంటే లేచిపోడమేగా!
    
    "ఎవరికీ చెప్పకుండా వద్దు..... పునీతతో మాట్లాడి, ఆమె ఒప్పుకుంటే రఘురాంగారితో కూడా మాట్లాడే వెళ్ళిపోదాం చాలా కూల్ గా చెప్పాడు.
    
    "మీరు చాలా అసహజంగా మాట్లాడుతున్నారు. వస్తా" అంటూ లేచాను.
    
    ధీరజ్ నా భుజం మీద చెయ్యి వేసాడు. "ఫ్రెండ్స్ గా నెల రోజులు గడిపాం. లవర్స్ గా ఒక సాయంత్రం అయినా గడిపే ఛాన్స్ ఇవ్వకూడదా? అప్పుడు కూడా మీకు ఇది అసహజంగా అనిపిస్తే.....వద్దు. అసలు ఆలోచించనే వద్దు" అన్నాడు.
    
    నాకు కోపం బదులు ఉక్రోషం, దుఃఖం ఎగదన్నుకువచ్చాయి దోసిట్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చాను.
    
    ధీరజ్ నా తలని తన గుండెలకి హత్తుకున్నాడు.
    
    "అహల్యా.... ఐ లవ్ యూ... ఈసారి ఇండియా వదిలిపోతుంటే నా శరీరంలోని ముఖ్యమైన భాగమేదో వదిలిపోతున్న భావం కలుగుతోంది. నిన్ను వదలలేకుండా వున్నాను డియర్" అన్నాడు.
    
    నేనతన్ని వదిలించుకొని వెంటనే వెనక్కి జరగలేదు.
    
    అతని చేతివేళ్ళల్లో లాలన.... ఆ సామీప్యం..... మాటల్లో ఆత్మీయత.....మనసుని సేదదీర్చే మృదుత్వం....ఇవేగా నేను కోరుకుంటున్నది.
    
    "రేపు సాయంత్రం..... నాకో అవకాశం ఇవ్వకూడదా.....ప్లీజ్..... ఒకవేళ మళ్ళీ మనం జీవితంలో కలుసుకోకపోయినా.... అది నెమరేసుకుంటూ హాయిగా చచ్చిపోతాను" అన్నాడు.
    
    నేను దూరంగా జరిగాను.
    
    "సే ఎస్" నా కళ్ళు తుడుస్తూ అన్నాడు.
    
    భారమైన నిట్టూర్పు ఒకటి నా గుండె వాకిలి తోసుకుని వచ్చేసింది.
    
    చటుక్కున వెనక్కి తిరిగి "నే వెళుతున్నాను" అని చరచరా వచ్చేసాను.
    
    ఆ రాత్రి ఫోన్ మోగినప్పుడల్లా అతనేమోనని ఆశగా చూసాను. కానీ అతను ఫోన్ చెయ్యలేదు.
    
    పునీత కాలేజీకి వెళుతూ గదిలోకి వచ్చింది.
    
    "అమ్మా.....ఒంట్లో బాలేదా? ఏమైందీ?" అడిగింది.
    
    "ఏం లేదు. నువ్వు టిఫిన్ చేసావా?" అడిగాను.
    
    "ఆ!" ఏదో చెప్పడానికన్నట్లు తల కిందికి వంచుకుంది.
    
    నెమ్మదిగా వచ్చి నా మంచంమీద కూర్చుంది.
    
    "అమ్మా....ఒక్క విషయం చెప్తాను.....ఏం అనుకోకూడదు మరి" అంది.
    
    "చెప్పమ్మా" పునీత తలమీద చెయ్యి వేసాను.
    
    "ధీరజ్ అంకుల్ తో నువ్వు ఎక్కువసార్లు బయటికెళ్ళడం చూస్తే - ఎవరయినా ఏమైనా అనుకుంటారేమోనని భయంగా వుంది!"
    
    నేను ఆమె తలమీద నుండి చెయ్యి తీసేసాను.
    
    పునీత భయంగా - "ఆ! తప్పని కాదు. నిన్నేమైనా అంటే నేను సహించలేనేమో అందుకు! బట్ అంకుల్ ఈజ్ వెరీ నైస్! నీకు మంచి ఫ్రెండ్ అయ్యారని నాకు తెలుసు. కాని.....బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ని కూడా అర్ధం చేసుకోరమ్మా లోకంలో" ఆరిందలా చెప్పింది.
    
    నేను చిన్నారి పునీతవేపు ఆశ్చర్యంగా చూసాను.
    
    "నేను తప్పుగా మాట్లాడితే క్షమించమ్మా" నన్ను గట్టిగా కౌగలించుకుంది.
    
    "మా అమ్మ ఎంత గొప్పదో నాకు తెలుసు. అందుకని కాస్త జెలసీ కూడా వుందనుకో నీ ప్రేమంతా ఎవరికీ షేర్ లేకుండా నాకేగా పూర్తిగా"
    
    నవ్వుతుంటే పునీత కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.
    
    ఆ చిన్నారి మనసులో భయం నీడలు నాకర్ధమయ్యాయి.
    
    నాతో చెప్పలేక ఎంత నలిబిలి అయిందో కూడా అర్ధమయింది.
    
    పునీత తలని భారమయిన నా గుండెలకి ఇంకా దగ్గరగా హత్తుకున్నాను.
    
    "ఎస్.... అమ్మ పూర్తిగా నీకే" అన్నాను.
    
    "థాంక్యూ అమ్మా థాంక్యూ" పునీత కళ్ళు తుడుచుకుంది. "టిఫిన్ తినమ్మా! నేను తినిపించనా?" అడిగింది.
    
    "నీకోసం జీవితానందమైన సంగీతమే వదులుకున్నాను. ఆఫ్ట్రాల్ మిగతా సుఖాలేపాటి?" అనుకున్నాను.
    
    పునీత ఏవేవో చెపుతూ నాచేత టిఫిన్ తినిపించి కాలేజీకి వెళ్ళిపోయింది.
    
    నేను అలాగే పడుకుని ఆలోచిస్తూ వుండిపోయాను.
    
    పునీత మా చనువుని చూసి ఎంతగా మధనపడి వుంటుందో తల్చుకుంటేనే నన్ను నేను క్షమించుకోలేక పోతున్నాను.
    
    సాయంత్రం అవుతుండగా ధీరజ్ ఫోన్ చేసాడు. "ఏం ఆలోచించుకున్నారు అహల్యా?" అడిగాడు.

 Previous Page Next Page