"డాడీ! నేను సుఖంగా బ్రతకడం నీకు ఇష్టం లేదా?"
"అమూల్యా!"
"ఆనందాన్ని నానుంచి దూరం చెయ్యాలనుకుంటున్నారా?"
"నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థంకావటం లేదు. నేను నీ తండ్రిని. నీ శత్రువును కాదు. అదుగో మీ మమ్మీ వస్తూంది. ఇవాళంతా ఆలోచించు. సాయంత్రం కోర్టునుంచి వచ్చాక మాట్లాడుకుందాం."
అమూల్య గబగబా తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది.
* * *
"డాడీ!"
"ఆలోచించావా?"
"నేను శ్రీధర్ లేకుండా బ్రతకలేను. శ్రీధర్ ను మనసారా ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్ళిచేసుకోవాలనుకున్నా" ఇక నా నిర్ణయానికి తిరుగులేదు అన్నట్టు అన్పించింది.
"శ్రీధర్ తో మాట్లాడకుండానే ఈ నిర్ణయానికి వచ్చావా?"
నిజమే శ్రీధర్ కు అమూల్యను వివాహం చేసుకోవడానికి అభ్యంతరం ఉండనక్కర్లేదు. ఆ వయసులో ఉన్న అందరు ఆడపిల్లల్లాఫ్వ అమూల్యకు కూడా ప్రేమ జ్వరంలో బుర్ర పనిచెయ్యటం లేదు. ప్రేమకు కళ్ళు లేవన్నారు. ఎలా అమూల్య మనసు మళ్ళించడం.
కృష్ణారావుకు ఒక ఆలోచన మెరుపులా వచ్చింది.
ఆ! ఒకసారి శ్రీధర్ తో వాళ్ళ ఊరు పంపిస్తే? ఆ ఇల్లూ, ఆ ఊరూ, ఆ మనుషులూ, వారి అలవాట్లు చూసి అమూల్య తన నిర్ణయాన్ని మార్చుకొనే అవకాశం వున్నది.
'ఏమిటి డాడీ ఆలోచిస్తున్నారు'
"చూడు తల్లీ! నువ్వు ఒకసారి శ్రీధర్ తో వాళ్ళ ఊరు వెళ్ళి చూసిరా. వాళ్ళ పరిస్థితుల్నీ, ఆ ఇంటి వాతావరణాన్ని చూడు, ఆ పల్లెటూళ్ళో ఆ యింట్లో జీవితమంతా గడపగలవో లేదో చూసి మరీ నిర్ణయించుకో. అప్పటికీ నీ నిర్ణయమదే అయితే శ్రీధర్ తో నీపెళ్ళి జరిపిస్తాను.
"డాడీ! మీరెంత మంచివారు?" తండ్రి మెడచుట్టూ చేతులు వేసి ఆనందంతో ఊగిపోయింది.
నీకోసం, సుఖం కోసం ఏమైనా చేస్తాను. కాని ముందు నువ్వు బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రా?"
"ఎప్పుడు వెళ్ళమంటారు."
"ఎప్పుడో ఎందుకు. రేపు తెల్లవారుఝామున బయలుదేరండి. మళ్ళీ ఎల్లుండి మధ్యాహ్నానికి వచ్చెయ్యండి."
"కారు....."
"అవును కారు తీసుకెళ్ళండి."
"శ్రీధర్ ఒప్పుకోకపోతే?"
"నేను ఒప్పిస్తాగా? శ్రీధర్ ఉన్నాడా"
"ఆ. బయటికి వెళ్ళడానికి తయారౌతున్నట్లున్నాడు"
ప్యూన్ ను పంపించి శ్రీధర్ ను పిలిపించాడు కృష్ణారావు.
శ్రీధర్ వచ్చాడు. అమూల్యను అక్కడ చూసి జంకుతూ నిల్చున్నాడు.
"కూర్చో"
సంకోచంగా కుర్చీలో ఒదిగి కూర్చున్నాడు.
'చూడు బాబూ రెండురోజులలో నీ అపాయింట్ మెంటు ఆర్డరు వస్తుంది'
"థాంక్యూ సర్"
"ఈ లోపల నువ్వు నాకు ఒక పని చెయ్యాలి."
'చెప్పండి సర్?' వినయంగా అడిగాడు.
అమూల్య రెప్పవెయ్యకుండా శ్రీధర్ ని చూస్తూ కూర్చుంది. అమూల్యకేసి చూడక పోయినా ఆమె తననే చూస్తున్నట్లు శ్రీధర్ కు అన్పించసాగింది. మరీ ఇబ్బందిగా అనిపించసాగింది శ్రీధర్ కి అక్కడ కూర్చోవాలంటే.
"అమూల్య మా పెద్ద అమ్మాయి తెలుసుగా?"
"సర్"
"ఆమెకు పల్లెటూరు చూడాలనే కోరిక కలిగింది. అమూల్య మనస్తత్వం ఏమిటో తెలుసా?"
"సర్"
"శ్రీధర్ కు అరచేతుల్లో చెమట్లు పడుతున్నాయి.
"మనసులోకి ఒక ఆలోచన వస్తే పోదు. దాన్ని ఆచరణలో పెట్టేంతవరకూ నిద్రపోదు."
శ్రీధర్ తల వంచుకుని కూర్చున్నాడు.
"నువ్వు అమ్మాయిని మీ వూరు తీసుకెళ్ళాలి. రేపు ఉదయం కార్లో బయలుదేరండి. ఎల్లుండి తిరిగి వచ్చెయ్యండి."
శ్రీధర్ ముఖంపైన సేదబిందువులు కన్పించాయి.
అమూల్యకు అతని గాభరా చూస్తుంటే నవ్వు వస్తోంది.
"ఆడపిల్లలా మరీ అంత బిడియపడితే ఎలాగయ్యా?" నవ్వుతూ అన్నాడు కృష్ణారావు.
"ఎవరెవరు వస్తారు సర్!"
"మీ యిద్దరే...."
"ఇద్దరేనా?"
"ఏం? నేనంటే నీకు భయమా?" కిలకిల నవ్వింది అమూల్య. శ్రీధర్ ఇబ్బందిగా ముఖం పెట్టాడు.
"సరే! సర్"
"థాంక్యూ" అన్నది అమూల్య.
శ్రీధర్ అమూల్యకేసి చూడలేదు. వినిపించనట్లు ఊరుకున్నాడు.
"కాని సర్...."
"ఏమిటయ్యా నీ సందేహం....?"
"మా ఇంట్లో అమ్మాయిగారికి కావల్సిన..."