Previous Page Next Page 
వేసవి వెన్నెల పేజి 4


    కృష్ణారావుకి ముగ్గురు పిల్లలు. కొడుకు పెద్దవాడు. ఐ.పి.యస్. సెలెక్షన్ పొంది మసోరిలో ట్రైనింగ్ అవుతున్నాడు. రెండో బిడ్డ అమూల్య. ఎం.ఏ. చదువుతోంది. మూడో బిడ్డ అవంతి. బి.ఏ. ఫస్టు ఇయర్ చదువుతోంది. కృష్ణారావు భార్య శ్రీమంతుల ఇంటి నుండి వచ్చింది. కృష్ణారావు సామాన్య కుటుంబం నుంచి వచ్చినవాడు. అందువలనే ఎప్పుడూ ఇంట్లో ఆమెదే పైచేయిగా వుంటూ వచ్చింది. కృష్ణారావు లాయర్ గా బాగానే ఆర్జించాడు. కాని బీదవాళ్ళ దగ్గర డబ్బు తీసుకోకుండా ఎన్నో కేసులు వాదించాడు.


    కృష్ణారావు భార్య సరళకు బీదవాళ్ళు మనుషుల్లా కనిపించరు. అందరూ ఆమెను గరిష్టి అంటారు. కొడుకూ, చిన్నకూతురూ తల్లి పోలిక. అమూల్య తండ్రి పోలిక. తండ్రికి అమూల్య అంటే ఎక్కడలేని అభిమానం. అవంతి స్వభావం కృష్ణారావుకు నచ్చదు. అమూల్యకు అంతస్థుల గర్వం అంటలేదు. స్నేహితురాళ్ళను అవంతి ఎద్దేవా చేస్తూ వుంటుంది.


    'అమూ! నీకింకా ప్రపంచం తెలియదు. పిచ్చిపిచ్చి ఆలోచనలు మానేయ్'


    "డాడీ నేను పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. ఇది నా నిర్ణయం"


    "వీల్లేదు"


    "ఆజ్ఞాపిస్తున్నారా?"


    కృష్ణారావు కూతురి ముఖంలోకి చూశాడు. అమూల్య తను అనుకున్నంత అమాయకురాలు కాదు.


    "కాదు. నీ కళ్ళు తెరిపించడానికి ప్రయత్నిస్తున్నాను. అతని అంతస్థుకూ, నీ అంతస్థుకూ ఉన్న అగాధాన్ని చూడమంటున్నాను. అసంభవాలను సంభవాలుగా ఊహించుకుంటూ మనస్సు పాడు చేసుకోవద్దు అంటున్నాను."


    "అది అసంభవం ఎలా అవుతుంది?"


    "నేను మీ వివాహాన్ని అంగీకరించలేను"


    "అయినా నేను అతన్నే వివాహం చేసుకుంటాను."


    "అమూల్యా!"    


    "అవును డాడీ మీరు కూడా అంతస్థుల గురించి మాట్లాడతారని నేను కలలో కూడా భావించలేదు.


    మీరు అభ్యుదయ భావాలు కలవారు అనుకున్నాను. అలాగే ఉపన్యాసాలు ఇస్తారు. అంతస్థులు పోవాలంటారు. నాకూ చిన్నప్పటి నుంచీ ఇదే చెప్పారు. అంతస్థులు పోవాలంటారు. మనిషికీ మనిషికీ మధ్య ఆస్థులు ఏర్పరచిన గోడలు కూలిపోవాలని ఎంతో ఉద్రేకంగా అనేవారు. తీరా మీ కూతురి దగ్గరకు వచ్చేసరికి అంతస్థులు అడ్డు వచ్చాయి కదూ? మీరు చెప్పేది ఒకటీ, నమ్మేది మరొకటీ అని నేను భావించలేదు."


    కృష్ణారావు కూతురి ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు. తన కూతురిలో ఇంత ఎదుగుదల ఉన్నదా? ఆమెలోని చిలిపితనం మాత్రమే తను ఇంతకాలం చూశాడు.


    "ఎందుకు డాడీ అలా చూస్తారు. మీ అసలు రూపం నాకు తెలిసిపోయిందనేగా" ఉద్రేకంగా అన్నది.


    కృష్ణారావు అదోలా నవ్వాడు.


    "కూర్చో చెబుతాను!" కూతుర్ని చెయ్యి పట్టుకొని పక్కకుర్చీలో కూర్చోబెట్టాడు.


    "నేను నమ్మేదీ, ఇంతకాలం నేను చెప్పిందీ ఒకటే!"


    "అబద్ధం" దాదాపు అరిచింది అమూల్య.


    "కాదు నిజం. ఈ అంతస్థులు పోవాలని మనసారా కోరుకొనే వాళ్ళలో నేనూ ఒకణ్ని. ఈ వ్యవస్థ మారాలనీ అందరూ సుఖించే రోజు చూడాలనీ నేను కోరుకుంటాను. అందుకు నా పరిధిలో చేతనైన దోహదం నేనూ చేస్తాను."


    'మరి ఇప్పుడేగా మీరు మీ అంతస్థుల గురించి..."


    'అంతస్థులు పోవాలని కోరుకోవడం వేరు. కాని అంతస్థులు ఉన్నాయ్.


    వాటి ప్రభావం సంఘ జీవితం మీద వున్నది. నువ్వు పెరిగిన అంతస్థు వేరు. సంస్కారం వేరు. నీ ఆలోచనలూ, అలవాట్లూ వేరు. శ్రీధర్ పెరిగిన వాతావరణం వేరు. సంఘర్షణ వ్యక్తుల మధ్య వుండదు. వ్యక్తుల అభిప్రాయాలు, ఆశయాల మధ్య ఏర్పడుతుంది. మీ ఇద్దరి అలవాట్లు, సంస్కారం ఒకటి కాదు. అతని చెల్లెళ్ళు నీలా జీన్స్ వేసుకోరు. మినీ బికినీ వేసుకోరు. మగపిల్లలతో స్వేచ్చగా టిస్టు డ్యాన్సులు చెయ్యరు. ఉదయం ఎనిమిది గంటలదాకా నిద్రపోరు. నీకు జీవితం ఒడ్డించిన విస్తరిలాంటిది. వాళ్ళ బ్రతుకులు విస్తళ్ళు కుట్టే ఈ నెల దగ్గిర్నుంచీ వెతుక్కుంటూ ముందుకు సాగుతాయి. నీ జీవితం ఒక మధుర స్వప్నం లాంటిది. రంగుల హరివిల్లు లాంటిది. కాని వారి అనుభవాలు వేరు. బీదతనం పాపం కాదు. కాని శాపం లాంటిది. ఆ జీవితంలో నువ్వు ఇమడలేవు అందుకే చెబుతున్నాను."


    'సారీ డాడీ! ప్రేమకు బీదతనం అడ్డురాదు.'


    'ఇవన్నీ జీవితం అంటే తెలియక మాట్లాడే మాటలు. కలల్లో బ్రతికేవాళ్ళ ప్రేలాపన. బీదతనం అంటే ఏమిటో తెలియకుండా వల్లించే చిలకపలుకులు ఇవి. నీలో జీవితాన్ని అర్థం చేసుకొనే పరిపక్వత ఇంకా రాలేదు. నువ్వు ఊహించుకుంటున్న ప్రేమ ప్రపంచం కరిగిపోవడానికి ఎంతోకాలం పట్టదు. నాకు తెలుసు. అందుకే హెచ్చరిస్తున్నాను.'


    'ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళున్నారు. ప్రేమకోసం రాజ్యాలు వదలుకున్నవాళ్ళున్నారు.'


    'కావచ్చును! కాని ఒకటి తెలుసుకో! ప్రేమతో పొట్ట నిండదు. ప్రేమతో మాత్రమే పిల్లలు పెరగరు. ప్రేమతో జీన్సు కొనలేవు. కనీసం ఒక నూలు చీరె కూడా కొనలేవు. సినిమాలు చూసి అదే ప్రేమ అని నీలాంటి వాళ్ళు భ్రమ పడుతున్నారు. ఇక కథల గురించి చెప్పనే అక్కర్లేదు. పనిలేనివాళ్ళు సాహిత్యం పేరుతో స్వప్నాల ప్రపంచం సృష్టించి నీలాంటి వాళ్ళను జీవిత వాస్తవాల నుంచి దూరంగా విసిరి వేస్తున్నారు. మీ మనసుల్లోకి మత్తుమందును ఎక్కిస్తున్నారు. కాని వాళ్ళు సృష్టించే ఆ స్వర్గంలో ఏమీ ఉండదు. అంతా శూన్యమే! భ్రమే! తిండికి లేక బాధపడుతూ, కథలోని హీరోలు హీరోయిన్లను కార్లలోనూ, హెలీకాప్టర్లలోనూ తిప్పుతుంటారు.


    "ఓ డాడీ"


    "అవునమ్మా! నేను చెప్పడి శాంతంగా విను. ఆలోచించు. శ్రీధర్ కు బ్యాంకు గుమాస్తా ఉద్యోగం వేయించాను. గుంటూరులో పోస్టింగ్స్ కావాలన్నాడు. ఇప్పిస్తున్నాను ఎందుకో తెలుసా? అతని ఊరు గుంటూరుకు పదిమైళ్ళలోపుగా ఉన్నది. ఇంటికి పెద్ద కొడుకు. ఇద్దరు చెల్లెళ్ళకు పెళ్లిళ్లు చెయ్యాలి. తమ్ముణ్ని ప్రయోజకుడ్ని చేయాలి.


    తండ్రి ఆరు నెలల్లో రిటైర్ అవుతాడు. బస్తీలో వేరుకాపురం పెట్టే తాహతులేదు. రోజూ బస్ లో పల్లెటూరు నుంచి గుంటూరు ఉద్యోగానికి రావాలి. అతని జీతం ఎంతో తెలుసా? నువ్వు ఒక నెలలో బట్టలకూ, పిక్నిక్కులకూ ఖర్చు పెట్టేంతకూడా ఉండదు. నువ్వు ఆ ఇంట్లో, ఆ పల్లెలో ఉండగలవా."


    "ఉంటాను. శ్రీధర్ తో అరణ్యంలోనైనా వుండగలను."


    "పూర్తిగా సినిమా డైలాగే. ఈ ప్రేమ జ్వరం ఎంతోకాలం నిలవదని నాకు తెలుసు. ఆ తర్వాత పశ్చాత్తాపపడతావని కూడా తెలుసు. అందుకే హెచ్చరిస్తున్నాను."


    "డాడీ! మీరు ఇంత క్రూయల్ గా నామనసు గాయపరుస్తారనుకోలేదు." రెండు చేతులలో ముఖం దాచుకొని భోరుమన్నది.


    "ఓ మై చైల్డ్! నన్ను అర్థం చేసుకో!" తల నిమురుతూ బాధగా అన్నాడు కృష్ణారావు.

 Previous Page Next Page