ఈలోగా గౌరవనీయులైన త్రిబుల్ ఏ త్రిబుల్ వన్ పాసేంజర్లూ అందరూ , అత్యంత ఆధునికమైన , అత్యంత విలాసవంతమైన ఈ ఎయిర్ పోర్టు హోటల్లో బస చేయవచ్చును. వారి కోసం హోటల్లో ప్రత్యేకంగా ఒక రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు చేయబడింది.
అన్ని విధాలయిన సౌకర్యాలు ఉన్న ఈ ఎయిర్ పోర్ట్ పాలెస్ లో మీరు సేద తీరుతారని మా నమ్మకం . హావ్ ఏ నైస్ టైం!"
నవ్వుకున్నాడు రాజు.
ఎయిర్ లైన్స్ వాళ్ళ మాట తీరు సడెన్ గా మారిపోయింది. నిన్నటిదాకా , వూదర గొట్టినట్లుగా ఎఎఎ 111 విమానం గొప్పని గురించి చెప్పింది చెప్పకుండా చెప్పారు. ఇవాళ అది గాల్లోకి లేవకుండానే కళ్ళు తేలేయడంలో , విమానం సంగతి వదిలేసి, హోటలు సంగతి చెబుతున్నారు.
బిజినెస్ నాయనా!
బిజినెస్!
అప్పుడు కనబడింది అతనికి.
ఆ అమ్మాయి.
సీనియర్ స్కాలర్ లాగా వుంది.
ఒక చేతిలో పుస్తకం -- కానీ చూపులు పుస్తకం మీద లేవు. రెండో చెయ్యి నుదుటికి ఆనించి ఏదో ఆలోచిస్తోంది.
ఆమె చాలా కన్ ఫ్యూజన్ లో ఉన్న సంగతి చూసీ చూడగానే అర్ధమయింది రాజుకి.
దగ్గరకు వెళ్ళి -
"మే ఐ హెల్ప్ యూ?" అని అడిగాడు స్నేహంగా.
"ఆ?" అని ఉలిక్కిపడి , అంతలోనే సర్దుకుని, "ఓహ్! తప్పంతా నాదే! చెప్పల్నా వద్దా" అని ఆలోచిస్తున్నాను" అంది తికమకగా.
"తప్పా / ఏం తప్పు? అన్నాడు రాజు ఆశ్చర్యంగా.
"పాపం! ఎంత ఖర్చు పెట్టి తయారు చేశారో -- ఆ త్రిబుల్ వన్ త్రిబుల్ ఏ ఎయిర్ క్రాప్ట్ ని -- అది ఫెయిలయిపోవడంలో నాకూ బాధ్యత వుంది."
ఆశ్చర్యంగా ఆమెని ఎగాదిగా చూశాడు రాజు.
"ఇదంతా పవన్ పని!" అంది ఆ అమ్మాయి ఆరోపణగా.
"మీరు జరిగింది కాస్త వివరంగా చెబితే నాలాంటి వాడికి అర్ధం అవుతుంది " అన్నాడు రాజు.
"పవన్ ఈజ్ మై పెట్ మంకీ. నా పెంపుడు కోతి " అంది ఆ అమ్మాయి.
"పవన్ సరే .....మీరు ?"
"నేను సృష్టి.... అంత్రోపాలజిస్టుని . కోతుల జీవన విధానం గురించి రిసెర్చి చేస్తున్నాను."
"ఓహ్! ఐసీ!"
"పవన్ ఈజ్ మై పెట్ మంకీ! కానీ పెంకె ఘటం -- మాటవినదు -- అది ఈ వూళ్ళోనే ఫ్రెండ్ అయింది నాకు - వదల్లేక వదిలి వచ్చి ప్లయిట్ ఎక్కుదామనుకుంటే అది కూడా నన్ను వెదుక్కుంటూ ఎయిర్ పోర్టుకి వచ్చి వుండాలి. ఆ ప్రయత్నంలోనే అది తెలియనితనంతో ఎయిర్ క్రాప్ట్ ఇంజన్ లోకి వెళ్ళిపోయి ఉండాలి. ఇంజను డామేజ్ అయింది. అలా అని ఒక మెయిన్ టెనన్స్ ఇంజనీరు చెపుతుంటే విన్నాను. అంతటికీ నేనే కారణం !"
'అలా అని అందరికీ టాంటాం వేసినందువల్ల లాభం ఏమీ లేదు. ప్లీజ్ ! బీకామ్! ఎట్లా జరగాల్సింది అట్లా జరిగి తీరక తప్పదు !" అన్నాడు రాజు.
"అంతేనంటారా?"
'అంతే మరి"
కాస్త కుదుట పద్దట్లుగా చూసింది సృష్టి.
అంతలోనే-
అక్కడ చిక్కుకుపోయిన పాసెంజర్లని ఏ విమానంలో వీలయితే ఆ విమానంలో తరలించే ప్రయత్నాలు మొదలయ్యాయి.
అర్దారాత్రి అవుతుండగా --
రాజూ, సృష్టి టర్న్ వచ్చింది.
ఆ విమానాన్ని చూడగానే గాభరాపడింది సృష్టి.
"ఇది ఎప్పటి మోడలూ, ఇంత పాత మోడలు విమానాలు ఇంకా నడుస్తున్నాయా ?" అంది ఆశ్చర్యంగా.
నవ్వాడు రాజు "ఎమర్జన్సీ కదా! దొరికిన విమానాలన్నీ పట్టుకొస్తున్నట్లున్నారు."
ఇద్దరూ విమానం ఎక్కారు .
ఇద్దరికీ ఫ్రంట్ సీట్లో వచ్చాయి.
"గుడ్డిలో మెల్ల" అన్నాడు రాజు.
అతని మాట పూర్తీ కాకుండానే, ఒక ముసలాయన, ముసలమ్మా అక్కడికి వచ్చారు ."
"మీరు ఏమీ అనుకోకపోతే , మమ్మల్ని ఈ ఫ్రంట్ సీట్లలో కూర్చోనిచ్చి మీరు వెనుక మా సీట్లలో సర్దుకుంటారా?" అన్నారు వాళ్ళు. ఎంతో అభ్యర్ధన గొంతులో పలికిస్తూ.
"తప్పకుండా " అంటూ లేచి వెనుక సీట్ల వేపు నడిచాడు రాజు.
అతన్ని అనుసరించి సృష్టి . కూర్చున్న తరువాత రాజు యధాలాపంగా ఒంగి, సీటు కిందికి చూసి, "అరె ! ఇదేమిటి?" అన్నాడు.
"ఏమిటి? ఏమయింది?" అంది సృష్టి కంగారుగా.
కళ్ళు చిట్లించి చూశాడు రాజు . సీటు కింద కాలితో తడిమాడు.
పాత విమానం అది. కాళ్ళ దగ్గర చిన్న పగులు కూడా కనబడుతోంది. నిజమా -- తన భ్రమా?
'చూడండి -- అక్కడ చిన్న పగులు కూడా కనబడుతోందా?" అన్నాడు.
సృష్టి కూడా ఒంగి చూసి , "అవును -- అట్లాగే వుంది . ఇప్పుడెలా ?" అంది.
"పైలెట్ తో చెబుదాం " అని లేచి కాక పిట్ వైపు వెళ్ళాడు రాజు.
విమానం తాలుకు ఇంజన్లు అప్పటికే స్టార్ట్ అయి, పెద్దగా హోరు మొదలెట్టాయి.
"పైలట్ తో మాట్లాడాలి " అన్నాడు రాజు, ఎయిర్ హాస్టస్ తో.
"ఎందుకు ?" అంది ఎయిర్ హోస్టెస్ , విసుగ్గా .
తను చూసింది చెప్పాడు రాజు.
ఎయిర్ హోస్టెస్ అతని వెంటే వచ్చి, సీటు కింద చూసింది. కళ్ళు నులుముకుని మళ్ళీ చూసింది.
నిజమే! పగులులాగా కనబడుతోంది.
"మీరు కూర్చుని ఉండండి- పైలెట్ తో చెబుతాను " అని వెళ్ళింది ఎయిర్ హోస్టెస్.