వేగంగా, చురుగ్గా ఆలోచిస్తోంది. సుదూరంగా నాలుగురోడ్ల కూడలి.
అతి పెద్ద చౌరస్తా.
ఆ చౌరస్తాలో ట్రాఫిక్ ఎస్.ఐ. తప్పకుండా వుంటాడు. అతనికి తోడుగా నలుగురు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా వుండొచ్చు. అదే సరైన స్థలం.
ఆమె ఓ నిర్ణయానికొచ్చేసింది.
కారు అప్పటికే చౌరాస్తాకి దగ్గరగా వచ్చేసింది.
సిగ్నల్ లైట్స్ వెలిగాయి. వాహనాలన్నీ వరద ప్రవాహంలా ముందుకు సాగిపోతున్నాయి.
కుడివేపు, ఎడమవేపున్న వెహికల్స్ అన్నీ ఆగిపోయి సిగ్నల్ కోసం ఎదురుచూస్తుండగా ఆమె కారుని స్లో చేసింది.
ఆటోమేటిగ్గా వెనుక వస్తున్న వైట్ అంబాసిడర్ కూడా స్లో అయింది.
సిగ్నల్ ఇచ్చినా ఆమె ముందుకు వెళ్ళకుండా అక్కడే ఎందుకాగిపోయిందో అర్ధం కాలేదు అంబాసిడర్ లో వున్న ఆగంతకులకు.
మరికొద్ది క్షణాలకి రెడ్ లైట్ వెలిగింది.
అడ్డంగా వున్న కుడిఎడమల రోడ్స్ లోని వాహనాలు అడ్డంగా పరిగెడుతుండగా ఆమె తన కారుని తెచ్చి చౌరస్తాకి దగ్గరగా ఆపింది. అడ్డంగా వాహనాలు ఎడతెరిపి లేకుండా వెళుతూనే వున్నాయి.
ఆమె క్లచ్ నొక్కి ఫస్ట్ గేర్ లోకి వచ్చింది.
ఎడమకాలుతో అలాగే క్లచ్ ని నొక్కి వుంచింది.
కుడికాలును యాక్సిలేటర్ మీద ఆన్చి క్షణాల్ని లెక్కిస్తోంది.
కొద్ది క్షణాలు గడిచాయి.
సిగ్నల్ లైట్ వెలిగింది.
అడ్డంగా వెళుతున్న వాహనాల ప్రవాహం ఆగిపోయింది.
ఆమె కారు ముందున్న వెహికల్స్ ఎదురుగా వెళుతుండగా ఎదురుగా ఆగివున్న వాహనాలు ఇటుకేసి రాసాగాయి.
అయినా ఆమె కారు కదలలేదు. సిగ్నల్ లైట్ వెలిగినా ఆమె ముందుకు వెళ్ళకుండా మరోసారి ఎందుకాగిపోయిందో వెనుక కారులో వున్న ఆగంతకులకు అర్ధం కాలేదు.
ఆమె కారులో స్టీరింగ్ ప్రక్కనే అమర్చిన ఎలక్ట్రానిక్ వాచ్ కేసి చూస్తూ క్షణాల్ని లెక్కిస్తోంది.
మరో అయిదు క్షణాల్లో రెడ్ లైట్ వెలుగుతుందనగా అడ్డంగా వున్న రోడ్ లోని వాహనాలు బయలుదేరబోతుండగా-ఆమె కనురెప్ప పాటులో కారుని ముందుకు దూకించింది.
ఆమె మరొక్క క్షణం ఆలస్యం చేసినా అడ్డంగా వస్తున్న వాహనాల మధ్య ఇరుక్కొని ఘోరమైన ప్రమాదానికి గురయ్యేదే.
ఆమె కారలా ముందుకు దూకగానే, వెనుక కారులో వున్న ఆగంతకులు తేరుకొని గేర్ మార్చి ముందుకు వచ్చేసరికి ఆలస్యమయిపోయింది.
అడ్డంగా పరిగెడుతున్న వాహనాలు మధ్యలోకి వచ్చేసి ప్రవాహపు గోడలా నిలిచాయి.
అంబాసిడర్ ఆగిపోయింది.
మరలా సిగ్నల్ లైట్ వెలగటానికి యాభై క్షణాలు పడుతుంది. ఈలోపు ఆమె ఎంతో దూరం వెళ్ళిపోతుంది?
ఆమె ప్లేచేసిన ట్రిక్ వాళ్ళకు అర్ధమయిపోయి అసహనంగా, పెద్దగా "డామ్ షిట్" అంటూ అరిచారు.
ఆమె కారు నేరుగా వెళ్ళలేదు. ముందుకు వెళ్ళినట్లే వెళ్ళి చటుక్కున కుడివేపుకి తిరిగి ఆగిపోయింది.
ఇప్పుడు ఆమె కారుకి ఆగంతకుల కారు ఎదురుగా వుంది. మధ్యలో ట్రాఫిక్ ఐలాండ్ వుంది.
సిగ్నల్ లైట్ వెలిగింది.
ఆగంతకుల కారు ఎదురుగా వెళుతుండగా, ఆవేపు నుంచి ఆమె కారు ఇటువేపు వస్తూ కనిపించింది.
వాళ్ళు పళ్ళు పటపటా కొరుకుతూ ముందుకు వెళుతుండగా ఆమె 'హాయ్' అంటూ పెద్దగా అరుస్తూ, కుడిచేతిని కారులోంచి బయటకు పెట్టి బొటనవేలిని పైకిలేపి ఛాలెంజ్ అన్నట్లు సైగచేస్తూ ముందుకు సాగిపోయింది.
ఆ కోపంలో వాళ్ళు కారును స్లో చేయటంతో వెనుక వస్తున్న వాహనాలు ఆగంతకుల కారును ఢీ కొట్టాయి. అంతే వరుసగా పది, పదిహేను వాహనాలు ఢీ కొట్టాయి. అంతే వరుసగా పది, పదిహేను వాహనాలు ఢీకొన్నాయి.
అది చూస్తూనే ట్రాఫిక్ ఎస్.ఐ. ట్రాఫిక్ ఐలేండ్ కేసి పరిగెత్తుకు రాసాగాడు.
ఈలోపు ఆమె కారు ఇంతక్రితం తను వచ్చిన రోడ్ లోనే వెళుతూ రెండు కిలోమీటర్ల డూరాన్ని అధిగమించింది.
ఆమెలో ఇప్పుడు టెన్షన్ లేదు రిలాక్స్ అవుతూ మగళంపల్లి క్యాసెట్ ని టేప్ రికార్డర్ లోకి ఇన్ సర్ట్ చేసింది.
కారు రాజహంసలా ముందుకు సాగిపోతోంది.
ఎదురుగాలి కారులోకి చొరబడుతూ, ఆమె ఎత్తయిన ఎదపై నున్న పైటను సుతారంగా తాకుతూ ప్రక్కకు తప్పించే చిలిపిపనిలో నిమగ్నమయింది.
ఆమె ఆలోచనలిప్పుడు వేరే విషయం మీదకు మరలాయి.
కారు వెళుతూనే వుంది.
క్యాసెట్ లోంచి మంగళంపల్లి స్వరం మృదుమధురంగా విన్పిస్తూ వుంది.
పైట ఎగురుతూనే వుంది.
పైట క్రింద బరువైన ఎద కారు కుదుపులకి కదులుతూనే వుంది.
'బ్లాక్ ఈజ్ బ్యూటీఫుల్' అని ఆమెను చూసిన ఎవరైనా వెంటనే అనేస్తారు.
నల్లగా వున్న ఆడపిల్లలు ఆమెను చూసి ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ ని తేలిగ్గా దూరం చేసుకోగలరు.
ఆమె ఆరోగ్యంగా, బలంగా, పుష్టిగా వున్నా నాజూకుతనాన్ని వదులుకోలేదు. ఆమెది అందమైన చామనఛాయ శరీరం.
ఆమె వీనస్....
'క్వీన్' ఎడ్వర్టెయిజింగ్ ఏజెన్సీకి యజమానురాలు.
ది ఒన్ అండ్ ఓన్లీ ఉమన్ ఓరియంటెడ్ ఎడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ఇన్ ఇండియా.
* * * * *
ఆ వృద్దుడు కనుసైగతోటే తనను గుర్తించిన అధికారి నోటినుంచి వెలువడబోయిన కేకను ఫ్రీజ్ చేశాడు.
ఆ అధికారి వృద్దుడి దగ్గరకు వచ్చి వినయంగా వంగి నమస్కరించాడు.
మాట్లాడకుండా తనతోటే రమ్మని సైగ చేస్తూ ఆ వృద్దుడు ముందుకు సాగిపోయాడు.
ఒక సెక్షన్ లో నలుగురు ఓచోట గుమిగూడి రేస్ పుస్తకాలతో లక్కీ నెంబర్స్ తో కుస్తీ పడుతున్నారు.
మరో సెక్షన్ లో నలుగురు యువకులు ఎవరెవరు ఏఏ అమ్మాయికి ఏఏ టైమ్ లో సైట్ కొడుతున్నది గొప్పగా చెప్పుకుంటున్నారు.
వృద్దుడి ముఖంలో ఏ భావమూ పలకడం లేదు.
పక్కనున్న అధికారి మాత్రం ప్రాణాలు అరచేత పట్టుకొని ఫాలో అవుతున్నాడు.
సరిగ్గా అరగంటకు ఆ వృద్దుడు లిఫ్ట్ దగ్గరకు చేరుకొని "నేను కబురు పెట్టినప్పుడు రండి" అంటూ లిఫ్ట్ లోకి వెళ్ళి డోర్స్ క్లోజ్ చేసుకున్నాడు.
ఆ అధికారి పై ప్రాణాలు పైనే పోయాయి.
ఈరోజు ఎంతమందికి షోకాజ్ నోటీసులు అందుతాయో మరెంతమంది తమ ఉద్యోగాల్ని కోల్పోతారో అంచనా వేయలేకపోతున్నాడా అధికారి.
సరిగ్గా అదే సమయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రూమ్ లోని ఇంటర్ కమ్ మోగింది.
అప్పటివరకు జి.ఎమ్.తో మాట్లాడుతున్న మౌనిక చటుక్కున ఫోనెత్తి చెవికానించుకుంది.
"హలో మోని... హౌ ఆర్యూ... విల్ యూ ప్లీజ్ కమ్ వన్స్..."
"ఇప్పుడే వస్తున్నాను గ్రాండ్ ఫా" అంటూ ఫోన్ క్రెడిల్ చేసి మౌనిక లేచింది సీట్లోంచి.
ఈలోపు ఆఫీస్ నంతటా దిగ్రేట్ జె.జె. వచ్చినట్టు, తనెవరో ఎవరికీ తెలియకుండా తన కార్యాలయాన్నంతటినీ అబ్జర్వ్ చేసినట్టు తెలియడంతో పదహారు అంతస్థుల్లో వున్న సిబ్బంది భయోద్వేగానికి లోనయ్యారు.
మౌనిక చైర్మెన్ ఛాంబర్ లోకి ఎంటర్ అవుతూనే "గుడ్ మార్నింగ్ గ్రాండ్ ఫా...." అంది చాలాకాలానికి తాతగార్ని చూశానన్న ఆనందంతో.
జె.జె. తలెత్తి మనవరాలివేపు ఆప్యాయంగా చూస్తూ దగ్గరకు రమ్మన్నట్లు సైగ చేశాడు.
మౌనిక విశాలమైన టేబుల్ ప్రక్కనుంచి ఆయన దగ్గరకు వెళ్ళి నించుంది.