ఆయన చైర్లోంచి లేచి మనుమరాలి తలను తనవేపుకు తీసుకొని, ఆమె నుదుటిమీద వాత్సల్యంతో ముద్దెట్టుకుని కొద్ది క్షణాలు మనుమరాలి కేసి చూశాడు.
ఆ చూపుల్లో ఆయన చనిపోయిన తన గారాల కూతుర్ని చూసుకోగలుగుతున్నానన్న ఆనందం కొట్టొచ్చినట్టు కనిపించింది.
"సరిగ్గా నీ వయస్సులో మీ అమ్మ వున్నప్పుడు ముమ్మూర్తులా నీలాగే వుండేదమ్మా..." ఆయన కంఠంలో ఒకింత జీర.
ఆయన తన మనుమరాలు మౌనికను చూడక అప్పటికి పది సంవత్సరాలైంది.
ఆయన కళ్ళలో తడి.....
వాత్సల్యం కట్టలు తెంచుకుంది....
అప్పటివరకూ బిజినెస్ తప్ప మరో ప్రపంచంతో ఆయనకు ప్రమేయం లేదు.
డెబ్బైఎల్లా జె.జె.లో జవసత్వాలు ఉట్టిపడుతున్నాయి. పవర్ ఫుల్ ఫ్రేమ్ తో, గంభీరమైన కంఠంస్వరంతో ఎవరినో శాసించడానికి, తనకు కావల్సిన పనులు ఆర్డర్ వేసి చేయించుకునేందుకు పుట్టినవాడిలా కనిపిస్తాడు.
ఈ దేశంలోని భాగ్యవంతులలో మూడవస్థానంలో వుంటాడు జె.జె.
ప్రపంచంలోని బిలియనీర్స్ అతని మిత్రులు, ఎడ్సెల్ ఫోర్డ్, ఫియట్ ఆగ్నేల్లి, కాన్రాడ్ హిల్టన్, హోండా, లీ అయెకోక్కా, ఆకియో మోరిసాలాంటి ప్రపంచ మహాధనవంతులు అతనితో బిలియర్డ్స్ ఆడుతూ బిజినెస్ డీల్ చేస్తుంటారు.
బిగ్ బిజినెస్ వరల్డ్ కి అతనో మూలస్థంభంలాంటి వాడు.
స్వయంకృషితో కోట్లాది సంపదను ఒక తరంలో సంపాదించి అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన భారతీయుడు జె.జె.
ప్రతి క్షణాన్నీ లక్షల్లోకి, కోట్లల్లోకి మార్చగల ప్రతిభాశాలి.
అతనికి వివాదాలతో, సంవాదాలతో సంబందాలుండవు, వుంచుకోడు. మరొకర్ని చూసి అసూయపది అవాకులు, చావాకులు పేలే అధముడు కాదు. అతనికి కాలం విలువ బాగా తెలుసు.... దాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో ఇంకా బాగా తెలుసు.
బిజినెస్ వ్యవహారాల్లో కఠినంగా వ్యవహరిస్తాడు. ఏదైనా సాధించుకోవలసినప్పుడు ఒకింత లౌక్యాన్ని ప్రదర్శిస్తాడు.
అలాంటి జె.జె.ని జరిగిపోయిన ఎన్నో ఏళ్లనాటి జ్ఞాపకాలు వరదలా ముంచెత్తాయి.
జె.జె.కి ఒక కొడుకు- ఒక కూతురు. కొడుకు చిన్నప్పటినుంచి తండ్రి దారిని తప్పి వ్యవహరించేవాడు. కూతురు మాత్రం ప్రతి విషయంలోనూ తండ్రినే అనుసరించేది. దాంతో సహజంగానే కూతురితో ఆయనకీ ఎటాచ్ మెంట్ ఎక్కువయింది?
భార్య చనిపోయినా మరలా పెళ్ళి చేసుకోకుండా కూతుర్ని, కొడుకునీ తన లోకంగా భావించేవాడు.
జె.జె. అప్పటికి సెక్సువల్ గా విగరస్ గా వున్నా పెళ్ళి చేసుకొనేందుకు ఇష్టపడలేదు.
కాలప్రవాహంలో కొడుకు మానసికంగా జె.జె.కి చాలా దూరమయ్యాడు.
కొడుకు ఎలాగోలా సంపాదించి అనుభవించాలనేవాడు- కూతురు పాపపుణ్యాలు కూడా ఆలోచించాలనేది. కొడుకు ఈజీ మనీని ఇష్టపడితే, కూతురు హార్డెర్న్ డ్ మనీనే కోరుకునేది. కొడుకు, కూతురు పెద్దవాళ్ళయ్యాక జె.జె. నిర్దాక్షిణ్యంగా ఓ నిర్ణయం తీసుకున్నాడు. అప్పటివరకూ తను సంపాదించిన ఆస్తిని మూడు వాటాలు చేసి ఒకటి తనుమ్చుకొని, రెండవది కొడుక్కి మూడవది కూతురికీ యిచ్చేశాడు.
ఆ వెంటనే కొడుకు వేరే పొయ్యి పెట్టడంతో జె.జె. ఓ రకమైన విరక్తికి లోనయి కొడుకును దాదాపు మర్చిపోయాడు. కూతుర్ని దగ్గరే వుంచుకున్నాడు. అంతగా ప్రేమించిన తన కూతురికి తను ఇష్టపడిన వ్యక్తితోనే పెళ్ళి జరిపించాడు. దురదృష్టవశాత్తూ రెండు సంవత్సరాలకే అల్లుడు చనిపోవడంతో జె.జె.కి కూతురంటే ప్రేమతోపాటు ఒకింత జాలీ పెరిగింది. కూతురికి అప్పటికే మౌనిక పుట్టడంతో జె.జె. ఆలోచనలు మలుపు తిరిగాయి తన మనుమరాలే యాజమానురాలు కావాలని, ఆమె తనకు వారసురాలు కావాలని- ఆ రోజునుంచీ రాత్రింబవళ్ళు శ్రమించేవాడు.
వర్క్..... వర్క్..... అందులోని నిర్ణయాలని క్లియర్ మైండ్ తో తీసుకోవడం, లాభనష్టాలను ఒకే విధంగా అనెమోషనల్ గా చూసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, సామర్ధ్యం, డిసిప్లిన్ వున్న వ్యక్తుల్ని పసిగట్టి వారికి పదవులు ఇవ్వడం- తన కాలాన్ని మాత్రం కొత్త వ్యాపారాలకు కేటాయించడం నిరంతరం ఇదే అతని వ్యాపకం....
ఇన్ని వ్యాపకాల్లో రిలాక్స్ అవుతుండే వాడాయన..... స్విమ్మింగ్, బిలియర్డ్స్ అండ్ గోల్ఫ్ స్క్రూ ఎ ఫ్యూ స్టార్ లెన్స్ ఫ్రమ్ మద్రాస్ టూ బోంబే తనకు ఆనందాన్నిచ్చిన స్టార్ లెట్స్ కి విలువైన బహుమతులిచ్చి ఎటాచ్ మెంట్ లేకుండా చూసుకునేవాడు.
కొడుకు విషయంలో జె.జె. ఏంటీ సెంటిమెంటనిపించినా, కూతురు విషయంలో సెంటిమెంటల్ అనిపించేవాడు.
ఎవరికోసమైతే తను రాత్రింబవళ్ళు శ్రమించాడో.... ఎవరికోసమైతే తను అన్యులెవరికీ దగ్గరకాలేదో..... ఎవరికోసమైతే ఒక మెగా ఇండస్ట్రియల్ ఎంఫైర్ సృష్టించాడో... ఆ వ్యక్తీ... తనకు అత్యంత ఇష్టమైన ఆ మౌనికే ఇప్పుడు పెరిగి పెద్దదయి తన ముందు, తన కూతుర్ని తలపిస్తూ నించుంది.
ఎత్తు, లావు, రంగు, కనుముక్కు తీరు, నడక అంతా అచ్చం తన కూతురిలాగే వుంది. తన తల్లి నోట్లోంచి వూడిపడ్డట్టున్న మౌనికను చూసి ఆయన ఒకింత గర్వంగా, తృప్తిగా ఫీలయ్యాడు.
ఆయనకు ఓ విషయంలో బాధగా కూడా వుంది. పదిసంవత్సరాలుగా విదేశాలలో, జెట్ లాగ్స్ తో అనవరతం శ్రమిస్తూ ఆఖరికి మౌనిక 24వ ఏట తన ఎంఫైర్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ని చేసేప్పుడు కూడా దగ్గర వుండలేకపోయాడు.
అదెంతోసేపు ఆయనలో నిలవలేదు. అతని మైండ్ కి ఓ ప్రత్యేకమయిన శక్తి వుంది. తనకు బాధ కలిగించే విషయాల్ని, తనకిష్టంలేని విషయాల్ని సునాయాసంగా ప్రక్కదారి మళ్ళించగలడు. అదే చేశాడిప్పుడు జె.జె.
ఇప్పుడతని ముఖం ప్రశాంతంగా వుంది. అతనిలోని ఆలోచనల వేగం తిరిగి వుంచుకుంది.
మనుమరాలివేపు ఆప్యాయంగా చూస్తూ "టేక్ యువర్ సీట్ మౌనిక" అన్నాడు.
ఆమె తాతగారి గొప్పతనాన్ని మననం చేసుకుంటూ ఆయన కెదురుగా కూర్చుంది.
ఆయన సీట్లోంచి లేచి మెత్తని పర్షియన్ కార్పెట్ పై పచార్లు చేస్తున్నాడు. ఆ ఛాంబర్ మొత్తం ఇప్పుడు నిశ్శబ్దంగా వుంది.
కొద్దిక్షణాలకు ఆయన టేబుల్ దగ్గరకు వచ్చి ఫ్రెంచ్ సిగార్ ఒకటి తీసి లైటర్ తో వెలిగించుకుంటూ అన్నాడు.
"ఓటమి అంటే నాకు అసహ్యం... నా డిక్షనరీలో డిపీట్...అపజయం-పరాజయం... ఓటమిలాంటి పదాలు లేకుండా ఇంతకాలం జాగ్రత్తపడ్డాను. బట్..... బట్" ఆయన మాటల్లో అసహనం, అవమానం తొంగిచూశాయి.
మౌనిక మౌనంగా వుంది.
"ఎలా సంభవించిందీ ఓటమి?" ఇప్పుడాయన కంఠంలో కోపం కూడా ప్రస్ఫుటమైంది. ఇప్పుడాయన దృష్టిలో మౌనిక తన వారసురాలిగా కాక, తన క్రింద పనిచేసే ఒక పెద్ద వుద్యోగినిగా మాత్రమే కనిపిస్తోంది.
ఆయనంత నిష్కర్షగా వ్యవహరించబట్టే ఆ స్థితికి రాగలిగాడేమో!
"కాఫ్స్ అండ్ స్నీజెస్ స్ప్రెడ్ డిసీజెస్!"
అలాగే అసమర్ధత, తెలివి తక్కువతనం పరాజయాన్ని పంచుతుంది. పరాజయాన్ని అసహ్యించుకున్నట్లే...
"అసమర్ధతను, తెలివితక్కువతనాన్ని కూడా నేను అసహ్యించుకుంటాను..." డిజ్ గస్టెడ్ గా అన్నాడు.
నిజానికి ఆ ఓటమి ఎలా సంభవించిందన్నది ఆమెకు కూడా తెలీదు. ఆమెకది క్రితం రోజే తేలిసింది. విదేశాలలో వున్న జె.జె.కే ఆమె కన్నా ముందు తేలిసింది.
జె.జె.కి అంత గొప్ప నెట్ వర్క్ వుంది.
"చెప్పమ్మా.... ఎలా జరిగింది?" జె.జె. మౌనికను అడిగాడు తిరిగి.
ఆయనకి తెలుసు ఆ ఓటమి సంగతి ఇంకా ఆమెకు తెలిసుండదని.
అలా అని ఆ విషయం మౌనికకు కూడా తెలుసు. కాని నాకు తెలీదని సింపుల్ గా సమాధానం చెబితే దాన్ని తన అసమర్ధతగానే తాతగారు భావిస్తారని ఆమె వూహించింది. అందుకే ఆమె యింకా మౌనాన్ని వీడలేదు.
"మౌనికా! నా జీవితాన్ని నేను యుద్దప్రాతిపదిక మీద క్రమశిక్షణతో నడిపాను. వ్యక్తులతో, సంస్థలతో, ఆఖరికి వివిధ దేశాల ప్రభుత్వాలతో యుద్దాలు చేశాను. తద్వారా వ్యాపార విజయాల్ని నా సొంతం చేసుకున్నాను. కొన్ని దశాబ్దాల క్రితం ఒకే ఒక్కసారి ఓ వ్యక్తి చేతిలో ఓడిపోయాను. తిరిగి పట్టుదలగా ఆ వ్యక్తిమీదే గెలిచాను. కాని అప్పటినుంచి ఓటమి అంటే నాకు అసహ్యం. నా పోరాట విధానంలో ఓటమి అన్న పధం లేదు. నా మనోధైర్యంతో, శ్రమతో ఓ ఇండస్ట్రియల్ ఎంపైర్ ని సృష్టించాను. ఇదంతా దేనికోసం? ఎవరికోసం....? నా కూతురు కోసం.... నన్ను అమితంగా ప్రేమించిన కూతురు కోసం.... అంటే నీకోసమేగా?" గంభీరంగా వున్నాయి ఆయన మాటలు.