Previous Page Next Page 
అక్షరయజ్ఞం పేజి 4

 

        ఆమె అందం వాళ్ళను అచేతనుల్ని చేస్తే ఆమె వస్త్రధారణ వాళ్ళకు ఓ పజిల్ అయి కూర్చుంది.
   
    మామూలు మధ్యతరగతి స్త్రీలు ధరించే నూటయాభై రూపాయల ఆర్గండి చీర, దానికి తగ్గ ఖరీదులో లభించే బ్లౌజ్, ఎడం చేతికి సన్నటి రిస్ట్ వాచ్, కుడిచేతి చిటికెన వేలుకి చిన్న డైమండ్ రింగ్, కళ్ళకు కూలింగ్ గ్లాసెస్... కోట్లకు వారసురాలు....!?
   
    ఆమె చూపులు సూటిగా, కదలికలు షార్ప్ గా ఎదుటివాళ్ళ అంతరంగాన్ని స్కాన్ చేసేలా వుండడాన్ని మొదటి చూపుల్లోనే కొందరు అధికారులు వెంటనే పసిగట్టి ఈమెతో జాగ్రత్తగా వ్యవహరించాలని ఓ నిర్ణయానికొచ్చేశారు.
   
    ఆమె నిశ్శబ్దంగా లిఫ్ట్ కేసి సాగిపోతోంది. వాళ్ళు ఆమెను పరిచయం చేసుకోవాలని, తమ గురించి ఆమెకు చెప్పాలని ఆత్రుత పడుతుండగానే ఆమె లిఫ్ట్ లోకి నడిచి, డోర్ మూసుకోబోయేలోపు-   
   
    గాగుల్స్ ఓసారి అలవోకగా తీసి అందరికేసి చూసింది.
   
    అంతే... ఆ మరుక్షణం డోర్స్ మూసుకున్నాయి. వాళ్ళు ప్రశ్నార్ధకంగా అక్కడే మొద్దుబారిపోయి నిల్చున్నారు.
   
    ఇప్పుడా బిల్డింగ్ లో మూడువేల గుండెల లబ్ డబ్ శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తోంది.
   
    సరిగ్గా అరగంటకు జనరల్ మేనేజర్ గదిలోని ఇంటర్ కమ్ మ్రోగింది. ఆమె వచ్చిన అరగంటలో ఆ భవనంలో తొలిసారి వినిపించిన శబ్దం అదే. ప్రాణాలరచేత పట్టుకొని కుర్చీలో అటూ, ఇటూ కదులుతున్న జి.ఎం. చటుక్కున ఫోన్ అందుకున్నాడు.
   
    మరికొద్ది క్షణాలకి  ఫోర్త్ ఫ్లోర్ లో వున్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మౌనిక రూమ్ కేసి హడావిడిగా బయలుదేరాడు.
   
    జి.ఎం. గదిలోకి ఎంటర్ అవుతుండగానే.... "ఎవరీ మాథుర్?" సన్నగా కోకిల కంఠంలా వున్నా, అందులో లీలగా శాసనాధికారం ప్రస్ఫుటమవుతూ ఓ ప్రశ్న వెలువడింది. జి.ఎం. ఉలికిపాటును కప్పి పుచ్చుకుంటూ ఆమెకేసి మర్యాదగా చూశాడు.
   
    సరీగ్గా అదే సమయానికి ఆఫీసు సిబ్బంది మధ్య గుసగుసలు ప్రారంభమయ్యాయి.
   
    ప్రతి సెక్షన్ లో సిబ్బంది పని మానేసి ఓచోట చేరి రాబోయే పరిణామాల గురించి ఫర్ కేస్ట్ చేయడంలో మునిగిపోయారు. ఓ వృద్దుడు అప్పుడే ప్రధాన సింహద్వారం దాటి గ్రౌండ్ ఫ్లోర్ లోని విశాలమైన పర్చేజింగ్ హాల్లోకి ప్రవేశించాడు..... అతని చూపులు నిశితంగా, లేసర్ కిరణాల్లా వున్నాయి.
   
    ఒక్కో అడుగే ముందుకేస్తూ ఫ్లోర్ మీద పడున్న చెత్తని తీసి వేస్ట్ బాస్కెట్ లో వేస్తూ, చెల్లాచెదురుగా పడున్న సిన్స్ ని, జెమ్ క్లిప్స్ ని, టాగ్స్ ని ఏరి అక్కడే వున్న సిబ్బంది టేబుల్స్ మీద శ్రద్దగా వుంచుతూ నిశ్శబ్దంగా ముందుకు సాగిపోతున్నాడు.
   
    అక్కడున్న ఎవరూ అతన్ని గమనించలేదు. గమనించిన ఒకరిద్దరూ నిర్లక్ష్యంగా తలెగరవేసి మాట్లాడుకోవటంలో నిమగ్నమయిపోయారు.
   
    "కాళ్ళకు మెట్టెలున్నాయి.... పెళ్ళయిపోయిందా! ఏం కొంపదీసి....." ఒక పెళ్ళి కాని క్లర్క్ బాధగా అన్నాడు.
   
    "మెట్టెలు పెళ్ళి సింబల్ కాదు. పెళ్లికాని వాళ్ళూ ఈ మధ్య మెట్టెలు పెట్టుకుంటున్నారు. పెళ్లయినా, కాకపోయినా నువ్వేం పిచ్చి ఆశలు పెట్టుకోకు పిచ్చికన్నా...." ప్రేమలో విఫలమయి విరహగీతాలు పాడుకుంటున్న మరో క్లర్క్ అన్నాడు.
   
    ఆ వృద్దుడు మరికాస్త ముందుకు వచ్చాడు.
   
    అయినా వాళ్ళతన్ని గమనించలేదు-ఒకరిద్దరు గమనించినా గుర్తించలేదు.
   
    అంతలో అటుగా వస్తున్న ఓ అధికారి అలవోకగా ఆ వృద్దుడ్ని చూశాడు. ముందుగా అతనికేం అర్ధం కాలేదు- కొద్ది క్షణాలకి తేరుకున్న అతను ఆ వృద్దుడ్ని గుర్తించాడు- అంతే అతను పెద్దగా వేయబోయిన కేక అతని గొంతులోనే ఫ్రీజ్ అయిపోయింది-
   
                             *    *    *    *    *
   
    "సముద్రా ఎడ్వర్ టైజింగ్ ఏజెన్సీ....
   
    పదేండ్లలో అనితరసాధ్యమైన అభివృద్ధిని సాధించిన రిలయన్స్ టెక్స్ టైల్స్ కంపెనీ ఉత్పత్తుల ప్రచార బాధ్యతల్ని నెత్తికెత్తుకున్న ప్రతిష్టాత్మకమైన ఎడ్వర్ టైజింగ్ సంస్థ.
   
    పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు సయితం ఈ రోజు సముద్రానే తమ ఏడ్ సంస్థగా అట్టిపెట్టుకోవాలనే ఉత్సాహంతో వున్నాయంటే ప్రచార రంగంలో ఆ సంస్థకి వున్న ప్రాముఖ్యతను అంత తక్కువగా అంచనా వేయలేం."
   
    విశాలంగా వున్న ఎయిర్ కండిషన్డ్ హాల్లో ఆమె పచార్లు చేస్తూ చెప్పుకుపోతోంది.
   
    ఆ హాల్లో కూర్చున్న పదిహేనుమంది ఆమె చెప్పుకుపోతున్న విషయాల్ని శ్రద్దగా వింటున్నారు.
   
    అందమైన ముఖం.
   
    నల్లటి కురులు.
   
    కరి మబ్బులా ఆమె వీపంతా పర్చుకొనే నల్లటి, వరదలాంటి ఒత్తయిన కురులు.
   
    ఎలిజబెత్, రేఖ పోలికల్ని కలగలిపితే ఆమె మోముకి దగ్గరగా వుంటుందేమోనని అనిపిస్తుంది.
   
    అమాయకత్వం ఓవైపు- మొండితనం ఓవైపు తొంగిచూసే రాయల్ ఫేస్.
   
    ఆమె వోకల్ కార్డ్స్ నుంచి పుట్టే శబ్ద తరంగాలు ఆ నాలుగు గోడల మధ్య పేరుకున్న నిశ్శబ్దాన్ని నియంత్రిస్తున్నట్లున్నాయి.
   
    అరగంట గడిచింది.
   
    ఆమె చెప్పదల్చుకుంది పూర్తి చేసింది.
   
    "సో... వీటన్నిటిని బట్టి మనం మన పంథాను పూర్తి మార్చుకోవలసి వుంటుంది. బీ ప్రిపేర్డ్ ఫర్ యాడ్ వార్" హెచ్చరిస్తూనే ఆమె బయటకు నడిచింది.
   
    ఆమె లిఫ్ట్ లో నాల్గవ అంతస్థు నుంచి క్రిందకు వచ్చేసింది.
   
    లిఫ్ట్ తెర్చుకోగానే ఆమె బయటకు వచ్చి నలువేపులా చూసి ఆ తరువాత వేగంగా కార్ పార్కింగ్ ప్లేస్ కేసి నడిచింది.
   
    మరికొద్ది క్షణాల్లో ఆమె కారు బుల్లెట్ లా రోడ్ పైకి దూసుకుపోవటం-అరవై కిలోమీటర్ల వేగానికి చేరుకోవటం అంతా క్షణాల్లో జరిగిపోయింది.
   
    అందమైన ఆడపిల్ల వాల్జడలాంటి రోడ్ పై ఆమె కారు సుడిగాలిలా ముందుకు దూసుకుపోతోంది.
   
    చిత్రకారుడెవరన్నా ఆమె అందమైన చేతివేళ్ళను చూస్తే వాటి మీదే అద్భుతమైన ఆయిల్ పెయింటింగ్ వేసి అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించుకునేవాడు. అంతా అందమైన ఆమె వెళ్ళేటప్పుడు మారుతికారు స్టీరింగ్ పై బిగుసుకుంటున్నాయి.
   
    ఆమె ఓ క్షణం సైడ్ మిర్రర్ లోకి చూసింది. అదే కారు. అదే నెంబరు తనను వెంటాడుతూ వస్తోంది.
   
    ఆమె ఓ క్షణం సైడ్ మిర్రర్ లోకి చూసింది. అదే కారు. అదే నెంబరు తనను వెంటాడుతూ వస్తోంది.
   
    ఆమె ఓ క్షణం నవ్వుకుంది. ఉన్నట్టుండి ఆమె కుడికాలు ఒకింత ముందుకు జరిగింది. అంతే కారు స్పీడోమీటర్ లోని ముల్లు వణికిపోతూ ముందుకు కదిలింది.
   
    ఆమె వున్నట్టుండి కాఉర్ని ఒకింత స్లో చేసింది. ఎవరో మంత్రించినట్టు వెనుక వస్తున్న కారు కూడా కొద్దిగా స్లో అయింది.
   
    తిరిగి అంతలోనే ఆమె కారు వేగం పెరిగింది. వెనుక వస్తున్న కారు వేగం కూడా పెరిగింది.
   
    ఆమెలోని అనుమానం బలపడింది.
   
    ఎలాగైనా వెనుక వస్తున్న కారులోని వ్యక్తి కళ్ళు గప్పి వెళ్ళిపోవాలి.
   
    ఎలా?
   
    అదీ వాళ్ళను ఫూల్స్ ని చేస్తూ... ఎలా? కారుకన్నా వేగంగా ఆమె మెదడులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.
   
    ఒకవేళ సడన్ గా కారాపేసి, ఎందుకిలా తననే చేజ్ చేస్తున్నారని అడిగినా.... వాళ్ళు చిరునవ్వు నవ్వి అదేంలేదే.... మేము మామూలుగానే వెళుతున్నాం అంటే... ఏమిటి చేసేది? అసలెలా వాళ్ళు తన కారూన్ చేజ్ చేస్తున్నట్లు రుజువు చేసేది?
   
    పోలీస్ కంప్లయింట్ ఇవ్వొచ్చు కానీ, అది అసమర్ధులు, పిరికివాళ్ళు చేసేపని. ఒకవేళ కంప్లయింట్ ఇచ్చినా సరైన ఆధారం చూపించలేక థానే ఫూల్ కావచ్చు.
   
    వాళ్ళు తనను ఏడిపించాలనే, హుమిలిఏట్ చేయాలనో చూస్తున్నారు. తెలివిగా, వాళ్ళు చూస్తుండగానే వాళ్ళకు టోకరా ఇచ్చి, వాళ్ళను నిస్సహాయ స్థితిలో పడేసి తను ముందుకు వెళ్ళాలి.
   
    ఆమె ఆలోచిస్తోంది.

 Previous Page Next Page