Previous Page Next Page 
దావాగ్ని పేజి 49


    "కానీ అంత డబ్బు నాలుగైదేళ్ళలో సంపాదించే అవకాశం వుంది. ఇన్ ఫాక్ట్, ఓ ఆరునెలల లోపలే డబ్బు వరదలా మన ఇనప్పెట్టెల్లోకి ప్రవహించడం మొదలవుతుంది.

 

    "బట్ హౌ:" అంది అప్సర ఆశ్చర్యంగా.

 

    "యురేనియం:"

 

    "అంటే, యురేనియం బ్లాక్ మార్కెట్ లోకి మనం దిగుతామా?"

 

    "కాదు. యురేనియం త్రవ్వి తీస్తాం."

 

    "ఎక్కడనుంచి?"

 

    "చిత్రద్వీప్ లోని ఒక కొండలో నుంచి."

 

    నుదురు చిట్లించి చూసింది అప్సర.

 

    నవ్వి, ఇంక సస్పెన్స్ మెయిన్ టెయిన్ చెయ్యడం మానేసి, వివరంగా జరిగింది అంతా చెప్పటం మొదలెట్టాడు బాబూజీ.

 

    "చిత్రద్వీప్ లో తమ కంపెనీ రోడ్డు వేస్తోంది. అక్కడ ఒక పిల్లవాడు చూసుకోకుండా తన మీదికి రాయి ఒకటి వేశాడు. ఆ రాయి మామూలు రాయి కాదనీ, అందులో యురేనియం ఉందనీ పసికట్టాడు కంపెనీ సైంటిస్టు రామనాధం. ఆ రహస్యం జనరల్ భోజా గవర్నమెంటుకి తెలియకుండా, రిపోర్టుని మార్చి, అక్కడ చౌకరకం లోహమేదో కొద్ది మోతాదులో దొరుకుతుందని రామనాధం చేత రాయించాడు తను. డబ్బు అవసరంలో వున్న రామనాధం తను చూపించిన ఆశలకి లొంగిపోయాడు. రిపోర్టు మార్చి రాసిన తర్వాత రామనాధాన్ని "బట్వాడా" చేసెయ్యమని తను పోతరాజుని పంపించాడు. కానీ ఒక చైనీస్ రెస్టారెంట్ లో కెళ్ళిన రామనాధం చిత్రంగా అదృశ్యమైపోయాడు. అతను మళ్ళీ బయటికి రాలేదు. బహుశా పోతరాజు అతన్ని మిస్సయిపోయి వుండవచ్చు.

 

    "ఆ చైనీస్ రెస్టారెంట్ ఓనర్ యెవరు?" అంది అప్సర నెమ్మదిగా.

 

    తను ఇంత గొప్ప వార్త చెప్పినా అప్సర పెద్దగా ఎగ్జయిట్ కాకపోవడం బాబూజీకి చిత్రం కలిగించింది.

 

    అప్సరలో అప్పటికే మానసికంగా చాలా మార్పు వచ్చిందనీ, రుద్రప్రసాద్ తో సంపర్కం ఆమెకి డబ్బుపట్ల నిర్లక్ష్య భావాన్ని కలగజేసిందనీ అతనికి తెలియదు.  

 

    "ఆ చైనీస్ రెస్టారెంట్ ఓనర్ పేరు "సూజీవాంగ్" అన్నాడు బాబూజీ.

 

    తలపంకించింది అప్సర.

 

    "సూజీవాంగ్ నీకు గుర్తులేదా డాడీ?"

 

    ప్రశ్నార్థకంగా చూశాడు బాబూజీ.

 

    "సూజీవాంగ్ మహా చలాకీ మనిషి. చైనీస్ రెస్టారెంట్ నడపడం ఆమెకి సైడ్ బిజినెస్. ఒళ్ళమ్ముకుని డబ్బు చేసుకోవడం మరో సైడ్ బిజినెస్. ఈ రెండు రకాల బిజినెస్ ల కోసం వచ్చే కస్టమర్లని బుట్టలో వేసి, వాళ్ళ రహస్యాలు గ్రహించి వాళ్ళని బ్లాక్ మెయిల్ చెయ్యడం, లేకపోతే ఆ రహస్యాలని మరెవరికో అమ్మి డబ్బు చేసుకోవడం ఆమెకి మెయిన్ బిజినెస్.

 

    చిత్రద్వీప్ లో రోడ్లువేసే కాంట్రాక్ట్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఎవరెంత కోట్ చేసిందీ మనకు సూజీవాంగ్ వలనే తెలిసింది. యింకా స్పష్టంగా చెప్పాలంటే ఆ సమాచారం మనం ఆమె దగ్గరనుంచి కొన్నాం.

 

    "ఎవరో ఒక చైనీస్ అమ్మాయి దగ్గర నుంచి ఇన్ ఫర్మేషన్ సంపాదిస్తున్నట్లు నువ్వు చెప్పావు. ఆ తర్వాత..."

 

    "ఆ తర్వాత నీకు హార్ట్ ఎటాక్ రావడం, హాస్పిటల్లో చేరడం జరిగాయి: అందుకనే నీకు ఈ విషయం గుర్తు వుండి వుండదు. ఇన్ ఫర్మేషన్ సంపాదించిన నువ్వు ధైర్యంగా కేప్టెన్ తోకాస్ ని అప్రోచ్ అయి ముడుపుల గురించి మాట్లాడగలిగావు. అవునా డాడీ?"  

 

    "అవునవును ఇప్పుడు గుర్తొచ్చింది" అన్నాడు బాబూజీ. అతని మొహం తెల్లకాయితంలా పాలిపోయింది.

 

    "లాభంలేదు డాడీ? ఈ యురేనియం సంగతి రామనాధం ద్వారా ఎలాగోలా బయటికి కక్కించి వుంటుంది సూజీవాంగ్. లేదా రామనాధమే తాగిన మైకంలో అది ఆమెముందు కక్కేసి వుంటాడు. నా ఉద్దేశ్యంలో సూజీవాంగ్ రామనాధం శవాన్ని ముక్కలుగా కోయించి ఏ పందిమాంసంతోనో కలిపేసి వుంటుందని. అందుకే అతను అయిపూ అజా లేకుండా పోయాడు. ఇంత పెద్ద రహస్యం తనకు తెలిసిన తర్వాత సూజీవాంగ్ చేతులు ముడుచుకు కూర్చోదు. ఎవరికో అమ్మేసి వుంటుంది.   

 

    "ఎవరికీ?"

 

    "ఆమె చైనీస్ యువతి చైనా ప్రభుత్వానికి ఈ రహస్యం చెప్పినా వాళ్ళు మహా అయితే ఏ పార్టీ పోస్టో ఇస్తారు గానీ భారీగా డబ్బు మాత్రం ముట్టచెప్పరు. ఆమె చైనా వాళ్ళకి ఈ విషయం చెప్పిందంటే కేవలం దేశభక్తి వలనే అయి వుండాలి. డబ్బుకోసం అయి వుండదు.

 

    కానీ మనకు తెలిసినంతవరకూ సూజీవాంగ్ కేవలం డబ్బుమనిషి. ఆమెకి దేశభక్తి దేశసేవా లాంటి ఉదాత్తమైన భావాలు వుండి వుంటాయనుకోను.

 

    ఇకపోతే అమెరికా...

 

    అమెరికా అయితే భారీగా డబ్బు ముట్టజెప్పవచ్చు.                

 Previous Page Next Page