Previous Page Next Page 
దావాగ్ని పేజి 50


    ఎందుకంటే ఇది కేవలం కమర్షియల్ ఇన్ ఫర్మేషన్ కాదు. కేవలం మిలిటరీ ఇన్ ఫర్మేషనూ కాదు. ప్రపంచ దేశాలన్నిటి పవర్ ఈక్వేషన్ నీ మార్చేసేటంత విలువైన అద్భుత సమాచారం. అందుకని ఈ రహస్యాన్ని అమెరికాకు అమ్మి వుండవచ్చు ఆ అమ్మాయి.

 

    అదీ కాకపోతే సూజీవాంగ్ మరొకటి చెయ్యవచ్చు.

 

    "ఏమిటది?" అన్నాడు బాబూజీ బలహీనంగా.

 

    "ఆ రహస్యాన్ని ఎవరికీ చెప్పకుండా తనలోనే దాచుకొని, తనకి వున్న కాంటాక్ట్స్ తో భోజా ప్రభుత్వాన్నే పడగొట్టి తను ఆక్రమించుకోవడానికి చూడవచ్చు. కానీ అంత పెద్ద ప్రాజెక్ట్ చేపట్టేంత డబ్బు ఆమె దగ్గర వుంటుందని నేను అనుకోను."

 

    కూతురి ఊహాశక్తికి మనసులోనే జోహార్లు అర్పించాడు బాబూజీ. తను రోజులపాటు ఆలోచిస్తే గానీ తట్టని విషయాలు ఆమెకి క్షణాలమీద తడుతున్నాయి.

 

    "నువ్వన్నది నిజమే: సూజీవాంగ్ కి వెర్రిమొర్రి ఆలోచనలు ఏమయినా వచ్చినా అవి అమలు పరచడానికి కావలసినంత అంగబలం, అర్ధబలం ఆమెకి లేవు. షీ మే బీ ఏ స్మాల్ టైం క్రూక్."

 

    అవునన్నట్లు తలపంకించింది అప్సర.

 

    "కానీ అలాంటి ప్లాను ఒకటి వేసి, జనరల్ భోజా గవర్నమెంటుని పడెయ్యడానికీ, మన చెప్పు చేతల్లో వుండే మనుషులని అక్కడ పవరులోకి తేవడానికీ మనకి సామర్ధ్యం వుంది. ఆ సంగతి మాట్లాడాలనే నిన్ను ఇంత అర్జెంటుగా పిలిపించాను" అన్నాడు బాబూజీ.    

 

    చిత్రంగా తండ్రివైపు చూసింది అప్సర.

 

    "నిజంగానే చెబుతున్నావా డాడీ?"

 

    "అవును. ఎందుకు కాకూడదు ఆ యురేనియం అంతా అమ్మితే లక్ష కోట్ల రూపాయలు వస్తాయి. రూపాయల సంఖ్య అటుంచి, మనకి వచ్చే పవర్ ఎలా వుంటుందో ఆలోచించు. అగ్రరాజ్యాలకి కూడా మనం టెర్మ్స్ డిక్టేట్ చేస్తాం. యురేనియంతో అవసరం వుండని దేశమేది వుంటుంది: నాకు తెలిసిన సమాచారం ప్రకారం ముందు ముందు అంత రిక్షా యానంలో ఇంధనంగా యురేనియం వుపయోగించే అవకాశం కూడా వుందిట. మనకింక ఎదురుండదు.   

 

    నిర్లిప్తంగా తల పంకించింది అప్సర.

 

    ఆమెవైపు విచిత్రంగా చూశాడు బాబూజీ.

 

    "అప్సరా: ఏమయింది నీకు? ఇంత గొప్ప వార్త చెప్పినా నీకు ఎగ్జయింట్ మెంట్ అనిపించడం లేదా?"

 

    సమాధానం చెప్పకుండా కళ్ళు మూసుకుంది అప్సర. ఆమె మనోనేత్రం ముందు రుద్రప్రసాద్ మెదిలాడు.

 

    అతని సాన్నిధ్యంలో గడిపిన క్షణాల మాధుర్యంతో పోలిస్తే ఈ రాబోయే కోటానుకోట్ల రూపాయలు ఏపాటి?

 

    నెమ్మదిగా అంది అప్సర. "ఇంకా డబ్బెందుకు డాడీ మనకి? వున్నదే ఏం చేసుకోవాలో తెలియట్లేదు కదా? ఎంత సంపాదించినా కడుపున తినేది పట్టెడన్నం, ఒంటికి కట్టుకునేది జానెడు గుడ్డ. పడుకోవడానికి ఆరడుగుల స్థలం. వున్నది చాలనుకోవడంలో తృప్తి వుంది డాడీ: లేని దానికోసం ఆర్తులు చాచడంలోనే అశాంతి వుంది. అవునంటావా? కాదంటావా?"

 

    "అప్సరా: నువ్వు ఎందుకో మారిపోయావు."

 

    "అవును డాడీ: ఎందుకనోగానీ హఠాత్తుగా నాకు విసుగొచ్చేసింది. ఈ తాపత్రయం ఇంక చాలనిపించింది. వున్నదానితో యికనుంచి అయినా తృప్తిగా నిశ్చింతగా గడపాలనిపించింది.

 

    కొద్దిగా ఆదుర్దాగా అడిగాడు బాబూజీ.

 

    "అంతేనా? ఇంకేం లేదు గదా:"

 

    కొద్ది క్షణాలు ఆగి, చెప్పింది అప్సర.

 

    "నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను డాడీ:"

 

    బాబూజీ మొహంలో కలవరం కనబడింది.

 

    "ఇలాంటిదేదో ఉండి ఉంటుందనే నేను ఊహించాను. వెల్: ఆడపిల్లని కన్న తర్వాత పెళ్ళిచేసి అత్తారింటికి పంపించడం తప్పదు. ఆ ఆలోచనా ఉంది నాకు. కానీ నీకు త్వరగా పెళ్ళి చేసేస్తే నాకు మంచి బిజినెస్ పార్టనర్ లేకుండా పోతుందన్న స్వార్థం నాలో కూడా కాస్తో కూస్తో ఉండే వుంటుంది. అందుకనే కొద్దిగా అశ్రద్ధ చేశాను నీకుతొందరలోనే పెళ్ళి చేసేస్తాను అప్సరా: నా దృష్టిలో రెండు మూడు మంచి సంబంధాలు వున్నాయ్:"   

 

    సంకోచంగా అంది అప్సర. "నేను ఒకతన్ని పెళ్ళిచేసుకోవాలనుకుంటున్నాను డాడీ:"

 

    బిగుసుకుపోయాడు బాబూజీ:

 

    "ఎవర్ని? ఏం చేస్తుంటాడు అతను? బిజినెస్సా?"

 

    "అతనికి బిజినెస్ ఏమీలేదు. ఆర్మీలోనుంచి రిలీజ్ అయిన సోల్జరనుకుంటాను."

 

    "వాట్ నాన్సెన్స్:" అన్నాడు బాబూజీ అదిరిపడి. అతని నోట్లో వున్న పైపు కిందపడి పోయింది. "అప్సరా: తమాషా చేస్తున్నావా? ఊరూ పేరూలేని అనామకుడయిన ఒక సోల్జర్ ని పెళ్ళి చేసుకుంటావా?"    

 

    "అవును డాడీ:" అంది అప్సర స్థిరంగా.

 

    కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు బాబూజీ. "ఇంత నీచమయిన పని చెయ్యడానికి నీకు మనసు ఎట్లా ఒప్పుతోంది?"                        

 Previous Page Next Page