Previous Page Next Page 
దావాగ్ని పేజి 48


    అతనే జనరల్ భోజా చెప్పిన మెకానిక్.

 

    అన్న మరణంతో కృంగిపోయి, పగతీర్చుకోవడానికి ఎదురుచూస్తున్నాడు సైతాన్ సింగ్:

 

    అతడి మొహాన్ని మళ్ళీ యెక్కడ చూసినా గుర్తువచ్చే విధంగా... జాగ్రత్తగా పరికించి చూసింది వినీల.

 

    చాలా సంవత్సరాల క్రితం, పాకిస్తాన్ తో జరిగిన భయంకర సంగ్రామంలో ఇండియా తరపున అరవీర భయంకరంగా పోరాడుతూ ఒళ్ళంతా తూటాలతో తూట్లు పడిపోయిన తర్వాత కూడా పదిమందిని మట్టుపెట్టిగానీ మరణించకూడదనే పట్టుదలతో శతృవులను తను మాడి యోధుడు సైతాన్ సింగ్ పేరు గుర్తువచ్చింది వినీలకి. అతను చనిపోయాక పరమ విశిష్ట సేవా మెడల్ యివ్వడం జరిగింది.

 

    అలాంటి యోధానుయోధుడూ, దేశభక్తుడూ అయిన సైతాన్ సింగ్ పేరు పెట్టుకున్న ఈ అల్పుడు, దేశద్రోహి అయి, విదేశీ శక్తులతో కలిసి...

 

    వీలుచిక్కిన వెంటనే సైతాన్ సింగ్ గురించిన సమాచారం రాణాకి అందజేయాలని నిశ్చయించుకుంది వినీల.

 

                                      *    *    *    *

 

    బాబూజీ పంపిన మెసేజ్ అందుకుని ఇండియాకి వచ్చింది అప్సర ఆమె ఇంటికి చేరేసరికి యింటికి తూర్పువైపున కట్టిన అద్దాల సన్ రూంలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు బాబూజీ. ఆయన ముందు కొన్ని పేపర్సు, పాకెట్ కంప్యూటరూ ఉన్నాయి. ఆ రూమ్ లోనే అప్సర అన్న ప్రతాప్ పసివాడిలాగా గుడ్లుపెట్టే బాతు బొమ్మతో ఆడుకుంటున్నాడు.   

 

    "ఏమిటి విశేషం డాడీ? అంత అర్జెంటుగా రమ్మని కబురు చేశారు? ఫోన్ చేస్తే మీరు దొరకలేదు. సెక్సెట్ ఫ్లయిట్ లో వచ్చేశాను" అంది అప్సర. ఆమె గొంతులో కొద్దిగా ఆదుర్దా ధ్వనిస్తోంది. తండ్రికి క్రితం సంవత్సరం హార్ట్ ఎటాక్ రావటం, నెలరోజులపాటు ఆయన బాంబే బ్రీచ్ కాండీ హాస్పిటల్లో ఉండటం ఇంకా మర్చిపోలేదు తను.

 

    తండ్రి ఆరోగ్యంగానే కనబడుతూ వుండటం చూసి కొద్దిగా కుదుట పడింది అప్సర మనసు.

 

    "పెద్ద విశేషమే వుంది: నువ్వు వెళ్ళి స్నానం చేసిరా...: తీరిగ్గా మాట్లాడుకుందాం" అన్నాడు బాబూజీ.

 

    అన్న ప్రతాప్ దగ్గరకు నడిచింది అప్సర. "అన్నా:" అంది అభిమానంగా.

 

    తలెత్తి చూశాడు ప్రతాప్. అతడి మొహం సంతోషంతో వెలిగిపోయింది.

 

    "చెల్లాయ్: ఎప్పుడొచ్చావ్ స్కూలునుండి? ఏమిటంత సంతోషంగా ఉన్నావ్? ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారా ఏమిటి...? నీకు యెప్పుడూ ఫస్టు రాంకేగా?" అన్నాడు లేచి అప్సర భుజం మీద చెయ్యివేస్తూ.   

 

    రుద్రప్రసాద్ ఆలోచనలతో పులకరింతలుగా వున్న అప్సరకి అన్న అమాయకపు మాటలతో కొద్దిగా విచారం వేసింది. "అన్నకి ఎలా వుంది?" అన్నట్లు సాభిప్రాయంగా తండ్రివైపు చూసింది.   

 

    "మామూలే:" అన్నట్లు నిరుత్సాహంగా తలపంకించాడు బాబూజీ.

 

    "చెల్లాయ్: రా: ఆడుకుందాం: కావాలంటే ఈ గుడ్లుపెట్టే బాతుబొమ్మ అచ్చంగా నీకే యిచ్చేస్తాను. సరేనా?" అన్నాడు ప్రతాప్ హుషారుగా.

 

    "స్నానం చేశాక" అంది అప్సర. తర్వాత వెళ్ళి స్నానం చేసి, లేత ఆకుపచ్చరంగు పువ్వుల ప్రింటుతో ఉన్న స్కర్టూ, తెల్ల బ్లవుజూ వేసుకుని, జుట్టు సిల్కుజలపాతంలా భుజాల మీదకి ప్రవహిస్తూ వుంటే వనకన్యలా వచ్చి ప్రతాప్ టో కాసేపు ఆడినట్లు నటించి, తర్వాత తండ్రి దగ్గరకు వచ్చి కూర్చుంది అప్సర.

 

    అప్పటికే ఆమె కోసం శాండ్ విచెస్ రెడీగా ఉన్నాయి.... కాఫీ జగ్గులో వుంది.

 

    "చెప్పండి" అంది అప్సర.

 

    "లక్షకోట్లు: అనే సంఖ్య యెలా వినిపిస్తోంది...?" అన్నాడు బాబూజీ డ్రమెటిక్ గా.

 

    "డాలర్లా: ఫ్రాంక్ లా, రూబుల్సా, యెన్ లా, లీరాలా, రూపాయలా?" అంది అప్సర అప్రయత్నంగా.

 

    ఒక్కో కరెన్సీ ఒక్కొ విలువ వుంటుంది. యెన్, లీరా లాంటి కరెన్సీకి అంకె పెద్దదిగా ఉన్నా విలువ తక్కువ ఉంటుంది.

 

    "రూపాయలు" అన్నాడు బాబూజీ.

 

    "లక్షకోట్ల రూపాయలంటే చాలా పెద్ద సంఖ్యే: ఇండియా సాంవత్సరీక బడ్జెట్ కంటే కొన్ని రెట్లు ఎక్కువ."

 

    ఊరిస్తున్నట్లు అన్నాడు బాబూజీ.

 

    "లక్ష కోట్లరూపాయలు మన సొంతమయ్యే అవకాశం వుందనుకో:"

 

    "ఇంపాజిబుల్:" అంది అప్సర. "ఇప్పుడు మనం చేస్తున్న బిజెనెస్, చెయ్యగల బిజినెస్ అంతా కలుపుకుని లెక్కేసినా, ఇంకో వందేళ్ళకు కూడా అంత డబ్బు సంపాదించలేం."

 Previous Page Next Page