"స్కూల్ ఫైనల్ చదివిన మీ అమ్మాయి డాక్టరేట్ చేసిన నన్ను తీసిపారేసి "అబ్బా మీకేం తెలియదు! మీరూరుకోండీ! అని రోజుకెన్నిసార్లంటుందో గుర్తుచేసుకోండి. అది నిజానికి తీసిపారెయ్యడమో లేక నన్ను అవమానించడమో అంటే హాస్యాస్పదంగా లేదూ? అది నామీద తనకున్న ప్రేమా, చనువు వల్ల అలా మాట్లాడ్తుంది. తనకంటే తక్కువ చదువుకున్నవాడయినా పక్కింటాయన్ని నా భార్య విసుక్కుంటుందా? స్వంత భర్తని కాబట్టే నిన్ను విసుక్కుంటుంది. అది నాకేం బాధనిపించదు కూడా! కానీ ఈ ఇంట్లో నా తల్లి కూడా ఉంటే ఆమె మనోభావాలెలా ఉండేవో మిమ్మల్ని చూస్తే తెలుస్తోంది. మనలో మనమాట! మీరెప్పుడైనా వసుధతో 'అలా భర్తనెదిరించి మాట్లాడకూడదమ్మా. తప్పు!' అని చెప్పారా?"
ఆవిడ జవాబు చెప్పలేనట్టు చూసింది.
"చెప్పలేదు. ఎందుకంటే అది తప్పని ఎప్పుడూ మీకనిపించలేదు. వసుధ చెప్పేది నిజమే కదా! ఇంటి విషయాలు ఆ అబ్బాయికేం తెలుస్తాయి అనిపిస్తుంది మీ కూతురు కాబట్టి. అదే మీ కోడలయితే 'తనకి తెలిసినా వాడు చెప్పేది విని సరేనంటే ఏంపోతుంది' అనిపిస్తుంది. అది మీ తప్పుకాదు. మీ కాలానికి ఈ కాలానికి సామాజికంగా ఎన్నో మార్పులొచ్చాయి. వాటిని మీరు మీకిష్టమైనంత వరకూ జీర్ణం చేసుకుంటారు. మిగతావి అజీర్ణం చేసి మిమ్మల్ని బాధపెడ్తాయి. ఉద్యోగం చెయ్యకపోయినా ఇంట్లో పనీ, బాధ్యతలూ ఎక్కువైనప్పుడు 'నేను చెయ్యలేకుండా వున్నాను బాబూ ఛీ ఛీ ఆడదానిగా మరోజన్మలో చచ్చినా పుట్టను' అంటూ ఉంటుంది వసుధ. మరి అలాంటిది ఎవరి సహాయం లేకుండా ఇంట్లోనూ, బైటా కూడా కష్టపడుతున్న ఆ అమ్మాయి కష్టం గమనించరేం?"
"కొంత ఆ అమ్మాయి చేతులారా చేసుకుంటుంది బాబూ! ఎందుకనవసరంగా అంత కష్టపడడం? ఒక టైమూ పాడూ లేకుండా స్టూడెంట్లూ, సెమినార్లు అని తిరుగుతూ ఆరోగ్యం కూడా పాడుచేసుకుంటుంది. ఆదివారాలు కూడా రెస్టు తీసుకోకుండా వెళ్ళిపోతుందీ మధ్య" అంటుంటే అడ్డుతగిలి "నేను కూడా వెళ్తానుగా. ఒక్కోసారి పండుగరోజుల్లోనూ ఆదివారాలు కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఊరువిడిచి కూడా వెళ్తుంటాను. మా ఇద్దరి ఉద్యోగాలూ, వృత్తిధర్మాలూ ఒకేలాంటివి. మగవారికి వేరుగానూ, ఆడవారికి వేరుగానూ ఉండవు. జీతభత్యాలు సమానమైనప్పుడు, పనికూడా సమానంగా చెయ్యాలిగా" అన్నాడు.
"నువ్వు మగవాడివి. ఇంట్లో బాధ్యతగా చూసుకుని, చేసుకునే భార్య ఉంది కాబట్టి తిరుగుతావు. అదే ఆడదలా పనిమనుషుల మీద పిల్లల్నొదిలేసి, ఇల్లు పట్టకుండా తిరుగుతుంటే ఆ సంసారం గతేమవుతుందో ఆలోచించు."
"పిల్లల్ని పెంచడం విషయంలోనూ, ఇంటిపన్ల విషయంలోనూ ఇద్దరిదీ సమానమైన బాధ్యతే. అరుణ్ కి మీరెప్పుడైనా, వసుధతో చెప్పినట్లు ఇలాకాదు అలా అనీ, సంసారం ఈ విధంగా చేసుకోండి అని చెప్పారా? పోనీ సింధుతో ఆప్యాయంగా "నీ ఆరోగ్యం విషయం జాగ్రత్త. పిల్లల్ని ఇలా వదిలిపెట్టకు" అంటూ నిదానంగా చెప్పి చూశారా? ఒక తల్లిగా, అత్తగారిగా మీరెంతవరకూ మీ విధులు సక్రమంగా పాటించారు? చిన్నచిన్న విషయాలకే మనసు కష్టపెట్టుకుని వచ్చేస్తారు. అవే విషయాలు ఇక్కడా జరుగుతాయి. వసుధకి మీకూ కూడా అభిప్రాయభేదాలు వస్తూనే ఉంటాయి. కానీ కూతురు కాబట్టి మీరు సర్దుకుపోవడమో లేక వసుధని చనువుగా చివాట్లు వేసి అలాకాదు ఇలానే చేద్దాం అని చెప్పడమో చేస్తుంటారు! అవునా?" అడిగాడు నవ్వుతూ.
ఆవిడేం మాట్లాడలేకపోయింది.
"సింధుది కాస్త ముభావంగా ఉండే టైపు తప్ప చెడ్డది కాదు. వెళ్తే ప్రాణం పెడ్తుంది. ఇంక పనిమనిషి విషయమంటావా! పోయినసారి మనం పంపిన వంటమనిషిని ఏదో అందనీ, అది వెళ్ళిపోయిందనీ, ఆ అమ్మాయికి నోరెక్కువ కాస్త సర్దుకుపోతేకానీ పనివాళ్ళతో పని చేయించుకోలేం' అనీ నువ్వే అన్నావుగా! అందుకే అలా మాట్లాడకుండా ఊరుకుని ఉంటుంది. అయినా అసలు నువ్వు పర్మినెంట్ గా అక్కడే ఉండి పిల్లల్ని చూసుకుంటే ఈ పనిమనుషులూ గొడవా వుండదు గదా! వుంటూ వుంటే నీకు అలవాటవుతాయా పద్ధతులూ అవీ. క్రమేణా సాన్నిహిత్యం పెరిగి ఒకరిమీదొకరికి ప్రేమానురాగాలు కూడా వృద్ధి అవుతాయి. ఇక్కడ ఉండబట్టి కదా, మా ఆయన మీద నీకంత ఆప్యాయత. ఎప్పుడూ 'అతనందర్లాంటివాడు కాదు దేవుడు' అని చెప్తుంటావు" అంది వసుధ తల్లిభుజం మీద చెయ్యేసి.
"అలా అని మీరు మాకు బరువనీ వెళ్ళిపొమ్మనీ కాదు మా అభిమతం. ఇది మీ ఇల్లే నన్నో కొడుకులా చూస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంటుంది. కానీ ఆ సంతోషం మీ కొడుకు కూడా పొందాలి కదా! అతను 'నా తల్లిని నేను చూసుకోలేకపోతున్నాను' అనే బాధలోనే బతుకంతా గడిపెయ్యాలా?" అన్నాడు చక్రధర్ అనునయంగా.
ఆవిడేం మాట్లాడలేక కంటతడి పెట్టింది.
"పోనీ కోడలు చెడ్డదే అనుకుందాం. అయినా పిల్లలలా ఎవరిమీదో ఆధారపడి వుండడం కన్నా నువ్వు చూసుకుంటూ వుంటే ఆ తృప్తి వేరుకదా! నువ్వొచ్చేస్తున్నప్పుడల్లా పిల్లలెలా ఏడుస్తారో, నీకోసం ఎంతలా మొహంవాచీ ఉంటారో నీకు తెలియంది కాదు" అని వసుధ అంటుంటే ఏడుస్తున్న రమ్య, తేజాల మొహాలు గుర్తుకొచ్చి వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని చూడాలనిపించింది.
"నువ్వు బాధపడి వాళ్ళని బాధపెడ్తున్నావే తప్ప నిజానికిలాంటి సమస్యలు సమస్యలే కావు. వడ్లగింజలో బియ్యపుగింజలాంటివి. అన్ని కుటుంబాల్లోనూ ఉన్నవే" అంది మళ్ళీ వసుధ.
"మీ దగ్గర నాకున్న చనువుకొద్దీ ఏదో మాట్లాడాను. ఏమైనా నొప్పిస్తే మీ కొడుకే అనుకొని క్షమించండి" అన్నాడు చక్రధర్.
"లేదు నాయనా! నువ్వన్న మాటల్లో నిజముంది. నేనెప్పుడూ నాకోణంలోంచే తప్ప అటునుంచి ఆలోచించలేదు. నిజమే! నేనొచ్చేస్తున్నప్పుడల్లా పిచ్చినాయన! ఎంత దిగాలుపడిపోయి చూస్తాడనీ. ఆ అమ్మాయిమీద నోరు కూడా చేసుకున్నాడు మొన్న. పిల్లలు ఎంత ఏడ్చారు! అది తల్చుకుంటే నేనెంత నిర్దయురాల్నో అనిపిస్తోంది. పనిమనిషి విషయంలో నేను పేచీపడకుండా ముందురోజే సింధుతో మనసువిప్పి "నేనే మడిగా వంటచేస్తాను. దాన్ని ఇంట్లోకి రావద్దని చెప్పు అంటే పోయేది. నాకు తోచింది కాదు. ఈసారి అరుణ్ తో నా పద్ధతులూ, పనిపాటలూ ఇవి అని చెప్తాను. ఆ అమ్మాయి ఇలా కాదు అలా అని ఏదైనా సలహా ఇస్తే వింటాను. ఇద్దరం మనసులు విప్పి మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకుంటాము" అంది దృఢనిశ్చయంతో.
* * * *