Previous Page Next Page 
దావాగ్ని పేజి 47


    "నువ్వు కొన్నాళ్ళు ఇండియన్ వైమానికి దళంలో కూడా పని చేశానన్నావు గదూ?" అన్నాడు మూరెడు చుట్ట ముట్టిస్తూ.

 

    అతని కళ్ళు మాత్రం ఆమె ఎత్తయిన గుండెలమీదే కేంద్రీకరించి వున్నాయి,

 

    మొద్దు చూపు అతనిది.

 

    కొద్దిగా వెనక్కి వాలి, ఎదను మరింతగా పొంగిస్తూ అంది వినీల, ఉరఫ్ నీలోఫర్.

 

    "అవును. నాకు తెలిసినంతవరకూ ఇండియన్ వైమానికి దళం రహస్యాలు ఎంత తొందరగా మీకు చెప్పెయ్యాలా అని వుంది నాకు" అంది వినీల.

 

    "మరి ఆలీశం ఎందుకు? చెప్పెయ్:"

 

    ఆ 'రహస్యాలు' చెప్పటం ప్రారంభించింది వినీల.

 

    "అక్షరక్రమంలో ఆంధ్రప్రదేశ్ వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో వున్న మిలటరీ స్థావరాలతో మొదలుపెడతాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యపట్టణమయిన హైదరాబాదులో ఇప్పుడు అంతర్భాగంగా కలిసి పోయిన సికిందరాబాద్ పట్నంలో వుంది ఎయిర్ వార్ ఫేర్ కాలేజ్. వైమానిక యుద్ధంలో ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్ కి దగ్గర్లో వుంటుంది ఈ కాలేజీ. పెద్ద ఆర్భాటం లేకుండా సాదాగా కనబడుతూ వుంటుంది ఆ బిల్డింగ్.

 

    వైమానిక దళ పైలెట్లకు శిక్షణ ఇస్తుంది సికిందరాబాదు శివార్లలో 1200 హెక్టార్లలో విస్తరించి వున్న హాకీలపేట వైమానికదళ కేంద్రం.   

 

    ఒకానొక కాలంలో ఈ కేంద్రం కేవలం యుద్ధ సమయంలో మాత్రమే పనిచేసేది అలాంటి ఈ కేంద్రాన్ని భారత వైమానికదళం ముప్ఫయ్ ఎనిమిదేళ్ళ క్రితం తన కంట్రోల్ లోకి తీసుకుంది.... అప్పట్నుంచి ఇది పైలట్లకు అతికీలకమైన శిక్షణ ఇచ్చే కేంద్రంగా ఉంటోంది. ఇది ఆగ్నేయాసియాలోకెల్లా ప్రతిష్టాత్మకమైన హెలికాప్టర్ల శిక్షణ కోర్సు నిర్వహిస్తోంది. 1951 సెప్టెంబరులో అంబాలాలో నిర్వహణ కేంద్రంగా ఏర్పాటు చేశారు. అటు తర్వాత వైమానికదళ అకాడెమీ బేగంపేట పౌర విమానయాన కేంద్రానికి తరలించారు. అక్కడనుండి శిక్షణా కేంద్రాన్ని అకాడెమీకీ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో గల హాకీంపేట వైమానికదళ ప్రాంతానికి తరలించారు."   

 

    చుట్ట గట్టిగా పీల్చి, రైలింజనులా గుప్పున పొగవదిలాడు జనరల్ భోజా. బలంగా కనబడుతున్న నీలోఫర్ తొడల పొడుగుని కొలుస్తున్నట్లు ఓసారి నిశితంగా చూసి, "వెరీ ఇంటరెస్టింగ్: చెప్పు:" అన్నాడు. మిలిటరీ పదాలను పలుకుతున్న నీలోఫర్ పెదాలు తనతో సరసం జరుపుతున్నప్పుడు శృంగార పదాలను పలికితే యెలా వంపు తిరుగుతాయో వూహించుకొనడానికి ప్రయత్నించాడు అతను.   

 

    తన ఒంపులు అతనికి ప్రొఫైల్ లో ప్రస్ఫుటంగా కనబడేటట్లు కొద్దిగా ప్రక్కకు తిరిగి కూర్చుని, మళ్ళీ చెప్పటం మొదలెట్టింది వినీల... ఉరఫ్ నీలోఫర్. "హాకీంపేటలో వాంపైర్, స్పిట్ ఫైర్, టెంక్వట్, కిరణ్ ఇస్కాల పైలట్లకు శిక్షణ యిస్తున్నారు.... హాకీంపేటలోని శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించిన ఇరవై ఏళ్ళకు జోధ్ పూర్ లోని హెలీకాఫ్టర్ శిక్షణ పాఠశాలను కూడా యిక్కడికి తరలించారు. దీనిలో చేతక్, చేధా, హిలోస్టర్ ల మీద శిక్షణ యిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో ప్రకృతి భీభత్స సమయంలో సేవలు అందించే శిక్షణ కూడా యిక్కడే యిస్తున్నారు.   

 

    మొదట్లో ఈ కేంద్రం ఎయిర్ ఫోర్సు అకాడెమీ పైలట్లకు మాత్రం ఆధునిక శిక్షణ ఇచ్చేది. తర్వాత కోయంబత్తూరులోని గ్రవుండ్ డ్యూటీ ఆఫీసర్ల శిక్షణా విభాగాన్ని 1975లో ఇక్కడికి తరలించారు. 1975లో వైజ్ఞానిక రవాణా ఆఫీసర్ల శిక్షణ సంస్థను కూడా హాకీంపేటకు తరలించి వైమానికదళంలోని సగం విభాగాల శిక్షణ కేంద్రంగా మార్చారు."

 

    "వండర్ ఫుల్: చాలా విషయాలు తెలుసుకున్నావు నువ్వు. పనికి వస్తావ్:" అన్నాడు జనరల్ భోజా సంతోషంగా.

 

    మనసులోనే నవ్వుకుంది వినీల. తను చెప్పిన సమాచారమంతా న్యూస్ పేపర్లు రెగ్యులర్ గా చదివే వాళ్ళకి కంఠోపాఠమేననీ, ఈ సమాచారం రహస్యమైనదేమీ కాదనీ ఆమెకు తెలుసు.

 

    కానీ జనరల్ భోజాకి తెలియదు ఎందుకంటే జనరల్ భోజాకి చదువు రాదని ఇంతకుముందే మనవి చెయ్యడం జరిగింది.

 

    మృదువుగా ఉన్న త్రిభుజాలలాంటి ఆమె ఎత్తులనుచూసి మోహం ఆపుకోలేక దగ్గరకి రాబోయాడు జనరల్ భోజా.

 

    చటుక్కున లేచి నిలబడింది వినీల. "నా శపథం మాట మర్చిపోకండి: మీరు ఢిల్లీని లొంగదీసుకుంటేనే నేను మీకు లొంగేది" అని చేపపిల్లలా జారిపోయి కాక్ పిట్ లోకి వెళ్ళిపోయింది.

 

    గొరిల్లాలాగా మూలిగి, తనకు పరిచర్యలు చేయటానికి విమానంలో ఉన్న హోస్టెస్ ని గదిలోకి రమ్మని ఆజ్ఞాపించాడు జనరల్ భోజా. అరగంటసేపు ఆమెతో పబ్బం గడుపుకొని, తర్వాత లేచి వచ్చి కాక్ పిట్ లోకి తొంగిచూస్తూ వినీలతో అన్నాడు - "వినీలా: ఎన్ టెబ్ ఎయిర్ పోర్ట్ లో దింపు విమానాన్ని. అక్కడ మనకోసం ఎదురు చూస్తుంటాడు ఒక మెకానిక్. అతడ్ని ఎక్కించుకొని పారడైజ్ సిటీకి తిరిగి వెళ్ళాలి మనం మన ప్లాను అమలు చెయ్యాలంటే అతని సహకారం అవసరం" అన్నాడు.  

 

    సరేనన్నట్లు తలపంకించి దిగడానికి పర్మిషన్ కోసం ఎన్ టెబ్ విమానాశ్రయం కంట్రోల్ టవర్ తో మాట్లాడటం మొదలెట్టింది వినీల...

 

    మరో పదినిముషాల తర్వాత విమానం ఎన్ టెబ్ ఎయిర్ పోర్ట్ లో దిగేసరికి, అప్పటికే అక్కడ వాళ్ళకోసం యెదురు చూస్తూ వున్నాడు సైతాన్ సింగ్. రాణా చేతిలో మరణించిన సిఖ్ తీవ్రవాది దుర్లబ్ సింగ్ కి తమ్ముడు:

 Previous Page Next Page