అందుకనే అంటాను_ ఎన్ని మతాలు ఎన్ని సోషలిజములు మానవజాతి సమానత్వాన్ని బోధించినా, సనాతనుల తెలివి ఒప్పుకోవలసివచ్చినా సరే కాని, మీరే మనుషులైతే నేనుకాను శృంగార భావం, సౌందర్యతృష్ణ మలినమే ఐతే, నేను మలినుణ్ణి పశుత్వమే ఐతే, మన్నించి దూరమై పశువుల్లో కలవడం గౌరవం నాకు. అది నాకు వున్న సౌందర్యతృష్ణ. అనేకమందికి వుంది, జడులకు తప్ప, తీవ్రతిలోనే భేదం, అంతే. ఈ తృష్ణ_ ప్రతిచోటా సౌందర్యం కనపడే యీ గుణం, యెప్పుడో యీ ఆధారాల్ని వీడి, తనంతట తాను యీ సౌందర్యాన్ని కల్పించుకుని, మనుష్య సంబంధంగా యీ జడ ప్రపంచ సంబంధంగా కాక, తనలోనే కల్పించుకోగలిగితే, ఆ ఆనందానికి ఆ సౌందర్యారాధనకి ఆ మాధుర్యానికి అంతం వుంటుందా? సముద్రపు అలలలో చూసిన ఆ నునుపు ఆకాశపు నీలం చిక్కదనం, యీ తామరల పరిమళం, యీ స్త్రీ శరీరాల స్నిగ్ధత్వం మోహ మాధుర్యం, అన్నీ యీ హృదయంలో అప్రమేయంగా యిచ్చామాత్రంగా జనించి ముంచేస్తే_ పోనీ వాటిని కాకపోయినా, ఆ సౌందర్యాల్నే కాకపోయినా, అవి కల్పించే ఆనందమైనా నేనే కల్పించుకోగలిగితే యింకేం కావాలి! ఎందుకంటే యిప్పుడు చూసే అందంకూడా ముప్పాతిక నేనే కల్పించుకుంటున్నాను. అందరికీ కనపడుతుందా సౌందర్యం? రసికుల కళ్ళకేగాని! ఎప్పుడో తప్పదు నేను_
ఎట్లాగో.....యేమీ తెలీదు వుత్త ఆలోచనలూ కోతలూ తప్ప! ఉత్త ఆశలూ, కలలూ అంతే. స్త్రీ అనే పదంనించి విముక్తి లేదు. వుత్త భ్రమ, ఏదో ఆత్మ వుందనీ_అది యీ విశ్వ ఆత్మ కల్పించిన సౌందర్యంలో ఐక్యమై విశాలమై యీ సౌందర్య తృష్ణను తృప్తిపరచుకుంటుందనీ, యీ విఫల మనోరధులు, యీ defeated people, పొందే కలవంటిదే, యిదో పిచ్చి కల! కాని అట్లాంటి పర్యవసానమే లేకపోతే, యీ వాంఛనించి, యీ నాదిగా చేసుకొని, ఎవరిదైనా నేనే మింగెయ్యాలనే యీ శునకత్వంనించి తప్పించుకోకపోతే, యీ జన్మ యెంత నీచం, యీ సంకుచితత్వం యెంత క్షుద్రం? దేవుడు లేడు. కాని ఆ దేవుణ్ణి కల్పించిన మనస్సు దేవుణ్ణి నిరాకరించిన మనస్సు, దైవత్వాన్నందుకోలేకపోతే యెందుకు బ్రతికి? ఎప్పుడూ యీ అల్ప సంతోషంతో సౌందర్యావేశాలతో తృప్తిపడుతూ బాధపడుతూ యెందుకు కాలం గడపడం?
* * * *
ఉదయ సూర్యుడు, నేర్పుగల ప్రియుడివలె యీ చెరువు మధ్య తామర మొగ్గల చివరల్ని కిరణపు కొనలతో తాకి, యెర్రబారేట్టు పులకరింప చేస్తున్నాడు. నేనూ సౌరిస్, తన్మయులమై ప్రతిదినమూ ప్రపంచం కళ్ళముందు జరిగే యీ ఇంద్రజాలాన్ని కొత్తగా చూస్తున్నాము గట్టున నుంచుని.
"Good morning sir"
తిరిగి ఓ కుర్రాణ్ణి కనుగొన్నాను నా భుజంకింద. సంభాషణలో చాలాభాగం నేను తెలుగులోనూ, అతను ఇంగ్లీషులోనూ నడిపించాము. సౌరిస్ నించి ఆపుకోలేని నవ్వు కూడా అతని ఇంగ్లీషులో తప్పుల్ని గాని, అతని మాటల్లోని "seriousness"ని కాని కదిలించలేకపోయింది. టీచర్ని కావడంచేత ఏ భాషలో ఏ లోపాలూ నన్ను నవ్వించగలిగే శక్తిని పోగొట్టుకున్నాయి. నాలో "sense of humour" బతికివుంటే నా అధికార్ల మొహాలమీద నవ్వి వుండును! ఒక "sense of misery" మిగిలింది. కాని యింకా నాలుగు నెలలు యీ దరిద్రపు పాఠశాలలు తనిఖీలు చేస్తే, డాక్టర్ల హృదయం వలె "self preservation" కోసమన్నా ఆ "misery" చావక యేం చేస్తుంది? చివరికి యిదంతా మామూలనో, మనకేం పట్టింది, యీ లోకాన్ని మనమూ ఏర్పరిచింది అనో లేకపోతే యిదంతా మాయ, అనే ఆలోచన దుప్పట్లనో కప్పుకొంటుంది పాపం మానవ హృదయం: యింకా పూర్తిగా ఎండిపోని వెర్రి హృదయం.
"బ్రహ్మసమాజం రూల్సు ఏమిటండి?"
"నాకు బ్రహ్మసమాజం సంగతి ఏమీ తెలీదు" అన్నాను.
అబద్ధం.
కాని ఆ ఉదయాన నా చెవికింద "discussion" నా ఆనందాన్ని భంగపరుస్తుందనే బెంగ. అబద్ధంతో అవన్నీ వదుల్చుకోవాలని ప్రయత్నించాను. అబద్ధం వల్ల ఏదీ వదలదని తెలిసికూడా. కాని వచ్చినవాడు ఫల్గుణుడు.
కొన్ని బ్రహ్మసమాజపు పుస్తకాల పేర్లు చెప్పి పెద్దాడ రామస్వామి గారి దగ్గిరికి వెళ్ళమన్నదాకా నన్ను వదల్లేదు. అప్పటికీ వదల్లేదు. నాకు అర్ధమౌతోంది, అతనికి బ్రహ్మసమాజం సంగతి ఏమీ అఖ్కర్లేదనీ, నాతో మాట్లాడేందుకు అదొక వంక అని. బ్రహ్మసమాజమనగానే ముందు కాబోయే బ్రహ్మయోధుడు దొరికాడనే భ్రమలో నేను కావిలించుకుంటానని అతని వుద్దేశ్యం.
"Tell me ఈ ఆనందం యేమిటి?" అన్నాడు.
ప్రతి ప్రశ్నా అతను "Tell me" తో ప్రారంభించాడు. సౌరీస్ అతనికి 'Tell me అని పేరుపెట్టింది. Long fellow, "Tell me not" అనడం చేత నేనతనికి short fellow అని పేరుపెట్టాను.
"ఏం ఆనందం?" అన్నాను అర్ధం గాక.
"అదే! మీకీ ఆనందమంతా......Tell me"
తెల్లబోయి చూస్తున్నాను.
"Tell me నిన్నట్నించి చూస్తున్నాను. మీరు ఆనందంగా గడుపుతున్నారు"
ఏం చెప్పను?
"ఇక్కడ నీకు మాత్రం ఆనందంగా లేదా?"
చుట్టూ చూశాను. నిండి పొర్లుతున్న చెరువు, హంసల వంటి తెల్ల తామర పువ్వులూ, వాటిమీదనించి వస్తున్న పరిమళంతో చిక్కనైన గాలీ, చుట్టూ ఆ చిన్న కుటీరాలూ పొలాలూ_ఆకాశం_అన్నీ."
"అదంతా సరేలెండి. అసలు మీరు ఆనందంగా కనపడుతున్నారు. Tell me"
అతని "earnestness" చూసి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
ఆనందమా! నాకా? ఏ నిమిషానైనా నేననుభవించేది ఆనందమో బాధో, నాకు తెలుసా? నాకు తెలిసినా అతనికి చెప్పగలనా? నేను చెప్పినా అతనికి అర్ధమౌతుందా? అర్ధమయితే మాత్రం ఉపయోగపడుతుందా? రాత్రులకు రాత్రులు ఇంక ప్రపంచానికి తెల్లవారడమంటో వుందా? అని నరాల బాధతో, విరహ బాధతో యీ జన్మ బాధతో యీ ప్రపంచానికి అర్ధం యేమిటో తెలీదనే బాధతో, నరాల లోపలి చెప్పలేని బాధతో, అర్ధంలేని కారణంలేని గొప్ప బాధతో, చీకట్లో చీకట్లు కల్పించుకుంటూ యేడ్చిన రాత్రుల సంగతి అతనికెట్లా తెలియచెయ్యగలను? ఇంకా ఆ బాధ పోలేదనీ, ఎన్నటికీ పోయేట్లు లేదనీ ఎట్లా చెప్పను?