నిన్న సాయంత్రం నేనూ సౌరీస్ తామర కొలను ముందు కూర్చున్నాము. చీకటి నీళ్ళమీద కమ్మేసిన సమయాన. తామరాకులు నీటిమీద పరుచుకొని నిద్రపోతున్నాయి. గాలి వచ్చి ఆకు ఒకమూల ఎత్తి పలకరిస్తే అలిసి కళ్ళు మూతలు పడ్డ ప్రియురాలి వలె ప్రేమతో తప్పించుకొని మళ్ళీ పడుకుంటున్నాయి అవి. క్రమంగా యీ మనుష్య భావాల్ని చెట్లలో జడాలలో గమనించి వూహించడం నకలవాటయిపోయింది. ప్రతిచోటా యిట్లా ప్రాణమున్నదనుకోడం, ఒంటరిగా తిరగడం మాట్లాడక భావనా ప్రపంచకంలో బతకడం వల్ల కలుగుతున్న మనోజాడ్యమా, లేక అభివృద్ధా? కాని నిజంగా నిజప్రపంచానికి భావనా ప్రపంచానికీ భేదం కూడా నశిస్తోంది. సమస్తమా భావనేకదా అనిపిస్తోంది. ప్రపంచం మాయ అనను కదా కొన్నాళ్ళకి! ప్రపంచం మాయ కాదు. మృత్యువే మాయ అని రూఢిగా స్వయం జ్ఞానం వల్ల అనగలిగితే!
మెల్లిగా యీ పల్లెటూరి పిల్లలు నన్ను గుర్తుపట్టి బిడియంతో సమీపిస్తున్నారు. ఆ వెనక వొక యిరవయి ఏళ్ళ యువతి వచ్చింది. ఆమె సౌందర్యం చూసి నా చిరునవ్వు ఆమెకి నమస్కరించింది. మమ్మన్నామె తమ యింట్లోకి ఆహ్వానించింది. ప్రశ్నలు వేసింది. నా జీవితమంతా తెలుసుకున్నప్పుడు అసూయపడింది. నేను చాలా అదృష్టవంతుణ్ణనుకుంది.
నా జీవితానికే! ఇంటి నిండా వడ్ల బస్తాలు, వంటినిండా నగలు, నా కళ్ళను చెదిరిస్తున్న ఒంటి నిగనిగలు! ఇంతలో బయటనుంచి వచ్చిన సరసుడు ఆరోగ్యవంతుడు యెద్దుతో పోరాడగల బలిష్టుడు, ఆమె భర్త. ఇవన్నీ ఆమెకు అదృష్టాలుగా తోచలేదు. నాకు ఒక్కసారిగా చేతులలోకి వచ్చే కాసిని రూపాయలు, నా పట్టణపు వాసనలు, నా ఒంటి రంగు, సారీస్ నాజూకు, వింత వేషం, యివన్నీ ఆమెకేవో ఎరగని ఆరాటాల్ని ఆశల్ని కలిగిస్తున్నాయి. ఆమె కళ్ళ వెనక, మాటల వెనక ప్రోత్సహిస్తున్న భావాల్ని గమనించడం చాలా సరదాగా వుంది. ఆ ఒక్క స్త్రీలో ఆంధ్రదేశపు పల్లెటూరు స్త్రీల హృదయం విప్పుకుంది నా కళ్ళముందు.
ఎందుకో మానవ ప్రకృతి యిట్లా! ఉన్న సంతోషాన్ని వదిలి లేని వాటికి రెక్కలు జాచడం! ఈ చెరువు ఒడ్డున కుటీరంలో కొలనులో తామర పువ్వులవంక చూస్తూ జీవితం గడపలేమో అని సౌరిస్ సందేహం! electric fans and lightsని వొదిలి. మా మిత్రురాలు, యీ చెరువూ, పాతరా, పాడీ, ఎప్పుడు వదిలిపోతాయా, సినిమాలూ ఊరేగింపులూ, తారురోడ్లూ, కష్టపడకుండా హోటల్లో ఫలహారాలూ ఎప్పటికన్నా లభ్యపడతాయా అని కళ్ళలో కలలు చూపుతోంది.
ఇంత అనుభవమూ, జ్ఞానమూ వుందని లోపల పౌరుషపడే నేను మాత్రం! తెలుసు, విధి నాయందు చాలా దయతో ప్రవర్తించిందని. లేనిదానికై వచ్చిన కష్టానికి, పడే వేదన నుంచి దృష్టిని వున్న సౌఖ్యాలవేపు తిప్పడమే wise man చేయవలసిన పని అని తెలుసు. కాని చాతకాదు కష్ట దినాలను శాసించిన గ్రహాలు దృష్టిని అట్లా తిప్పనీవా? లేక మనసు ఆ అలవాటులో నుంచి తప్పుకోలేకపోవడమే కారణమా? విరక్తి వల్ల సాధించాలా ఆ మనోజాడ్యాన్ని! లేక సాధన వల్లనా? నిశ్చయశక్తి మనసుది. ఈ గుణం మనసునించి వదిలిపోవాలని మనసే నిశ్చయిస్తోంది. కాని ఎందుకు వదలదూ? గట్టి అలవాటు గనక పోవటంలేదా? ఎప్పుడు తెచ్చుకున్నాను యీ అలవాటుని? ఈ జన్మంలో జ్ఞాపకం లేదు. పూర్వజన్మనించా! లేక యీ నిశ్చయగుణం couscious mind దీ, ఆ బలహీనం sub conscious mind కావటం మూలానా?
నిన్న చంద్రాల సైకిలు మీద వెడుతో యిదే అనుకుంటున్నాను ఎంతైన కాలవగట్టుకీ బండిబాటకీ మధ్య సైకిల్ చక్రం జారి పడపోయినాను. పడితే! నాలుగు వెమికలకు తక్కువ విరిగివుండవు. కాని ఎన్నిసార్లిట్లా తప్పించుకున్నాను. అదృష్టమా నా నేర్పా!
వసంత ఋతువు వస్తున్నానని కబుర్లు పంపే ఇట్లాంటి కాలంలోనే, యిట్లా వరిని కుప్పలుగా వేసినప్పుడే, మండు యెండలోనైనా ఆ కుప్పల వెనకాల కాస నీడలో వొదిగేవాళ్ళం నేనూ__మ్మా. ఆ కొత్త వరిగడ్డే మా సోఫా, అదే మా తలగడ. ఈ చిన్నకాలవ గట్టున ఆ చిన్న తుమ్మచెట్టు నీడ ఆధారం చాలు మాకు, పగలంతా గడపడానికి. ఆమెమీద ఒక కన్ను, ఎవరూ సమీపించడంలేదు కదా అని ప్రపంచంమీద ఒక కన్ను. మళ్ళీ ప్రపంచమే మరిచి అంత మనసూ ఆమె మయమై, తెప్పరిల్లి మళ్ళీ చూడడం. రక్తం పొంగి పొంగి సమస్తాన్ని నా ప్రియురాళ్ళ క్షేమాన్ని కూడా ఆలోచించని ఉధృతపు దినాలవి! కాని అన్నిటిలోనించి ఏ రతీదేవి కరుణించి మమ్మల్ని రక్షించి తప్పించి బైటపడవేసింది? ఆ పరిస్థితులలో సంఘము, ఆరోగ్యము, స్వభావము స్త్రీ అబలత్వము పురుషక్రౌర్యము జలసీ వీటిలో ఇతరుల జీవితాల్ని శాశ్వతంగా భగ్నం చేసిన విషయాలు నేనెరుగుదును. ఎందుకు విధి నన్నింత సులభంగా కరుణించింది! వదిలింది? నా వివేకమా? ప్రజ్ఞా? సమస్తమూ సులభంగా ప్రేమకై ప్రపంచం ముందు పదిసార్లు వొడ్డిన మూర్ఖుణ్ణి! ఏది పాలించింది? వుత్త chance అవునా? లేక నా పూర్వజన్మ సుకృతమా? పూర్వజన్మలో నేపూజించిన దేవతా? కాని యీనాటికైనా నా సుస్వభావం చేతనైతేనేం, నా సంకోచ భీరుత్వాలచేతనైతేనేం, నా ప్రమత్తత వల్లనైతేనేం, నా చేతినించి తప్పిపోయిన సౌందర్యమే నన్ను పలకరించి, వెక్కిరించి ఏడిపిస్తుంది! ఎందుకు?
ఇంత సౌందర్య కాంక్ష కలిగిన నేను_అట్లా కాదు. ఒక కథ వ్రాయాలనిపిస్తోంది. నావంటి సౌందర్యోన్మత్తు డొకడు తపస్సు చేస్తాడు. వరాన్ని పొందుతాడు; తను కోరిన స్త్రీ ప్రతి ఆవిడా తన్ను మోహించాలని. నావలెనే ప్రతి స్త్రీలో ఏదో వొక విధమైన అందాన్ని చూస్తాడు. వాంఛిస్తాడు. ప్రతివారూ గోపికల్లాగు అతన్ని అనుసరించి వెంటబడతారు. ఏమౌతాడతను?
తోవ వెంబడిపోతే, ఒక్క కళ్ళలో, ఒక్క నడకలో, ఒక్క మాటలో, చిరునవ్వులో, చేతి వేళ్ళలో, అందాన్ని చూసి ముగ్ధుణ్ణి అవుతాను. ఆ సౌందర్యాన్ని గమనించడం అంతటితో ఆగక, వాంఛ నరాల్ని బాధిస్తుంది. నవ్వు వస్తుంది. నేను వ్రాయతలుచుకున్న కథ జ్ఞాపకం వస్తుంది. Byron పడ్డ Despair "లోకంలోని అందమైన పెదవులన్నీ ఒక్కచోట గుమికూడరాదా నేను ముద్దు పెట్టుకునేందుకు?" అన్నాడు. అంతేకాదు నేను__
అనాదినించి పుట్టి చచ్చిన సౌందర్యవతులు, కవులు భావించిన స్వరూపాలు, పుట్టబోయేవారు అందరూ వేధిస్తారు. నవ్వు కాదు. ఇప్పుడు చిన్నగా వున్నవారిని చూసి బాధ కలుగుతుంది. ఇంత నా హృదయంలోని మీరు అనుకునే మాలిన్యాన్నంత ఎందుకు కెలుకుతున్నానంటే అది మాలిన్యం కాదు. నాలోకాని, మీలోకాని, అట్లాంటి వాంఛలు మాలిన్యం కాదని నిరూపించడానికి. అట్లాంటి వాంఛలు లేవంటారా_ నిజంగా మీలో లేవంటారా__ ఎంత జాలి కలుగుతుంది! నపుంసకుడికన్న అధములా_ నిజంగా అంత అధములా_ జీవశక్తే లేదా_ పాపం...పుణ్యాత్ములూ, మర్యాదస్తులూ కావడానికి... సృష్టిశక్తుల్ని నాడాలవాడిచేత చితకకొట్టించుకోడం కన్నా కూడా... మనస్సులో శృంగార భాగాల్ని కత్తిరింపించుకున్నారా? ఎందుకు బతుకుతున్నారు? ఎంత ఘోరం!