Previous Page Next Page 
పెళ్ళాంతో పెళ్ళి పేజి 4


    "నిజంగానేరా! స్వయంగా వీళ్ళ అమ్మే ఈ అమ్మాయిని చంపమని అడ్వాన్సు ఇచ్చింది. గొప్పోళ్ళ గోత్రాలు ఇలాగే ఉంటాయ్ గురూ! ఆస్తుల కోసం శాల్తీలు లేపెయ్యడం వీళ్లకు లెక్కకాదు."


    "మరి ఈ ముదనష్టపు పనికి నువ్వెందుకు ఒప్పుకున్నావు?"


    "ముదనష్టపు పొట్ట ఒకటి ఉంది కదా!" అన్నాడు సుందర్.


    ఆకలి అంటే ఏమిటో తెలుసు కాశీకి. అన్యాయం అంటే ఏమిటో కూడా తెలుసు. ఈ కేసులో దేన్ని సమర్ధించాలా అని ఆలోచనలో పడగానే, అతని పరధ్యానాన్ని గమనించిన సుందర్ ఒడుపుగా తప్పించుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోవడం మొదలెట్టాడు. మిగతా వాళ్ళందరూ కూడా పరిగెత్తడం మొదలెట్టారు.


    మెదడు మొద్దుబారినట్లయిపోయింది కాశీకి. అయ్యో! ఎంత దురవస్థ ఈ అమ్మాయిది! స్వయంగా తల్లే కూతుర్ని చంపమని మనుషులని పురమాయించిందా! ఎంత ఘోరకలి! ఈ విషయం విన్న తర్వాత మళ్ళీ జీవితంలో కోలుకోగలదా ఈ అమ్మాయి! అయ్యోపాపం! సానుభూతిగా ఆమెవైపు చూశాడు కాశీ. వెంటనే అతని నెత్తిమీద మంచుదిమ్మె ఒకటి పడినట్లయింది.


    విలాసంగా నిలబడి ఉంది ఐశ్వర్య. ఇందాక తన తోపుతో ఎగిరి ఎక్కడో పడిన రివాల్వర్ ఆమె చేతిలోనే ఉంది. ఆమె మొహంలో వ్యంగ్యంతో కూడిన నవ్వు. వాళ్ళ మాటలు ఆమె నమ్మినట్లుగా లేదు. అవును. ఎవరైనా ఎలా నమ్మగలరు? తనలాంటి వెర్రివెంగళప్పలు తప్ప! హఠాత్తుగా కాశీకి అర్థమయింది సుందర్ ప్లే చేసిన ట్రిక్కు ఏమిటో! టెంపరరీగా తను షాక్ అయిపోయేమాట ఒకటి చెప్పాడు. తను షాక్ లో ఉండగా తప్పించుకుపోయాడు! అంతే!


    "క్యాచ్!" అని రివాల్వర్ కాశీ వైపు విసిరింది ఐశ్వర్య. అతను ఉలిక్కిపడి దాన్ని అందుకోబోయేలోగానే కాలి మడమ మీద గిర్రున తిరిగి, గాల్లోకి ఎగిరి, కాలితో రివాల్వర్ ని తన్నింది. రివాల్వర్ అతని చేతిలో పడకముందే ఎటో వెళ్లిపడిపోయింది.


    షాక్ అయిపోయి చూస్తున్నాడు కాశీ. ఏం జరుగుతుందో అతనికి ఏమాత్రం అంతుబట్టడం లేదు. ఈ అమ్మాయికి కరాటే వచ్చా? గాల్లో ఎగిరిన రివాల్వర్ ని అది క్రింద పడక ముందే మళ్ళీ గాల్లోకి ఎగరకొట్టగలదా?


    మరి...ఇందాక వాళ్ళని చూసి అంత భయపడిపోయిందేం?


    జరిగింది ఏమిటో కాశీకి అర్థం కాలేదు గానీ బాలూకి వెంటనే అర్థమైపోయింది. ఎదుటివాళ్ళ మనసులో ఉన్న ఊహలని పుస్తకం చదివినట్లు చదివెయ్యగలడు బాలూ.


    ఐశ్వర్య కరాటే ఎక్స్ పర్ట్. పదిమంది కాదు. పాతిక మంది మీద పడినా ఎడం కాలితో బుద్ధిచెప్పగలదు. అందుకే తనేమీ కలుగజేసుకోలేదు. నిజానికి తనకీ కరాటే వచ్చు. కరాటేనే కాదు. గుర్రపు స్వారీ వచ్చు. కత్తి యుద్ధం వచ్చు. డాన్సులు వచ్చు. అవన్నీ తను సినిమా ఛాన్స్ ల కోసం నేర్చుకున్నాడు. ఈ బట్లరు ఉద్యోగం ఎల్లకాలం చెయ్యడు తను. సినిమా హీరో అవుతాడు. ఈ ఐశ్వర్య రాజ్యశ్రీ తన ఆటోగ్రాఫ్ అడుగుతుంది తప్పదు!


    "బాలూ!" అంది ఐశ్వర్య.


    "మేడమ్!"


    "ఇతనికి గుండె ధైర్యం ఉంది!"


    "మంచి గుండె కూడా ఉంది మేడమ్" అన్నాడు బాలూ.


    హఠాత్తుగా ఐశ్వర్య చూపులు అక్కడే ఉన్న ఒక జామ చెట్టు మీద నిలిచాయి.


    ఆమె అటు చూడగానే బాలూ ప్రాణాలు కడబట్టినట్లయింది. ఆ జామ చెట్టులో చిక్కుకున్న ఓ వంద రూపాయల నోటు తీసి దాన్ని తన జేబులో పెట్టేసుకున్నాడు. అది కూడా కనిపెట్టేసిందా ఏమిటి? ఇది ఆడపిల్ల కాదు! ఆటంబాంబు!


    "బాలూ!" అంది ఐశ్వర్య చల్లగా.


    "మేడమ్!"


    "తోటమాలి ఏడీ?"


    "ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు మేడమ్!" అని "మల్లయ్యా!" అని పెద్దగా పిలిచాడు బాలూ.


    అక్కడే ఉన్న ఒక చిన్న గుడిసెలో నుంచి బయటికి వచ్చాడు మల్లయ్య. ఒకప్పుడు బాగా లావుగా భారీకాయంతో ఉండి - తిండికి గడవక సన్నబడిపోయిన వాడిలా, ఒకప్పుడు బాగా బతికి, చెడిపోయిన వాడిలా ఉన్నాడతను.


    "పిలిచారా అమ్మా!" అన్నాడు వినయంగా.


    "ఇట్రా."


    దగ్గరికి వచ్చాడు మల్లయ్య.


    "ఈ చిన్న కొమ్మకి ఓ పేద్ద జాంకాయ ఉండాలి. ఏమయిందిరా?"


    కొద్దిగా జంకుతూ చెప్పాడు మల్లయ్య "ఆ కాయా అమ్మా... అది నా బిడ్డ అడిగితే కోసిచ్చా!"


    కత్తి ఝళిపించినట్లు అంది ఐశ్వర్య.


    "ఈ తోట వేసింది నీ బిడ్డ కోసమా?"


    "....."


    "ఏదీ అది?"


    "ఎవరమ్మా?"


    "నీ బిడ్డరా!" అంటూ చరచరా గుడిసె దగ్గరికి వెళ్ళింది ఐశ్వర్య. ఆమె నడవడం చూస్తే కాటందుకోవడానికి వెళుతున్న తాచులాగే ఉంది.

 Previous Page Next Page