"ఎ...ఎ..ఎవరు?" అంది గొంతు పెకలించుకుని.
చటుక్కున వెనక్కి తిరిగి చూశారు బాలూ, కాశీ. వాళ్ళ వెనకగా -
పదిమంది యువకులు నిలబడి ఉన్నారు. చాలా రఫ్ గా ఉన్నారు. పెరిగిన గెడ్డాలు - నలిగిన బట్టలు, ఆకలి చూపులు. ఆకలి అన్నం కోసం, అందం కోసం కూడా అన్నట్లు అనిపిస్తోంది వాళ్ళు ఐశ్వర్య వైపు చూస్తుంటే.
కానీ కొద్దిక్షణాల్లో ఆ ఊహ తప్పని తేలిపోయింది.
వాళ్ళు క్షణాల్లో ఆ అమ్మాయిని చుట్టుముట్టేశారు. ఒకడు తపంచా అనే నాటు రివాల్వర్ తీశాడు. సరిగ్గా ఆమె గుండెలకి గురిపెట్టాడు.
అంతే! క్షణంలో సగంలో ఎగిరి వాళ్ళమీద పడ్డాడు కాశీ. వాళ్ళు పదిమంది. తను ఒక్కడు. బాలూ ఆమెని రక్షించే ప్రయత్నం ఏమీ చేస్తున్నట్లు కనబడలేదు. పైగా వాళ్ళ దగ్గర ఆయుధం ఉంది.
అతను భయంతో నీలుక్కుపోయి ఉన్నాడు.
కానీ - ఆ విషయాలేవీ ఆ క్షణంలో కాశీకి గుర్తురాలేదు.
ఆ అమ్మాయిని కాపాడాలి.
కాదు. కాపాడుకోవాలి.
ఎందుకు?
ఎందుకో తనకే తెలియదు. మనసు చెబుతోంది. నువ్వు ఏమైపోయినా సరే! ఆ అమ్మాయికి ఏమీ కాకూడదు!
వళ్లు తెలియడంలేదు కాశీకి. అతను విసురుగా వచ్చి మీదపడటంతో వాళ్ళలో ఒకడి చేతిలో ఉన్న తపంచా ఎగిరివెళ్లి ఎక్కడో పడింది. వాడి కాలర్ పట్టుకున్నాడు కాశీ. "చంపుతావుట్రా... చంపుతావుట్రా... చంపుతావుట్రా..." అని పూనకం వచ్చిన వాడిలాగా వాడి చెంపలు వాయించేస్తున్నాడు. తక్కిన వాళ్ళు అతన్ని పట్టుకోబోతే కాలితో తంతున్నాడు. ఒకడి చెంప అందుబాటులో కనబడితే కొరికేశాడు. అతను పట్టుకున్న మనిషి షర్టు చిరిగిపోయింది. చీలికలైపోయింది. కాలర్ మాత్రం మిగిలింది. ఆ కాలర్ నే మెడ చుట్టూ బిగించి, బలంగా గుంజుతున్నాడు కాశీ. ఇంకొద్ది క్షణాలు ఉంటే అవతలివాడు ఊపిరాడక ప్రాణాలు వదిలేవాడే! ఆస్ ఫిక్సేషన్! రొప్పుతున్నాడు కాశీ. కొద్దిగా పట్టుజారింది. ఆ మనిషి కీచుగొంతుతో "కాశీ! నేన్రా! సుందర్! నన్ను చంపకు! దండం బెడతా!" అన్నాడు భయభ్రాంతుడై పోయి.
సుందర్ అనే పేరు వినగానే పట్టు సడలించి, వాడి మొహంలోకి చూశాడు కాశీ. అవును! వాడు సుందరే!
సిటీలో పార్కుల దగ్గర కూర్చుని ఉంటారు కొందరు నిర్భాగ్యులు. వాళ్ళు బిచ్చగాళ్ళు కాదు. కానీ బీదవాళ్ళు. రకరకాల కారణాల వల్ల జీవితంతో పోరాడి ఓడిపోయే స్థితికి వచ్చి, ఓ పూట తిండి గడవడం కోసం ఏపని అయినా చేసిపెట్టే మనుషులు. మీరు ఇల్లు మారుతున్నారా? వాళ్లు సామాన్లు మోస్తారు. తోటపని చెయ్యాలా? వాళ్లలో ఒకతను రెడీ... అలా!
హైదరాబాద్ వచ్చిన కొత్తలో కాశీ కూడా అక్కడే వాళ్ళతోపాటు ఉన్నాడు. సుందర్ ఫ్రెండ్ షిప్ అయ్యాడు.
"సుందర్! నువ్వా!" అన్నాడు కాశీ నమ్మలేనట్లుగా.
తలవంచుకున్నాడు సుందర్.
"మనిషిని చంపుతావురా! ఏమయింది నీకు?"
మౌనంగా ఉండిపోయాడు సుందర్.
"చెప్పరా! ఈ అమ్మాయిని చంపాలని ఎందుకనుకున్నావ్?"
"కాశీ! నన్ను అడక్కు!" అన్నాడు సుందర్.
"ఏం? చేసిన తప్పుకి సిగ్గేస్తోందా?"
"సిగ్గు కాదు. భయం!"
"ఎందుకు భయం?"
"భయం నాకోసం కాదు. ఈ అమ్మాయి కోసమే!"
"తిక్కవాగుడు తగ్గించి అసలు సంగతి చెప్పు!"
"అసలు సంగతి చెబితే ఈ అమ్మాయి గుండె పగిలి చావడం ఖాయం!"
"ఏమిటీ!"
"భయంకరమైన రహస్యం అది!"
"విన్న తర్వాత ఈమె బతికి ఉండలేదు..." అన్నాడు సుందర్.
కాశీ చేతులు సుందర్ మెడచుట్టూ గట్టిగా బిగుసుకోవడం మొదలెట్టాయి.
"రహస్యం చెప్పకపోతే నువ్వు బతికి ఉండవ్! వెధవ్వేషాలు వేస్తున్నావా?"
"నీకు దండం పెడతానురా కాశీ! నాచేత ఆ ఘోరం చెప్పించాలని చూడకు!"
"సుందర్! వార్నింగ్ ఇస్తున్నా..."
"సరే! మీ ఖర్మ! ముందు నా గొంతు వదులు!" అన్నాడు సుందర్. కాశీ పట్టు సడలించాడు. రొప్పుతూ కొద్ది క్షణాల పాటు ఆయాసం తీర్చుకొని, తర్వాత అన్నాడు సుందర్.
"వీళ్ల అమ్మ... ఈ అమ్మాయిని చంపెయ్యమని మాకు డబ్బులు ఇచ్చింది. అడ్వాన్సు పదివేలు! చంపితే తలో లక్ష!"
"ఏమిటి?"