Previous Page Next Page 
పెళ్ళాంతో పెళ్ళి పేజి 5


    అప్పటికే గుడిసె ద్వారం దగ్గరికి వచ్చి అమాయకంగా నిలబడి ఉంది మల్లయ్య కూతురు జ్యోతి. పధ్నాలుగేళ్ళుంటాయ్ - ముగ్ధ. జాంకాయ ఇంకా ఆమె చేతిలోనే ఉంది.


    "కాయ బాగుందా?" అంది ఐశ్వర్య కఠినంగా.


    "చాలా మంచిగా ఉందమ్మా!" అంది జ్యోతి అమాయకంగా.


    "ఫ్రీగా వస్తే ఫినాయిలు కూడా రుచిగానే ఉంటుంది" అని - "మల్లయ్యా! ఇట్రారా!" అంది.


    ఇరవై రెండేళ్ళ ఐశ్వర్య తనని 'రా' అని పిలుస్తుంటే, యాభై ఏళ్ల మల్లయ్య తలవంచుకుని వచ్చి నిలబడ్డాడు.


    "దాని చేతిలో పండు తీసుకో!"


    జ్యోతి చేతిలోని పండు తీసుకున్నాడు మల్లయ్య.


    "అవతల పారేయ్!"


    అవతల పారేశాడు మల్లయ్య.


    "ఇంకో అడుగు ముందుకు రా!"


    ఇంకొక్క అడుగు ముందుకు వేశాడు మల్లయ్య.


    చాచి అతని చెంప మీద ఛెళ్ళున కొట్టింది ఐశ్వర్య.


    "ఏ ఊర్రా మీది?"


    "మాచెర్ల."


    "వెళ్ళు! హైదరాబాద్ దారి మర్చిపో!"


    "తన తండ్రికి తన కళ్లముందే అంత అవమానం జరగడం చూసి వస్తున్న కన్నీళ్ళు బలవంతాన ఆపుకుంటూ నిలబడిపోయింది జ్యోతి. మల్లయ్య మాట్లాడలేదు. పావు గంటలో సామాన్లు సర్దడం అయిపోయింది. పూట గడిస్తే చాలు అనుకునే పేదవాడికి సామాన్లు ఏముంటాయ్! మూటా ముల్లెతో బయటికి వచ్చాడు మల్లయ్య.


    "వస్తాను దొరసానీ!"


    "ఇంకెప్పుడూ రాకు."


    మల్లయ్యా, జ్యోతి వెళ్ళిపోయారు.


    కాశీ వైపు తిరిగింది ఐశ్వర్య.


    "నీ పేరేమిటన్నావ్.... బెనారస్?"


    "కాశీ"


    "కాశీ! ఉద్యోగం కోసం కదూ వచ్చావ్! ఇప్పుడే ఒకటి ఖాళీ అయింది. తోటమాలిగా పని చెయ్! దుక్కలా ఉన్నావ్! దున్నపోతులా కష్టపడాలి! తెలిసిందా! బాలూ! ఏర్పాట్లు ఎంత వరకూ వచ్చాయ్!"


    "పర్ ఫెక్ట్ మేడమ్" అన్నాడు బాలూ.


    "ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచెయ్యండి! ఇవాళ చాలా ఇంపార్టెంట్ డే! గుర్తుందా?"


    "గుర్తుంది మేడమ్!" అన్నాడు బాలూ వినయంగా.


    హెలికాప్టర్ లో ఎక్కి కూర్చుంది ఐశ్వర్య.


    అప్పుడు చూశాడు కాశీ. హెలికాఫ్టర్ లో ఇంకో ఇద్దరు మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళ చేతుల్లో రివాల్వర్స్ ఉన్నాయి.


    హెలికాప్టర్ పెద్ద రొదతో గాల్లోకి లేచింది.


    "బాడీ గార్డ్స్!" అన్నాడు బాలూ. కాశీకి అర్థమయ్యేలా చెబుతూ, "నీడలా కనిపెట్టుకుని ఉంటారు. మీ సుందర్ వాళ్ళ గ్యాంగు ఎంతోదూరం పోయి ఉండరు. హెలికాప్టర్ ముందు వాళ్ళ స్పీడెంత? కార్లో వెళ్ళినా వీళ్ళు పట్టేసుకుంటారు. పాపం! కుర్రాళ్ళది ఇంక కుక్క చావే. దానికి ఎదురేముందీ! డబ్బుతో పులిసిపోయి ఉంది ఒళ్ళు..." అని ఇంకా ఏదో అనబోయాడు బాలూ.


    "బాలూ!" అన్నాడు కాశీ కోపంగా.


    బాలూ అదిరిపడి అతని మొహంలోకి చూశాడు. "ఒర్నియబ్బ. దాన్నంటే నీకెందుకురా అంత ఉలుకూ!"


    "ఆ అమ్మాయిని ఇదీ అదీ అనకు"


    "నీదేం పోయింది?"


    "ఆ అమ్మాయి" అని హఠాత్తుగా ఆగిపోయాడు కాశీ.


    "చెప్పు"


    "ఇప్పుడు కాదు. టైం వచ్చినప్పుడు చెబుతాను బాలూ! ఈ అమ్మాయి గురించి నీకు తెలిసింది అంతా చెప్పవా?" అన్నాడు కాశీ.


    ఉత్సాహంగా గొంతు సవరించుకున్నాడు బాలూ. గాసిప్ అంటే అతనికి చెప్పలేనంత సరదా!


    "రా! రాత్రికి పార్టీ ఉంది. పనులు చేసుకుంటూ మాట్లాడుకుందాం!" అన్నాడు అక్కడే ఉన్న కిచెన్ లోకి దారి తీస్తూ. కిచెన్ దగ్గరికి వెళ్ళాక అక్కడికి కొంత దూరంలో తోటలో జరుగుతున్న సంరంభం కనబడింది కాశీకి. అక్కడ చాలామంది వర్కర్లు చీమల్లాగా చకచక పని చేస్తున్నారు. ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, డెకరేటర్లు, పూలమాలలు కట్టేవాళ్ళు వగైరా... వగైరా...


    అక్కడ పెద్ద డయాస్ కూడా ఒకటి నిర్మించబడుతోంది.

 Previous Page Next Page