Previous Page Next Page 
దావాగ్ని పేజి 35


    "డిక్టేటర్లకి అందరికీ ఉండే ప్రాణభయమే జనరల్ భోజాకి కూడా వుంది. ఏ క్షణాన ఎవరు తనమీద తిరుగుబాటు చేసి అధికారం స్వాధీనం చేసుకుంటారో అని అతడి భయం:

 

    ఒకదేశం తాలూకు అధికారాన్ని స్వాధీనం చేసుకోవడం అంటే ఏమిటి? ఆ దేశపు ప్రచారసాధనాలని కంట్రోలులోకి తెచ్చుకోవడం మిలటరీనీ చెప్పుచేతల్లోకి తెచ్చుకోవడం. ప్రస్తుతం పదవుల్లో వున్న వాళ్ళని దింపెయ్యడం లేదా చంపెయ్యడం.

 

    అందుకని భోజా ఏం చేశాడూ, సెక్రెటీరియట్, రేడియోస్టేషన్ తో సహా సమస్తం తన డైరెక్టు సూపర్ విజన్ లోనే ఉంచుకొనే ఉద్ధేశ్యంతోనే వాటినన్నిటినీ కూడా తన దుర్భేధ్యమైన కోటలాంటి ప్రెసిడెన్షియల్ పాలెస్ లోనే పెట్టేశాడు.

 

    చివరికి సాయుధదళాల బారక్స్ కూడా ఆ ప్రెసిడెన్షియల్ పాలెస్ లోనే వున్నాయి. అంటే సైన్యంలో చాలాభాగం పాలెస్ లోనే అనుక్షణం సర్వసన్నద్ధంగా ఉంటుందన్నమాట.

 

    ఇకపోతే ఎయిర్ పోర్ట్.

 

    ఎయిర్ పోర్ట్ కూడా ఇంట్లోనే దాచేసేవాడు జనరల్ భోజా. అది సాధ్యమయ్యే పక్షంలో.

 

    కానీ అలా సాధ్యం కాదు కదా:

 

    అందుకని ఎయిర్ పోర్టు మాత్రం పాలెస్ లో లేకుండా వుంది" అన్నాడు తోకాస్.

 

    బాదంకాయ షేపులో వున్న కనురెప్పల్ని రెపరెపలాడించింది సూజీవాంగ్.

 

    "అద్సరే: అసలుపని వెనుకబడిపోతోంది" అంటూ ఆమెని సమీపించాడు తోకాస్.

 

    "నలిగిపోతుంది... నలిగిపోతుంది" అంది సూజీవాంగ్ ఆదుర్ధాగా.

 

    "పోతే పోనీ:"

 

    "అరెరె:లాగకు: చిరిగిపోతుంది."

 

    "పోతే పోనీ:"

 

    "మా నాన్న వస్తాడు:"

 

    "వస్తే రానీ:"

 

    "అడుగో వచ్చేశాడు:"

 

    "ఏడీ?" అని గిరుక్కున వెనక్కి తిరిగాడు తోకాస్.

 

    చటుక్కున గదిలోకి దూరి తలుపులు వేసుకుని, కిటికీలోనుంచి అతనివైపు చూసి, నాలుక బయటపెట్టి వెక్కిరించింది సూజీ. "రేపు:" అంది అల్లరిగా. ఉక్రోషంగా చూశాడు తోకాస్.

 

    "నిజంగానా...?"

 

    "నీ తోడు...:"

 

    నిరుత్సాహంగా అక్కడినుంచి వెళ్ళిపోయాడు తోకాస్. సూజీవాంగ్ గనక ఇండియన్ అమ్మాయి అయితే, తను ఇంత భంగపడి అడగవలసి వచ్చేది కాదు. బలాత్కారంచేసి, తనసొంతం చేసుకునేవాడు.  

 

    కానీ సూజీవాంగ్ ఇండియన్ కాదు చైనీస్ అమ్మాయయిపోయింది.

 

    చైనా వాళ్ళంటే జనరల్ భోజాకి హడల్.

 

    సూజీవాంగ్ మోజులోపడి తను రోజుకో రహస్యం చెప్పేస్తున్నాడనీ, ఆ రహస్యాలని సూజీ ఓపెన్ మార్కెట్ లో అమ్ముకుంటుందని తోకాస్ కి తెలియదు. ఊరికే అన్నారా మరి? ప్రేమ గుడ్డిదని:  

 

                                      *    *    *    *

 

    బి అండ్ పి కంపెనీ వర్క్ సైట్ కి కొంచెం దూరంలో ఉన్నాయి కంపెనీ క్వార్టర్స్. అందులో చివరి క్వార్టరులో వుంటున్నాడు ప్రొఫెసర్ రామనాధం. అతనికి బయట ప్రపంచంలో గుర్తింపు ఉందేమోగానీ ఇంట్లో మాత్రం అతనికి ఎర్రని ఏగానీ విలువలేదు. అతని భార్య అంబుజాక్షి  అతనికి రెండింతలు సైజులో ఉంటుంది. ఆమె సైజుకి నాలుగింతలు వుంటుంది ఆమె నోరు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఆమె గయ్యాళి.

 

    ఎప్పుడూ కుక్కినపేనులా బిక్కచచ్చిపోయి ఉండే తన భర్త ఆ రోజు ఛాతీ విరుచుకుని ఇంట్లోకి రావడం ఆమెకి ఆశ్చర్యం కలిగించింది.

 

    విశేషమేమిటో తనే చెప్పేశాడు రామనాధం.

 

    "అంబుజాక్షీ: మనకి డబ్బు లేకపోవచ్చు. కానీ నిజాయితీకేంలోటులేదని ఇవాళ రుజువు చేశాను."

 

    "ఏం చేశారేంటి?" అంది ఆమె పెడసరంగా.

 

    బాబూజీ ప్రతిపాదనా, తను నిరాకరించడం అంతా సగర్వంగా చెప్పాడు ప్రొఫెసర్ రామనాధం.

 

    వెంటనే, "ఓరిదేవుడోయ్:" అని ఏడుపు లంకించుకుంది అంబుజాక్షి. ఆమె ఏడవడం మొదలుపెట్టిందంటే ఫ్యాక్టరీసైరన్లుకూడా మూగపోతాయి.

 

    "ఏమిటీ? ఏమయిందిప్పుడు?" అన్నాడు రామనాధం కంగారుగా. అతనికి ఆలస్యంగా తట్టింది జరిగిందంతా పెళ్ళాంతో చెప్పి తప్పుచేశానని.

 

    టేప్ రికార్డర్ పెట్టుకుని సినిమా ప్రేమగీతాలు వింటున్న కూతురివైపు చూపించింది అంబుజాక్షి. "దాన్నొక అయ్యచేతిలో పెట్టే దారి ఏమిట్రా అని నేను దిగులుపడుతూ ఉంటే, దయాధర్మంగా యజమాని ఇస్తానన్న పాతికలక్షలూ వదిలేసి వస్తావూ? నీకేమన్నా బుద్ధి వుందా? నువ్వు మొగాడివేనా అసలు? అసలు నువ్వు అంతే: నీ వంశమూ అంతే: కురూపి వంశం: ముదనష్టపు వంశం:" అని ఏడుతరాల వాళ్ళని తిరగేసి తిట్టటం మొదలెట్టింది.

 Previous Page Next Page