ఈ గొడవ చూసి కూతురు కన్నీళ్ళు పెట్టుకుని దుఃఖిస్తోంది.
జంకుతూ యిదంతా చూస్తున్నాడు రామనాధం.
ఆ రాత్రి అందరికీ శివరాత్రే అయింది.
తెల్లారేసరికి మారిపోయాడు ప్రొఫెసర్ రామనాధం: "నేను రిపోర్ట్ మార్చేస్తానులే: ఇంక కోప్పడకు:" అన్నాడు భయంగా.
అయినా ఆమె స్టీము తగ్గడానికి మరోగంట పట్టింది.
నాన్న పాతిక లక్షలు తెస్తాడని తెలిసి వికసించింది కూతురు వకుళ మొహం.అప్పుడే పెళ్ళికళ వచ్చేసింది ఆ అమ్మాయి మొహంలోకి.
తను రైటింగ్ టేబుల్ దగ్గర కూర్చుని వణుకుతున్న చేతులతో రిపోర్ట్ రాయటం మొదలెట్టాడు ప్రొఫెసర్ రామనాధం.
* * * *
"ఇదిగో: నా మాట వినే ఓపిక వుందా నీకు?" అంది జనరల్ భోజాతో అతని భార్య జెన్నిఫర్.
అప్పుడే ఎవరికో ఫోన్ చేసి రిసీవర్ కింద పెట్టిన జనరల్ భోజా ఆసక్తిగా అడిగాడు "ఏమిటి?"
"ఇంగ్లండ్ వదిలి ఈ అనాగరికపు దేశానికి వచ్చేసిన తర్వాత అసలు ఎన్ టర్ టైన్ మెంటు అన్నదే కరువయిపోయింది."
"నువ్వు సుఖంగా వుండటానికి కావలసినంత డబ్బు యిస్తున్నానుగా...:"
బలవంతంగా నవ్వింది జెన్నిఫర్. "ఇవ్వట్లేదని నేనన్నానా: నువ్విచ్చిన డబ్బుతో కొత్త టెన్నీస్ కోర్టు ఒకటి తయారుచేయించా."
"వెరీగుడ్...:"
"ఎన్ని పనులున్నా సరే. యివాళ నువ్వు నాతో రెండుసెట్లు ఆడాలి" అంది జెన్నిఫర్.
కాస్త ఆలోచించి, "సరే:" అన్నాడు జనరల్ భోజా.
పావుగంట తర్వాత...
జనరల్ భోజా, జెన్నిఫర్ కొత్త టెన్నీస్ కోర్టుకి చేరుకున్నారు. మధ్యలో నెట్ కట్టి వుంది. నెట్ దగ్గరగా ఒక ఎత్తున కుర్చీ వేసి వుంది. అది ఎంపైర్ కోసం.
జనరల్ భోజాతోపాటు వచ్చిన తోకాస్, "నేను ఎంఫైర్ గా వుంటా" అని ఆ ఎత్తయిన కుర్చీ ఎక్కి కూర్చున్నాడు.
తన భారీ కాయాన్ని బిగుతుగా ఉన్న తెల్ల నిక్కర్, టీ షర్టులలోకి అతి కష్టంమీద దూర్చగలిగినట్లు వుంది జెన్నిఫర్. తను టెన్నిస్ ఛాంపియన్ స్టెఫీగ్రాఫ్ లాగా ఉన్నానని ఆమె భ్రమపడుతూ వుండవచ్చు నేమోగానీ చూసేవాళ్ళకి మాత్రం నీటిగుర్రం టెన్నిస్ డ్రెస్సు వేసుకున్నట్లు కనబడుతోంది.
"టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళు ముందు సర్వీస్ చెయ్యాలి" అన్నాడు కేప్టెన్ తోకాస్ చాలా ఇంపార్టెంట్ గా ఫీలవుతూ.
"ఒద్దులే: ఆయన్నే ముందు సర్వీసు చెయ్యనీ" అంది జెన్నిఫర్.
స్టయిల్ గా బాల్ అందుకున్నాడు భోజా. దాన్ని గాల్లోకెగరేసి బాట్ తో కొట్టటానికి ఉద్యుక్తుడవుతున్నాడు. బంతి కొంచెం బరువుగా ఉన్నట్లు తోచిందతనికి.
అప్పుడు -
ఒక పిల్లి చటుక్కున కోర్టుకి అడ్డుగా పరుగుదీసింది.
పులులన్నా భయంలేదు భోజాకి. కానీ పిల్లులంటే మాత్రం చెప్పలేనంత అలర్జీ.
అప్రయత్నంగానే బాల్ ను బలంగా పిల్లివైపు విసిరాడు జనరల్ భోజా.
తక్షణం పిల్లి పేలిపోయింది బ్రహ్మాండమైన చప్పుడుతో.
కొయ్యబారిపోయాడు భోజా.
అంటే అది బంతికాదు. బంతిలా వున్న బాంచ్ అన్నమాట:
దాన్ని గనుక తను గాల్లోకి ఎగరేసి బ్యాట్ తో కొట్టి వుంటే తనే పేలిపోయి వుండేవాడు ఈ పిల్లిలాగా:
దేవుడు దయామయుడు.
అనుమానంగా భార్య జెన్నిఫర్ వైపు చూశాడు జనరల్ భోజా.
"ఏమిటీ ఏమయిందీ?" అందామె ఏమీ తెలీనట్లు.
సైలెంట్ గానే పళ్ళు కొరుక్కున్నాడు భోజా. ఆపని ఆమె చేయించి వుంటుందని అతనికి అర్థమైంది.
కానీ తనేమీ చెయ్యలేడు.
ఆమె వెనుక పాపాడాక్టర్ నిలబడి ఛాలెంజ్ చేస్తున్నట్లు తనను చూస్తున్నాడు.
పైగా -
తన జుట్టు ఆమె చేతిలో వుంది.
"మీరంటే పడనివాళ్ళు ఎక్కువైపోయారు." అని సదాభిప్రాయంగా కేప్టెన్ తోకాస్ వేపు చూసింది జెన్నిఫర్.
మాట్లాడకుండా మెడతిప్పి తోకాస్ వైపు చూశాడు జనరల్ భోజా.
ప్రేలుడు ప్రభావానికి తోకాస్ మసిబారిపోయి, దిష్టిబొమ్మలా కూర్చుని ఉన్నాడక్కడ.
* * * *
"సర్: రిపోర్టు మార్చి తీసుకొచ్చాను" అన్నాడు రామనాధం హీనస్వరంతో.
పైపు కాల్చుకుంటున్న బాబూజీ కళ్ళు మెరిశాయి.