Previous Page Next Page 
దావాగ్ని పేజి 34


    మంత్రముగ్ధలా వెనక్కి తిరిగింది వినీల.

 

    "నాట్ బాడ్: నాట్ బాడ్ ఎటాల్: నీ శరీరం సుకుమారంగానూ వుంది అదే సమయంలో, ఎంత శ్రమకైనా ఓర్చుకునేటంత పటుత్వంగానూ వుంది. ఫిజికల్లీ యూ ఆర్ ఎక్స్ ట్రీమ్ లీ ఫిట్," అన్నాడు ప్రతాప్ సర్టిఫికకేట్ ఇస్తున్నట్లు "నువ్వు ఇంక చీరె కట్టుకోవచ్చు."

 

    అతను ఆ మాట అనడమే మహద్భాగ్యమన్నట్లు చటుక్కున చీరె అందుకుని చుట్టేసుకుంది వినీల.

 

    ఊరికి ఎంతో దూరంలో, ఇంత ఏకాంతంలో, ఎదురుగా వున్న ఒక అందమైన అమ్మాయిని నగ్నంగా చూస్తూ కూడా చలించకుండా వున్న అతడి మనోదారుఢ్యానికి, ఏమైనా చెయ్యగల అవకాశం వున్నా... ఏమీచేయని అతని మనసుకీ, మనసులోనే జోహార్లు అర్పించింది వినీల.

 

    అతని మీద క్షణక్షణానికి సదభిప్రాయం పెరిగిపోతోంది ఆమెకి.

 

                                      *    *    *    *

 

    పారడైజ్ సిటీలో అది ఒక చిన్న పేటలాంటిది 'చైనాటవున్' అంటారు దాన్ని. అక్కడ చైనీయులు ఎక్కువగా వుంటారు.

 

    అక్కడ ఉంది చిన్నదిగా, ముచ్చటగా ఉన్న ఆ ఇల్లు... దాని ముందు గోడమీద 'డ్రేగన్' బొమ్మ పెయింట్ చేసివుంది. తలుపులకు ఎర్రరంగు వేసివుంది.

 

    రాత్రి బాగా చీకటి పడింది.

 

    ఆ ఇంటిముందు నిలబడ్డాడు కేప్టెన్ తోకాస్. అతను లాంగ్ కోటు వేసుకుని వున్నాడు. తన మొహం సరిగ్గా కనబడకుండా ఫెల్డ్ హాట్ నుదుటి మీదకిలాక్కున్నాడు అటూ ఇటూ చూసి ఆ ఇంట్లోకి దూరాడు తోకాస్.

 

    అడుగుల చప్పుడు విని ఎదురొచ్చింది ఒక చైనీస్ యువతి.... పింగాణీ బొమ్మలా నాజూగ్గా వుంది తను. అతడికి అభివాదం చేసి చిరునవ్వు నవ్వింది. అతడిని కూర్చోమని చెప్పి, కిచెన్ లోకి వెళ్ళి గ్రీన్ టీ తయారుచెయ్యడం మొదలెట్టింది. చైనావాళ్ళు పచ్చి టీ ఆకులతోనే పల్చటి టీ కాచుకు తాగుతారు.

 

    "ఆ మర్యాదలకు ఇప్పుడు టైమ్ లేదు. ఒకసారి త్వరగా ఇటురా:" అన్నాడు తోకాస్ బెడ్ రూమ్ లోకి చనువుగా వెళ్ళిపోతూ.

 

    అతని మాటలు వినిపించుకోనట్లు తీరిగ్గా టీ కాస్తూనే ఉంది ఆ అమ్మాయి సూజీవాంగ్.

 

    అతను విరహం భరించలేనట్లు బెడ్ రూమ్ లో నుంచి కిచెన్ లోకి వచ్చాడు.

 

    "ఏం టైమ్ లేదు ఒక్కసారి:" అన్నాడు ఆత్రంగా.

 

    కోపం నటించింది సూజీవాంగ్.

 

    "మొగాళ్ళకెప్పుడూ కోరిక తప్ప మరేం ఉండదు. ఆడవాళ్ళు మాత్రమే ప్రేమా పెళ్ళీ అని తాపత్రయ పడుతుంటారు."

 

    "నీ మీద నాకు బొచ్చెడంత ప్రేమ ఉంది. లేదని ఎందుకనుకుంటున్నావ్?" అన్నాడు తోకాస్.

 

    "చూడండి: ఆ టీ ఆకులు చెబుతున్నాయి. టీ ఆకులు నీళ్ళలోవేసి మరగబెట్టాక, వాటి ఆకారం చూసి భవిష్యత్తు చెప్పగలగడం మా చైనా వాళ్ళకి బాగా చేతనవును" అంది.

 

    ఆ మాట నిజమేనని తోకాస్ కి తెలుసు.

 

    "ఏం చెబుతున్నాయ్ ఆ దిక్కుమాలిన టీ ఆకులూ?" అన్నాడు ఓపిక చచ్చిపోతుంటే.

 

    "నువ్వు వుత్త అబద్ధాలు కోరువిట: నాలాంటి గర్ల్ ప్రెండ్స్ నీకు లక్షాతొంభైమంది ఉన్నారుట నాతో చెప్పిన మాటలే వాళ్ళందరితో కూడా చెబుతూ ఉంటావుట" అంది సూజీవాంగ్ అలకగా.

 

    "చెట్టంత మనిషిని నేను చెబుతుంటే నమ్మకుండా ఆ ఆకుల మాటలు నమ్ముతావా ఏమిటి...?" అని సూజీ భుజం చుట్టూ చెయ్యేశాడు తోకాస్.    

 

    అతడి చేతిని విసురుగా తోసేసింది సూజీ. అతను బ్యాలెన్స్ తప్పి గోడమీద ఒరిగాడు. వెంటనే గోడలోనుండి పెద్ద సిమెంటు పెళ్ళ విరిగి పడింది.

 

    "ఎప్పుడో తాతల కాలంనాటి యిల్లు ఇది. తాకితే పడిపోయేటట్లున్నాయ్ గోడలు. గవర్నమెంటు కొత్త కాలనీ కట్టిస్తోంది. అందులో ఒక ఇల్లు అలాట్ చేయించమంటే దానికి దిక్కులేదుగానీ..." అంది సూజీ సణుగుతున్నట్లు అంటూనే తన డ్రెస్సులోకి దూరబోయిన అతడి చేతిమీద ఒక్క దెబ్బ వేసింది.  

 

    చుర్రుమంది తోకాస్ కి. "దేనికైనా టైమ్ రావాలంటే వినిపించుకోవేం? తలుచుకుంటే నేను నీకు జనరల్ భోజా ఉండే పాలెస్ కి తాతలాంటిది కట్టించి యివ్వగలను తెలుసా?" అన్నాడు.

 

    "అలా పది గదుల ఇంట్లో ఉండే అదృష్టమా నాకు?"

 

    నవ్వాడు తోకాస్.

 

    "పది గదులా: పిచ్చిమొహమా: భోజా ఇంట్లో వందగదులు ఉన్నాయి."  

 

    "నిజంగా:"

 

    "ఆ ఇంట్లో వుండే కారిడార్లు అన్నీ కలిసి రెండుమైళ్ళ పొడవు వుంటాయి."

 

    "అబ్బా:"

 

    "ఆయన పాలెస్ అంటే ఏమనుకున్నావ్? తస్సదియ్యా: సెక్రెటేరిడియట్, రేడియో స్టేషనుతోసహ అన్నీ అందులోనే."

 

    "రేడియోస్టేషన్ కూడా ఎందుకూ?"

 

    నవ్వాడు తోకాస్.

 Previous Page Next Page