Previous Page Next Page 
దావాగ్ని పేజి 32


    ఇతన్ని బెదిరించి లాభంలేదు.

 

    మరి?

 

    ఏదో స్ఫురించింది అతనికి.

 

    "ప్రొఫెసర్: మీరిప్పుడు బిజీగా వున్నారా?"

 

    "బిజీనేగానీ, పరిశోధనల్లో మునిగిపోయి మూడు రోజుల నుంచి సరిగ్గా భోజనం చెయ్యలేదు. భోజనం గురించి నాకు అంత పట్టింపు లేదు గానీ, ఇదిగో ఈ కట్టె బతకాలిగా?" అన్నాడు.  

 

    "అలా అయితే ఓ పని చెయ్యండి. నేనిప్పుడు డిన్నర్ తీసుకోవడానికి వెళుతున్నాను. మీరూ నాతో వచ్చేయండి. ఇంకొన్ని విషయాల గురించి మీతో మాట్లాడాలి."  

 

    తల ఊపాడు ప్రొఫెసర్ రామనాధం.

 

    కొద్ది నిమిషాల తర్వాత బాబూజీ కారు కంపెనీ గెస్ట్ హవుస్ చేరుకుంది. అప్పటికే అక్కడ భోజనం ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. వెండి డిన్నర్ సెట్టు, నాలుగు రకాల సూపులు, నాలుగు రకాల స్వీట్లు, నాలుగు రకాల బిర్యానీలు, రైలౌ అనే పెరుగు పచ్చళ్ళు, సాంబారు, రసం, నాలుగు రకాల ఊరగాయలు, నాలుగు రకాల ఐస్ క్రీంలు.  

 

    "మొహమాటం లేకుండా భోజనం చెయ్యండి" అన్నాడు బాబూజీ రామనాధంతో.

 

    "నాకు ఏ విషయంలోనూ మొహమాటంలేదు" అని ఎర్రగాఉన్న ఆవకాయ కలుపుకొని, దానిలో పచ్చిమిరపకాయలు కొరుక్కుంటూ తినడం మొదలెట్టాడు ప్రొఫెసర్ రామనాధం. మొదటినుంచి చివరిదాకా అదే తిన్నాడు. ఇంకేం తాకలేదు అతను స్ఫూనులూ, ఫోర్కులూ ఉపయోగించకుండా మోటుగా ముద్దలు చేసి మింగడం నాగరికతకి అలవాటుపడ్డ బాబూజీకి వికారం కలిగించింది. అయినా కూడా అవసరం తనది కాబట్టి మాట్లాడకుండా ఊరుకున్నాడు.

 

    భోజనం తర్వాత బాబూజీ ప్రయివేట్ రూంలోకి వెళ్ళారు.... అక్కడ అతిలోక సౌందర్యవతి లాంటి అమ్మాయి పొడుగాటి మద్యం గ్లాసుల్లో షాంపేన్ ఒంపుతోంది. చీరె కట్టుకుని వుంది ఆ అమ్మాయి.... కానీ జాకెట్ వేసుకోలేదు. కనీసం బ్రా కూడా వేసుకోలేదు. పల్చటి పమిట ఆమె ఒంపులని దాచలేక ఓటమిని ఒప్పుకుంటోంది. షాంపేన్ కలిగించే మత్తుకంటే ఎక్కువ మత్తు కనబడుతోంది ఆమె విశాల నయనాలలో.

 

    ప్రొఫెసర్ రామనాధం రియాక్షన్ కోసం ఓరగా చూశాడు బాబూజీ.

 

    రామనాధం ఆ అమ్మాయిని ఎగాదిగా చూసి, "మా అమ్మాయీ సరిగ్గా ఈ ఈడుదే. ఈ సంవత్సరం పెళ్ళిచేసి పంపెయ్యాలి... మీ కూతురికి కూడా దాదాపు ఇదే వయసుంటుందనుకుంటాను" అన్నాడు.

 

    రామనాధానికి అర్థనగ్ననంగా వున్న ఆ అమ్మాయిని చూస్తే శృంగార భావాలు కాక కూతురు గుర్తు రావడం బాబూజీకి చిత్రం కలిగించింది.

 

    మద్యం గ్లాసు ఎత్తి గుటగుట తాగేశాడు రామనాధం. మళ్ళీ గ్లాసు నింపింది ఆ అమ్మాయి? తక్షణం గ్లాసు ఖాళీచేశాడు రామనాధం.

 

    మత్తు తలకెక్కింది అతనికి. బుగ్గలు గాలితో పూరించి, శూన్యం లోకి చూస్తున్నట్లు చూస్తూ చాలాసేపు కూర్చుండిపోయాడు.

 

    అతనికి కోతిపోలికలు చాలా ఉన్నాయనిపించింది బాబూజీకి.

 

    తర్వాత గొనుక్కుంటున్నట్లు అన్నాడు ప్రొఫెసర్ రామనాధం, "నేను కోతిలా ఉంటానంటారు అందరూ. కాదని నేననను కానీ నా కూతురు కూడా నాలాగే అందవికారంగా ఎందుకు పుట్టాలీ? అంత అందవికారంగా వున్నదానిని పెళ్ళెవడు చేసుకుంటాడూ? కూతురు పెరిగి పెద్దదయినా గుండెలమీద కుంపటిలా కూర్చుంది కదా? పోనీ నాక్కూడా ఈ బాబూజీలాగా వెనక పెద్దలప్ప వుంటే ఓ పదిలక్షలు పారేసి కూతురికి మొగుడిని కొందును. జీతం రాళ్ళు కూడబెట్టినా అవి కట్నం బరువుకి తూగడం లేదే: కూతురికి పెళ్ళి చెయ్యలేదని పెళ్ళాం చంపుకు తింటోంది నేనేం చెయ్యను?" అని మరో గ్లాసు అందుకుని గొంతులో పోసేసుకున్నాడు.  

 

    తర్వాత అతను బాధలు మరిచిపోయి రామదాసు కీర్తనలు పాడడం మొదలెట్టాడు.

 

    ప్రొఫెసర్ రామనాధం ఇంటి పరిస్థితి చూచాయిగా అర్థంఅయింది. బాబూజీకి అతని మొహంలో రిలీఫ్ కనబడింది. డబ్బు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని డబ్బుతో కొనెయ్యడం చాలా తేలిక:

 

    గంట తర్వాత మత్తు మెల్లిగా దిగింది రామనాధానికి.... అతను సిగ్గుపడుతూ బాబూజీవైపు చూసి, "క్షమించండి : కష్టాలు మర్చిపోవడానికి అప్పుడప్పుడు ఇలా తాగేస్తూ వుంటాను" అన్నాడు.

 

    సానుభూతిగా పెదిమలు చప్పరించాడు బాబూజీ.

 

    "నేనూ బీదరికంలో పెరిగినవాడినే ప్రొఫెసర్: కానీ కుమిలిపోతూ కూర్చోలేదు నేను. నీ బీదరికాన్ని చూసి సిగ్గుపడకు. నీ బీదరికాన్ని అదేదో ఘనత అయినట్లు కూడా చెప్పుకోకు నీ బీదరికాన్ని సాధ్యమయినంత త్వరలో వదిలించుకో:" అని ఒక నానుడి వుంది. దాన్ని మన స్ఫూర్తిగా నమ్మాను నేను. అహర్నిశలూ శ్రమపడి బీదరికంలోనుంచి బయటపడ్డాను. మీకూ ఆ అవకాశం వుంది ప్రొఫెసర్"   

 

    "అంటే?" అన్నాడు ప్రొఫెసర్.

 

    "ఆ యురేనియం రిపోర్టు మీరు యధాతధంగా రాయకండి.... ఆ ఖనిజంలో అతికొద్ది మోతాదులో రాగి దొరుకుతుందని రాయండి. అలా చేస్తే, మీకు పాతికలక్షల రూపాయలు ఇస్తాను పాతిక లక్షలు ఉంటే ధైర్యంగా మీ అమ్మాయి పెళ్ళి చేసెయ్యవచ్చు. అంతేకాదు మీ కాబోయే అల్లుడికి మన కంపెనీలో మంచి ఉద్యోగం ఇస్తాను. మీకు ప్రమోషన్ ఇస్తాను. మన న్యూయార్క్ బ్రాంచ్ లో మీకు పోస్టింగ్ ఇస్తాను. ఈ చిత్రద్వీప్ లోని దోషులకీ, మలేరియాకీ మీరు దూరంగా వెళ్ళిపోయి నిశ్చింతగా రిసెర్చ్ చేసుకుంటూ కాలం గడిపెయ్యుచ్చు" అన్నాడు.

 Previous Page Next Page