"కాదు డాడీ"
"అయితే మళ్ళీ ఓడిపోయాను. త్వరగా చెప్పు"
"మీరు నన్ను చెప్పనిస్తేగా? అన్నీ మీరే ఊహించి మాట్లాడేస్తున్నారాయె"
"అవును కదూ? అయితే నువ్వు చెప్పు"
"శ్రీధర్"
"శ్రీధరా? వాడెవడు?"
"పో డాడీ! తెలియనట్లు అడుగుతారు"
"శ్రీధరా ఎవరబ్బా! ఆ గుర్తుకు వచ్చింది.
"పొడుగ్గా వుంటాడు. జనవరి 18న నీతో క్లబ్బులో డాన్సు చేశాడూ? అతని పేరు శ్రీధరా? అతను ఎవరి అబ్బాయి అన్నావూ ఏమిటో ఒక్కటీ గుర్తుండదు ఆ కోర్టు విషయాలు తప్ప. అందుకే మీ మమ్మీ నా మతిమరుపునకు నెత్తినోరు కొట్టుకుంటుంది."
"కాదు డాడీ! అతను కాదు."
"మరి ఇంకెవరమ్మా?" కళ్ళజోడు తీసి తుడిచి మళ్ళీ పెట్టుకున్నాడు.
"శ్రీధర్ డాడీ"
"అదే ఎవరని అడుగుతున్నాను."
"పో డాడీ! మరీ మీకు మతిమరుపు ఎక్కువైపోయింది."
"నిజమే! ఏదీ ఎంత ప్రయత్నించినా క్లూ దొరకడం లేదే"
"అదే డాడీ మీ స్నేహితుడి కొడుకు మనింట్లో ఉండటం లేదూ? అంటూ బుర్ర వంచేసుకుంది అమూల్య.
కృష్ణారావు తుళ్ళిపడి అమూల్య ముఖంలోకి అయోమయంగా చూశాడు ఓ క్షణం.
అంతలోనే పకపక నవ్వాడు.
అమూల్య చివ్వున తలెత్తి చూసింది. ముఖం చిన్నబుచ్చుకుంది. అమూల్య ముఖం చూస్తుంటే కృష్ణారావుకి జాలివేసింది.
దగ్గరకు వచ్చి తల నిమురుతూ "పిచ్చి తల్లీ! ప్రేమంటే ఏమనుకుంటున్నావమ్మా?" లవ్ ఎట్ ఫస్ట్ సైట్' అనీ, 'ప్రేమ గుడ్డిది' అనీ పనిలేనివాళ్ళు చెప్పిన మాటల్ని పట్టుకుని "ప్రేమించేస్తున్నాను" అనుకుంటున్నావా. కుర్రాడు కాస్త ఎర్రగా బుర్రగా కనిపించగానే, వయసులో వున్న ఆడపిల్ల మనసులో రేకెత్తే అలజడి ప్రేమ కాదమ్మా, అదోరకమైన ఉన్మాదం, వ్యామోహం! తాత్కాలిక ఆకర్షణ!"
'డాడీ' గాయపడిన లేడిలా తండ్రి ముఖంలోకి చూసింది.
"అవునమ్మా నేను ఇలా అంటున్నందుకు బాధపడకు"
"ఓ డాడీ డోంట్ బి సో క్రూయల్" దాదాపు ఏడుస్తున్నట్టే అన్నది.
కృష్ణారావు కూతురు ముఖంలోకి జాలిగా చూశాడు.
"పూర్ చైల్డ్" నేను నిన్ను బాధపెట్టాలని చెప్పడం లేదు తల్లీ.
"వయసులో ఉన్న ఆడపిల్ల శృతి చేతి పెట్టిన వీణ లాంటిది."
అమూల్య చివ్వున తలెత్తి చూసింది.
అవును తల్లీ! ఏమిటి డాడీ కవిత్వంలో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా? అవి నా మాటలు కాదులే. ఎక్కడో చదివాను. ఆ ఏమన్నాను. వయసులో వున్న ఆడపిల్ల శృతి చేసి పెట్టిన వీణ లాంటిది. ఏ చిన్న తాకిడికైనా పలుకుతుంది. కాని ఆ పలుకులు గానం అవలేదు. అవునా? వ్యామోహం వేరూ, ప్రేమ వేరూ. ఆ కుర్రవాడు మనింటికి వచ్చి వారంరోజులు కాలేదు. అందంగా ఉన్నాడు. ఆ ఆకర్షణలో పడ్డావ్"
ప్రేమించడం ప్రేమించకపోవడం మన చేతిలో వుండదు డాడీ. మోహబ్బత్ హోతీహై ముహబ్బత్ కీ నహి జాతీ"
'స్టాపిట్ పిచ్చి మాటలు మాట్లాడకు'.
అమూల్య కళ్ళలో నీరు తిరిగింది. ముఖం కంద గడ్డలా ఎర్రబడింది.
నన్ను అర్థంచేసుకో తల్లీ, అతనెక్కడా, నువ్వెక్కడా? అతన్ని నువ్వు ప్రేమించడమేమిటి? నువ్వు ఎం.ఏ. చదువుతున్నావ్. అతను బి.ఏ. పాసయ్యాడు..."
"నేను చదువు మానేస్తాను. అప్పుడు ఇద్దరి క్వాలిఫికేషన్ ఒకటే అవుతుందిగా" మధ్యలోనే అందుకుంది అమూల్య.
"అంతేకాదు. అతను ఒక బడిపంతులు కొడుకు. బ్యాంకులో గుమాస్తా ఉద్యోగం కోసం వచ్చాడు. నా రికమెండేషన్ కోసం వచ్చాడు. వాళ్ళ నాన్న నాకు చిన్ననాటి స్నేహితుడు. అందుకే అపాయింట్ మెంట్ ఆర్డరు తీసుకొని ఒకేసారి వెళ్ళమన్నాను. ఇంట్లో ఆశ్రయం యిచ్చాను. వాడు తిన్న యింటి వాసాలు లెక్క పెడ్తాడనుకోలేదు. రాస్కెల్"
"డాడీ అతన్ని ఏమీ అనకు. అతని తప్పేమీ లేదు."
"ఇంకా ఏం తప్పు చెయ్యాలి. వాడికెంత ధైర్యం? నా కూతురితోనే ప్రేమ కలాపాలు సాగిస్తాడా?"
"డాడీ మీరు అనవసరంగా తొందరపడుతున్నారు. శ్రీధర్ కు ఏమీ తెలియదు. నేను ప్రేమిస్తున్నట్టు కూడా తెలియదు. అతను నన్ను చూస్తేనే తప్పించుకు తిరుగుతాడు."
కృష్ణారావుకు కూతుర్ని చూస్తూ, నవ్వాలో ఏడవాలో తెలియక చూస్తూనే ఉండిపోయాడు.
"చూడు తల్లీ! ఇది జీవితం. సినిమా కాదు. మనిషి చూడగానే ప్రేమించడానికి. పిచ్చిపిచ్చి ఆలోచనలు మాని వెళ్ళి పడుకో కాసేపు. కళ్ళు చూడు ఎలా కణకణలాడుతున్నాయో?"
"డాడీ మీకు నేను చెప్పేది వేళాకోళంగా తోస్తున్నట్లుంది. నేను పసిపిల్లను కాదు. ప్రేమ అంటే ఏమిటో తెలియనిదాన్ని అసలే కాదు. నేను శ్రీధర్ ను ప్రేమిస్తున్నాను. శ్రీధర్ ను చూసిన క్షణంలోనే నా మనసు అతనిది అయిపోయింది."
"అతనికి తెలియదన్నావుగా? ఇలాగే మరో రెండు రోజులు ఉండు. అతను వెళ్ళిపోతాడు. అతనితోపాటు అతని ప్రేమ జ్వరం కూడా జారిపోతుంది.
"డాడీ నా ప్రేమను గేలిచేస్తున్నారు" బాధపడుతూ అన్నది.
"నా మనసు అతనికే ఇచ్చాను" మళ్ళీ అన్నది తల వంచుకుని.
"నీ మనసు అతనికి అక్కర్లేకపోతే...?"
"జీవితాంతం అతన్నే తల్చుకుంటూ గడుపుతాను-" ఖచ్చితంగా అన్నది.
కృష్ణారావుకు కోపం వచ్చింది. లాగి చెంపమీద కొట్టాలనిపించింది. తమాయించుకున్నాడు.