'రాదు సార్!'
'అయ్యో పాపం! నీకే గనక క్రికెట్ వచ్చి ఉంటే బ్యాంకు ఉద్యోగం ఇప్పించి ఉండేవాడ్ని కదయ్యా! పోన్లే, హాకీవచ్చా?"
'రాదండీ!'
'అరెరె! హాకీవచ్చి ఉంటే నీకు ఎయిర్ లైన్స్ ఉద్యోగం ఖాయం గదయ్యా! కనీసం ఫుట్ బాల్ అన్నా ఆడతావా?'
విచారంగా బుర్ర ఆడించి, 'లేదుసార్!' అన్నాడు నిరుద్యోగి.
'ఓర్నీ! ఫుట్ బాల వచ్చిఉంటే రైల్వేలో ఉద్యోగం వేయించి ఉండేవాడ్ని. పోన్లే తెలివి ఉందా నీకు?'
'ఉందండీ!' అన్నాడు నిరుద్యోగి, చేటంత మొహం చేసుకుని.
'అయ్యో! అదే లేకపోతే పోలీసు డిపార్ట్ మెంట్ లో చేర్పించి ఉండేవాడ్ని కదయ్యా బాబూ!' అన్నాడుట ఆ పెద్దమనిషి!" అని పెద్దగా నవ్వాడు సందీప్.
అప్పటిదాకా సావధానంగా వింటున్న సబ్ ఇన్ స్పెక్టరు మొహం కందగడ్డలా మారింది. "షటప్!" అన్నాడు కర్కశంగా.
నవ్వు తెరమధ్య అన్నాడు సందీప్. "మీరు అపార్థం చేసుకోకండి సార్! ఈ జోకు నా స్వంతం కాదు. ఒక ఉర్దూ నాటకంలోది."
సబ్ ఇన్ స్పెక్టరు మొహం తీవ్రంగా వుంది.
ఇంకా, ఇంకా రెచ్చగొట్టి తిక్కరేగేలా చేయాలి వీళ్ళకు! అప్పుడు గానీ తన ప్లానుని ఆచరణలో పెట్టలేడు.
ఇందాకటి లేడీ పోలీసు కంగారుగా మళ్ళీ వచ్చింది. మెడకింద తడిమి చూసుకుంటూ "ఇందాక రెండు వుండాలి. ఇప్పుడు ఒక్కటే వుంది!" అంది గాభరాగా. ఆమె మెడలోని రెండు గోల్డు ఛెయిన్స్ లో ఒకటిపోయి ఒకటే మిగిలింది.
తొందరపాటువల్ల ఆమె మాటల్లో ధ్వనించిన ద్వందార్థానికి విరగబడి నవ్వాడు సందీప్. నిజానికి ఆ రెండో గొలుసు కత్తిరించేసింది కూడా అతనే.
అతన్ని దహించేస్తున్నట్టు చూసింది ఆమె. తర్వాత ఒక్కొక్క అక్షరం స్పష్టంగా ఉచ్చరిస్తూ నెమ్మదిగా అంది.
"పోలీసులతో పరాచకాలు నిప్పుతో చెలగాటమని తెలియదు నీకు, యూ విల్ బి సారీ!"
నిశ్చలంగా, నిర్భయంగా చూశాడు సందీప్.
సబ్ ఇన్ స్పెక్టరు, లేడీ పోలీసూ తగ్గు స్థాయిలో చర్చించుకోవడం మొదలెట్టారు.
"వీడికి మాగ్జిమమ్ శిక్షపడాలి! మంచి పకడ్బందీగా కేసు తయారుచేసాను. ఉన్నవీ, లేనివీ అన్నీ మిళాయించి!" అంది ఆమె ఉడుకుబోతు తనంగా.
ఆవేశపడవద్దని ఆమెకు నచ్చజెప్పి, సందీప్ వైపు నడిచాడు ఇన్ స్పెక్టర్. రొటీన్ గా అతన్ని సోదా చెయ్యడం మొదలెట్టాడు.
షర్టు జేబులో సిగరెట్ ప్యాకెట్టు, లైటర్, పాంట్ హిప్ పాకెట్లో చిన్న దువ్వెన, కర్చీఫ్, ఎనిమిది రూపాయల నోట్లు, కొంత చిల్లర, నలిగిన రెండు కాగితాలు.
యధాలాపంగా ఆ కాగితాలు పరికించి చూశాడు ఇన్ స్పెక్టర్. ఏదో ఇంగ్లీషు నవలలోని పేజీలు. వాటిని పక్కన పడెయ్యబోతూ ఉంటే కొన్ని పదాలు అతని దృష్టిని ఆకర్షించాయి. 'నాశనం... ఫ్లయిట్... ప్రేలుడు.'
అలర్టుగా అయిపోయి తీక్షణంగా చూశాడు ఇన్ స్పెక్టర్. ప్రముఖ ఇంగ్లీష్ రచయిత ఆర్థర్ హెయిలీ రాసిన 'ఎయిర్ పోర్ట్, లోని ఆరు పేజీలవి. ఆ నవల అతనుకూడా చదివాడు. సులభంగా దొరికే అయిదు వస్తువులతో దారుణమైన బాంబులాంటిది తయారుచేసే పద్ధతి టూకీగా వివరించి ఉంది అందులో. బాంబుకి కావలసిన భాగాలు - మూడు డైనమైట్ కాట్రిడ్జెస్, వైర్లు అమర్చి వున్న చిన్న బ్లాస్టింగ్ క్యాప్, ట్రాన్సిష్టర్ రేడియో బ్యాటరీ ఒకటి, బట్టలు ఆరేసే కొయ్య క్లిప్పు, ఒక ప్లాస్టిక్ ముక్క, చిన్న దారం, కొద్దిగా అడ్ హెసిల్ టేపూ.
ఇది వీడి జేబులో ఎందుకుంది? బాంబు తయారుచేసే సన్నాహంలో వున్నాడా వీడు? సందీప్ మొహంలోకి సందేహంగా చూశాడు.
ఐదారు రోజులుగా గడ్డం చేసుకోని చెంపలు, నిర్భయంగా చూసే కళ్ళు. తిరుగుబాటుదారుడిలా వున్నాడతను.