Previous Page Next Page 
మనీ బాంబ్ పేజి 2

పెదిమలు దాటని చిరునవ్వు నవ్వింది ఆ అమ్మాయి. ఫ్రెష్ గా సోపూ, టాల్కం పౌడరూ సువాసన వస్తోంది తన దగ్గరనుంచి.
కొంత దూరం పోయాక, "ఇక్కడ దిగుదాం" అంది, వినీ వినపడనట్లు. ఆమె అతనితో మాట్లాడటం అదే మొదటిసారి.
సంతోషంతో విజిలెయ్యాలనిపించింది సందీప్ కి. కష్టం మీద నిగ్రహించుకొని, బెట్టుకొట్టాడు. తన డ్యూటీ అతను చేస్తున్నందుకు పెద్దగా విసుక్కున్నాడు కండక్టర్. కొరకొరా చూస్తూ బస్సు ఆపాడు డ్రైవరు.
ఆ అమ్మాయితో కలిసి కిందికి దిగాడు సందీప్.
ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంది!
కఠినంగా అంది ఆ అమ్మాయి, "కమాన్ మిస్టర్ రోమియో! ఈవ్ టీజింగ్ కి శిక్ష ఏమిటో తెలుసా? తెలియదా? తెలుస్తుంది, రా!"
తన సైగని అందుకుని, ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు సందీప్ ని.
కాలేజ్ స్టూడెంట్ లా కనబడుతున్న ఆ అమ్మాయి నిజానికి లేడీ పోలీసు ఆఫీసరు. బస్ స్టాపులలోనూ, కాలేజీల దగ్గరా ఆడపిల్లలని వేధిస్తూవుండే ఈవ్ టీజర్స్ పని పట్టడానికి గాను, తను కూడా కాలేజి స్టూడెంట్ లాగే డ్రెస్ చేసుకొని తిరుగుతూ ఉంటుంది.
 పోలీసుస్టేషన్ లో డ్యూటీలో ఉన్న సబ్ ఇన్ స్పెక్టరుకి సందీప్ ని అప్పగించి, వెనుదిరిగింది తను.
భుజాలు ఎగరేశాడు సందీప్. 'థాంక్యూ సిస్టర్!ఇదే నేను కోరుకున్నది!' అని నవ్వుకున్నాడు మనసులోనే. ఆమె పోలీసు అని అతనికి ముందే తెలుసు. కావాలనే ఆమె వెంటపడి, టీజ్ చేసి, లాకప్ లోకి వచ్చాడు తను.
దానికి చాలా పెద్ద కారణం ఉంది.
కానిస్టేబులు ఒక కటకటాల తలుపు తెరిచి, సందీప్ ని మోటుగా అందులోకి నెట్టాడు, ఏదో బూతుమాట ఉచ్ఛరిస్తూ.
ఇన్ స్పెక్టర్ మొహం చిట్లించాడు. అతను చాలా మంచివాడు. నేరస్తులని సన్మార్గంలో పెట్టి పరివర్తన తేవాలే తప్ప, వాళ్ళని హింసించి రాటుదేలిపోయేలా చేయకూడదని నమ్మే అరుదైన మనిషి.
లేచి, కటకటాల దగ్గరకి వచ్చాడు అతను. సందీప్ ని పరిశీలనగా చూశాడు.
చాలా హాండ్సమ్ మాన్ సందీప్. ఆరడుగుల మూడంగుళాల పొడుగు. అంత పొడుగు ఉండటం వల్ల ఆ లాకప్ రూం కప్పు అతని తలకి తగులుతోంది. ఇబ్బందిగా వంగి నిల్చుని వున్నాడు.
తలుపులు తెరిచి, సందీప్ ని బయటకు రమ్మని సైగ చేశాడు ఇన్ స్పెక్టరు. తన టేబుల్ కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమని చెప్పి, "ఏం చదువుకున్నావ్ నువ్వు?" అన్నాడు సౌమ్యంగా.
"బి.టెక్. సార్!" అన్నాడు సందీప్ మర్యాద ఒలికిస్తూ.
ఇన్ స్పెక్టరు విచారంగా తల ఊపాడు. "లుక్ హియర్ యాంగ్ మాన్! ఆడపిల్లల వెంటబడి ఏడిపించడం ఉత్త రౌడీ వెధవలు చెయ్యవలసిన పని. నీలాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అలా బిహేవ్ చెయ్యకూడదు. అవునా?"
"సారీ సార్!"
"ఇది మొదటి తప్పుగా భావించి వదిలేస్తాను, నీమీద మళ్ళీ ఇలాంటి కంప్లయింట్ రాకూడదు. యూ కెన్ గో!"
 సందీప్ కి సంతోషం కలగడానికి బదులు ఆందోళన కలిగింది. తనని వదిలిపెట్టేస్తాడా? అలా అయితే తను వేసిన మహత్తరమైన ప్లాను అంతా బూడిదై పోయినట్లేనా?
అతని మెదడు చకచకా ఆలోచించింది. కృతజ్ఞతగా చూశాడు ఇన్ స్పెక్టరు వైపు. "థాంక్స్ సార్! మీలాంటి వాళ్ళవల్లనే పోలీసు డిపార్ట్ మెంట్ బాగుపడుతుంది. పోలీస్ డిపార్ట్ మెంట్ అంటే గుర్తొచ్చింది. ఈ జోక్ విన్నారా సార్?"
"ఏం జోకు? జోకులంటే నాకు ఇష్టం! చెప్పు!" అన్నాడు ఇన్ స్పెక్టరు నవ్వుతూ.
"వెరీ ఫన్నీ సార్! ఒక పెద్దమనిషి దగ్గరకు ఓ నిరుద్యోగి వచ్చి ఏదైనా ఉద్యోగం ఇప్పించమని కాళ్ళావేళ్ళా పడ్డాడుట.
'ఉద్యోగం కావాలా? అయితే నీకు క్రికెట్ వచ్చా?' అని అడిగాడు ఆ పెద్దమనిషి.

 Previous Page Next Page