Previous Page Next Page 
కన్నీటికి వెలువెంత? (కథలు) పేజి 27


    శంకరం ఇంటికి వచ్చేసరికి చీకటి పడ్తూంది. సైకిలు పెట్టి గదిలోకి వెళ్ళేసరికి వళ్ళు తెలియని కోపం వచ్చేసింది. చంటిది ఉచ్చ పోసుకుని హాయిగా చేతులు తపతప కొట్టుకుంటూ మొహం వళ్ళూ తడుపుకుంటూంది. రెండో పిల్ల మూడోపిల్ల లక్క పిడతలకోసం హోరా హోరీ దెబ్బలాడుకుంటూ జుట్టుపీక్కుంటూ కలయపడుతూ ఏడుస్తున్నారు. పెద్దపిల్ల ఇవేం పట్టనట్టు పలకమీద ఏదో రాసుకుంటూంది. ఇల్లంతా కాగితాలు చింపి పోశారు. 'పాపా!' ఒక్క కేక పెట్టాడు శంకరం. పెద్దపిల్ల ఎనిమిదేళ్ళ పిల్ల తండ్రి గర్జనకి ఉలిక్కిపడి బిక్కమొహం వేసుకు చూస్తూండి పోయింది. "నీకేం చెప్పాను, చెల్లిని చూడమన్నానా? అది అలా వుచ్చ పోసుకు తడుపుకుంటూంది. వీళ్ళిలా కొట్టుకుంటున్నారు....ఈ కాగితాలేమిటి, ఈ ఇల్లేమిటి.... ఏం చేస్తున్నావు! దరిద్రపు వెధవల్లారా, పిల్లలా మీరు రాక్షసులు గానీ" అంటూ పెద్దపిల్లని వీపుమీద దబదబ బాదాడు. కొట్టుకుంటున్న ఇద్దరి పిల్లలకి చెరొకటి తగిలించి దూరంగా కుదేశాడు. చంటిపిల్లని ఒంటి రెక్కతో లేవనెత్తి ఎత్తి కుదేశాడు. "దిష్టిబొమ్మలా ఏమిటే చూస్తున్నావు. గుడ్డ పట్టుకొచ్చి తుడు. చెల్లి బట్టలు మార్చు. ఒసేయ్ ఈ కాగితం ముక్కలు ఏరే...." అంటూ అరిచాడు. తండ్రి కోపానికి బిక్కచచ్చిపోయారు పిల్లలు. శంకరం కేకలకి బామ్మగారు యివతలికి వచ్చింది.
    "ఏం నాయనా వచ్చావా! అమ్మాయికెలా వుంది! కాన్పు ఎప్పుడవుతుందంటున్నారు?" శంకరం అలసటగా కుర్చీలో కూర్చుంటూ "తెలీదండి, బహుశా రేపటిలోగా రావచ్చంటూంది డాక్టరు...." అన్నాడు.
    'కాలం రావాలిగదా దేనికన్నా, బాధపడకు బాబూ.... పిల్లలు ఆకలంటూ ఏడుస్తున్నారు.... త్వరగా బియ్యం పడెయ్యి నాయనా.... ఇంత తిని పడుంటారు' అంది బామ్మగారు.
    నీరసంగా లేచి బట్టలు మార్చుకుని లుంగీ కట్టుకుని వంటింట్లోకి వెళ్ళాడు శంకరం. 'ఏమిటో పిచ్చి బ్రాహ్మడు.... మొగపిల్లాడు మొగపిల్లాడు అనుకుంటూ నలుగురు ఆడపిల్లల్ని కన్నాడు. ఈసారన్నా కొడుకు పుడతాడో లేదో.... అమ్మాయి ఆరోగ్యం అలా వుంది....యీ నలుగురిని పెంచేదెలా, పెళ్ళిళ్ళు ఏం చేస్తాడో.... ఏమిటో కొడుకు కొడుకు అనుకోడంతప్ప.... వాళ్ళేం నెత్తికెక్కిస్తారు' బామ్మగారు పచ్చడి రుబ్బుతూ శంకరం గురించి ఆలోచిస్తూ జాలిపడింది.

                                             *    *    *    *

    "ఒరేయ్.... ఎందుకురా నన్నిలా కాల్చుకు తింటావు. పది తే ఇరవై తే అంటే అస్తమాను ఎక్కడ తెచ్చి ఇస్తారా! ఇక్కడ డబ్బు మూటకట్టుక్కూర్చున్నానురా...." బామ్మగారు గొంతు విసుగ్గా, బాధగా వినిపిస్తూంది.
    పిల్లలకి అన్నాలు పెట్టి, తను తింటున్న శంకరం బామ్మగారి మాటలు విని ఆ అంజి మళ్ళీ డబ్బుకి ఆవిడ్ని కాల్చుకు తింటున్నాడులా వుంది పాపం అనుకున్నాడు.
    "నాక్కావాలి. ఇస్తావా లేదా చెప్పు, అడగ్గానే ఎప్పుడు ఇచ్చావులే.... ఎప్పుడడిగినా లేదులేదు అంటూ ఏడుస్తూనే వుంటావు."
    హు....తల్లిని కొడుకు అంటున్న మాటలు! వింటున్న శంకరం వళ్ళు మండుకొచ్చింది. అప్రాచ్యుడు. ఆవిడ కడుపున చెడబుట్టాడు. పాపం ఆవిడెలా భరిస్తూందో! ఏం చేస్తుంది భరించక, కన్నాక! పాపం ఇద్దరాడపిల్లల తర్వాత లేకలేక నలభయ్యో పడిలో పుట్టాడట! అల్లారుముద్దుగా అపురూపంగా పెంచినందుకు ఆవిడకి ఇదీ శిక్ష! మొగుడు పోయిందగ్గిరనించీ ఆ వున్న కాస్త భూమితో, ఇల్లద్దెకిచ్చి ఆ డబ్బుతో సంసారం లాక్కొస్తూ కొడుకుని చదివించుకుంటూంది. ఇద్దరాడపిల్లలకీ తండ్రి వుండగానే పెళ్ళి చేశాడు. వాళ్ళు సుఖంగా కాపురాలు చేసుకుంటున్నారు. ఎటొచ్చీ ఈ ఆంజనేయ వరప్రసాదు, వరప్రసాదంలా పుట్టాడన్న కొడుకు ఈనాడు ఆవిడ నెత్తిన పిండి కొడుతున్నాడు. పాతికేళ్ళొస్తున్నా ఆ బి.ఏ. చదువు ఎప్పటికీ పూర్తిచేయకుండా, అలా ఒక్కొక్క క్లాసులో డింకీలు కొడుతూ యింకా అలా చదువుతూనే వున్నాడు. సినిమాలు, సిగరెట్లు, స్నేహితులు, పేకాట సకల గుణాభిరాముడు! రెండు రోజులకోసారి పదియ్యి పదిహేను ఇయ్యి అంటూ తల్లి ప్రాణాలు కొరుక్కుతింటూ కాల్చుకుతింటాడు. డబ్బిచ్చేవరకూ సాధిస్తాడు. నోటికొచ్చినట్టు మాట్టాడుతాడు. తిడ్తాడు. ఆ పోరు పడలేక వున్నప్పుడు ఆవిడ ఇచ్చేస్తుంది. డబ్బులేనపుడు లేదురా నాయనా అంటూ బ్రతిమిలాడ్తుంది. నచ్చచెబుతుంది. ఏడుస్తుంది. డబ్బీయకపోతే కొడుకు అలిగి అన్నం ముట్టుకోడు, ఇంటికి రాడు అని ఆవిడకి భయం. ఇంట్లోనే వుండి తల్లి ఎదుటే పచ్చి మంచినీళ్ళన్నా ముట్టుకోకుండా ఉపవాసం వుండి ఆవిడ్ని హింస పెడ్తాడు. ఆవిడ చూడలేక, భరించలేక ఆఖరికి ఆ డబ్బు అప్పన్నా చేసి తెచ్చి ఇస్తుంది కొడుక్కి.
    ఇంట్లో ఈ భాగోతం అంతా శంకరానికి క్రొత్త కాదు. అంజి అంటే అతనికి మంట చదువు సంధ్యా లేకుండా జులాయిలా తిరిగే అతన్ని చూస్తే. కన్నతల్లి కాబట్టి ఆవిడ భరిస్తూంది, మరొకరయితేనా అనుకుంటాడు కోపంగా. అలాంటి సమయాలలోనే అతనికి కొడుకు, కొడుకు వంశోద్ధారకుడు కావాలన్న అతని కోరిక గుర్తువస్తుంది. వళ్ళు ఝల్లుమంటుంది. కొడుకు.... ఇలాంటి కొడుకు కోసమా తనింత కలవరిస్తున్నాడు! పోనీ అందరూ అంజి అంత దుర్మార్గులు కాకపోయినా యీ రోజుల్లో ఏ కొడుకులు తల్లి తండ్రులకి చేస్తున్నది ఏముంది? ఎవరిదాకానో ఎందుకు? తను తన తల్లి తండ్రులకి ఏం చెయ్యగలిగాడు? పట్టుమని పది రూపాయలు ఏనాడన్నా పంపగలిగాడా? రోగ మొచ్చినప్పుడైనా నాలుగు రోజులుండి సేవచేయగలిగాడా? ఆఖరికి చచ్చిపోయేముందు ఆయన కలవరించినా ఆఖరి చూపన్నా ఆయనకి అందచేశాడా? అంతే ఈ రోజుల్లో ఎవరికి వారే! ఎవరి సంసారాలు, ఎవరి బరువులు, బాధ్యతలు వాళ్ళవే! కనడం పెంచడం వరకే తప్ప పిల్లలనించి ఏమీ ఆశించే రోజులు పోయాయి! ఆమాత్రం దానికోసం తనెందుకింకా కొడుకు కోసం కలవరించడం! కొడుకు కోసం అనవసరంగా నలుగురు పిల్లలని కని మోయలేని భారం పెంచుకున్నాడు! అలాంటప్పుడు పడే పశ్చాత్తాపం శంకరం అప్పుడే మరిచిపోయేవాడు. ఫలితమే ఐదో కాన్పు భార్యకి.
    "అన్నం తిని వెళ్ళరా నాయనా, నన్నిలా కాల్చుకు తినకురా, అన్నం వండేశాను రెండు ముద్దలు తినిపోరా" ఆవిడ కొడుకుని దీనంగా బ్రతిమిలాడుతూంది.
    "నీ వెధవ భోజనం నాకేం అక్కరలేదు. ముందు నాకు డబ్బిస్తావా లేదా! నేవెళ్ళి టిక్కెట్లు కొనుక్కోవాలి" ఆరోజే విడుదలయిన సినిమాకి రెండో ఆటకి టిక్కెట్లు దొరకవేమోనని అంజి బెంగ. స్నేహితులముందెంత తలవంపు డబ్బు లేదంటే!
    'వరేయ్ నీ యిష్టం. నేనింక నీకు చెప్పలేను నాయనా, తింటే తిను లేకపోతే పో....నా దగ్గిర డబ్బు మాత్రం లేదు. నే నీయను....' ఆవిడ దృఢంగానే అంది.
    'డబ్బు లేదూ.... వెధవ అబద్ధాలు నీవూనూ.... మధ్యాహ్నం రైతు డబ్బు తీసికొచ్చి యీయడం నే చూడలేదనుకున్నావా?'
    'నీకంట పడిందీ ఆ డబ్బు.... అవునురా ఇచ్చాడు.... ఆ డబ్బు రెండు రోజులలో ఆర్పేస్తే తర్వాత నోట్లోకి వేళ్లెలా పోతాయిరా! ఆడముండని నేనెక్కడ్నించి తెచ్చి నిన్ను పోషిస్తానురా! పాతికేళ్ళొచ్చాయి, ఆ చదువు పూర్తిచేసి కన్నతల్లిని సుఖపెడదామన్న ఆలోచన లేకపోగా, డబ్బుకి నన్నిలా కొట్టుకు తింటున్నావు. ఆ మహారాజు నన్నీ చావు చావమని ఆయనదారి ఆయన చూసుకున్నారు. నీవు నన్నిలా కాల్చుకు తింటున్నావు. ఎప్పుడొస్తుందో నాకు చావు" ఆవిడ ఏడుస్తూంది. 

 Previous Page Next Page