Previous Page Next Page 
కన్నీటికి వెలువెంత? (కథలు) పేజి 26


                                            చేతులు కాలాయి

    మామ్మగారూ, తలుపు దగ్గర నించుని పిల్చాడు శంకరం.
    "ఏం, నాయనా" ముసుగు సవరించుకుంటూ వచ్చింది సుందరమ్మగారు.
    "ఆస్పత్రికి వెళ్ళొస్తాను. కాస్త పిల్లలని చూస్తారు గదూ. ఆడుకుంటున్నారు లెండి" అన్నాడు శంకరం.
    "అలాగే, వెళ్ళిరా నాయనా, కాఫీ తీసుకెడుతున్నావా, వెళ్ళిరా చూస్తాలే" అంది ఆవిడ.
    శంకరం వరండాలోంచి సైకిలు తీసుకుని బయలుదేరాడు. ఆఫీసునించి ఆదరా బాదరా వచ్చి కాఫీ చేసుకుని త్రాగి, పిల్లలకింత పోసి, ఎడ పిల్లకి పాలుపట్టి అందరికి మొహాలు కడిగి తనూ కడుక్కుని పెళ్ళానికి కాఫీ ఫ్లాస్కులో పోసుకుని ఆస్పత్రికి బయలుదేరాడు. అక్కడ భార్యను చూసి మళ్ళీ ఇంటికి వచ్చి వండాలి. పిల్లలను పడుకోబెట్టాలి. మళ్ళీ ప్రొద్దునే కాఫీలు, వంట, ఆఫీసు.... తను చేయాల్సిన పనులన్నీ దెయ్యాల్లా ఎదుటనిలబడి భయపెడ్తోంటే శంకరంకి అలసట నీరసం ముంచుకు వచ్చింది. అప్పుడే రెండు రోజులయింది ఆస్పత్రిలో చేర్చి. ఇంకా కాన్పు అవలేదు. అయ్యాక ఇంకోవారం! చేయాల్సిన చాకిరీ కంటే నల్గురి పిల్లలని, అందులో రెండేళ్ళ పిల్లని సంబాళించుకుంటూ వచ్చేసరికి శంకరం ఆ పది రోజులలో సగం అయిపోయాడు. ఏదో వెధవది మొగపిల్లాడు కావాలన్న ఆశ, కోరిక పీడిస్తూంటే ప్రలోభపడ్డాడు!.... ఫలితం నలుగురు ఆడపిల్లలు! పెళ్ళయిన తొమ్మిదేళ్ళలో ఇది ఐదో కాన్పు! మూడో కాన్పు నించి భార్య ఆరోగ్యం దిగజారింది. నాలుగో కాన్పుకే డాక్టరు చివాట్లు పెట్టింది. వంశోద్ధారకుడి కోసం ఆ చివాట్లని లక్ష్యపెట్టలేదు. ఐదోసారి నీవు మనిషివా, పశువ్వా అన్నట్లు చూసింది డాక్టరమ్మ. నలుగురి పిల్లలతో చాలీచాలని జీతంతో రెండు పురుళ్ళకి భార్య ఆస్పత్రిలో పడుంటే తను యింట్లో పడిన నరకం అన్నీ గుర్తుకొచ్చి అవునుసుమా, పొరపాటు చేశాను అన్న పశ్చాత్తాపంతో పాటు యీసారీ ఆడపిల్ల పుడితే ఏం చేసేట్టు అన్న భయం ఆరంభించాయి శంకరంలో. చేతులు కాలాయి కనక ఈసారి యింక ఆకులు పట్టుకుని లాభం లేదని యింక చాలు బుద్ధి వచ్చింది అని చెంపలేసుకున్నాడు శంకరం. నీలాంటి వాళ్ళకి చెప్పి లాభంలేదు. యీసారి ఆవిడకే ఆపరేషన్ చేసేస్తానని డాక్టరు తిరస్కారంగా అంటే తలవంచుకుని తలాడించాడు. దేముడు దయ ఎలా వుందో యీసారి!.... మగపిల్లాడి మాట దేముడెరుగు సీత బొత్తిగా వంట్లో ప్రాణం లేకుండా వుంది. ఈ గండం గడిచి బయటపడితే చాలు.... అనుకున్నాడు శంకరం.
    ఆస్పత్రి వరండాలనిండా జనం! విజిటింగ్ టైముకనక రోగుల బంధువులతో, ఆప్తులతో, మిత్రులతో వార్డులన్నీ నిండిపోయాయి.
    తెల్లటి ప్రక్కమీద అంతకంటే తెల్లగా పాలిపోయిన సీత మంచం దగ్గరికి వచ్చాడు శంకరం. భర్తని చూసి నీరసంగా నవ్వింది సీత. "ఎలా వుంది సీతా, డాక్టరేమంది?" అన్నాడు ఆరాటంగా శంకరం.
    "అలాగే వుంది, ఇంజక్షనిచ్చారు.... అయితే ఈ రాత్రికి కాన్పు అవచ్చంటున్నారు.
    "నెప్పులు అలాగే వున్నాయా?" శంకరం ప్రక్కమీద కూర్చుని, కాఫీ గ్లాసులోకి పోసి అందించాడు. "నిన్న రాత్రి కొద్దిగా ఓ రెండుగంటలు వచ్చి ఆగిపోయాయి. మళ్ళీ రాలేదు. ఏమిటో యీ నరకం ఎన్నాళ్లు అనుభవించాలో ఏమిటో" సీత నిరాశ నిస్పృహ బాధలతో అంది.
    'డాక్టరు ఏమీ అనడం లేదూ?'
    "ఏం అంటుంది. చూస్తున్నారు, నెప్పులు రావాలిగా, సమయం వచ్చేవరకు వాళ్ళుమాత్రం ఏం చేస్తారు. అవసరమయితే ఏ ఆపరేషన్ వాళ్ళే చేస్తారు."
    'ఊ....బాగుంది. ఈసారి ఎందుకిలా అయిందో'
    "ఖర్మ! ఖర్మమాట ఎలా వున్నా 'చేతులారా చేసుకున్నారు. తొమ్మిదేళ్ళలో ఐదు కాన్పులా! పోనీ మందులన్నా వేసుకోరు చెప్పినట్లు, వంట్లో రక్తం లేదు. బలం లేదు యిలా తయారవుతారు మా పీకల మీదకి. మేం ఏం చేయగలం' అంటూ మాటకి ముందు సాధిస్తుంది డాక్టరు. తలేత్తుకోలేకపోతున్నాను" అంది సీత. శంకరం తలొంచుకున్నాడు!
    'సర్లెండి, ఇప్పుడేమనుకుని ఏం లాభం? పిల్లలేమంటున్నారు, అల్లరి చేస్తున్నారా, మిమ్మల్ని ఏడిపిస్తున్నారా'
    "ఏడిపించడమా, వెధవలు నా ప్రాణాలు తోడేస్తున్నారనుకో, చస్తున్నాను వాళ్ళతో, అందులో ఆ చంటిదాన్ని పట్టుకోడం నా వశం కావడం లేదు. నిన్న రాత్రంతా పడుకోనేలేదు. లేచినప్పుడల్లా అమ్మా అంటూ యేడ్పు, సముదాయించేసరికి నా ప్రాణం పోతుంది. ప్రతిసారి ఐదోరోజు యింటికి వచ్చేదానివి. కనీసం పిల్లలని చూసుకునేదానివి. ఈసారి అప్పుడే రెండు రోజులైంది. కాన్పు అవ్వాలి, ఆపరేషన్ ఇవన్నీ అయి నీవు యింటికి వచ్చేసరికి నా చావు మూడుతుంది" చిరాగ్గా అన్నాడు శంకరం. సీత నిట్టూర్చింది. 'చంటిపిల్లలు, జ్ఞానం తెలుసా ఏమన్నానా వాళ్ళకి. ఎలాగో పదిరోజులు యీసారికి బాధపడాలి, మరేం చేస్తాం. మన ఖర్మ కాకపోతే ఇటుఅటు కూడా ఆదుకునేవాళ్ళు లేకుండా అయ్యారు మనకి' అంది.
    నిజమే, శంకరం తల్లి దండ్రులు లేరు. అక్కగార్లున్నారు. వాళ్ళనెవరినన్నా పిలిస్తే, వాళ్ళు అరడజను మంది పిల్లలతో వస్తే పోషించే స్తోమతలేని శంకరం ఆ అనుభవం ఒకసారి అయ్యాక అంతకంటే చాకిరీ చేసుకోడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చాడు. సీత తల్లి వుందిగాని ఆవిడ రోగిష్టిది. ఆవిడకే అందరూ చెయ్యాలి. రెండు పురుల్లకి పుట్టింటివారు తీసుకెళ్ళారు. తల్లి మంచాన పడ్డాక పుట్టింటి ఆశ పోయింది సీతకి.
    డాక్టరు దూరంగా రావడం చూసి శంకరం లేచి నిల్చున్నాడు. అతనికి డాక్టరుని చూస్తే భయం, ఎక్కడ దులుపుతుందోనని, నమస్కారం చేశాడు. ఆవిడ ఓ చూపు శంకరం వైపు విసిరి 'ఎలా వుంది.... నెప్పులేమన్నా వస్తున్నాయా....' అంటూ సీతని అడుగుతూ, పొట్ట నొక్కింది.... 'లేదండీ' అంది సీత, ఆవిడ నర్సుతో ఏమిటో చెప్పింది.
    'చూద్దాం....రేపటిలోగా రావచ్చు.' అంటూ ఆవిడ కదిలి ముందుకు వెళ్ళింది.
    "ఇంటికెళ్ళండి....పిల్లలు ఏడుస్తున్నారో ఏమిటో....వంట అది చెయ్యాలి గాబోలు యింకా.... నాకేం పరవాలేదులెండి.... బామ్మగారు కూర అది చేసి ఇస్తున్నారా...." సీత అడిగింది.
    'ఊ.... ఆవిడ వుండబట్టి యీపాటి అన్నా ఈడ్చుకు వస్తున్నాను. పాపం రెండు పూటలా కూరో పచ్చడో ఏదో ఇస్తూంది చేసి. పిల్లలని చూస్తూంది. ఆవిడ రుణం తీర్చుకోలేం మనం అన్నాడు శంకరం.
    నిజమే! ప్రక్కవాటాలోని బామ్మగారు పెద్దదిక్కులా సీత వాళ్ళని కష్టంలో సుఖంలో ఆదుకుంటూంది. పురుటికి సీత ఆస్పత్రిలో వున్నన్ని రోజులూ పిల్లల్ని శంకరం ఆఫీసుకి వెళ్ళినప్పుడు చూస్తూంది. శంకరం అత్తెసరు పడేసుకుంటే ఏ కూరో పచ్చదో చేసి యిస్తుంది. సీతకి పథ్యం వంట వండి పెడుతుంది. ఆ పది రోజులూ, స్నానం చేసిందగ్గరిచించి సీతే పనిమనిషి సాయంతో కుంపటిదగ్గిర కూర్చుని వండుకునేది.

 Previous Page Next Page