Previous Page Next Page 
కన్నీటికి వెలువెంత? (కథలు) పేజి 28


    "ఛా నీవు కాదు నేను చావాలి. వెధవ బ్రతుకు ఒక్క సినిమాకు వెళ్ళడానికి యింత రాద్ధాంతం ఎప్పుడూ యింట్లో...'
    'సినిమాకి కావాలంటే రూపాయో రెండోగాని పదిహేను, ఇరవై ఎందుకురా!' పాపం బామ్మగారు అర్ధరూపాయి టిక్కెట్టుకి వెళ్ళినట్టు బి.ఏ. చదువుకుంటున్న కొడుకు వెళ్ళడని, పక్కింటి సుబ్బమ్మగారితో వెళ్ళినా ఎవరి టిక్కెట్టు డబ్బులు వాళ్ళు పెట్టుకోడం, నలుగురూ కలిసి వెళ్ళినప్పుడు ఎటికేట్ కాదని పాపం బామ్మగారికేం తెల్సు! నలుగురు ఫ్రెండ్సు వెళ్ళాలి! టిక్కెట్లు దొరక్కపోతే బ్లాకులోనన్నా కొనుక్కోవాలి. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, పాన్, సిగరెట్ల చిల్లర ఖర్చులు వుంటాయని ఎంతకని చెప్తాడు అంజి. అంతేకాక రెండో ఆటకి వెళ్ళేలోపల వీలయితే ఓ నాలుగు రౌండ్లు రమ్మి ఆడుకోడానికి డబ్బుండాలి అని అన్ని ఖర్చులు ముసలావిడకి చెప్పడం చిరాకు గదా అంజిలాంటి వాళ్ళకి!
    'ఇంద' రెండు రూపాయలు తీసుకో, సినిమాకు వెడుదూవులే ముందు అన్నం తిను___
    "నీ బోడి రెండు రూపాయలు నీవే వుంచుకో.... డబ్బు ఎలా తీసుకోవాలో నాకూ తెల్సులే....' అంజి దూకుడుగా అన్నాడు.
    "ఒరేయ్.... ఒరేయ్.... అన్నం...." ఆవిడ అరుస్తూంది కొడుకు అన్నం తినకుండా వెళ్ళిపోతున్నాడని.
    'హ....' నిట్టూర్చాడు శంకరం.
    'ఏం పాపం చేసుకుని కన్నానురా నాయనా నిన్ను.... పూజలు చేసి చేసి నిన్ను కన్నాను' బామ్మగారు ఏడుస్తూ గొణుక్కోవడం విన్పించింది శంకరంకి. కొడుకు అన్నం తినలేదని ఆ పూట ఆవిడా తినకుండా పడుకుంటుందని శంకరంకి తెల్సు.
    అర్థరాత్రి నుంచి నిద్రలో వున్న శంకరంకి బామ్మగారు వెర్రి కేకలు పెట్టడం విని మెళుకువ వచ్చింది 'దొంగ.... దొంగ....' ఆవిడ కేకలు విని గాభరాగా శంకరం తలుపులు తీసుకుని బయటికి వచ్చాడు. వస్తూంటే వరండాలోంచి చీకట్లో డాష్ ఇచ్చిన మనిషిని గట్టిగా వాటేసుకున్నాడు శంకరం. శంకరాన్ని విదిలించుకుని, గింజుకుని విసురుగా పారిపోతున్న మనిషి అంజి అని ఆ చీకట్లో కూడా గుర్తుపట్టగలిగాడు శంకరం. 'అంజీ!' అన్నాడాశ్చర్యంగా శంకరం, చేయి వదులు చేసి. ఆ అదునులో అంజి పారిపోయాడు. గబగబ లోపలికెళ్ళాడు. శంకరం లైటు వేసి చూసేసరికి బామ్మగారు బోర్లా నేలమీద పడివుంది.... 'బామ్మగారు' అంటూ శంకరం ఆత్రుతగా ఆవిడ దగ్గిరకెళ్ళాడు. ఆవిడ తెలివి తప్పి పడివుంది. నీళ్ళు తెచ్చి చల్లాక ఆవిడ కళ్ళువిప్పి, 'దొంగ దొంగ' వగరుస్తూ నోటమాట రానట్టు గజగజ లాడింది. శంకరంకి తెరిచిన పెట్టె అందులోంచి లాగి అడ్డదిడ్డంగా పడున్న బట్టలు కనిపించాయి. 'దొంగ పారిపోయాడా నాయనా ఆ పెట్టి చూడు బాబూ, డబ్బు పట్టుకు పోయాడో ఏమిటో' ఏడుపు గొంతుతో అందావిడ. ఆవిడ నుదుట పెద్ద బొప్పి కట్టింది. మోకాలు మోచేయి గీసుకుని నెత్తురు వస్తూంది. శంకరం ఆవిడని లేపి మంచంమీద కూర్చోపెట్టాడు. ఆవిడ కుంటుతూ లేచింది. శంకరం ఆరాటంగా పెట్టె చూశాడు. "డబ్బు లేదు బామ్మగారు."
    "అయ్యయ్యో ఐదొందలు మధ్యాహ్నమే పెట్టాను నాయనా! దిక్కుమాలినవాడు ఆ అంజిగాడు అలిగిపోయాడు ఇంట్లోంచి. ఎప్పుడొస్తాడో ఏమిటోనని తలుపులు చేరేసి అలా నడుం వాల్చాను. వీధి తలుపు వేసేసుందిగదా లోపలికెవరొస్తారనుకున్నాను. అలా ఎప్పుడు నిద్ర పట్టేసిందో పెట్టె చప్పుడయితే మెలుకువ వచ్చి కళ్ళువిప్పి చూద్దును, ఎవడో పెట్టె తీస్తున్నాడు. గబుక్కున కేకపెట్టి లేచేసరికి మాయదారి వెధవ ఒక్క తోపు తోశాడు. మంచం తగిలి బోర్లా పడ్డాను. నుదురు కొట్టుకుని కళ్ళు చీకటి కమ్మింది. అయ్యొయ్యో ఐదువందల రూపాయలు! నేనేం చెయ్యను! అయ్యో మరో నాలుగైదు నెలలు ఏం పెట్టుక తింటాం! వీడమ్మ కడుపు మాడా!....' బామ్మగారు ఏడుస్తూ తిడ్తూంది.
    'వెర్రినాయన అడిగితే పది రూపాయలు ఇచ్చాను గాదు. యీ దొంగసచ్చినాడి మొహాన కొట్టాను డబ్బంతా.'
    ఆవిడ అమాయకత్వానికి జాలిపడ్తూ, పోయిన డబ్బు ఎలాగో పోయింది, ఆవిడ మనశ్శాంతిని కూడా పోగొట్టడం ఎందుకని తనకు తెల్సిన నిజం చెప్పలేకపోయాడు శంకరం.
    'ప్చ్ ఏంచేస్తాం యీ రోజు మంచిదికాదు బామ్మగారు! అయినా మీరు డబ్బు అలా పెట్టెలో అందరికీ తెలిసేచోటున యిక ముందన్నా పెట్టకండి. ఏ వంటింట్లో అరమార్లలో ఎవరికీ తెలియని చోటున పెడ్తుండండి' అన్నాడు శంకరం అంజిని దృష్టిలో వుంచుకుని. ఆవిడ ముక్కు చీదుకుంది. తరువాత చాలాసేపు నిద్రపట్టలేదు శంకరానికి వచ్చి పడుకున్నాక___

                                                                                *    *    *    *

    ఉదయం లేచేసరికి బారెడు ప్రొద్దెక్కింది. ఆలస్యమై పోయిందని ఆదరా బాదరా పనులు చేసి వంటచేసి భార్యకి క్యారేజి పట్టుకుని ఆస్పత్రికి బయలుదేరాడు శంకరం. అట్నించి వచ్చి పిల్లలకి పెట్టి తను తిని ఆఫీసుకెళ్ళాలి. సీతకి ఎలా వుందో! పురుడు వచ్చిందేమో! ఏదన్నా చికాకయితే ఫోను చెయ్యమని రెండిళ్ళ అవతల వున్న ప్లీడరుగారి ఫోను నంబరిచ్చాడు శంకరం ఆస్పత్రిలో నర్సుకి. ఫోను ఏం రాలేదు. పాపం ఒకర్తీ ఎలావుందో!
    ఆస్పత్రి కెళ్ళేసరికి సీత పడుకున్న తెల్లారి ప్రక్క ఖాళీగా వుంది. ఒక్క క్షణం శంకరం గుండె ఆగిపోయింది. కాళ్ళలోంచి వణుకు పుట్టింది, సీత!.... సీతేమయింది?
    'ఏమండి, యీ బెడ్డుమీద ఆవిడ....' మాట పూర్తి చెయ్యలేకపోయాడు శంకరం చెమటలు పట్టాయి.
    "తెలీదండీ!" అంది ఆవిడ 'నేను ఇందాకనే జాయిన్ అయ్యాను' అంది మళ్ళీ. రెండు మంచాల తర్వాత వున్న ఆవిడ శంకరం గాభరా చూచి 'ఆవిడ్ని రాత్రి రెండు గంటలప్పుడు లేబర్ రూముకి తీసికెళ్ళారండీ, కాన్పు అయినట్టులేదు, ఆపరేషన్ అంటూ హడావిడి పడుతున్నారట నర్సు అంది. ఇందాక పాపం రాత్రి పదిగంటల నించి చాలా బాధపడ్తున్నారు....'
    సీత ఇంకా బ్రతికే వున్నదన్న కబురుకి శంకరంకి మళ్ళీ కాళ్ళు చేతులు ఆడడం మొదలుపెట్టాయి, తన పిచ్చి కాకపోతే ఏం జరిగినా తనకి తెలియకుండా ఏంచేసెయ్యరు గదా మనిషిని!
    సీత!.... సీతకెలావుందో! ఎవర్నడగడం! మంచాలన్నీ దాటుకుని డ్యూటీ రూము దగ్గిర కెళ్ళాడు. అక్కడెవరూ లేరు. వరండా చివర్నించి ఓ నర్సు నడుచుకుంటూ వస్తూంది. ఆరాటంగా ముందుకెళ్ళి 'పదకొండో' నంబరు పేషంటుకి ఎలా వుందండీ!' ఎవడీ వింత మృగం అన్నట్టు ఓ చూపు విసిరి 'నాకు తెలీదు' అంటూ విసురుగా వెళ్ళిపోయింది. తనకు తెల్సిన నర్సు మొఖాలు ఎక్కడన్నా కనిపిస్తాయేమోనని ఆశగా ఆరాటంగా చూశాడు. మరో నర్సు వస్తూంటే "ప్లీజ్.... ఏమండీ, ఇక్కడ పదకొండో నంబర్ బెడ్ పేషంటు కెలా వుందో చెప్పగలరా? కాన్పు అయిందా? ఆపరేషన్ చేస్తున్నారా?" ఆ నర్సు ఓ క్షణం ఆగి, "నాకు తెలీదండీ, నాదీ వార్డు కాదు ఇంకెవరినన్నా అడగండి' అంది.

 Previous Page Next Page