Previous Page Next Page 
కన్నీటికి వెలువెంత? (కథలు) పేజి 25

   
    అంతా విన్నాక వీరిగాడ్ని మనసులో మెచ్చుకోకుండా వుండలేకపోయాడు వెంకట్రావు. ఇంత చిన్న వయసులో ఎంత బరువు భుజాన వేసుకున్నాడు!
    ముంజేతి షర్టుతో కళ్ళుతుడుచుకుంటూ ధీనంగా బాల్చీ పట్టుకుని వెడుతున్న వీరిగాడ్ని చూస్తే జాలనిపించింది.
    "అదిగో మీ బస్సు వచ్చింది బాబూ, బేగెల్లండి!" ఎవరో అన్నారు. వెంకట్రావు ఆలోచనలోంచి లేచి పరిగెట్టాడు.

                                             *    *    *    *

    చాలా రోజుల తర్వాత....
    అదే బస్ స్టాండులో.... అదే చివర, అదే ఎండ, అదే ఉక్క, చెమట, గలీజు మధ్య బస్సు కోసం యధాప్రకారం ఎదురుచూస్తున్నాడు వెంకట్రావు.
    "ఛా.... యీ వెధవ ప్రయాణం చేయడం తనవల్లగాదింక! ఆ పొలం కాస్తా ఏదో ధరకి ఈసారి అమ్మి పారేయాలి! ఈ బస్సులలో ఈ ప్రయాణాలు ఇంకా తనవల్ల గాదు...." నాలుగోసారి గట్టిగా నిర్ణయించుకున్నాడు.... ఏదో తిండి గింజలొచ్చే పొలం అమ్ముకోడం ఎందుకు అని ఆలోచించాడు ఇన్నాళ్ళు.... కానీ విసుగెత్తి పోతూంది. ఏడాదికి నాలుగుసార్లన్నా వెళ్ళిరావడం! విసుక్కున్నాడు మనసులోనే. కాస్త నీడ జాగాలో నిలబడి రుమాలుతో విసురుకుంటూ ఆపసోపాలు పడుతున్నాడు.    
    "బాబూ.... బాబుగారు.... డ్రైవరు బాబూ...." ఓ స్త్రీ ఎవర్నో పిలుస్తూంది.
    "ఏటి ముత్యాలమ్మా?" ఆ డ్రైవరు ఆమెకేసి తిరిగాడు.
    "మా ఈరిగాడు రావడానికి ఇంకెన్నాల్లవుతుంది బాబూ?...." ఆమె మొహంలో ఆరాటంతోపాటు దైన్యంకూడా తొంగిచూస్తూంది.
    "ఆ డ్రైవరు తలెత్తి వేళ్ళతో లెక్కలుకట్టాడు." ఇప్పుడెక్కడ, ఇంకా నాలుగు నెలలవ్వుద్ది.... ఏం, ఏంటి కావాలి?"
    "ఏం నేదు బాబూ.... ఇల్లు జరగడం కష్టంగా వుంది. ఆడెప్పుడొస్తాడా అని రోజులు లెక్కెంటుగుంటూ యీడ్చుకొస్తున్నాను బాబూ...." అదోలా నిస్పృహగా అంది.
    వీరిగాడు!.... చటుక్కున ఆ పేరు యీ బస్ స్టాండ్ లోనే విన్న గుర్తు వచ్చింది వెంకట్రావుకి.... వీరిగాడు!.... వాడి తల్లా యీమె? వీరిగాడు ఏమయ్యాడు? ఎక్కడికి కెళ్లాడు?
    వీరిగాడు గురించి తెలుసుకోవాలన్న ఆరాటాన్ని అదుపులో పెట్టుకోలేక ప్రక్క టీ హోటల్లో దూరాడు వెంకట్రావు.
    "ఆడా బాబూ.... జైలు కెళ్ళి కూర్చున్నాడు...." వెంకట్రావు అడిగిన ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పాడు.
    వెంకట్రావు ఆశ్చర్యపోయాడు. "జైలుకా.... ఎందుకు? ఏంచేశాడు....?"
    "ఆడి బాబుని సంపేసాడు బాబూ, ఏణ్ణర్ధం అయింది. పోలీసోళ్ళు ఆడ్ని అదేదో పిల్లలకి వేరే జైలుంటది కదా బాబూ! అక్కడికి పంపారు"_
    ఏ దొంగ తనమో చేసి వుంటాడనుకున్న వెంకట్రావు ఆమాటకి నిర్ఘాంతపోయాడు "ఎందుకు చంపాడు? ఎలా చంపాడు?" ఆత్రుతగా అడిగాడు.
    హోటలు వాడు వివరంగా చెప్పుకొచ్చాడు.
    ఓ రోజు వీరిగాడు వాళ్ళమ్మ కూర్చుని మధ్యాహ్నం తిండి తింటున్నారు. నర్సిగాడు ఆ రోజు రోజుకంటే ఫుల్ గా త్రాగి తూలుకుంటూ ఇంటికొచ్చాడు. త్రాగి, మూడుముక్కలాటలో చిత్తుగా ఓడిపోయాడు. పెళ్ళాం దగ్గిర కానీ, కొడుకు దగ్గిర కానీ డబ్బుంటే గుంజుకొని మళ్ళీ ఆడాలని యింటికి వచ్చాడు. రాగానే ముందు పెళ్లాన్ని అడిగాడు. అది లేదని కోపంగా జవాబిచ్చింది. కొడుకుని అడిగాడు. వీరిగాడూ లేదన్నాడు. అసలే కైపులో వున్న నర్సిగాడికి వాళ్ళిద్దరి జవాబు, ఆ నిర్లక్ష్యమూ కోపం తెప్పించి వుంటుంది. వాళ్లు తింటున్న మూడుకు కాలితో తన్ని ఎగరగొట్టాడు.... నోటికొచ్చినట్టు బండ బూతులు తిడ్తూ వీరిగాడ్ని జుట్టు పట్టుకు లేవదీసి.... "డబ్బులు తేరా నంజకొడకా, డబ్బు లట్టుకురా లేకపోతే సంపేస్తాను...." అంటూ వీరిగాడు జుట్టు పట్టుకుని గుంజి గుంజి వదిలాడు. అసలే ఎర్రగా వున్న నర్సింలు కళ్ళు మరింత ఎర్రబారాయి. ఆ మొహంలో క్రౌర్యం, ఆ కళ్ళలో ఎరుపుచూసి వీరిగాడు బెదిరి "నా కాడ డబ్బులు లేవు...." అంటూ ఏడవడం మొదలెట్టాడు.
    "లేవూ.... ఎందుకు లేవురా యదవా.... ఎప్పుడూ లేవంటావు. నిజం ఎప్పుడు సెప్పావు.... తేరా.... తీయరా...." అంటూ మళ్ళీ గుంజాడు. వీరిగాడు లేవంటున్న కొద్ది వాడికోపం మరింత ఎక్కువయింది. కోపం పట్టలేక వీరిగాడి వీపు వంచి ధభీమని గుద్దులు గుద్దాడు. కాలితో తన్నాడు. వీరిగాడి తల్లి చూస్తూ వూరుకోలేక మొగుడితో వచ్చి కలియబడింది. "నంజకొడకా నీకేం బోయేకాలంరా! ఆడ్ని అలా కొడతన్నావు.... నీ చేతులు విరగా,.... డబ్బు తే తే అంటే ఆ గుంటెదవ ఎక్కడనించి తెస్తాడు.... వదులు ముందాడిని...." అంటూ ఆడపులిలా కలియపడి వీరిగాడ్ని వదిలించ బోయింది. కైపులో వున్న నర్సిగాడికి కోపంతో వళ్ళు తెలియలేదు.... "పోవే ముండా" అంటూ దాని డొక్కలో బలంగా ఓ తన్ను తన్నాడు.
    ఆ దెబ్బకి ఎనిమిది నెలల గర్భంతో వున్న వీరిగాడి తల్లి ఓ వెర్రికేక పెట్టి కూలిపోయింది మాట పలుకు లేకుండా.... తండ్రి చేతుల్లోంచి తప్పించుకున్న వీరిగాడు తల్లి మాట పలుకు లేకుండా పడిపోవడం చూసి చచ్చిపోయిందనే అనుకున్నాడు. ఆ సమయంలో వాడికేం అయిందో తెలియదు. వెర్రి ఆవేశంతో ఊగిపోయాడు. ప్రక్కనున్న కర్రలు కొట్టుకునే గొడ్డలి తీసి ఓ రెండు దెబ్బలు నర్సిగాడి నడుంమీద కొట్టాడు.... "మా అమ్మని చంపేస్తావురా యదవా" అంటూ అలా నేలకూలిన నర్సింలు జరిగేదేమిటో తెలుసుకునే లోపలే దెబ్బల మీద దెబ్బలు కొట్టాడు. వీరిగాడు వీరావేశంతో అందిన చోటల్లా గొడ్డలితో కుళ్ళ బొడిచాడు. నర్సిగాడు, మొదటి రెండు మూడు దెబ్బలకే చచ్చాడు. బుర్ర చితికిపోయింది. చేతులు, కాళ్ళు తెగిపడ్డాయి, రక్తం వరదలయింది. యీ గలభాకి ఇరుగుపొరుగు చేరి వీరిగాడ్ని పట్టుకుని వాడి చేతిలో గొడ్డలి లాక్కునే వరకు అలా కొడుతూనే వున్నాడు వాడు.
    తరువాత జరగాల్సిన భాగోతం అంతా జరిగింది. పోలీసులొచ్చారు వీరిగాడి తల్లిని ఆస్పత్రికి పంపారు. వీరిగాడ్ని అరెస్టు చేశారు. వీరిగాడి తల్లికి ఆపరేషన్ చేసి చచ్చిన పిల్లని తీశారు. అదో నెలరోజులుండి బ్రతికి బయటపడి యింటికి వచ్చింది. వీరిగాడు ఆత్మరక్షణకి, తల్లిని రక్షించడానికి వళ్ళు తెలియని ఆవేశంలో కోపంలో చేశాడని కోర్టు తీర్మానించి రెండేళ్ళ శిక్షతో సరిపెట్టారు. వాడ్ని బాల నేరస్థుల జైలుకి పంపారు.
    "యీరిగాడు జైలు కెళ్ళి కూచోడం, ఆడి తల్లికి రోగం రావడం, పిల్లల్ని పెంచలేక ఆడకూతురు నానా గడ్డి కరుస్తూంది బాబూ. యీరిగాడు ఎప్పుడొస్తాడా తన కష్టాలెప్పుడు గట్టెక్కుతాయా అని చూస్తూంది ఆడమ్మ. అప్పుడప్పుడు డ్రైవర్లు క్లీనర్లు తలో బేడ, పావలా చేతిలో పెడుతూనే వుంటారు...." హోటలు వాడు అన్నాడు.
    "అంత ఇబ్బంది పడకపోతే వీరిగాడు ఇదివరకు దాచిన డబ్బు వాడుకోకూడదూ...." పాత సంగతి గుర్తుకొచ్చి అన్నాడు వెంకట్రావు.
    "ఆడమ్మ, తిండికి నేకపోయినా పస్తుంటదిగాని ఆ డబ్బు ముట్టుకోదు. ఆడు ప్రాణంగా దాచిన ఆ డబ్బు ఖర్చు చేసేస్తే.... ఆడొస్తాడు.... హోటలు పెడతాడు.... అప్పుడింక నాకు నా పిల్లలకి ఏలోటు వుండదంటుంది" అది. కొడుకు కోసం రోజులు లెక్కపెట్టుకుంటూ గడుపుతూంది అది.
    నిజమే! వీరిగాడు వస్తాడు! హోటలు పెడతాడు! తల్లిని సుఖపెడతాడు! తల్లిని సుఖపెట్టడమే వాడి ధ్యేయం! అదే వాడి గమ్యం! ఆ గమ్యం చేరడానికి దారిలో ఎన్ని అవాంతరాలు వచ్చినా అన్నీ దాటుకుని గమ్యం.... చేరతాడు.... సందేహం లేదు.
    పదేళ్ళ వీరిగాడితో తన వయసుని పోల్చుకోకుండా వుండలేకపోయాడు ఆ క్షణంలో వెంకట్రావు.
    బస్సు వచ్చి, కూర్చున్నాక, బస్సు తన గమ్యంవైపు పరుగులు తీస్తూంటే మనసులో దృఢ నిశ్చయం చేసుకున్నాడు.... "అమ్మని నా కన్నతల్లిని.... మామయ్య ఇంట్లో.... నౌఖరీదానికన్నా కష్టంగా చాకిరీ చేస్తూ దిక్కులేనట్లు పడివున్న అమ్మని వెంటనే తీసుకొచ్చేయాలి.... పెళ్ళాం మాటలకి లోబడి కన్నతల్లిని దూరం చేసుకోడం ఏమిటి?.... ఇన్నాళ్ళు నా బుద్ధి గడ్డితింది....ఇంక ఒక్కక్షణం ఆలస్యం చేయకూడదు...."
    బస్సు దుమ్ము రేపుకుంటూ తన గమ్యం చేరడానికి పరుగులు తీస్తూంటే తన నిర్ణయం ఇచ్చిన సంతృప్తితో తృప్తిగా కళ్ళు మూసుకుని వెనక్కి వ్రాలాడు వెంకట్రావు.

                                                                                                (పోలికేక పత్రిక 1970)

                                                  *  *  *  *

 Previous Page Next Page