Previous Page Next Page 
కన్నీటికి వెలువెంత? (కథలు) పేజి 24


                                                     గమ్యం

    ఎండ నెత్తిమాడ్చేస్తూంది! గాలి ఆడని ఉన్న! చెమట, చీదర, ఝాం అనే ఈగలు, కంటిమీద ముసిరే దోమలు! ఉమ్ములు, ఉచ్చాలు, కారా కిళ్ళీ మరకలు, అరటిపండ్లు తొక్కలు, మామిడి పళ్ళ టెంకలు, పనస పిక్కలు.... నానా గలీజు అక్కడే వుంది. హడావిడిగా తిరిగే పందులు, తీరుబాటుగా అడ్డంగా నిల్చుని నెమరువేసే ఆంబోతులు, కొంప మునిగినట్లు కొట్లాడుకునే ఊరకుక్కలు, లారీల మోత, బస్సుల హారన్లు, పాన్ బీడా గరమ్ చాయ్ ల కేకలు....
    బస్ స్టాండ్ అంతా ఒకటే గోల! ఒకటే చీదర! ప్రపంచంలో ఉన్న కుళ్ళంతా అక్కడే పోగుపడిందా అన్నంత గలీజుగా వుంది అక్కడ.
    నరకం అంటూ వేరే ఎక్కడుంటుంది! అనుకున్నాడు వెంకట్రావు. పదోసారి వాచి చూసుకున్నాడు. ఎంతకూరాని బస్సు మీద పదహారోసారి. వెధవ రైళ్ళు, బస్సులు తిన్నగా వేళకి వస్తే ఆశ్చర్యంగానీ రాకపోతే వింత ఏముంది అని విసుక్కున్నాడు. మరోసారి రుమాలుతో చెమట తుడుచుకుని మొహాన ముసిరే దోమల్ని తోలుకున్నాడు. విశాఖపట్నం నుంచి రావాలి బస్సు! అదసలు ఇంకా అక్కడ బయలుదేరిందో లేదో ఎవరికీ తెలియదు.
    మల మల మాడ్చే ఎండ బారినించి తప్పించుకోడానికైనా అక్కడున్న పాక టీ హోటల్లో దూరక తప్పలేదు వెంకట్రావుకి. ఊరికే కూర్చుంటే బాగుండదని "టీ" ఆర్డరు చేశాడు.
    బస్సులు వస్తున్నాయి, వెళుతున్నాయి.... అతనికి కావల్సింది మాత్రం రాదు!.... లారీ డ్రైవర్లు బస్సు డ్రైవర్లు, క్లీనర్లు టీ త్రాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు సావకాశంగా.
    "ఎన్టి ఓడు మా గొప్పగా ఏక్టు సేసిండు. నేను మూడు మాట్లు సూశాను.... అబ్బ జయలలిత.... తస్సదియ్య.... మా గుమ్ముగా వుంది గురూ!...." ఏదో సినిమా గురించి చెప్పుకునే వాళ్ళ మాటలు వింటూంటే వాళ్ళ అభిరుచికి అభినందించాలా.... ఆనందించాలా అని ఆలోచిస్తూ పరధ్యానంగా కూర్చున్నాడు.
    ఎదురుగా సెగలు కక్కుతున్న వేడి నీళ్ళు త్రాగాలా వద్దా అనిపించి, ఇరవై పైసలు నష్టం చేసేముందు, పోనీ ఓసారి రుచి చూస్తేనో అనిపించి నోటిదగ్గర కప్పు పెట్టుకున్నాడు. నాలుక చురుక్కుమంది. ఆ వాసనకి కడుపులో త్రిప్పి అదలా వదిలేశాడు.
    "ఏరా, దొంగనాయాలా, లారీకి తోడేసుకోవాలి, ఎప్పుడూ నీవు బండి క్లీన్ సేస్తావు...." ఎవడో కాకి బట్టల్లో డ్రైవరో క్లీనరోగాని ఓ పదేళ్ళ కుర్రాడు లోపలికి రాగానే చూసి కేకలేశాడు.
    "సిటికెలో సేసేస్తాను క్లీనరు బాబూ...." నాన్చాడు ఆ కుర్రాడు.... మోకాలు దిగువదాకా వ్రేలాడే కాకీ నిక్కరు, ఏ రంగో తెలియనంత మాసిపోయి, భుజాలు దగ్గిర పిగిలిపోయిన పెద్ద షర్టుతో, చేతిలో చిన్న బాల్చీ గుమ్మందగ్గిర పెట్టి లోపలికెళ్ళాడు ఆ కుర్రాడు.
    "బేగే కానీరా యీరిగా, లోడేసుకుని రాజమండ్రి ఎల్లి రాత్రికి తిరిగి రావాలి...." ఇందాకటి క్లీనరు తొందర పెట్టాడు. సత్తుగ్లాసులో టీ పోయించుకుని ఊదుకుంటూ గబగబ టీ త్రాగుతున్నాడు ఆ కుర్రాడు.
    "ఒరేయ్ యీరిగా.... యీరిగా.... ఎక్కడ సచ్చావు...." అరుచుకుంటూ ఓ మనిషి లోపలికి వచ్చాడు. వాడిని చూసి యీరిగాడు గబుక్కున స్తంభం చాటున నక్కాడు. కాని అప్పటికే యీరిగాడిని వాడు చూడనే చూశాడు. అటువైపు గబగబ వెళ్ళాడు.  
    "దొంగ ఎదవా, దాక్కుంటావురా.... పిలిస్తే గవురోజనమా, పలకవురా సచ్చు యెదవా" నోటికొచ్చినట్లు తిడ్తూ వీరిగాడి చొక్కా పట్టుకున్నాడు వీరిగాడు నిస్సహాయంగా బెదురు చూపులు చూశాడు. బెదురుతో పాటు తిరస్కారమూ వుంది ఆ చూపులో.... ఆ వచ్చినవాడు చొరవగా వీరిగాడి నిక్కరు జేబులో చెయ్యి పెట్టాడు వీరిగాడు జేబుని గట్టిగా పట్టుకున్నాడు.
    "తీరా, డబ్బులు తీ...." అన్నాడు అథార్టీగా, వీరిగాడి చెయ్యి లాగేస్తూ.
    "నాకాడ డబ్బులు నేవు...." ఏడుపు గొంతుతో అన్నాడు వీరిగాడు.
    "ఎదవా, దొంగ ఎదవా....డబ్బుల్నేవూ నీవు నిజం ఎప్పుడు సెప్పావు, దొంగతొత్తు కొడకా...." బలవంతంగా జేబులో చెయ్యిపెట్టి గుప్పెడు చిల్లర డబ్బులు తీశాడు ఆ మనిషి. వీరిగాడి మొహం నల్లబడింది. అవతల వాడి మొహం సంతోషంతో వెలిగింది. ఆనందంగా చిల్లర లెక్కపెట్టుకుంటున్నాడు. వీరిగాడు బితుకు బితుకుమని చూశాడు. లేని ధైర్యం తెచ్చుకొని...." ఆ డబ్బులిచ్చేయి. ఇంటికాడ బియ్యం లేవు.... కొనాలి" అన్నాడు.
    "పోరా, ఎదవా!" అప్పటికే వాడు జేబులో డబ్బులు వేసేసుకుని నిర్లక్ష్యంగా తలెగరేశాడు వీరిగాడిని అవతలకి నెట్టేస్తూ.
    టీ త్రాగుతున్న డ్రైవర్లు వీరిగాడ్ని జాలిగా చూశారు. "నర్సిగా, ఎందుకురా ఆ గుంటెదవని అలా ఏడిపిస్తావు.... ఆడు కష్టపడి దాచుకు డబ్బులు కూడా పట్టికెళ్ళి త్రాగుడు కెట్టేస్తే ఇంటికాడ పెళ్ళాం పిల్లలు ఎలా బ్రతుకుతారు....నీకీ పాడు బుద్ధి ఎప్పుడు పోతాదిరా...." అందులో ఒకడు కాస్త గట్టిగా మందలించబోయాడు.
    "నా వూసు నీకెందుకు.... ఆడు నా కొడుకు.... నేనాడి బాబుని మధ్య నీకేటి?...." నర్సిగాడు అంతకంటే గట్టిగా జవాబు చెప్పి, కొద్దిగా జవాబు చెప్పి కొద్దిగా తూలుకుంటూ వెళ్ళిపోయాడు. డబ్బులు దొరికిన సంతోషంలో గాబోలు ఈల పాట జోరుగా వుంది.
    నర్సిగాడి వంక వీరిగాడు చూస్తున్న చూపులకే శక్తి వుంటే ఆ పళంగా తండ్రిని అక్కడే నిలువునా భస్మం చేసేటంత తీవ్రంగా వున్నాయి. కళ్ళలోంచి జారి పడిపోతున్న అశ్రువులు ముంజేత్తో తుడుచుకున్నాడు.
    "ఈరిగా ఎన్నిసార్లు చెప్పినా నీకాడ డబ్బులెందుకుంచుకుంటువురా. ఏడన్న దాచుకోమన్నానా.... ఆ దొంగ సచ్చినోడు డబ్బు లగ పడితె ఊరుకుంటాడా" ఓ డ్రైవరు జాలిగా ఓదార్చాడు.
    ఆ డిప్పుడొస్తాడనుకోలేదు.... ఇంటికాడ నూకలు లేవు. మాయమ్మ ఇప్పుడొచ్చి అట్టి గెళతానంది...." ఈరిగాడు ఏడ్పు మధ్య అన్నాడు.
    జరిగిన భాగోతం అంతా కుతూహలంగా చూస్తున్న వెంకట్రావుకి సగం కథ అర్థం అయింది. నర్సిగాడు తండ్రి! ఈరిగాడు కొడుకు. నర్సిగాడు త్రాగుబోతి. వాడు సంపాదించిందే కాక కొడుకు కష్టపడి సంపాదించింది కూడా జబర్దస్తీగా లాక్కుని త్రాగుడికి తగలేస్తాడన్నమాట. వీరిగాడ్ని చూస్తుంటే వాడి సంగతేమిటో తెలుసుకోవాలన్న బుద్ధి పుట్టింది వెంకట్రావుకి.
    "ఎవరు వాడు? యీ కుర్రాడి దగ్గిర డబ్బు అలా లాక్కెళ్ళిపోయాడు ఎందుకు?" ఓ డ్రైవర్ని అడిగాడు.
    "ఆడిబాబే ఆడు.... దొంగ యదవ, త్రాగుబోతు సచ్చినోడు.... నాడు రిచ్చా లాగిన డబ్బంతా త్రాగుడుకి, మూడు ముక్కలాటకీ ఎట్టేస్తాడు.... అది సాలక యీ గుంటడు సంపాదించినది కూడా లాక్కెళ్ళిపోతాడు. ఇంటికాడ, పెళ్ళాం నలుగురు పిల్లలు తిండిలేక మాడి సచ్చినా వాడి కక్కరలేదు.... ఈ గుంటడే ఇంటికి దిక్కు, ఆల్లమ్మ ఎక్కడో పాసిపని చేసి ఓ పది రూపాయలు తెస్తుంది.... వీడు లారీలు బస్సులు తుడిచి హోటల్లో పనిచేసి రోజుకొక రూపాయో అర్ధో తెస్తే అదికూడా అప్పుడప్పుడు లాక్కెళ్ళిపోతాడు ఆడు.... ...."
    తరువాత డ్రైవరు చెప్పిందంతా వింటూంటే వెంకట్రావుకి ఎంతో ఆశ్చర్యం వేసింది. పట్టుమని పదేళ్ళు లేని వీరిగాడి కార్యదక్షత, దీక్ష వింటే ముచ్చటేసింది. తండ్రి తాగుబోతు, పెళ్ళాం పిల్లలు ఎలా బ్రతుకుతారన్నది వాడి కక్కరలేదు. తల్లిని నలుగురు చెల్లెళ్ళని, తమ్ముళ్ళని పోషణభారం పదేళ్ళు లేని వీరిగాడు తనమీద వేసుకున్నాడు. తండ్రి అంటే ఎంత విపరీతమైన ద్వేషమో, తల్లి అంటే ప్రేమాభిమానాలున్నాయి వాడికి. చావు దెబ్బలు కొట్టే తండ్రి బారినుంచి తల్లిని ఎలా రక్షించడమో వాడి వయసుకి తెలియకపోయినా తల్లికేలోటు రాకుండా వాడీడుకి మించి కష్టపడి తల్లిని, తోబుట్టువులని సుఖపెడుతున్నాడు.
    ప్రొద్దుటే లేచి యీ హోటలు శుభ్రంగా తుడిచి కళ్ళాపిజల్లినందుకు ప్రతిఫలంగా టీ ఫలహారాలు ముట్టుతాయి వాడికి రెండు పూట్లా. బస్ స్టాండ్ లో లారీలు, బస్సులు కడిగి తుడిచే పని క్లీనర్ల దయవల్ల సంపాయించుకున్నాడు. కీనర్ల బద్ధకం కొద్దీ పావలా, అర్ధా వీరిగాడి చేతులో పెట్టి బండి కడిగిస్తారు. రాత్రయినా కిరసనాయలు బుడ్డి సహాయంతో లారీలు అవీ తుడుస్తాడు. అలా సంపాయించింది రోజుకి కనీసం రెండు రూపాయలుంటుంది. అందులో సగం తల్లికిచ్చి మిగతా సగం ఈ హోటలు యజమాని దగ్గర దాస్తాడు. అలా డబ్బుదాచి రెండు మూడు వందలయ్యాక తల్లి తను కలసి చిన్న హోటలు నడపాలని వాడి ఆశయం, అప్పుడే అలా దాచింది నూటఏభై రూపాయల పైన అయింది.

 Previous Page Next Page