Previous Page Next Page 
మహిమ పేజి 23


    "నేనెవరో నీకు అనవసరం. ఎందుకొచ్చానో చెపుతాను విను. నీకు మూడు రోజులు టైమిస్తున్నాను. నీ పెట్టెలు, బట్టలు మాత్రం పట్టుకుని ఇల్లు వదిలి వెళ్లు. ఈ ఇల్లు నాది అనకు. ఇది నీదికాదు. ఇందులోని ఏ ఒక్క సామానూ నీది కాదు. ఎక్కడికి వెళతావో నాకనవసరం. వెళ్లకపోతే సామాను మిగలదు. నువ్వూ మిగలవు. చెప్పినట్టు చేస్తే నువ్వు మాత్రం మిగులుతావు. బతికుంటే సామాను మళ్లీ వస్తుంది. ఇక్కడినుంచి వెళ్లాక నీ బతుకు నీది".
    "ఏమిటి మీ దౌర్జన్యం? మీరెవరు నన్ను వెళ్లమనడానికి? ఇది నా ఇల్లు. ఏడాది నుంచి ఉంటున్నానిక్కడ. నేనెందుకు వెళ్లాలో చెప్పండి ముందు. రౌడీయిజం చేస్తే పోలీసుల్ని పిలుస్తా జాగ్రత్త" సెల్ తీయబోయింది. కిషన్ లాల వెనుక నిలబడ్డ ఇద్దరిలో ఒకడు ముందుకురికి, టక్ మని చేతిలోంచి ఫోన్ లాక్కున్నాడు.
    "చూడు... ఇలాంటివాటికి మేం బెదరం. నీకు బతుకు మీద ఆశ ఉంటే మేం చెప్పినట్టు విను. వినను అంటే రెండురోజులు టైమ్ కూడా లేదు".
    ఈసారి నిజంగానే భయమేసింది ప్రీతికి.
    "ఏం కావాలి మీకు? ఎందుకిలా నా మీద దౌర్జన్యం...?"
    "వినోద్ జీవితం నుంచి తప్పుకో. అతనితో ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు ఉండరాదు. ఈ ఇల్లు వదిలి, వీలయితే ఊరు వదిలిపో. దానికి ఎంత డబ్బు ఇవ్వాలో మేం నిర్ణయించి ఇస్తాం. గప్ చుప్ గా పుచ్చుకుని వెళ్ళు. కాదని మొండికేస్తే జరిగే దానికి మేం బాధ్యులం కాము".
    "మీరు వినోద్ మనుష్యులా? వినోద్ పంపించాడా బెదిరించడానికి?" నమ్మలేనట్లు అడిగింది. ఇంత నీచానికి దిగజారాడా వినోద్! వాడుకున్నన్ని రోజులు వాడుకుని, తల్లిని కాబోతున్నానని తెలిసి, తప్పించుకోవడానికి ఇంత నీచంగా...
    "ఏయ్ ఆపు. వాగుడనవసరం. మేమే వచ్చామో, వినోద్ పంపాడో నీ ప్రశ్నలకి జవాబులు చెప్పం... చెప్పింది చేయి..." కఠినంగా అన్నాడు కిషన్ లాల్. అంటూనే తన మనుష్యులకి సైగ చేశాడు. ఇంట్లోకి వెళ్ళి అన్ని గదులూ వెతికి వినోద్, ప్రీతి ఉన్న ఫోటోలు తీసుకున్నారు. "రెండు రోజులు టైము, ఇల్లు విడిచి వెళ్లడానికి..." అంటూ అందరూ బయటికి వెళ్ళిపోయారు.
    నిశ్చేష్టురాలై అలా ఉండిపోయి, తర్వాత ఫోన్ తీసింది. అటునుంచి స్విచ్చాఫ్ అని వచ్చింది. అలా ఓ గంట ఆలోచిస్తూ కూర్చుండిపోయింది ప్రీతి.

                                     *  *  *  *

    ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి డిన్నర్ కి కూర్చునే ముందు ఇంట్లోని నలుగురూ కూర్చుని కబుర్లాడుకునే వేళ, తుఫానులా ఇంట్లోకి దూసుకు వచ్చింది ప్రీతి.
    "వినోద్" లోపలికి వస్తూనే అరుస్తూ, వినోద్ ని చూసి చకచక అతని దగ్గరికి వెళ్ళింది. "నువ్వు ఇంత నీచానికి ఒడిగడతావా? ఛ... నువ్వింత నీచుడవని తెలియక మోసపోయాను. వాడుకున్నన్ని రోజులు వాడుకుని నేను ప్రెగ్నెంట్ అని చెప్పగానే, నన్ను వదుల్చుకోడానికి ఇంటికి రౌడీలని పంపించి బెదిరిస్తావా? నన్ను ఇంట్లోంచి దౌర్జన్యంగా వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తావా? ఏడాదిపాటు నాతో ప్రేమాయణం జరిపి, నువ్వే నా ప్రాణం అని రోజూ నా ఇంటికి వచ్చి, ప్రేమ కురిపించి, నీ రాకపోకలకి వీలుగా ఇల్లు కొనిచ్చి, ఇప్పుడు నేను గర్భవతినని తెలిసి నీ పరువుకోసం అబార్షన్ చేయించుకోమంటే చేయించుకోనన్నానని, ఇంత నీచానికి దిగజారావా? ఆ ప్రేమ కబుర్లు అంతా మోసమేనా? నిన్ను నమ్మి నా సర్వస్వం అర్పించాను. ఆ మాత్రం దయకూడా లేకుండా కట్టుబట్టలతో నన్ను గెంటించాలనుకున్నావా? ఇంత నిర్దయగా ఓ ఆడపిల్ల జీవితంతో ఆటలాడతావా? నువ్వసలు మనిషివేనా? నీలో ఇంత రాక్షసత్వమా? భార్యతో సుఖం లేక నా దగ్గరికి వచ్చానని, ప్రేమకోసం అల్లాడుతున్నానని నావెంటపడ్డావు. నీ మాటలు నమ్మి మంచివాడివని నిన్ను నమ్ముకుని ఏడాదిగా నీతో కలిసి బతికినందుకు ఇదా ఆఖరికి నువ్వు నాకిచ్చింది?" అతన్ని గుంజుతూ ఆవేశంగా అరిచింది.    
    పది నిమిషాలు ఆగకుండా ఆవేశంతో అరుస్తూ, అందరూ తేరుకునేలోగా తను అనవలసిన మాటలన్నీ... కథంతా మొత్తం అందరికీ అర్థం అయ్యేట్టు చెప్పేసి వగరుస్తూ, రుద్రకాళి అవతారం ఎత్తిన ప్రీతిని నిశ్చేష్టులై చూస్తుండిపోయారు. అందరికంటే ముందుగా తేరుకున్నది అవినాష్ జైన్. "ఏయ్, ఎవరు నువ్వు? ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది? నీకెంత ధైర్యం ఇలా ఇంట్లో జొరపడి అల్లరి చేస్తున్నావు. రౌడీలని పంపడం ఏమిటి? మేమెవర్నీ పంపలేదు. ఏమిటీ దౌర్జన్యం" కోపంగా అరిచాడాయన.
    "నేనెవర్నో మీ కొడుకు నడగండి సార్" నల్లబడిన మొహంతో మాటలు రాక, ఏం చెయ్యాలో తెలియక నిశ్చేష్టుడిలా నిలబడిన వినోద్ ని చూపిస్తూ అంది. "అడగండి... నే చెప్పిన మాటల్లో ఒక్క అబద్ధం ఉందేమో, నా ఎదురుగా, ఇక్కడే అడగండి" అరిచింది.
    "ఇదిగో ముందు నువ్విక్కడనుంచి తక్షణం వెళ్ళు. నీకెంత ధైర్యం ఇలా ఇంట్లోకి వచ్చి పరువు తీయడానికి. మా దయాధర్మం మీద బతికే నువ్వు మమ్మల్ని ఎదిరించి నిలదీసి మాట్లాడుతున్నావు. అసలు నిన్నెవరు లోపలికి రానిచ్చారు. ఏయ్, వాచ్ మేన్..."
    "కొడుకు గూండాలతో బెదిరించాడు. తండ్రి పెద్దమనిషిగా ఆడపిల్లకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాల్సిందిపోయి వాచ్ మేన్ తో గెంటిస్తాడు. అవును సార్! డబ్బున్నవాళ్ళు ఏమైనా చేస్తారు. నాకు న్యాయం జరిగేవరకు ఇక్కడినుంచి కదలను. పోలీసుల్ని పిలుస్తారా... పిలవండి. అన్ని టీ.వి.ల వారినీ నేనూ పిలుస్తాను. మీ పరువుని బజారుకీడుస్తాను. ఆడపిల్ల కదా, ఏం చెయ్యలేదనుకుంటున్నారేమో..."

 Previous Page Next Page