"చూడమ్మాయ్... నీ పేరు కూడా నాకు తెలియదు. నా కొడుకు తప్పు చేస్తే నువ్వు అడిగే పద్ధతి ఇదికాదు. పెద్దవాడిగా నేను న్యాయం చెయ్యాల్సి ఉంటే, ఇలా ఇంటిమీదకు వచ్చి దౌర్జన్యంగా ప్రవర్తించడం వల్ల, నీ మీద సానుభూతి కలగకపోగా న్యాయం చెయ్యాలన్న ఆలోచన కూడా పోతుంది. చూడు, నీ ఇష్టం లేకుండా నా కొడుకు నిన్ను బలవంతపెట్టాడా? నీ అవసరం కోసం, నీ ప్రయోజనం కోసం, డబ్బు కోసం, నువ్వు వాడి జత కోరి ఇష్టపడ్డావు. నువ్వు ముందే ఏమన్నా షరతులు పెట్టావా? నిన్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పాడా? మీ ఇద్దరూ ఏమనుకుని ఒకటయ్యారో మాకెవరికీ చెప్పి చేయలేదు. ఇవాళ ఇలా వచ్చి నిలేస్తే నేను నీకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మేం ఏ గూండాలనీ నీ ఇంటి మీదకి పంపలేదని మాత్రం చెప్పగలను. నేను నా కొడుకుతో మాట్లాడి అసలు సంగతేమిటో తెలుసుకుంటాను. నువ్వు చెప్పిందంతా నిజమైతే, నీ గురించి ఏం చెయ్యాలో, నీ పట్ల ఏ నిర్ణయం తీసుకోవాలో నిర్ణయించి చెపుతా. క్షణాల్లో నిర్ణయం తీసుకోవడానికి ఇదేమీ మామూలు విషయం కాదు. నిలబెట్టి అరిస్తే పని జరగదు. ముందు నువ్వు ఇక్కడినుంచి వెళ్ళు" ఆయన చాలా నిబ్బరంగా, దృఢంగా అన్నాడు.
ఆ క్షణంలో ఆ అమ్మాయిని శాంతపరిచి పంపకపోతే జరిగే అనర్థం ఆయనకి తెలుసు. ఆవేశంలో ఆమె నిజంగానే ప్రెస్ వాళ్లని పిలిచి రభస చెయ్యొచ్చు. అప్పుడు తమ పరువు బజారున పడుతుంది. ఆ క్షణంలో ఆమెని ఎలా టాకిల్ చెయ్యాలో అనుభవజ్ఞుడైన బిజినెస్ మేన్ గా, ఓ తండ్రిగా ప్రయత్నం చేశాడు.
"ఏం చేస్తారు మీరు? నా కొడుకుని వదిలెయ్, ఆ డబ్బు తీసుకుని పో అంటారు, అంతేనా?" ప్రీతి ఎగిసిపడుతున్న గుండెలతో అంది.
"ఇప్పటికిప్పుడు ఇలా నిల్చుని చెప్పలేను. రేపటి వరకు ఓపిక పట్టు. నేనే వచ్చి మాట్లాడతాను" శాంతంగానే అన్నాడు ఆయన. వినోద్ మొహంలో నెత్తురు చుక్కలేదు.
సుస్మిత ఎలా నిగ్రహించుకుందో ఆమెకే తెలియదు. భర్త మాడిపోయిన మొహం వంక చీదరింపుగా చూపు విసిరింది.
"సరే, పెద్దవారు చెప్పారని వెళుతున్నా. రేపు మీ కొడుకుతో వచ్చి మాట్లాడండి. ఇంత జరిగాక ఊరుకునే ప్రసక్తిలేదు" బెదిరించి, వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది.
అక్కడంతా నిశ్శబ్దం. ఎవరు ఏం మాట్లాడాలో తెలియనట్టు మూగబోయారు. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ సుస్మిత ఒక్క ఉదుటున లేచి లోపలికి పరిగెత్తింది. అందరూ తేరుకుని ఆమె వెంట వెళ్ళేలోగానే, ఒకచేత్తో పదేళ్ల కొడుకుని, మరోచేత్తో ఇంట్లో ఉన్న పెట్రోల్ క్యాన్ ని తీసుకొచ్చి అందరూ ఆమె ఏం చేస్తుందో అర్థం చేసుకునే లోగానే, తనమీద, కొడుకు మీద పెట్రోలు జల్లి, సినిమాల్లో మాదిరిగానే అగ్గిపెట్టె తీసుకుంది. ముందుగా విశాల్ తేరుకుని ముందు కురికి, వదినగారి చేతిలోని అగ్గిపెట్టె లాగేశాడు. ఆమె గింజుకుంటూ "విశాల్, వదులు నన్ను. ఇంత అవమానం జరిగాక, ఇంక నేను బతకను. నా మొగుడు నాకింత ద్రోహం చేశాక, ఏడాదిగా ఇంకొకరితో కులుకుతూ నన్నింత మోసం చేసి ఆమెతో బిడ్డని కంటానంటే, ఎంత ఘోర అవమానం... నేను, నాతోపాటు నా కొడుకు చస్తాం. అప్పుడింక ఆయనగారిని దానితోనే కులకమనండి" హిస్టీరిక్ గా అరుస్తూ గింజుకుంది. అవినాష్ ముందుకు వెళ్లి మనవడిని తన దగ్గరికి లాక్కుని, కోడలి చేయి పట్టుకుని "అమ్మా, నువ్వు ఆవేశపడకు. తొందరపడి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. పిల్లాడి మొహం చూడు. పిచ్చివెధవ ఎలా భయపడుతున్నాడో... చూడు, తప్పు జరిగింది. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి గాని, తొందరపడి అఘాయిత్యం చేసుకోవడం, అందరినీ బాధపెట్టే నిర్ణయాలు తీసుకోవడం చేయొద్దు. ముందు లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకో. మనం శాంతంగా మాట్లాడదాం. జరిగిన తప్పుని సరిదిద్దుదాం. భార్యగా నీ స్థానం ఎవరూ కాదనలేరు. సమాజం, చట్టం అన్నీ నీవైపే ఉంటాయి. ఎంతమంది ఆడవాళ్లు వచ్చినా, ఎవరూ భార్యగా నీ స్థానాన్ని పొందలేరు. అది ఉత్త వ్యామోహం. వినోద్ చేసింది తప్పే, కాదనం. ఏదో వీక్ మూమెంట్లో మగవాడు తొందరపడతాడు. అది తాత్కాలికం. నీకు కలిగిన బాధ, జరిగిన అవమానం భరించలేనిదే. కానీ తెలివైన భార్య చెయ్యాల్సింది ఇది కాదు" అంటూ భార్యని "లోపలికి తీసుకెళ్లి బట్టలు మార్పించు. నాన్నా అభీ, లోపలికెళ్లి బట్టలు మార్చుకో" అంటూ వాళ్లని పంపించాడు. ప్రాణం లేనివాడిలా కుర్చీలో చేతులతో మొహం కప్పుకుని కూర్చున్న వినోద్ దగ్గరికి వెళ్లి... భుజం మీద ఓదార్పుగా తట్టి, నిస్తేజంగా తలెత్తి చూసిన కొడుకుని "నే చూసుకుంటా, బాధపడకు. ధైర్యంగా ఉండు. చేసింది తప్పే... కాని సరిదిద్దుకోవడంలో ఉండాలి తెలివి" అన్నాడు.
* * * *
ఆయన చాకచక్యంగా సరిదిద్దాల్సిన అవసరం రాకుండానే, తెలివైన భార్య చెయ్యాల్సింది చేసింది సుస్మిత. వెంటనే గదిలోకి వెళ్లి జరిగింది తండ్రికి చెప్పింది. ఆయన మౌనంగా అంతా విని, "సరే, నువ్వు బాధపడకు. పిచ్చిపనులు చేయకు. దాని సంగతి నేను చూసుకుంటాను" అన్నాడు చాలా శాంతంగా.
ప్రీతి యాక్షన్ కి, రియాక్షన్ వెంటనే ఆరంభమయింది. ఉదయాన్నే ఏడు గంటలకి పోలీసులు ఇంట్లో చొరబడి, ఇల్లంతా వెతికి, మూల మూల నుంచి డ్రగ్స్ ప్యాకెట్లు పట్టుకు లాగారు. బీరువాలో, పుస్తకాల షెల్ఫుల్లో, వంటింట్లో, బాత్ రూముల్లో, పరుపుకిందా... లక్షల విలువ చేసే ప్యాకెట్లు బయటపడ్డాయి. డ్రగ్స్ మాఫియాతో చేతులు కలిపి డ్రగ్స్ సరఫరా చేస్తోందన్న సమాచారం అంది, పోలీసులు సెర్చ్ వారంట్ తో సహా వచ్చి ఇల్లంతా సోదా చేశారు. ఆమెను అరెస్ట్ చేసి, నాన్ బెయిలబుల్ వారంట్ జారీచేసి కేసు ఫైల్ చేశారు. కేసు మేజిస్ట్రేట్ కి వచ్చేలోగా సెల్ లో పడేసి నిజం చెప్పమంటూ, పేర్లు చెప్పమంటూ చిత్రవథ చేశారు. ఇది ఎంత నేరమో తెలుసా, నిజం ఒప్పుకో అంటూ చితకబొడిచారు. ఆడ పోలీసులు కూడా ఎంత క్రూరంగా ప్రవర్తించగలరో రుచి చూపారు.