Previous Page Next Page 
మహిమ పేజి 22


    ఇద్దరిదీ ఎక్కడో దూరపు చుట్టరికం. పైగా చిన్నప్పటి నుంచీ ఇద్దరూ కలిసి చదువుకున్న స్నేహం. దాంతో ఆమె చెప్పింది విని, సుస్మిత నిర్ఘాంతపోయింది. ఆగ్రహం పట్టలేక, ఆవేశంగా పార్టీ నుంచి బయటికి వచ్చింది. తరువాత కారులో కూర్చుని, ఆవేశం తగ్గించుకుని తెలివిగా ఆలోచించింది. తాను తొందరపడి, ఆవేశపడి భర్తను నిలదీస్తే...? అతనిప్పుడు తన బెదిరింపులకు లొంగడు. కంపెనీ లాభాల బాట పట్టింది. అవును, నేను ప్రేమిస్తున్నాను అని తెగేసి చెపితే... తనేం చెయ్యాలి? అసలే ఇద్దరి మధ్య సంబంధం అంతంత మాత్రం. ఇంట్లో తను పేరుకు మాత్రమే భార్య. తన గురించి అస్సలు పట్టించుకోడు. ఎక్కడికెళ్ళినా, ఏం చేసినా, ఎంత ఖర్చుపెట్టినా... ఏదీ కల్పించుకోడు. కొడుకుతో మాత్రం, వాడు స్కూలుకెళ్ళేముందు ఓ అరగంట కబుర్లు చెబుతాడు. చదువు, ఆటల గురించి, స్నేహితుల గురించి మాట్లాడతాడు. ఎప్పుడైనా సెలవురోజు అలా కారులో కాసేపు తిప్పి వాడికేం కావాలో కొనిపెడతాడు. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనుబంధం, ఆప్యాయత, దగ్గరితనం ఏనాడో పోయాయి. ఒక ఇంట్లో ఉన్నారన్నదే తమ బాంధవ్యం. ఇలాంటి స్థితిలో రెచ్చగొడితే, ఇంట్లో దొరకని ఆనందాన్ని బయట అనుభవిస్తున్నప్పుడు ఏదో తెగింపే ఉంటుంది అతనిలో. ఇంటికి చేరగానే బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపులు మూసుకొని తండ్రికి ఫోన్ చేసి విషయం అంతా చెపుతూ, తనకి జరిగిన అవమానం తట్టుకోలేక ఏడుపు ఆరంభించింది. అటునించి ఆయన అంతా విన్నాడు. కూతురిలా ఆవేశ పడలేదు. అతను పక్కా బిజినెస్ మాన్. బంగారం వ్యాపారంలో ఆరితేరి, ఏది ఎలా సాధించాలో పట్టువిడుపులు తెలిసిన మనిషి. ఆవేశపడి, కోప్పడి గుట్టు రట్టు చేసుకోకుండా, విషయాన్ని మట్టుపెట్టగలిగిన సమర్థత ఉంది కిషన్ లాల్ అగర్వాల్ కి. కూతుర్ని ఓదార్చాడు. "అంతా సరిచేస్తాను. నువ్వేం బాధపడకు. అతని దగ్గర ఏం తెలీనట్టే ఉండు" అని ధైర్యం చెప్పి, ఆ అపార్ట్ మెంటు పేరు, ప్రీతి వివరాలు తెలుసుకుని, కార్యాచరణలోకి దిగాడు. ఒక్క రెండు రోజుల్లోనే ప్రీతి ఎవరు, వినోద్ కంపెనీలో ఎప్పుడు చేరింది మొదలు... వినోద్, ప్రీతీల మధ్య అనుబంధం ఎప్పుడు మొదలైంది, ఈ అపార్ట్ మెంట్ ఎప్పుడు మారింది, వినోద్ రాకపోకల సమయాలు, వారిద్దరి ఆమధ్య సంబంధ బాంధవ్యాలు, ప్రీతికి ఏఏ ఇతర కంపెనీలలో ఆఫర్లున్నాయి. ఆమె సంపాదన ఎంత, ఈ మధ్య వారిమధ్య మనస్పర్థలు మొదలవడం, ఆఖరికి ప్రీతి నర్సింగ్ హోంకి వెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడం, వినోద్ గొడవపడడం వరకు ప్రతీ చిన్న విషయం అపాయింట్ చేసిన డిటెక్టివ్ ఏజెన్సీ రాబట్టి రిపోర్ట్ అందచేసింది. ఆమె కారు డ్రైవరు, ఇంట్లో ఉండి పనిచేసే అమ్మాయి, ఇరుగుపొరుగువారు, వాచ్ మేన్, ఆఖరికి ప్రీతి వెళ్లిన నర్సింగ్ హోం నుంచి కూడా వివరాలు రాబట్టారు. ఈ రిపోర్టు మొత్తం చదివిన కిషన్ లాల్... తనూహించిన దానికంటే విషయం చాలా దూరమే వెళ్లిందని, ప్రీతి ప్రెగ్నెంట్ అన్నది విని ఆయన మరింత సీరియస్ అయ్యాడు.  
    వినోద్, ప్రీతిల సంబంధం గురించి విన్న సుస్మిత గత రెండు మూడు రోజులుగా భర్తను అన్ని కోణాల నుంచి గమనించి చూస్తూ, అతి కష్టం మీద కోపం, ఆవేశం నిగ్రహించుకుంటోంది. తండ్రిమీద ఆమెకెంతో నమ్మకం, భరోసా. ఆయనకి తన మీద ఉన్న ప్రేమ తెలుసు. తనకెవరన్నా కష్టం కలిగించే మాట అన్నా, ఆఖరికి తల్లి అన్నా కూడా ఆయన సహించేవాడు కాదు. అలాంటిది అల్లుడు కూతురు కింత ద్రోహం చేస్తే ఊరుకోడని, ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో ఆయనకి తెలుసని, తండ్రి అన్నీ సేకరించి చెప్పేవరకు ఆయన ఏం చేస్తాడో చూశాక, అప్పుడు బయటపడాలని ఓపిక పట్టింది. గత ఏడాది నుంచి వినోద్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఇంట్లో అసలు తనను పట్టించుకోడు. ఏమన్నా వినీ విననట్టు వెళ్లిపోవడం, ఇంట్లో ఉండే సమయం తగ్గిపోవడం, నెలకి రెండు మూడుసార్లు ముంబయి, ఢిల్లీ ఆఫీసు పనులంటూ రెండు మూడు రోజులు వెళ్లిపోవడం... అన్నీ చూసిన ఆమెకి వినోద్ మీద అనుమానం రాలేదు. తమిద్దరి మధ్య ఎప్పుడూ పెద్ద సఖ్యత లేదు. సాన్నిహిత్యం లేదు. పని ఒత్తిడిలో అలా అంటీ ముట్టనట్టు హడావిడిగా వెళుతున్నాడు వస్తున్నాడనుకుంది తప్ప వినోద్ ఇలా ఇంకో ఆడదానితో సంబంధం పెట్టుకుంటాడన్న అనుమానం కూడా తలెత్తలేదు. అలాంటిది తనవెనక ఇంత పకడ్బందీగా, హాయిగా ఇంకో ఇంట్లో రెండో సెటప్ పెట్టాడంటే, ఇప్పటికీ ఆమెకి నమ్మశక్యం కావడం లేదు. వినోద్ చేతకానివాడని, తనంటే భయమని, తన డబ్బుతోనే ఈ బిజినెస్ నిలబడింది కాబట్టి తనకు వ్యతిరేకంగా ఏ పనీ చేసే సాహసం చెయ్యడని నమ్మకం. ఈరోజు ఆ నమ్మకం సడలిపోయింది. కట్టుకున్న భార్యకు ఇంత ద్రోహం చేయగలిగిన భర్తని ఏం చెయ్యాలి, ఎలా బుద్ధి చెప్పి మళ్లీ గుప్పిట్లో పెట్టుకోవాలని ఆమె లోలోపల ఉడికిపోతూ అతి కష్టం మీద నిగ్రహం చూపించింది.
    ఇంటికి పిలిచి తండ్రి సేకరించిన వివరాలు చెప్పగానే నిర్ఘాంతపోయింది. అన్నింటికంటే ప్రీతి గర్భవతి అన్న నిజం ఆమె తట్టుకోలేకపోయింది. ఆగ్రహావేశాలతో లేచి నిలబడ్డ కూతుర్ని చేయిపట్టుకు లాగి కూర్చోపెట్టాడు తండ్రి. "ఇది ఆవేశంతో చెయ్యాల్సిన పని కాదు. నువ్వు కామ్ గా ఉండు. నేను అన్నీ దారిలో పెడతా" భరోసా ఇచ్చాడు కిషన్ లాల్.
    "ఊరుకోను డాడీ! ఆ వినోద్ ని ఇంట్లో నలుగురిముందు నిలబెట్టి కడిగేసి మళ్లీ తలెత్తకుండా చేస్తాను. అసలేమనుకుంటున్నాడు న గురించి" ఎగిరిపడింది.
    కూతుర్ని సముదాయించి "ముందు అటు నుంచి నరుక్కురావాలి. అల్లుడిని కాదు కంట్రోల్ లో పెట్టాల్సింది. ఆ అమ్మాయిని అల్లుడి జీవితంలోంచి తప్పించాలి. అదంతా నాకు వదిలేయ్. ఇంకో రెండు రోజులు టైమివ్వు నాకు" అని నచ్చచెప్పి పంపాడు.

                                                             *  *  *  *

    ఇంట్లోకి చొరపడ్డ జెమజెట్టీల్లాంటి ముగ్గురు మనుష్యులని, ఆ తరువాత సినిమాలో మాదిరి హుందాగా లోపలికి అడుగుపెట్టిన కిషన్ లాల్ ని చూసి... తలుపుతీసిన ప్రీతి బిత్తరపోయింది. "ఏయ్... ఎవరు మీరు? ఏమిటి ఈ దౌర్జన్యం?" అరిచింది.
    కిషన్ లాల్ అక్కడున్న సోఫాలో కూర్చుని చుట్టూ పరిశీలిస్తూ, "ఊఁ బాగానే ఉంది ప్రేమకుటీరం. సెటప్ బాగానే ఉంది" అన్నాడు వ్యంగ్యంగా.
    "ఏయ్, ఎవరు నువ్వు?" అరిచింది ప్రీతి.
    "చెపుతా, ఇలా వచ్చి కూర్చో. ఆ తలుపులు మూసిరా నలుగురూ వింటే బాగుండదు" అన్నాడు.
    ప్రీతి భయంగా చూసింది. వచ్చినవారిలో ఒకడు తలుపు మూసి గడియ పెట్టి, గుమ్మం దగ్గరే నిలబడ్డాడు. తక్కిన ఇద్దరూ కిషన్ లాల్ వెనక వచ్చి నిలబడ్డారు. ప్రీతి భయంతో "ఏమిటిదంతా? ఎవరు మీరు?" మళ్లీ అడిగింది.

 Previous Page Next Page