చివరికి డాక్టరు ప్రసాద్ ఆమెని మళ్ళీ మనిషిని చేశాడు. ఆమె మనస్సు చెదిరిందని, తిరిగి కుదుటపడాలంటే కొంతకాలం, కొన్నేళ్ళు ఆ పరిసరాలకు, మనుష్యులకు దూరంగా ఉండాలని గుర్తించారాయన. ఆమెను తమ ఇంట్లో కలుపుకున్నారు. రాజేశ్వరితో సమానంగా ఆమెకు అన్నీ ఇచ్చారు. ఆమె గదిని అందమైన అలంకరణలతో, చక్కటి పుస్తకాలు దృశ్యాలతో నింపారు. ఆమెకు ఏదయినా కావాలన్నప్పుడల్లా అది అందించే మనిషి, స్వంత చెల్లెలిలా చూసుకునే రాజేశ్వరి, దయామయుడైన పితృ ప్రేమ చూపించే డాక్టరు, ఆ పరిస్థితుల్లో ఆమె కొద్ది నెలల్లోనే మామూలు మనిషి అయింది. ఏదో ఒక ధ్యాస, పని కల్పించడం కోసం మెట్రిక్ కి కట్టించారు. జానకి కష్టపడి చదివింది. ఆరోజు ఆమె పరీక్ష ఫలితాలు తెలిశాయి. అదొక కొత్త అనుభవం ఆమెకు జీవితంలో!
సినిమా పూర్తి అయింది.
"అబ్బా! ఎన్నాళ్ళయింది, కాస్త మంచి సినిమా చూసి, ఈ పాడు వూరికి ఎంతసేపూ యుద్ధాలు, దోపిడీలు, హత్యలు, కత్తి యుద్ధాలే వచ్చేది!" రాజేశ్వరి నడుస్తూ అంది.
"అస్తమానం నవ్వుతూనే ఉండాలంటే ఎలా? అప్పుడప్పుడు కొంచెం చావులూ, ఏడుపులూ కూడా రుచిచూడాలి! అదే నిజమైన జీవితం!" జానకి అంది.
"ఏమో! నాకిలా ఎప్పుడూ నవ్వుతూ పేలుతూ ఉండాలని ఉంటుంది! పెద్దయ్యాక నేనెన్నడూ ఏడవలేదు. అదంటే అసహ్యం!"
"అదృష్టవంతులు మీరు, వెలుగు పొందగలిగిన అదృష్టవంతులు! అభాగ్యులం మేము! సరిహద్దులు దొరకని సంధ్యలో మా సంచారం.
"మహాకవి మాటలు బాగానే బట్టీ పట్టావు సంతోషించా గాని కాస్త మామూలు మాటలు చెప్పు!"
"ఏమున్నాయి మామూలు మాటలు? నాకంతా అగమ్యగోచరంగా ఉంది. పరీక్ష పాసయ్యేదాకా ఆ ధ్యాసలోపడి మిగతావన్నీ మరిచిపోయాననుకో! కాని ఇప్పుడా మెట్టు గడిచాక, తరవాత ఏమిటి? ఇకమీదట రోజులెలాగడుస్తాయి? నా గమ్యం ఏమిటి? ఏం చెయ్యాలి? అన్నీ ప్రశ్నలే?"
"సఖీ గిన్నె నింపు. మన కాళ్ళ క్రిందనించి కాలం ఎలా కొట్టుకుపోతూందో ఎన్నిసార్లు చెప్పుకున్నా ఏం ప్రయోజనం? ఇంకా పుట్టని రేపు, పుట్టి చచ్చిన నిన్నా___వాటిని తలుచుకొని చిరాకుపడకు! ఈ రోజు హాయిగా తాగి అన్నీ మరచిపోదాం, ఇప్పుడు అనే ఈ క్షణమే మిగిలింది మనకు" అంటాడు ఉమర్ ఖయ్యాం! అలాగ...."
"రాజీ, అందరూ ఉమర్ ఖయ్యాంలే అయితే, ఈ లోకం ఇంత చిత్ర విచిత్రంగా ఉండదేమో!"
"అందరిగొడవా మనకెందుకు? మనసంగతి మనం ఆలోచించుకుందాం. జానీ, నిజంచెప్పనా, నాన్నగారు నీకోసం అంతా ఎప్పుడో నిర్ణయం చేశారు. నువ్వేం దిగులుపడకు. గడిచిందంతా పీడకల అనుకుని మరిచిపో, నువ్వింక ఎన్నడూ ఆ చాయలకి వెళ్ళవు. నువ్వు నాతోబాటే!"
జానకి మాటాడలేదు; ఇద్దరూ ఇల్లు చేరారు.
"మరోసారి అభినందనలు చెపుతున్నానమ్మా జానకీ! ఐదో తరగతి స్థాయితో మొదలుపెట్టి రెండున్నర ఏళ్ళలో మెట్రిక్ పాస్ కావడం సామాన్యమైన పనిగాదు. నీ తెలివి తేటలు, పట్టుదల చూస్తే నాకెంతో గర్వంగా ఉంది" అన్నారు డాక్టర్ ప్రసాద్ పొద్దున్నే గదిలోకి వచ్చి.
"అంతా, మీ ఆశీర్వచన ప్రభావం నాన్నగారు" సిగ్గు పడింది జానకి.
"మూడేళ్ళక్రితం నువ్విక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉన్నావో, తలుచుకుంటే, ఇప్పుడు నువ్విలా మామూలు మనిషివి అయినందుకు ఎంతో తృప్తిగా, ఆనందంగా ఉంటుంది. ఉత్తి మామూలు మనిషివి అవడమే కాదు, ఈ రోజు నీలో ఎలాంటి పరిస్థితుల్నయినాసరే తట్టుకోడానికి తగిన నిబ్బరం, సత్తువ ఉన్నాయి"
"అది కూడా మీరు పెట్టిన భిక్షే!"
"నేను చేసిందేముంది జానకీ! నిన్ను బాగు చేయాలని నాకుంటే మాత్రం, నీవు సహకరించకపోతే నేనేం చెయ్యగలిగిఉండేవాడిని? సరే, అది అలా ఉంచు. నీకో విషయం చెప్పాలమ్మా! అది ఇంతకాలం నీనుంచి దాచి క్షమించరాణి నేరం చేశాను"
"నాన్నగారూ! మీరలా మాట్లాడుతుంటే నన్ను చాలా కించపరుస్తున్నట్టుంది....."
"నీది చాలా ఉదాత్తమైన మనసన్న సంగతి తెలుసునమ్మా!.... నువ్విప్పుడు ఒక పెద్ద కూడలిలో ఉన్నావు. ఇటుపైన ఎటు వెళ్ళవలసినదీ నిర్ణయించుకునే మందు నిదానంగా, నిబ్బరంగా, ఆలోచించుకోవాలి. నువ్వు మెట్రిక్ పాస్ అయి, కొంత మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడా అలవరుచుకోవాలి.
ఇంతటి మనుషులూ ఉంటారనుకోడం, ఉండడం నమ్మలేని ఘోరం! కాని ఉన్నారని తెలిసి ఏం చెయ్యలేని అశక్తత, అసహాయత ఇంకా ఘోరం!
"చివరికి ఒక రోజు నా దగ్గిరికి వచ్చాడు రామ్మూర్తి. నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉన్నావు. భూత వైద్యుల బెత్తాల వాతలు ఒంటినిండా తట్లుతేలాయి! ఒళ్ళు అంతా కాలిపోతున్నట్టు విపరీతమైన జ్వరం. రెండు మూడు రోజులనించి తిండి, నీరు లేకుండా స్పృహలేని స్థితిలో ఉన్నావు. రామమూర్తి చాలా గాభరాపడ్డాడు. మనిషి ఇంచుమించు ఏడ్చే స్థితిలో ఉన్నాడు. చాలా డీలా పడి పోయాడు. డబ్బు నష్టపోయాడు. నీ నించి వచ్చిన సుఖమూ లేదు. ఈ నాలుగో భార్య కూడా పోతే, మళ్ళీ ఎవరయినా పిల్లని ఇస్తారా? అన్న ధోరణిలో చాలా ఆత్రుతతో నిన్ను ఎలాగైనా బతికించమని ఆ స్థితిలో నా చేతిలో పెట్టి కాళ్ళా వేళ్ళా పడ్డాడు.
"నాకు అవకాశం వచ్చింది అప్పటికి, కోపంతో శరీరం దహించుకు పోతుంటే కసితీరా తిట్టాను. 'నువ్వు బ్రతికే ఆశలేదని, ఇది హత్య అని పోలీసులకు రిపోర్టు ఇస్తానని బెదిరించాను. భయపడిపోయాడు మనిషి. 'చచ్చిన పామును ఇంకా ఎందుకు కొడతారు? బుద్ధి గడ్డితిని ఈ పాపానికి ఒడిగట్టాను. చెంపలు వాయించుకుంటున్నాను. ఎలాగో అలాగ ఆమెను బ్రతికించండి. మీరేమీ చెయ్యమంటే అది చేస్తాను?' అంటూ ప్రాధేయపడ్డాడు. ఈ భూతాలను తరమడంలో నీ ప్రాణాలు కూడా పోతున్నాయని అప్పటికి గాని తట్టలేదు ఆ దౌర్భాగ్యుడికి! ఆ చావుకు తనే కారకుడన్న పాపభీతి మాట ఎలా ఉన్నా, పోలీసులకు ఎక్కువగా భయపడ్డాడేమో! ఏమయినా నా చేతిలో చిక్కాడు. ఆ అవకాశం పోనీయకుండా సాధ్యమైనంత బెట్టు చూపించి, ఆఖరికి తన తప్పులు తన నోటే చెప్పించి, నేను కొన్ని షరతులు పెట్టాను.