Previous Page Next Page 
కన్నీటికి వెలువెంత? (కథలు) పేజి 23


    "నీకు చికిత్స నా ఇంట్లోనే జరుగుతుంది. నీకెప్పుడు నయమైంది నిర్ణయించేది నేను. నేను చెప్పిందాకా నీ దరిదాపులకి రాగూడదు. నీ ప్రసక్తి ఎత్తడానికి వీలులేదు. ఇంచుమించు భర్తగా నీ మీద అధికారాలన్నీ వదులుకున్నట్టే. అలా రాసి ఇస్తేనే నేనేమైనా చెయ్యగలననీ, లేకపోతే ఈ చావుకు మీరు కారణమని పోలీసులకు రిపోర్టు ఇస్తానని చెప్పాను. ఇబ్బందిలో ఉన్నాడేమో, ముందు కాస్త సంశయించి, తటపటాయించి నేనన్నదానికంతటికీ అంగీకరించాడు పైగా డబ్బు అక్కరలేదన్నానేమో, ఈ పీడ వదిలితే చాలుననుకుని ఉంటాడు. ఆ రోజునించే నిన్ను మా ఇంటికి తెచ్చి వైద్యం మొదలుపెట్టాను. పిల్లలకు, వంటకు ఎవరినో కుదుర్చుకున్నాడు"
    "నిన్ను ఆ మనుష్యులకు, ఆ వాతావరణానికి దూరంగా ఉంచడం కోసం, ప్రయత్నించి అక్కడినించి బదిలీ కోరుకుని ఈ వూరు వచ్చాను" డాక్టరు అంతవరకు చెప్పి ఆగారు. జానకి ఏడుస్తూంది, తలగడలో మొహం దాచుకుని, ఆయన లేచి జానకి దగ్గిరికి వెళ్లి ఆప్యాయంగా తల నిమిరారు.
    "అమ్మా! జానకీ బాధపడుతున్నావా? అవును! ఎంత బండరాతి గుండెలయినా కరుగుతాయి ఆ విషయాలు తలుచుకుంటే!.... కాని నువ్వు అదంతా పీడకల అనుకుని మరిచిపోవాలి!.... కనీసం ప్రయత్నించు!.... పోనీ నీకు అంతగా మనస్సు బాగులేకపోతే ఇంకోసారి మాట్టాడుకుందాం, నేను వెళతాను...."
    "కూర్చోండి నాన్నగారూ, పరవాలేదు. ఏం చెప్పినా వినడానికి తయారుగా ఉన్నాను. చెప్పండి!" జానకి లేచి కూర్చుంది. కళ్లు ఎర్రబడి, గొంతు కంపిస్తూ అంది. కాని ఆమెలో ఒక కొత్త స్థయిర్యం నిశ్చలత కనపడ్డాయి. ఆమె ఇదివరకటి జానకి కాదు.
    "జరిగింది అంతా మన మంచికేనమ్మా. రామ్మూర్తి నీ మెళ్ళో తాడు కట్టాడు కాని, నీతో ఎన్నడూ కాపురం చేసి ఎరగడు. నువ్వు అతని భార్యగా ఎన్నడూ ఉండలేదు. చివరికి ఆ ఉన్న బంధం కూడా తెగిపోయింది.... అతను ఏదో చచ్చేదాకా ఏదో కాస్త డబ్బు సంపాయించి వెనక వేశాడు. తాతలనాటి భూములు, ఆస్తి ఉన్నాయి. వాటికి ఆశపడి అతని తమ్ముడూ వాళ్లూ పిల్లల్ని చేరదీస్తారు. ఆ బెంగ కూడా నీకక్కరలేదు."
    డాక్టరుగారి మనస్సులో భావం జానకికి కొద్దికొద్దిగా అర్థం అవుతూంది. ఎన్నో విషయాలు ఒక్కసారి తెలియడం మూలాన, ఒక మాదిరి దిగ్భ్రమ ఆమెను ముంచెత్తింది. ఏదీ వెంటనే తోచడం లేదు.
    "నేను చెప్పేదేం లేదు, నువ్వు ఇంక ఆ బంధాన్ని తెంచుకో! కాలేజీలో చేర్పిస్తాను. ఓపిక ఉన్నంతవరకు చదువుకో! తరవాత ఏదో ఉద్యోగం దొరకకపోదు! క్రొత్త జీవితాన్ని ఆరంభించు. గతమంతా జరగనట్లే అనుకుందాం! ఈ ఇంట్లో రాజేశ్వరి ఎంతో నువ్వు అంతే! నా ఉద్దేశం నువ్వు మళ్లీ ఆ వాతావరణంలో అడుగుపెట్టకూడదు! ఇప్పుడు మామూలు మనిషి అయినా, నీలో ఎంత నిబ్బరం ధైర్యం వచ్చినా, తిరిగి ఆ మనుష్యుల మధ్యకు వెళ్లి, వాళ్ల మాటలు విన్నావంటే, నీకేమౌతుందో నేనూ వూహించలేను! ఇన్నాళ్లు నా శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందుకే నువ్వింక ఆ బంధాన్ని మరిచిపోవాలని నా కోరిక!"
    జానకి ఆలోచిస్తూ కూర్చుండి పోయింది. మౌనంగా. డాక్టరు ఆమెకు ఆలోచించుకోవడానికి అవకాశం ఇస్తూ, నెమ్మదిగా లేచి వెళ్ళిపోయారు.
    మరునాడు ఉదయం రాజేశ్వరి తండ్రి గదిలోనికి హడావిడిగా పరిగెడుతూ వచ్చింది.
    "నాన్నా. జానకి లేదు నాన్నా! పెట్టె, బట్టలు లేవు మంచం మీద యీ ఉత్తరం పడివుంది." గాభరాగా అంది రాజేశ్వరి.
    డాక్టరుగారు దాన్ని తెరిచి చదివారు.
    "మహారాజశ్రీ నాన్నగారికి,
    దేవుడిలాంటి మిమ్మల్ని ఇలా చనువుగా పిల్చుకోగల అవకాశం నాకు కలగటం నేను కలలో కూడా వూహించలేని మహా గౌరవం! మీరు నాకు ప్రాణం పోసిన మహాత్ములు! అంతకన్నా ముఖ్యం జీవచ్చవంలా ఏదో నరకంలో కొట్టుకుంటున్నదానికి, కూపస్థమండూకం లాంటి జీవితంలో వెలుగు చీకటికి భేదం తెలియని నాకు ప్రేమభిక్ష పెట్టి, వెలుగుబాట చూపారు. మీకు ఋణపడి ఉన్నానని చెప్పడానికి కూడా వీలులేని పరిస్థితి నాది. ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం మానవతకోసం, సాటి ప్రాణం మీద మమకారంతో, దయతో నన్ను చేరదీశారు. కరుణతో, ప్రేమతో నన్ను తేరించి నాలో క్రొత్త వెలుగు ప్రసరింప చేసి నన్ను క్రొత్త మనిషిగా రూపొందించారు. దీన్ని ఋణమని ఎలా అనను? దానికి ప్రతిగా నేను మీకు చెయ్యకలిగిందేముంది?
    "కానీ ఏదో ఒకటి చేయాలన్న ఆరాటం మనస్సుని వేధిస్తూంది. అందుకు మీరు వెలిగించిన బాటే, మీరు నడిపిన మార్గమే నా కళ్ల ఎదుట కనపడుతూ ఉంది. మీకు అంతటి ఉదాత్తత, ఔదార్యం, విశాల హృదయం నాకు లేకపోయినా, నా చేతనయినంతలో, నేను పొందిన ఈ దయ, కరుణను ప్రేమ ఇతరులకు దొరికేటట్లు చెయ్యాలని నిశ్చయించుకున్నాను.
    "క్షమించండి మీ సలహా పాటించలేక పోయాను! నిన్నటినించి నేను బాగా అలోచించి ఈ నిశ్చయానికి వచ్చాను. రామ్మూర్తిగారు, వాస్తవంగా నా భర్తగా ఉండకపోయినా ఆయన నాకు తాళి కట్టిన భర్త! ఆ పిల్లలు, నా పిల్లలు అనుకుంటాను. నా సుఖం, నా స్వార్థం కంటే, చేతనయినంతలో ఇతరులకు ఉపయోగపడటంలో ఎంతటి ఆనందం, ఆత్మతృప్తి ఉంటాయో తెలుసుకున్నాను. మీ సహచర్యంలో ఆ తల్లిదండ్రిలేని పసిపిల్లలను, మాతృ ప్రేమకు నోచుకోని ఆ పసిబిడ్డలకు మాతృ ప్రేమ చవిచూపించ దలుచుకున్నాను. ఆ వాతావరణంలో పెరిగితే ఆ పిల్లలకి నాకు పట్టిన గతే పడుతుందన్నది నిశ్చయం. నేను అనుభవించిన నరకంలో చూస్తూ చూస్తూ వాళ్లను పడెయ్యలేను. అందుకే వెళ్లిపోతున్నాను.
    "వెళ్లేముందు మీనించి సెలవు తీసుకోకుండా వెళ్ళిపోవడం నాకు చాలా కష్టంగా ఉంది. చూస్తూ చూస్తూ నన్ను తిరిగి, ఆ చీకటికి పంపరన్న నిజం నాకు తెలుసు! కాని మీరేమీ భయపడనక్కరలేదు! ఆ జానకి చచ్చిపోయింది! ఈ జానకి వేరు! ఎలాంటి సంఘటన అయినా ఎదుర్కోగల ధైర్యం, నిబ్బరం మీరు ప్రసాదించారు. అందుకే ఇంత సాహసిస్తున్నాను.
    "అపార దయాసముద్రులు మీరు. ఇన్నాళ్లు మీ కన్నకూతురులాగే చూసుకున్నారు. మీ కూతురులాగే అనుకుని ఈనా ఒక్క తప్పు మన్నించండి.
    "నేను తలపెట్టిన పనిలో మీ ఆశీస్సులు ఉంటాయని నాకు తెలుసు. అయినా నా తృప్తికోసం ఆశీర్వదించమని వేడుకొంటున్నాను. ఇంకోసారి నా ఈ చొరవ మన్నించమని కోరుతున్నాను.
                                                                                                                    సెలవు
                                                                                                                మీ అమ్మాయి
                                                                                                                    "జానకి"
    డాక్టరు నిర్ఘాంతపోయారు. కొద్దిక్షణాలు పోయాక నీరు చిందిన కళ్లు ఒత్తుకుంటూ "వెర్రితల్లి! ఎంతపని చేశావమ్మా!" అని నిట్టూర్చారు.
                                                                                                             (ఆంధ్రప్రభ దినపత్రిక)

                                                 *  *  *  *

 Previous Page Next Page