వెర్రిపిల్ల
సాయంకాలం ఆరుగంటలు. నీరెండల కాంతులలో వీధి అంతా కళకళలాడుతూంది.
"జానీ, నువ్వు ఇవాళ ఎంత బాగున్నావో తెలుసా?" అంది రాజేశ్వరి.
"నీ యోగ్యతాపత్రానికి ఎంతో కృతజ్ఞతే గాని, ఈ పొగడ్తలు చాలుగానీ, దయచేసి ఇంకేదయినా మాట్లాడమని ప్రార్థన" జానకి సగం వేళాకోళంగా అంది.
"నేనే మగవాణ్ణి అయితే నిన్ను పూలలో పెట్టి పూజించి ఉందును. ఆ అవకాశం రానందుకు బాధగా ఉంది!" హాస్యం ఆడింది రాజేశ్వరి.
"పాపం!"
"ఆ అబ్బాయి చూడు, ఇంకొంచెం ఉంటే సైకిలు మీదనుంచి పడును. మనస్సు, దృష్టి ఇటువుంటే దారేం కనపడుతుంది?" కొంటెగా అంది రాజేశ్వరి.
ఇద్దరూ నవ్వుకున్నారు.
"అయినా, ఆ దేవుడు అంత అనడమూ ఒక్కళ్లకే ఇవ్వకపోతే కాస్త అందరికి సంచిపెట్టకూడదూ!"
"మనకి కావలసిన బన్ తప్పించి, మిగతావన్నీ వచ్చి వెళ్లిపోతూంటాయి చూడు. అలాగే, ఈ ప్రపంచంలో మనకి కావలసినవి దొరకవు. మిగతావన్నీ ఉంటాయి." జానకి నిర్లిప్తంగా అంది.
"పద్దెనిమిదేళ్ల బంగారు వయస్సులో ఈ చచ్చు వేదాంత మెందుకే వెర్రిపిల్లా?"
జానకి మొగంలోకి చూసి నవ్వింది రాజేశ్వరి. ఆమె తల దించుకుంది. మనస్సులో బాధ ముఖాన్ని నల్లబరుస్తుంది. వాలిన కనురెప్పలు రెండు మూడు నిముషాలు పైకి లేవలేదు.
రాజేశ్వరి కొద్దిసేపు ఆమెవంక చూసి ధోరణి మార్చుకుంది.
"క్షమించు జానకీ, మరోలా అనుకుంటావని అనుకోలేదు?"
"ఇందులో అనుకోడానికీ, క్షమించడానికీ ఏముంది! నువ్వేం తప్పు మాట అన్నావు?" పేలవంగా నవ్వింది జానకి. రాజేశ్వరి జానకి వంక అయోమయంగా చూసి, ఏదో అడగబోయి మానుకుంది.
ఇద్దరూ మౌనంగా కొద్దిదూరం నడిచారు. పార్కు దగ్గిరికి వచ్చారు.
"రాజూ, చూడు నేనొకటి చెపుతాను వింటావా? ఇవాళ సినిమాకి పోవద్దు. మరెప్పుడైనా వెళ్ళవచ్చు. కాస్సేపు ఈ పార్కులో కూర్చుని మాట్లాడుకుని ఇంటికి వెళదాం! ఏం?" జానకి గేటు దగ్గిర నిలబడి అంది.
"అదేమిటి? ఇవాళ నువ్వు పరీక్ష ప్యాసు అయ్యావు కాబట్టి నాన్నగారు ఇద్దర్నీ సినిమాకు పంపించారు. రోజు మనకు కావాలన్నప్పుడల్లా పంపుతారా?"
"నాకేమిటో పాతవన్నీ గుర్తుకు వస్తున్నాయి. నేను సినిమా చూడలేను!"
"ఆ జ్ఞాపకాలు పోవడానికైనా సినిమా చూడాలి. తప్పకుండా."
"అంతకన్నా నీలాంటి ఆప్తురాలితో అవన్నీ మనస్సు విప్పి చెప్పుకొంటే కొంత ఉపశమనంగా ఉంటుంది. రా, రాజు, కొంచెంసేపు కూర్చుందాం" ప్రాధేయపడుతున్నట్లు అడిగింది జానకి.
రాజేశ్వరి కాదనలేకపోయింది. ఇద్దరూ మందార చెట్టుచాటున గడ్డి మీద కూర్చున్నారు.
"నువ్వు 'వెర్రిపిల్లా!' అనగానే ఎందుకలా అయిపోయానో చెప్పనా? నువ్వలా అన్నావని గాదు!.... కాని మా అమ్మ నన్ను గురించి అలాగే అనేది. ఎప్పుడూ అలాగే పిలిచేది. అందుకే ఆ రోజుల జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి, ఆమాట వినగానే."
"మీ అమ్మగారు నువ్వు పుట్టగానే పోయారన్నావుగా?"
"అవును, అమ్మ పోయింది. నాన్న మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఆమే నన్ను పెంచింది. ఆమె మాటే నేను చెప్పేది."
రాజేశ్వరి మాట్లాడలేదు. జానకి తత్వం ఆమెకు తెలుసు. పిల్లగాలికి కదిలే ఆకులకేసీ, గడ్డిమీద ఎగిరే ఏవో పురుగులకేసీ నిర్లిప్తంగా, అమాయకంగా చూసే ఆకళ్ల వెనక, అఖాతాల లోతు లున్నాయని ఆమె ఎరుగును. కదిలిస్తే ఆ లోతులోకి వెళ్లిపోతుందనీ తెలుసును.
"నేను చిన్నప్పటినించి ఇలానే ఏవో నాకే తెలియని ఆలోచనలలో ఇరుక్కుని, చుట్టుపక్కల సంగతులు పట్టించుకునేదాన్ని కాదు. ఇంట్లో నాతో కబుర్లు చెప్పడానికి, ఆడుకోడానికి అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు లేరు. చదువు వీధిబడి చదువుతోనే ఆగిపోయింది. అసలే పల్లెటూరు! నాన్న పోయేనాటికి పన్నెండేళ్లు! తరవాత అసలు ఇంటి బయటికి కూడా పోనిచ్చేది కాదు అమ్మ! నాలుగు గోడల మధ్య జీవితంలో చివరికి అదొకరకం మందమరుపుగా, మొద్దులా తయారయ్యాను!"
"నాన్నగారు నిన్ను ఆ పాత విషయాలెత్తవద్దన్నారా? మళ్లీ అవన్నీ ఎందుకు వల్లిస్తావు? లే, సినిమాకి." రాజేశ్వరి లేచింది.
"నేనిప్పుడు ఇదివరకటి మనిషిని కాదులే! అవన్నీ జ్ఞాపకం వచ్చినంత మాత్రాన పోయిందేంలేదు. అమ్మ నన్నెప్పుడు, 'వెర్రి మొద్దు, జడ్డిమాలోకం, వెర్రిపిల్లా!' అని పిలిచేది. నువ్విప్పుడు మళ్లీ ఆమాట అంటే అదంతా గుర్తుకు వచ్చింది. ఎలా ఉండేదాన్ని! ఎలా మారాను! అంతా గుర్తుకు వస్తే ఆశ్చర్యంగా ఉంటుంది నాకే" అదోలా నవ్వింది జానకి.
"గుర్తుకువస్తే మరిచిపోవాలిసిందే, నేనేం వినదల్చుకోలేదు. రా, పోదాం."
రాజేశ్వరి చెయ్యి పట్టుకు లాగుతూంటే జానకి తప్పనిసరిగా లేచింది. ఇద్దరూ పక్కన సినిమా హాలుకి నడిచారు.
సినిమా అంతా పాటలు, నృత్యాలు, నవ్వులు, కేరింతలతో గడిచింది. తెరమీద దొర్లే ప్రతి దృశ్యంమీదా, పలికే ప్రతి మాటమీద రాజేశ్వరి హాస్యంగా వ్యాఖ్యానిస్తూంటే జానకి ఆ మూడు గంటలూ మరో ప్రపంచంలోకి వెళ్ళిపోయింది.
జానకి సుమారు మూడేళ్ళనించి డాక్టరు ప్రసాద్ గారి ఇంట్లో ఉంటూంది. ఆమెది అదొకరకమైన వ్యాధి. ఆమె చుట్టూ పరిసరాలు, పరిస్థితులు మనస్సుకి కోత పెట్టేవిగా తయారయితే, వాటికి తట్టుకోలేక, వాటినించి విముక్తిలేక, ఆమె సున్నితమైన హృదయం తీవ్రంగా గాయపడింది. ఏవేవో పాడు ఆలోచనలు విపరీతంగా వేధిస్తూంటే, తట్టుకునే శక్తిలేక ఆమె ఒకరకం మూర్ఛలోకి వెళ్ళిపోయేది. ఆ కొత్త మానసిక స్థితిలో ఆమె ఎవరో ఏమి గుర్తు ఉండేదికాదు. ఆమెను కలవరపెట్టే ఆలోచనలే మాటల రూపంలో ఆమె నోటంట వచ్చేవి. శరీరం, మనస్సు వశంలో ఉండేవిగావు. ఒకోసారి ఎన్నో గంటల కొద్దీ, ఆకలిదప్పులు లేకుండా నిద్రలో మగతలో గడిచిపోయేవి మరొకప్పుడు అలా దిగాలుగా రోడ్డు మీద వెళ్ళిపోయేది ఎంతో దూరం, ఏటిగట్టున, శివాలయం మండపం మీద, తోటల మధ్య సృహలేకుండా పడి ఉండడం చూసి ఎవరో చెప్పాక, ఇంటికి చేర్చేవాడు ఆమె భర్త. ఏవేవో నాటు వైద్యాలు చేయించాడు, దేవుళ్ళకి మొక్కులు దెయ్యాలకి దెబ్బలు అన్నీ అయ్యాయి.