"హు, నీకు తెలీదు. నేనిచ్చే ఇల్లు, డబ్బు తనకెందుకు. తనకే ఉంది నన్ను కొనగలిగే డబ్బు. నిజం చెప్పాలంటే డబ్బుతోనే నన్ను కొనుక్కుంది. ఈ కంపెనీ అంతా తన భిక్ష. అలాంటి భార్యని కాదని నేనెలా అనగలను..." చాలాసార్లు ఈ విషయం ప్రీతికి నచ్చచెప్పేవాడు. తన అసహాయత వెల్లడించేవాడు. కాని ఉన్నంతసేపు ప్రీతి, కట్టుకున్న భార్యకంటే ఎక్కువగా డిమాండ్లు, అలకలు, కోపాలు, విసుగులు ప్రదర్శిస్తూ అతన్ని విసిగించడం ఆరంభించింది. ఇంట్లో భార్యతో సుఖం, హాయి దొరక్క వచ్చే వినోద్ కి, రోజులు గడుస్తున్నకొద్దీ ఆ కొత్తమోజు, ఆ ప్రేమ, ఆ స్వర్గసుఖాలు అన్నీ పాతబడి ప్రీతి దగ్గరికి వచ్చిన క్షణాలు ఆనందం కంటే ఇబ్బంది కలిగించడం ఆరంభించాయి. ఇటు ప్రీతి సాంగత్యం వదులుకోలేక, అటు ఆమె డిమాండ్లని తట్టుకోలేక నలిగిపోయాడు. దాంతో రాకపోకలు తగ్గించడం మొదలుపెట్టాడు. అది ప్రీతిని మరింత ఆగ్రహానికి గురిచేసింది. వచ్చినరోజున మనసారా ఆహ్వానించకుండా నీకు ఆడదాని సుఖం కావల్సిన రోజు వస్తావా, వెళ్ళు. ఇంట్లో భార్య ఉందిగా మరి నేనెందుకు, అంటూ ఎడమొహం పెడమొహం పెట్టి దెప్పేది. ఒకరోజు బతిమిలాడుతూ, మరోసారి ప్రాణం విసిగి, 'సరే, పోతాను. నీకు నామీద ప్రేమ పోతే ఇంక రానేరాను' అని అతను ఎగిరేవాడు. అప్పుడు 'కాస్త తగ్గాలి. నిజంగా రాకపోతే, అతన్ని వదులుకుంటే నష్టం ఎవరికి...' అనుకుంటూ మళ్లీ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ కౌగిలిలోకి ఒదిగిపోయేది. వినోద్ ని తనవాడిగా చేసుకునే ఆలోచనల్లో ఒక అద్భుతమైన ఆలోచన అనుకుని ఆచరణలో పెట్టింది. నెలరోజుల తర్వాత వినోద్ రాగానే సంతోషంతో ఎదురెళ్లి కౌగిలించుకుని, "వినోద్... నీకివాళ ఎంత శుభవార్త చెప్పబోతున్నానో ఊహించు. ఊహించలేవు. చెప్పాక నాకేం బహుమతిస్తావో ఊహించలేకపోతున్నాను" అంటూ ఊరించి, బతిమాలించుకుని... ఆఖరికి సిగ్గు, ఆనందం ఒలకబోస్తూ "వినోద్ మన మధ్య మనకో బిడ్డ... నీ బిడ్డ... నా కడుపున... ఓహో నీ రూపం నాలో... నాకు ఏం చెయ్యాలో తెలియనంత సంతోషం..."
వినోద్ కౌగిలి సడలిపోయింది. చటుక్కున ప్రీతిని వదిలేశాడు. అతని మొహం పాలిపోయింది. ఆ తరువాత నల్లబడింది. మరుక్షణంలో ఎర్రబడింది. కలపరంగా, కంగారుగా 'ఏమంటున్నావు నువ్వు?" తడబడుతూ అడిగాడు.
"వినోద్... మనిద్దరి ప్రేమసాక్షి... మనబిడ్డ..."
"ప్రీతి..." అరిచాడు. "మతిపోయిందా నీకు. మనకు పిల్లలేమిటి? ఎలా కుదురుతుంది? నలుగురికి ఏం చెబుతావు? మనం భార్యాభర్తలం కాదు. లోకాన్ని ఏ మొహంతో ఎదుర్కొంటాం? అసలు నీకు ముందే చెప్పానా లేదా మనిద్దరం చాలా జాగ్రత్తపడాలి ఈ విషయంలో అని. నా భార్యకిది తెలిస్తే చంపి పాతర వేస్తుంది. ఇంట్లో వాళ్లకి ఏం చెప్పాలి. నీకంటే పెళ్ళికాలేదు. నిన్ను నిలదీసేవారు లేరు. నా పరిస్థితి నీకు తెలుసు. అయినా ఇలా ఎందుకు చేశావు? ఆవేశంగా, ప్రీతి భుజాలు పట్టుకు ఊపేస్తూ అరిచాడు.
ప్రీతి నిర్లక్ష్యంగా అతనివైపు ఓ చూపు విసిరి, "ఇద్దరం కలిసి ఆనందించాం. దానికి నన్ను ఒక్కర్తినే ఎందుకంటావు. పెళ్ళి చేసుకోలేకపోయినా కలిసి కాపురం చేస్తూ పిల్లల్ని కంటే తప్పేమిటి? నాకు నా బిడ్డ కావాలనుకుంటే తప్పేమిటి? ఆడదాన్ని... తల్లినవ్వాలని నాకు కోరికుండకూడదా? ఎంతసేపటికీ నీ గురించే ఆలోచిస్తావు. నీకు పెళ్ళాం భయం, లోకభయం. కానీ ఆడదాని ఆనందం మాత్రం కావాలి. నాకలా కాదు. నాకు అన్నీ కావాలి. ఇల్లు, సంసారం, పిల్లలు అన్నీ కావాలి. పెళ్ళి కాకపోయినా, ఐడోంట్ కేర్..." తనూ గట్టిగా అరిచింది. విస్తుపోయాడు వినోద్. ఏం మాట్లాడాలో తెలియక గాభరా పడిపోయాడు.
"ఏమిటాచోపు... లోకంలో పిల్లల్ని కనబోతున్న మొదటి ఆడదాన్ని నేనే అన్నట్లు" దబాయించింది.
వినోద్ విసురుగా లేచి, ఆవేశంగా, "మాట్లాడకు. ముందు వెళ్లి డాక్టర్ ని కలువు. ఏం చేస్తావో, ఎలా చేస్తావో... ఈ బిడ్డ లోకంలోకి రాకూడదు అంతే" ఖచ్చితంగా తెగేసి అన్నాడు.
ప్రీతి విస్తుపోయింది. వినోద్ లో అంత కోపం ఎన్నడూ చూడని ఆమె కలవరపడుతూ, "ఏమిటి వినోద్? ఏమంటున్నావు?"
"వెళ్ళి వెంటనే అబార్షన్ చేయించుకోమంటున్నా" చాలా గట్టిగానే అన్నాడు. ప్రీతి మొహం ఎర్రబడిపోయింది. వినోద్ ఇంత రూడ్ గా ప్రవర్తిస్తాడని, ఇలా తెగేసి మాట్లాడుతాడని ఊహించని ఆమె బిత్తరపోయింది. తన ప్లాను బెడిసికొట్టినందుకు, తన ఆశ వమ్ము కాబోతున్నందుకు, ఆ నిరాశ తట్టుకోలేక ఆఖరి అస్త్రంగా "వినోద్, ఈ బిడ్డ నాక్కావాలి. అందుకు నేనొప్పుకోను. అబార్షన్ చేయించుకోను" నిష్కర్షగా అంది.
ప్రీతి అంత నిర్లక్ష్యంగా తనను, తన మాటలను లెక్కచెయ్యకపోవడంతో వినోద్ లో ఆగ్రహం పెల్లుబికింది. విసురుగా లేచాడు. "సరే, బిడ్డని కంటావో మానతావో నీ ఇష్టం. ఈరోజు నుంచి నీకు నాకు సంబంధం లేదు. ఇంక నీ మొహం నేను చూడను. గుడ్ బై!" ఆఖరి అస్త్రం వదిలాడు.
ప్రీతి విసురుగా లేచి అతని చెయ్యి పట్టిలాగి, "ఏమిటి గుడ్ బై? ఆ... ఇన్నాళ్లు వాడుకుని నన్ను వదిలేసిపోతావా? నా గర్భం నీ ఆనందానికి అడ్డని, ఈ బిడ్డ వల్ల నీ పరువు ప్రతిష్ఠలకి భంగమని వదిలించుకు పోదామనుకుంటున్నావా?" అపరకాళి అవతారం ఎత్తి అంది.
"ప్రీతీ... అర్థంచేసుకో, నా మాట వింటే మనం ఇలాగే ఉండొచ్చు. కాదంటే... నేను నా పరువు ప్రతిష్ఠని తాకట్టుపెట్టలేను. ఈ విషయం నా భార్యకి తెలిస్తే ఊరుకోదు. నన్ను నిలదీసి అడిగే హక్కు ఆమెకు ఉంది".
"నిన్నేమన్నా నీ భార్యగా ఇంటికి తీసికెళ్లమన్నానా లేక నీ పెళ్ళాం స్థానం ఇమ్మన్నానా? లేకపోతే నీ భార్యని వదిలేయమన్నానా? మనం ఏ గుళ్లోనో పెళ్ళి చేసుకుందాం. పుట్టబోయే బిడ్డకు తల్లిదండ్రులం అవుదాం. ఇదే కదా నేను అడుగుతోంది" ప్రీతి కోపంగా అంది.
"ఇదిగో ప్రీతీ, మన విషయం ఎంతో జాగ్రత్తగా ఎవరికీ తెలియకుండా ఇన్నాళ్ళు ఎలాగో సాగించాను. ఇప్పటికే ఆఫీసులో చాలామంది గుసగుసలాడుతున్నారు. బాస్ ని కనక పైకి తెలియనట్టే ఉంటున్నారు. ఈ విషయం ఇవాళ కాకపోతే రేపయినా నా భార్య దగ్గరికి చేరుతుంది. ఏదో విధంగా దబాయించో, అబద్ధాలు చెప్పో, ఎలా తప్పించుకోవాలో అర్థంకాక భయపడుతున్నాను. ఇలా నీ మెడలో తాళికట్టి పిల్లాడిని కంటే, ఆవిడ ఊరుకుంటుందా? సమాజం, చట్టం అంతా ఆవిడవైపే ఉంది అది మర్చిపోకు. అసలు నీకు నేను పెళ్ళిచేసుకుంటానని ఎప్పుడన్నా చెప్పానా? ముందురోజే నా పరిస్థితి చెప్పాను. ప్రేమకు, అనురాగానికి నోచుకోని నేను అవి దొరికే స్త్రీ పొందు కోరుకున్నాను. నువ్వు నాకు నచ్చావు కనుక నీతో సహజీవనం చేశాను. అంతకుముందు అమ్మాయిలతో రోజులు, మహా అయితే ఒక నెల... అంతకంటే ఎక్కువ ఎవరితోనూ ఇలాంటి పొత్తు పెట్టుకోలేదు. ఇవన్నీ నీకు ఏదీ దాచకుండా ముందే చెప్పాను. నువ్వు అన్నింటికీ ఇష్టపడే, నన్ను నిజంగానే ప్రేమించావని నమ్మాను. నిన్ను గత ఏడాదిగా ఎంత అపురూపంగా చూసుకున్నాను. నువ్వు ఏదడిగినా కాదనకుండా సమకూర్చాను అపార్ట్ మెంట్, కారు, నీకు నటిగా, మోడల్ గా గుర్తింపు తెచ్చే అవకాశాలు... ఎన్ని ఇచ్చా. ఇవన్నీ నేను ఇష్టపడే చేశాను. మరి నువ్వు నన్ను నిజంగా ప్రేమించావో, నీ స్వార్థం కోసం ప్రేమ చూపావో, ఈ ఫ్యాషన్ వరల్డ్ లో నీ స్థానం కోసం నన్ను వాడుకున్నావో నాకు తెలియదు. తల్లికావాలి అనే నీ కోరికని నేను తీర్చలేను. ఆ బిడ్డకి తండ్రిగా ఉండలేను. నా మాట అంగీకరిస్తే మన సంబంధం కొనసాగుతుంది. లేదంటే నన్ను మర్చిపో. ఇదే నా ఆఖరి మాట. ఆలోచించి, ఏ సంగతీ రేపు చెప్పు. నన్నేదో బ్లాక్ మెయిల్ చేద్దామని మాత్రం అనుకోకు" అన్న వార్నింగ్ కూడా ఇచ్చి చకచకా వెళ్లిపోయాడు వినోద్.