నిర్ఘాంతపోయి కూలబడిపోయింది ప్రీతి. మొహం ఎర్రబడి, కళ్లు నీళ్లతో నిండిపోయాయి. తన ఆశ, కోరిక తీరేది కాదని వినోద్ ఖచ్చితంగా చెప్పేశాడు. జీవితాంతం ఇలా అతని ఉంపుడుగత్తెగా ఉండిపోవాలా? పెళ్ళి, సంసారం, పిల్లలు లేకుండా గడపాలా? ఇవాళ ఉన్న ఈ ప్రేమ ఎన్నాళ్లుంటుంది? ఈ ప్రేమని నమ్ముకుని ఎలా బతకాలి? పెళ్ళి లేని ప్రేమకి మగాడు కట్టుబడడు. ఈ సంఘటన తర్వాత అతను ఇదివరకటి ప్రేమ చూపకపోవచ్చు కూడా! ఇంక ఇది మూన్నాళ్ల ముచ్చటే అవగలదు. తను అతన్ని కాదని బిడ్డని కంటే, పెళ్ళి కాకుండా బిడ్డను కన్న తనను లోకం గౌరవిస్తుందా? వినోద్ తో సంబంధం తెంచుకుంటే రేపు తనకి అవకాశాలు తగ్గవచ్చు. ఏ ధైర్యంతో తను ముందుకెళ్లగలదు? రాత్రంతా ఆలోచించినా పరిష్కారం కనబడలేదు. మనసులో కోపం, కసి పెరిగిపోయి, ఇన్నాళ్లు తనను వాడుకుని వదిలేశాడన్న ఉక్రోషంతో రాత్రంతా నిద్రపట్టక దొర్లింది. మర్నాడు ఫోన్ చేస్తానని, కోపం తగ్గి వస్తాడని ఆశించింది. ఒక రోజంతా చూసి తనే ఫోన్ చేసింది.
"ఏం నిర్ణయం తీసుకున్నావు" ముభావంగా అడిగాడు.
"ఇంకా ఆలోచించలేదు" బింకంగా అంది. ఫోను టక్కున పెట్టేశాడు.
మూడు రోజులు అదే పరిస్థితి. ఫోన్ చేసినా కట్ చేసేవాడు. మెసేజ్ పెడితే 'నిర్ణయం మార్చుకుంటే తప్ప మాట్లాడకు' అని జవాబిచ్చాడు. అతని నిర్లక్ష్యం ఆమెలో మరింత కోపం, కసి, ఉక్రోషాన్ని పెంచాయి.
అసలు తన గురించి ఏమనుకుంటున్నాడు. ఇష్టం వచ్చినట్టు వాడుకుని వదిలేసిపోతే, ఊరుకుంటానని అనుకుంటున్నాడా? ఏం చెయ్యలేనని ధైర్యమా? ఒకరకం తెగింపు వచ్చింది ప్రీతికి. అతనిమీద కోపంతో రగిలిపోతూ, విచక్షణా జ్ఞానం పోగొట్టుకుంది. ఆమె ఓ నిర్ణయానికి వచ్చి అతనికి బుద్ధి చెప్పాలని, దానికి ఏం చెయ్యాలో ఆలోచించే లోపల... కాగల కార్యం గంధర్వులే తీర్చారు.
* * * *
దీనికిముందు, వారం రోజుల క్రిందట... ధనిక వర్గం లేడీస్ కిట్టిపార్టీలో సుస్మిత ప్రాణస్నేహితురాలు కాంచన, స్నేహితురాలిని ఓ మూలకి లాక్కెళ్ళి... "ఏమిటి, నువ్వు మీ ఆయన రాసలీలలు తెలిసే ఊరుకున్నావా, తెలియదా అసలు?" గుసగుసలాడింది. "నీకు ఎలా చెప్పాలో, ఎలా అడగాలో తెలియక వారంరోజులుగా మథనపడుతున్నాను. ఫోన్ చేద్దామనుకున్నాను కానీ, ఫోనులో సంభాషణ ఎవరన్నా వింటారేమోననిపించి, కలిసి మాట్లాడాలనుకున్నాను" అంటూ ఆరంభించింది.
"నువ్వేమంటున్నావు? మా ఆయన రాసలీలలేమిటి?" తెల్లబోతూ అడిగింది సుస్మిత.
"అంటే నీకసలు ఏడాదిగా జరుగుతున్న భాగోతం గురించి ఏమీ తెలియదా?"
సుస్మిత మరింత తెల్లబోతూ కలవరంగా చూసింది. తెలియదన్నట్టు తల అడ్డంగా ఊపింది, పాలిపోయిన మొహంతో.
"మీ ఆయన ప్రీతి అన్న అమ్మాయితో లివిన్ రిలేషన్ షిప్ చేస్తున్నాడు. ఒక మంచి అపార్ట్ మెంట్ కొనిచ్చాడట. కారు, డబ్బు, వేషాలు, యాడ్ వరల్డ్ లో బోలెడు అవకాశాలు అన్నీ ఇచ్చి తనతో రెండో సెటప్ పెట్టాడు. నువ్వు ఇంత అమాయకంగా ఎలా ఉన్నావు సుస్మిత? ఇంట్లో మగాడిలో మార్పు కూడా కనిపెట్టలేకపోయావా? ఇంత జరుగుతుంటే ఈ వార్త నీదాకా రాలేదా?"
సుస్మిత వెర్రిమొహం పెట్టింది. తెల్లబడిన మొహం నల్లబడింది. "నిజంగానా? నువ్వు చెప్పేది నిజమేనా?" అంది పళ్ళ బిగువున.
"బాగుంది, నీతో ఇలాంటి విషయాల్లో అబద్ధం ఎందుకు చెపుతాను?"
"నీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు నీకు?" ఆరా తీసింది.
"నాకు మొన్న తెలిసింది. మా ఆడపడుచు కూతురు ఆ అపార్ట్ మెంట్స్ లోనే ఉంటుంది. ప్రీతి చాలామందికి తెలుసు. ప్రకటనల్లో, పత్రికలలో, యాడ్స్ లో, టీ.వి. యాడ్స్ లో చూస్తారు కదా అందరూ. ఆ అమ్మాయిని అందరూ చూసేవారు. కొంతమంది ఆ అమ్మాయితో కాస్త పరిచయం పెంచుకున్నారు. ఏ లిఫ్ట్ లోనో, వచ్చేటప్పుడో, పోయేటప్పుడో 'హాయ్' అన్న పలకరింపు. ఓ చిరునవ్వు తప్ప ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడకపోయినా, అదే భాగ్యంగా అనుకునేవారు అక్కడ ఉండేవారు. ఆ అమ్మాయింటికి వినోద్ వచ్చి పోవడం చాలామందే చూసినా, పెద్ద కారులో వచ్చే వినోద్ ని అడిగేవారెవరు. యాడ్ వరల్డ్, ఫ్యాషన్ వరల్డ్ లో బాయ్ ఫ్రెండ్సు, లవర్స్ కామన్. అది అందరికీ తెలిసిందే. అందుకే చూసీ చూడనట్లుండేవారు".
"మరి..." ఆరాటంగా అడిగింది.
"ఇన్నాళ్లు మా ఆడపడుచు కూతురు సుజాత కూడా అదే అనుకుందిట. పదిహేను రోజుల కిందట మా ఇంట్లో మేరేజ్ ఏనివర్సరి పార్టీ ఇచ్చినప్పుడు నువ్వు, వినోద్ వచ్చారు గదా. ఆ పార్టీకి సుజాత, వాళ్లాయన కూడా వచ్చారు. అక్కడ వినోద్ ని చూసి ఆశ్చర్యంగా అతనెవరు? అంటూ ఆరా తీసింది. ఊరికే అడిగిందేమో అనుకుని వినోద్ గురించి, మీ కంపెనీ గురించి, నువ్వు అతని భార్యవని అన్ని విషయాలు మర్నాడు మాట్లాడుకున్నాం. సుజాత అప్పుడు వినోద్ గురించి, ప్రీతి గురించి చెప్పింది విని ఆశ్చర్యపోయాను. నమ్మలేకపోయా. వెంటనే నీకు చెప్పకుండా సుజాతని అన్ని విషయాలు నాలుగైదు రోజులు కనిపెట్టి చెప్పమన్నాను. వాచ్ మేన్ ద్వారా పక్కనుండే అపార్ట్ మెంట్ వారి ద్వారా అతని రాకపోకలు, వివరాలు పూర్తిగా చెప్పమన్నాను. అతను సాధారణంగా సాయంత్రం వచ్చి రాత్రి పది గంటల వరకు ఉంటాడు. ఒక్కోసారి సూట్ కేసుతో వచ్చి రెండు మూడు రోజులుండేవాడు. కనీసం రోజుకొక సారన్నా ఏదో ఒక టైములో వస్తాడు. ఇద్దరూ కలిసి బయటికి మాత్రం వెళ్లేవారు కాదు అని చెప్పింది సుజాత. నీకు చెప్పేముందు అన్నీ రూఢీగా తెలుసుకునే చెప్తున్నాను" అంది స్నేహితురాలు కాంచన.