వినోద్ జీవితంలో ప్రీతి తారసపడేవరకు, అతని రిలేషన్ షిప్ లన్నీ ఒక రాత్రి, ఒక వారం, మహా అయితే ఒక నెల తప్ప అతన్ని కట్టిపడేసే, సమ్మోహపరిచే బంధం తటస్థపడలేదు.
మిగతా ఆడపిల్లలకి, ప్రీతికి చాలా తేడా కనిపించింది వినోద్ కి. అందచందాలను మించి ఆమెలోని ఆకర్షణ, ఆమెలోని జాణతనం, సోఫిస్టికేషన్, మాటల్లో హాస్యచతురత, తెలివిగా కౌంటర్ ఇవ్వడం, అతన్ని ఊపిరి సలపని అనురాగంలో ముంచెత్తి... తను వెతికింది ఇలాంటి తోడుకోసం, ఇలాంటి పొందుకోసం అనుకొని అల్లాడాడు. భావుకత, సౌందర్యం, నిజమైన ప్రేమను ఆమె దగ్గర పొందాడు.
తల్లిలా ఆదరించి ఆకలి కనిపెట్టి, ఇల్లాలిగా అనురాగం, దాసిలా సేవ, మంత్రిగా సలహా, ఒక స్త్రీలో పురుషుడు కోరుకునేవన్నీ ప్రీతిలో కనిపించాయి. ఇద్దరి భావాలు, వేవ్ లెన్త్ కలిసి ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకుని, చర్చించగల తెలివి ఆమెలో చూసి, ఆమెలో అన్ని గుణాలకి సరెండర్ అయిపోయి, 'తను కోరుకున్న స్త్రీ దొరికింది' అని తృప్తిగా ఇంకో అమ్మాయి వైపు కన్నెత్తి చూడని అనుబంధం ఇద్దరి మధ్య ఏర్పడింది. తోటి అమ్మాయిలతో కలిసి ఉండే ప్రీతిని ఎప్పుడుబడితే అప్పుడు కలిసే వీలులేక, తమ ఇద్దరికి ప్రైవసీ కోసం, తమ రాకపోకలు ఎవరికంటా పడకుండా ఉండడం ప్రీతిని తన తాహతుకు సరిపోయే అపార్ట్ మెంట్ అద్దెకి తీసుకుని షిఫ్ట్ చేశాడు. ఇద్దరూ ప్రణయ సామ్రాజ్యాన్ని ఏలుతూ, పరిసరాలనే మరిచిపోయారు. ప్రీతిని యాడ్ వరల్డ్ లో స్టార్ ని చేయడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేసి, పేరు, డబ్బు సంపాదించుకుని తనకో గుర్తింపు తెచ్చుకునేట్టు చూశాడు. ప్రీతితో తన సంబంధం ఎంత గుట్టుగా ఉంచినా, ఇలాంటివి ఎక్కువ రోజులు దాచలేరు అన్నది నిజమైంది. ప్రీతి వేషభాషలు, రిచ్ నెస్, వేరే అపార్ట్ మెంట్ తీసుకోవడం, ఇవన్నీ మిగతా అమ్మాయిల దృష్టి నుంచి తప్పించలేకపోయాడు. వినోద్, ప్రీతి బాడీ లాంగ్వేజ్, ఒకరిని చూసి ఒకరి మొహంలో, కళ్ళలో కనపడే ప్రేమోన్మాదం అందరికీ అర్థమవసాగింది. కొడుకులో మార్పు అర్థమై అన్వర్ ని పిలిచి విషయం ఆరా తీశాడు అవినాష్. తర్వాత కొడుకుని పిలిచి శ్రేయోభిలాషిగా, తండ్రిగా ఇలాంటి రిలేషన్ షిప్ లు ఎలాంటి అనర్థాలకి దారితీస్తాయో చెప్పి హెచ్చరించాడు. "నీవిన్నాళ్లు ఏం చేసినా, తెల్సినా నిన్ను ఏమనలేదు. జీవితంలో అనుభవానికి రానిది కొన్నాళ్లు అనుభవించనీ అనుకున్నాను. అప్పుడప్పుడు అటాచ్ మెంట్ లు లేని అనుభవాలు ఫరవాలేదు. కానీ రేపు నీ భార్యకి తెలిస్తే చాలా చిక్కులు వస్తాయి. తెలిసి ఏ భార్యా సహించదు. ఆఫీసులో నీ గౌరవం, మర్యాద, కుటుంబ పరువు అన్నీ ఆలోచించు" నచ్చచెబుతూ అన్నాడు. అన్నీ మౌనంగా విన్నాడు వినోద్, తలవంచుకుని. తరువాత తలెత్తి తండ్రికి రెండు చేతులతో దండం పెట్టాడు. "డాడీ, ప్లీజ్! ఇన్నాళ్లకి నాకు దొరికిన ఈ ఆనందం, తృప్తిని వదలలేను. కొన్నాళ్లయినా నన్ను సంతోషంగా బతకనీయండి. నా జాగ్రత్తలో నేనుంటాను" అన్నాడు. కొడుకు వంక చూసి, ఆయన ఇంకేం అనలేక మౌనం వహించాడు.
ఒక ఆరునెలలు ప్రీతి సాంగత్యంలో సర్వం మరిచి ఓలలాడాడు. ప్రీతికి ఎన్నో ప్రకటనల ఆఫర్లు, యాడ్ ఫిలిమ్స్, చిన్న చిన్న షార్ట్ ఫిలిం ప్రకటనలతో తీరిక లేకుండా పోయింది. చేతినిండా డబ్బు, ఇంటినిండా సామాను, రకరకాల డ్రెస్సులు, ఫ్యాషన్ షోలు... తన సమర్థత మీద తనకి విపరీతమైన నమ్మకం, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ప్రీతిలో అహంకారం పాలు ఎక్కువయింది. వినోద్ తనవాడు, తనని వదిలిపోయే ప్రసక్తిలేదన్న నమ్మకంతో వినోద్ ని సొంతం చేసుకోవాలన్న ఆలోచన మొదలైంది. ఈ యాడ్ వరల్డ్, ఫ్యాషన్ వరల్డ్ లో ఈనాటి ఆకర్షణ, అందం, ఎన్నాళ్లో అందరినీ ఆకర్షించలేదు. కొత్త మొహాల కోసం వెతుకులాట, పాతవారిని చిత్తుకాగితంలా బుట్టలో పడేస్తారన్న నిజాలు చుట్టూ చూసి తెలుసుకుంది. తన భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే వినోద్ అండ వదులుకోకూడదు. అతను తనకు సొంతం అవడానికి ఏం చెయ్యాలో దారులు వెతికింది. తనకోసం అద్దెకి తీసుకున్న అపార్ట్ మెంట్ కొనిపించింది. డబ్బు ఖర్చు పెట్టి ఆ మాత్రం చేయడం వినోద్ కి సమస్య కాదు. కనీ ఈమధ్య తరచు ప్రీతి తనను ఇబ్బంది పెట్టే కోరికలు కోరుతోంది. అతి ప్రేమతో అల్లుకుపోతూ "వినోద్, నువ్వు శాశ్వతంగా నావాడివి కావాలి. నాకెందుకో నువ్వు నన్ను వదిలి పోతావన్న భయం వేస్తోంది డియర్. ఇలా ఎన్నాళ్లు ఈ బంధం నిలుపుకోగలం. ఈ దొంగచాటు బతుకు ఎన్నాళ్లు? వినోద్ నన్ను పెళ్ళిచేసుకో. అప్పుడే నాకు నిశ్చింత. ఈ బెంగతో రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టడం లేదు. నీవెప్పుడు వస్తావోనని ఎదురు చూపులు, రాని రోజున ఆ నిరాశ తట్టుకోలేక ఏడుపు వస్తుంది. ఆ వియోగం తట్టుకోలేకపోతున్నాను..." గుండెలమీద తలపెట్టి కన్నీరు పెట్టుకుంది.
"ప్రీతి డార్లింగ్! ఏ రోజన్నా ఏదో టైమ్ లో రాకుండా ఉంటున్నానా? నీకెందుకు అలాంటి అనుమానాలు. డియర్ నీకంటే నాకే నీ అవసరం ఎక్కువ. నిన్ను వదిలి ఉంటున్న క్షణాలన్నీ యుగంలా అనిపిస్తాయి. ఆఫీసులో ఉన్నంతసేపే నేను ప్రశాంతంగా ఉంటాను. ఇంటికెళ్ళిన ప్రతిక్షణం నీవు లేని లోటుతో సతమతమవుతున్నా. ఏం చెయ్యగలను... కొన్ని మన చేతుల్లో ఉండవు. ఉన్నదాంతో సర్దుబాటు చేసుకో. ఉన్నంతలోనే ఆనందాన్ని అనుభవించడం..." సర్ది చెప్పేవాడు.
"అవును, ఆనందాన్ని అనుభవించడానికి నేను కావాలి కాని సమాజంలో, నీ ఇంట్లో స్థానం ఇవ్వవు. పబ్లిక్ గా నేను నీదాన్నని గర్వంగా చెప్పుకోలేను. దొంగచాటు బతుకు ఎన్నాళ్ళు వినోద్. నాకు ప్రియుడే భర్త అనుకుంటూ ఎన్నాళ్లు? ఇల్లు, పిల్లలు, సంసారం కావాలనిపించదా?" అలిగేది. బతిమాలుతూ, విచలితురాలై కంటనీరు పెట్టుకునేది. మొదట్లో వినోద్ ప్రీతి బాధగా అంటుంటే నిస్సహాయంగా, "నేనేం చెయ్యను డార్లింగ్... నీకు తెల్సు నేను పెళ్ళయినవాడిని. తండ్రిని. తల్లిదండ్రుల మధ్య బతుకుతున్నవాడిని. సంఘంలో పరువు ప్రతిష్ఠ, మిగతావి అన్నీ ఉంటే ఉండనీ లేకపోతే పోనీ అనుకోగలిగినా, భార్య ఊరుకుంటుందా... భర్త మళ్ళీ పెళ్ళి చేసుకోడానికి..." అని చాలా దిగులుగా అనేవాడు.
"ఏం ఆ పెళ్ళాం లేకపోతే బతకలేవా? డివోర్స్ ఇవ్వు. ఎలాగూ ఆమెతో ఏ సంతోషం లేదని నువ్వే చెప్పావు. అలాంటి భార్యని పట్టుకుని వేలాడాలా? ఆమెకి కావల్సిన ఇల్లు, డబ్బు ఇచ్చేయి. విడాకులు తీసుకో..."