"ఇంటి దగ్గిర కొంచెం__" నసిగాడు ప్యూన్.
"పని వుంది. వెళ్ళు. నైట్ వాచ్ మన్ కి తాళాలు నేను ఇచ్చి వెళ్తాలే" అన్నాడు షణ్ముఖం.
జవాబు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.
షణ్ముఖం మెడమీద చెయ్యి పెట్టుకొని వెనక్కు విరుచుకున్నాడు. మెడ నొప్పిగా వుంది.
ఎదురుగా బోసి నవ్వులతో పలకరిస్తున్న గాంధీ మహాత్ముని పటం కన్పించింది.
ఆ ముఖంలో ఎంత ప్రశాంతతా! నవ్వులో ఎంత చల్లదనం! ఆ కళ్ళలో ఎంత వెలుగు! ఎంత నిరాడంబర జీవి? తనకేం తక్కువని వంటినిండా బట్ట కూడా కట్టుకోకుండా సన్యాసిగా బతికాడు? ఎవరికోసం? తన కోసం కాదు. తన దేశం కోసం! తన దేశంలోని ప్రజల కష్టాల నివారణ కోసం! ఎన్ని బాధలు పడ్డాడు! ఎన్నిసార్లు జైలుకు వెళ్ళాడు! ధన్యజీవి! మానవజన్మ అంటే అది.
మరి తనో! తన ఇంట్లో వారి కష్టాలను కూడా తీర్చలేకుండా వున్నాడు. పైగా విసుక్కుంటున్నాడు. తన బిడ్డల్నే తను సుఖపెట్టలేక పోతున్నాడు.
గాంధీజీ లోక కల్యాణం కోసం జైలుకు వెళ్ళాడు. స్వరాజ్యం తెచ్చాడు. మరి తనూ, తనలాంటి వారూ ఇంకా ఇలాగే వున్నారేం?
క్షణం తీరిక లేని పని, ఎప్పుడూ ఎలుగ్గొడ్డులా అరిచే ఆఫీసరూ, శరీరాన్ని, ఆత్మనూ అమ్ముకొని సంపాదించే నెల జీతం రెండువందల రూపాయలూ, క్షణకాలం శాంతి లేని కొంపా, ఎప్పుడూ ఏడుస్తూ ఎదురయ్యే ఇల్లాలూ, సాధించే తల్లీ, అది కావాలి ఇది కావాలి అని ఏడ్చే పిల్లలూ, ఎప్పుడూ రోగాలూ, మందులూ...
"ఖంగ్ ఖంగ్" చిన్న కొడుకు దగ్గు.
"నాన్నా, నాన్నా" జబ్బుతో వున్న చిన్న కూతురి కలవరింత.
"జామెంట్రీ బాక్సు" పెద్ద కొడుకు నిద్రలో.
"ఇవ్వాళ్ళైనా పెందలాడే వస్తారా?" కలలో పలకరిస్తూ భార్య.
"ఒరే నాయనా! ఇంట్లో సరుకులు నిండుకున్నాయిరా!" మూగగా తల్లి గొణుగుడు.
షణ్ముఖం చెవులు మూసుకున్నాడు. అయినా మాటలు విన్పిస్తూనే వున్నాయి.
"హే! మహాత్మా. నా కళ్ళు తెరువు. నాకు వెలుగును ప్రసాదించు! నాకు జ్జ్ఞానబోధ చెయ్యి. నన్నేం చెయ్యమంటావ్?" గాంధీ మహాత్ముని ఫోటోకేసి చూస్తూ పైకే అన్నాడు షణ్ముఖం.
గోడ గడియారం తొమ్మిది కొట్టింది. క్యాష్ బుక్ క్లోజ్ చేసి క్యాష్ బాక్సు తీశాడు. క్యాష్ లెక్కపెట్టుకున్నాడు. సరిపోయింది. ఆఫీసరు ఇంటికి వెళ్ళాలా వద్దా అనే ఆలోచనలో పడ్డాడు.
మహాత్ముని కేసి చూశాడు. రెండు చేతులూ జోడించి నమస్కరించి స్వామీ! జ్ఞానోదయం అయింది అన్నాడు.
షణ్ముఖం ఇంటికి చేరేప్పటికి పది దాటింది.
అందరూ నిద్రపోయారు.
ఆదిలక్ష్మి మాత్రం దర్వాజాకు చేరబడి జోగుతూ వుంది.
షణ్ముఖం భార్యకు తగలకుండా లోపలకు వచ్చాడు.
అలికిడికి ఆదిలక్ష్మి కళ్ళు తెరిచింది. భర్తను చూసి లేచి నిల్చుంది.
"ఏమండీ!" ఆదిలక్ష్మి ఏడుపు గొంతు.
షణ్ముఖం కసిగా వెళ్ళి తలుపులు బిగించుకున్నాడు.
మూసుకున్న తలుపులకేసి చూస్తూ నిట్టూర్పు విడిచింది.
* * * *
"ఒరేయ్ పెదబాబూ! మీ నాన్నను లేపారా ఎనిమిది దాటింది. ఇంకా నిద్రేమిటి!" కొడుకుని పిల్చి అన్నది ఆదిలక్ష్మి.
ప్రసాదు తలుపు కొట్టాడు. తలుపులు తెరుచుకున్నాయి. తండ్రి పడుకునే నులక మంచం ప్రసాదు ముఖంలోకి బోసిగా చూసింది.
"అమ్మా? నాన్న కన్పడ్డం లేదు?" బిక్క మొహంతో అన్నాడు ప్రసాదు.
ఆదిలక్ష్మి మాటా పలుకూ లేకుండా కుప్పకూలి పోయింది.
"ఒరే నాయనా! ఏమైపోయావురా" తల్లి రాగాలు పెట్టసాగింది.
మధ్యాహ్నం పోలీసులు షణ్ముఖం ఇంటిని ముట్టడించారు. ఇల్లూ, దొడ్డి అంతా సోదా చేశారు. ఇంట్లో అడగాల్సిన ప్రశ్నలు అడిగి పోలీసులు వెళ్ళిపోయారు.
వీథి వాకిలి ముందు జనం చేరారు.
"మనిషి చూస్తే బుద్ధిమంతుడిలా కన్పించేవాడు."
"బాగా చదువుకున్నవాడు! ఇదేం పని."
"ఒకటా రెండా ... ఇరవై వేలు ..." తలా ఒక మాట అంటున్నారు.
ఆదిలక్ష్మి బిడ్డల్ని ఒళ్ళో పడుకోబెట్టుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ వుంది.
తల్లి మంగమ్మ గుండెలు బాదుకుంటూ భోరు భోరున ఏడుస్తూ వుంది.
మూడోరోజు రాత్రి ఆదిలక్ష్మి అన్నయ్య రంగనాథం విజయవాడ నుంచి వచ్చాడు.
"అన్నయ్యా!" అన్నను చుట్టుకొని ఆదిలక్ష్మి గుండె పగిలేలా రోదించింది.
"ఊరుకో అమ్మాయ్! ఏం చేస్తాం రేపు కృష్ణా ఎక్స్ ప్రెసుకు వెళ్దాం. సామాను సర్దు!" అన్నాడు రంగనాథం.
"నీ సంసారమే అంతంత మాత్రంగా వుందే, ఇంతమందినీ తీసుకెళ్ళి నువ్వేం చేస్తావ్ అన్నయ్యా?" ఏడుస్తూనే అన్నది.
"పోయిన వాడు పోయినా - గుడ్డిలో మెల్లగా ఒకదారి చూపించి పోయాడులే. నీ బిడ్డలు చదువుకొని ప్రయోజకులు అయిందాకా సుఖంగా బతకొచ్చులే!" చెల్లెలి చెవి దగ్గిర చిన్నగా అన్నాడు రంగనాథం.
ఆదిలక్ష్మి వెర్రిదానిలా అన్నయ్య ముఖంలోకి చూసింది.
"ఊఁ త్వరగా సామాను సర్దుకో! మళ్ళీ చీకటితోనే లేవాలి." అన్నాడు రంగనాథం.
** ** **