పాత కథే
రేఖా, రమేశ్ ప్రేమించుకున్నారు.
ఇద్దరూ అందమైన వాళ్ళు పేర్లుకూడా ఎంతో అందంగా వున్నాయ్. ఒకే కాలేజీలో, ఒకే క్లాసు చదువుకొంటున్నారు.
"మరి ప్రేమించుకోకపోతే ఏం చేస్తారు? నువ్వు కొత్తగా చెప్పేది ఏమిటి బోడి!" అంటున్నారు గదూ?
నేను కొత్తగా ఏం చెప్పడం లేదు. పాతకథే చెబుతున్నాను. అవును! ఒప్పుకుంటాను - "ప్రేమ" ఈ పదం అరిగిపోయి తుప్పు పట్టిన రికార్డులోని మాటేనని!
నేను కొత్త విషయం చెప్పడం లేదు. పాతకథే చెబుతున్నాను.
ఎందుకు మళ్ళీ పాతకథే చెప్పడం అంటున్నారా?
ప్రేమ కథను ఎన్నిసార్లు చెప్పినా మీరు కొత్తగానే వింటారుగా? అందుకే చెబుతున్నాను.
చెప్పిందే చెప్పినా ప్రేమ కథలయితే ఆవురావుమంటూ చదువుతారు కనకనే చెబుతున్నాను.
"యుగయుగాలుగా పూలు వికసిస్తూనే వున్నాయ్. గులాబి పువ్వుల్ని నిత్యం చూస్తూనే వుంటాం. అయినా మన వాకిట్లో పూచిన గులాబి పువ్వులు ఎన్నడూ గులాబిని చూడనట్టే ఆసక్తిగా, ఆనందంగా చూస్తాం. గాలి కూడా ఆ పువ్వును ఉపేక్షించదు. దాని సుగంధాన్ని దశదిశలా వ్యాపింప చేస్తుంది. అలాగే పాత మాటలు కొత్త భావాన్ని వ్యక్తం చేసినప్పుడు కొత్తగా విన్పిస్తాయి."
"ప్రేమ అనే శబ్దం పాతదే కావచ్చు. కాని ఆ శబ్దాన్ని పలికే ప్రతి వ్యక్తి పెదవుల మీద కొత్తదనాన్ని పుణికి పుచ్చుకుంటుంది. ప్రతివ్యక్తి హృదయంలో కొత్త కొత్త అనుభూతుల్ని కలిగిస్తుంది. అందుకే ప్రేమ నిత్యనూతనం అయింది" అని నేను అనడం లేదు.
ప్రేమ కథలు వినేవారూ, చెప్పేవారూ అంటూ వుంటారు. అందుకే పాత కథనే కొత్తగా చెప్పాలనుకున్నాను.
పాత ప్రేమకథే రేఖా రమేశ్ ల మధ్య కొత్తగా ప్రారంభం అయింది.
రేఖ చక్కగా అలంకరించుకొని కాలేజీకి వస్తుంది.
"బాపూ" వేసిన ముఖ చిత్రంతో వెలువడిన దీపావళి స్పెషల్ మాసపత్రికలా ఆమె కాలేజీ విద్యార్థుల్ని ఆకర్షిస్తుంది.
ఆమె నడక చూస్తుంటే, రాచకొండ కథ చదువుతున్నట్టు విద్యార్థులకు అద్భుతమైన అనుభూతి (థ్రిల్లింగ్) కలుగుతుంది.
ఆమె కళ్ళల్లో కలలు కదిలిపోతూ వుంటాయి.
ఆమె మనసునిండా మధువు వుంది.
ఆ మధువుని ఎవరి దోసిట్లోనైనా పొయ్యాలనే ఆరాటం వుంది ఆమె హృదయంలో.
ఆమె నవ్వితే ఇంద్ర ధనస్సులు విరిగి పడ్తాయి.
ఆమె మాట్లాడుతూ వుంటే ఉర్దూ కవిత్వం వింటున్నట్టు వుంటుంది.
కాలేజీ మాగజైన్ లో ఓ కుర్రాడు ప్రేమ కథే రాశాడు. ఆ కథలో హీరోయిన్ "రేఖే" అన్నారు అందరూ.
మరో కుర్రాడు ప్రేమ కవిత్వం రాశాడు.
అదీ ఆమెను గురించే అన్నారు అందరూ.
ఆమెలో హేమమాలిని పోలికలున్నాయని కొందరంటే కాదు వాణిశ్రీ పోలికలు వున్నాయన్నారు మరికొందరు విద్యార్థులు.
అందాలరాశి రేఖ కోసం ఎందఱో విద్యార్థులు తమ హృదయాలను పారేసుకున్నారు. ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు.
హృదయాలు పారేసుకున్న వాళ్ళలో రమేశ్ కూడా వున్నాడు.