Previous Page Next Page 
సీతాచరితం పేజి 20


    తాటక


    ఆ రాత్రి వారు అక్కడే పడుకున్నారు. తెల్లవారి లేచారు. నావ ఎక్కారు. వారిని మునులు సాగనంపారు. పడవ కదిలింది. పడవ నది మధ్యకు చేరింది. అక్కడ ఒక పెద్ద ధ్వని వినవచ్చింది. దానికి కారణం ఏమని రాముడు అడిగాడు. అందుకు విశ్వామిత్రుడు యిలా చెప్పాడు. " బ్రహ్మ తన మనస్సుతో ఒక సరస్సు సృష్టించాడు. అది కైలాస పర్వతం మీద పుట్టింది. ఇది గంగా సరయుల సంగమం, సరయు ఎత్తునుండి గంగలో పడ్తుంది. అందువల్ల ఈ శబ్దం, ఇది పవిత్ర సంగమం, దీనికి నమస్కరించండి.


    రామలక్ష్మణులు ఆ నదికి నమస్కరించారు. ఓడ దరికి చేరింది. వాళ్లు దిగారు. అక్కడ వారికి భయంకరమైన అడవి కనిపించింది. ఆ అరణ్యమును గూర్చిన కథ చెప్పమని రాముడు విశ్వామిత్రుణ్ణి అడిగాడు. విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు :-


    "ఒకప్పుడు ఇంద్రుడు వృత్తాసురుని సంహరించాడు. అతనికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకొంది. అతనికి మాలిన్యం, ఆకలి ఎక్కువైంది. అప్పుడు దేవతలు, ఋషులు ఒక్కచోట చేరారు. వారు ఇంద్రునికి మంత్రజలంతో స్నానం చేయించారు. దానితో అతనికి ఆకలి, మాలిన్యం దూరమయ్యాయి. ఇంద్రుని మాలిన్యాన్నీ, ఆకలినీ గ్రహించినందున మలదకరూశ దేశమను పేరు వచ్చింది."


    "ఇక్కడే తాటక యనే యక్షిణి వుంటున్నది. భయోత్పాతములు కల్గిస్తున్నది. దాని కథ చెప్తా వినండి."


    "సుకేతుడనే యక్షుడుండేవాడు. అతనికి సంతానం కల్గిందిగాదు. అందుకోసం అతడు ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మ అతని తపస్సుకు మెచ్చాడు. ప్రత్యక్షమయినాడు. సుకేతునికి కొడుకునివ్వక కూతురునిచ్చాడు. దానికి వెయ్యి ఏనుగుల బలముండేట్లు వరమిచ్చాడు. దాని పేరు తాటక - తాటకకు వయస్సువచ్చింది. సుకేతుడు కూతురును సుందునకిచ్చి వివాహం చేశాడు. తాటకకు మారీచుడను కొడుకు పుట్టాడు. ఆ తర్వాత ఆగస్త్యుడు నందుని వధించాడు. ఆగస్త్యుడు తన భర్తను చంపాడని తాటకకు తెలిసింది. అది మండిపడ్డది. మారీచుని వెంటబెట్టుకొని ఆగస్త్యుని మింగడానికురికింది. ఆగస్త్యుడు వారిని శపించాడు. ఆ శాపంతో వారిద్దరూ రాక్షసులైనారు. ఆ కోపముంది వారిద్దరికీ. కాబట్టి ఆ మహర్షికి స్వస్థలమైన ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు.


    "తాటక భయంకరమ రూపం కలది. దుష్టస్వభావురాలు. అనేక మందిని హింసిస్తుంది. కాబట్టి నువ్వు దాన్ని చంపాలి. ఆడదాన్ని చంపడం నీచకార్యమనుకోకు. ప్రజలకు హితమైనకార్యం రాజు చేయాలి. ప్రజల హితంకోసం క్రూరమైనా, అక్రూరమైనా, పాపకార్యమైనా, అపకీర్తికరమైనా ప్రజాహితకార్యం చేయవల్సి ఉంటుంది. కాబట్టి సందేహించాల్సిన పనిలేదు. తాటకను చంపు."


    అందుకు రాముడు చేతులు జోడించి, "మహర్షీ!  నా తండ్రీ "విశ్వామిత్రుడు చెప్పినట్లు చేయమని ఆజ్ఞాపించాడు. అతనిమాట జవదాటను. అంతేగాక తాటకను వధించడంవల్ల ప్రజాహితం కల్గుతుందంటున్నారు. కాబట్టి తాటకను వధిస్తాను." అని చెప్పి విల్లుబట్టి టంకారం చేశాడు. ఆ ధ్వనికి దిక్కులు బద్ధలైనాయి. తాటక అగ్నివలె మండిపడ్డది. ధ్వనినిబట్టి పరుగెత్తుకొని వచ్చింది. సుడిగాలి సృష్టించింది. రామలక్ష్మణులమీద దుమ్ము కురిపించింది.  రామలక్ష్మణులు చికాకుపడ్డారు. రాముడు కోపించాడు. బాణాలు వేసి శిలావర్షాన్ని అడ్డాడు. అప్పుడు తాటక రాముని మీదకు పరుగెత్తుకొని వచ్చింది. రాముడు దాని రెండుచేతులు నరికివేశాడు. తాటక రెక్కలు విరిగిన పర్వతంలా కూలింది. అలా కూలిన తాటక ముక్కూ, చెవులూ కోశాడు లక్ష్మణుడు. తాటక కామరూపిణి, అది మళ్లా రాళ్ల వర్షం కురిపించసాగింది.


    అప్పుడు విశ్వామిత్రుడు రామునితో సాయంకాలాల్లో రాక్షసులనెదిరించడం కష్టం. "సాయంకాలం కాకముందే తాటకను చంపు" అన్నాడు.


    రాముడు విశ్వామిత్రుని మాట విన్నాడు. ఉత్సాహం తెచ్చుకున్నాడు. శబ్దవేది ప్రయోగించాడు. శిలావర్షం ఆపాడు. అప్పుడు తాటక పిడుగులా రామలక్ష్మణులమీదికి వచ్చింది. రాముడు అది చూశాడు. శరసంధానం చేశాడు. బాణం విడిచాడు. అది తాటక గుండెల్లోంచి దూసుకుపోయింది. తాటక పెడబొబ్బలు పెట్టింది. కూలింది. చచ్చింది.


    విశ్వామిత్రుడు రాముడు కౌగలించుకున్నాడు. తల నిమిరినాడు.


    ఆ వనానికి ఉపద్రవం విడిపోయింది. అప్పుడది చైత్ర రథంలా ప్రకాశించింది.


    ఆ రాత్రి వారు అక్కడనే పడుకున్నారు. తెల్లవారింది. విశ్వామిత్రుడు రాముణ్ణి మేల్కొల్పాడు. "రామా! నీవు తాటకను వధించావు. ఉపద్రవాన్ని నిర్మూలించావు. అందుకు నాకు చాల సంతోషంగా వుంది. నాకు అనేక శస్త్రాస్త్రాలు తెలుసు. వాటిని నీకు ఇస్తాను. అందువల్ల నీవు దేవరాక్షస గంధర్వులలో ఎవరినైనా జయించగలవు" అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు అస్త్రములను ఆవహనం చేశాడు. వాటిని రామూనికిచ్చేశాడు. అలా చేయగానే అస్త్రాలన్నీ రామునిముందు ప్రత్యక్షమయ్యాయి. "రామా! మేము మీకు విధేయులము" అన్నాయి. రాముడు అందుకు చాల సంతోషించాడు. వాటిని తాకాడు. తన మనసుననుసరించి వర్తించవలసిందని చెప్పాడు. అవి వెళ్లిపోయాయి. విశ్వామిత్రుడు మళ్లీ జపించాడు. అప్పుడు ఉపసంహారకములన్నియు ప్రత్యక్షమయినాయి. రాముడు వాటికి తాకాడు. తన మనసును అనుసరించి ప్రవర్తించవలసిందని చెప్పాడు. అవి వెళ్లిపోయాయి.

    
    సిద్దాశ్రమము


    అక్కడి నుంచి బయలుదేరి వారు సిద్ధాశ్రమానికి వెళ్లారు. దాన్ని గురించిన కథ విశ్వామిత్రుడిలా చెప్పాడు.


    "బలిచక్రవర్తి మహావీరుడు. అతడు ఇంద్రుని కూడ జయించాడు. స్వర్గాన్ని పాలించాడు. అప్పుడు అతడు యజ్ఞాన్ని ప్రారంభించాడు. అది పూర్తవుతే అతడు అసాధ్యుడవుతాడు. దేవతలు కూడ అతని ఆధీనంలో వుండవలసి వస్తుంది ఏదో విధంగా ఆ యజ్ఞానికి భంగం కల్గించాలనుకొన్నారు దేవతలు, దేవతలంతా విష్ణువు వద్దకు వెళ్లారు. తమను కాపాడవలసిందని ప్రార్ధించారు. విష్ణువు వారికి అభయమిచ్చాడు.


    "అదలా వుండగా కాశ్యపుడు విష్ణువును గురించి ఘోరమైన తపస్సు చేశాడు. నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. కాశ్యపుని భార్య అదితి. ఆమె గర్భంలో జన్మించవలసిందని విష్ణువును వరం కోరాడు. విష్ణువు అంగీకరించాడు.


    "నారాయణుడు అదితి గర్భంలో వామనుడై పుట్టాడు. బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్న చోటికి వెళ్లాడు. తనకు మూడడుగుల నేల ఇవ్వాల్సిందని కోరాడు. బలిచక్రవర్తి సంతోషంగా ఇచ్చాడు. బలిని అణచివేశాడు. ఇంద్రునికి స్వర్గరాజ్యం ఇచ్చాడు.


    "కాశ్యపుడు తపస్సు చేసిన చోటిదే. ఈ ప్రదేశంలో అతనికి తపస్సు సిద్ధించింది. అందుకే ఈ ప్రదేశానికి సిద్ధాశ్రమం అని పేరు వచ్చింది. నేనిపుడు ఈ ఆశ్రమంలోనే తపస్సు చేస్తున్నాను." అని విశ్వామిత్రుడు తన ఆశ్రమంలో ప్రవేశించాడు. అక్కడి మునులు ఎదురువచ్చారు. విశ్వామిత్రుని, రామలక్ష్మణులను పూజించారు. లోనికి తీసికెళ్లారు.

 Previous Page Next Page