"అదేమిటి చాలా ఆకలిగా వుందని ఇంతకుముందే అన్నారుగా?"
"నా ఆకలి తీరిపోయింది."
"సరేలే పదండి!"
"అక్కరలేదు." తెచ్చి పెట్టుకున్న కోపంతో అన్నాడు.
"అలిగారా?"
"ఔను!"
"అలక తీర్చేవాళ్ళుంటేనే ఆ అలకకు అందం."
"అంటే నా అలక నువ్వు తీర్చవన్నమాట!"
"ఊఁహూ!" ముసిముసిగా నవ్వుతూ అన్నది.
"అయితే నాకు అన్నమక్కరలేదు."
"పదండి బాబూ మరీ అల్లర ఎక్కువై పోతున్నది. నాకు ఆకలేస్తోంది."
"అయితే పద!"
రమణమూర్తి భార్య వెనుకే వంటింట్లోకి వెళ్ళారు.
డైనింగ్ టేబుల్ మీద గిన్నెలూ, ప్లేట్లు పెడుతూంది అనసూయ.
ఫ్రిజ్ లో నుంచి వాటర్ బాటిల్ తీసి గ్లాసులోకి నీరు పంపుతున్నాడు రమణమూర్తి.
"మీరు కూర్చోండి నేను చేస్తాగా?"
ఇద్దరూ భోజనం ముందు కూర్చున్నారు.
తను నిజంగా అదృష్టవంతురాలు జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. తను అనుకొన్నదొకటీ జరిగింది మరొకటీ అయినా తను మంచి గమ్యాన్నే చేరుకుంది. తన భర్త అందరిలాంటి వాడు కాడు. తనను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. చివరవరకూ అతని ప్రేమను ఇలాగే నిలుపుకోగలిగితే తనకంటే అదృష్టవంతులు ఉండరు.
"ఏమిటోయ్! అలా అన్నం కలుపుతూ కూర్చున్నావ్? ఏమిటి ఆలోచన."
"ఈ ప్రేమ ఇలాగే ఎప్పటికీ ఉంటుందా అని...."
రమణమూర్తి తృళ్ళిపడ్డాడు.
అతనికి మొదటిభార్య గుర్తుకొచ్చింది.
ఆమె కూడా అలాగే అనేది.
కానీ... ...
"ఆఁ ఏం లేదు."
"చెప్పండి. ఎందుకలా అయ్యారు?"
"ఎలా అయ్యాను."
"అకస్మాత్తుగా మీ కళ్లల్లో ఏదో బాధ కన్పించింది."
రమణమూర్తి మాట్లాడలేదు.
"చెప్పరా?"
"నీకు అబద్ధం చెప్పలేను."
"నిజమే చెప్పండి."
"నీకు బాధ కలుగుతుంది."
"ఫర్వాలేదు చెప్పండి."
"నా మొదటిభార్య కూడా ఇలాగే అనేది." అతడి కంఠంలో బాధ ఉన్నది.
అనసూయ ముఖంలో వెంటనే భావ పరివర్తన కనిపించింది.
ముఖం చిన్న బుచ్చుకుంది.
"సారీ! అనూ! నిన్ను బాధపెడితే క్షమించు!"
"అబ్బే అదేంలేదు."
"మీ ఆడవాళ్ళకు అసూయ ఎక్కువ!"
ఆమె చివ్వున తలెత్తి చూసింది.
"చనిపోయిన వ్యక్తిమీద అసూయ ఎందుకు అనూ!"
అవును!
తను చదువుకున్నది.
ఆలోచించగలదు.
అయినా తనకు మొదటిభార్యను తల్చుకోవడం ఇష్టం వుండదు. ఆయన కొంచెం విచారంగా ఉంటే చాలు ఆమెనే తల్చుకుంటూ బాధపడుతున్నా డనిపిస్తుంది. వెంటనే తనకు అంతరాంతరాల్లో ఏదో గుచ్చుకున్నట్లు అవుతుంది. తను అలా ప్రవర్తించ కూడదు అనుకుంటుంది. కాని తన మనసును అదుపులో పెట్టుకోలేకపోతోంది.
అన్నం వడ్డిస్తున్న అనసూయ పొడవాటివేళ్ళ అందాన్ని చూస్తూ కూర్చున్నాడు రమణమూర్తి.
2
భోజనం చేసి ఆఫీసుకు వెళ్ళిపోయాడు రమణమూర్తి.
అనసూయ వాకిలి వరకూ వచ్చి సాగనంపి, అతను కనుపించినంత వరకూ వాకిట్లోనే నిల్చుంది.
అనసూయ భోజనం చేసింది.
మంచంమీద నడుం వాల్చి కళ్లుమూసుకుంది.
ఎల్లుండే తమ ప్రయాణం. పెళ్ళయి ఆరునెలలు దాటిందియ అయినా ఇద్దరూ కలిసి ఎక్కడికీ వెళ్ళలేదు. ఇదే ఒకరకంగా హనీమూన్. అనసూయ పెదవులమీద చిరునవ్వు లీలా మాత్రంగా కదిలింది.
తను అదృష్టవంతురాలు "పుణ్యం కొద్దీ పురుషుడు" అంటారు. నిజంగానే తను పూర్వజన్మలో పుణ్యం చేసుకొని ఉండాలి. ఆ మాట అంటే రమణ నవ్వుతాడు. ఆయనకు భగవంతుడన్నా, పునర్జన్మలన్నా నమ్మకంలేదు. తనకు ఏ లోటూలేదు. కాని ఒక్క విషయంలోనే అప్పుడప్పుడు తన మనసు కలతపడుతూ ఉంటుంది. ఆయన ఒంటరిగా వున్నప్పుడు ఏదో ఆలోచిస్తూ వుంటాడు. ఒకరోజు అతని కళ్ళల్లో నీరు తిరగటాన్ని కూడా గమనించింది. ఆ సమయాల్లో అతను తన మొదటిభార్యను గుర్తు చేసుకొని బాధపడుతూ వుంటాడని తనకు అర్ధమౌతుంది.
ఒకటి రెండుసార్లు తనతో మొదటిభార్యను గురించి చెప్పబోయి ఆగిపోయాడు. అప్పుడు తన ముఖంలోని భావాలు తనకే కన్పించినట్టు అన్పిస్తుంది. ఎంత మామూలుగా వుండాలనుకున్నా తనవల్లకాదు. అంతే మళ్ళీ ఎప్పుడూ తన ముందు తన మొదటిభార్య ప్రసక్తి తీసుకురాలేదు.
ఒకసారి తనను తానే నిందించుకుంటుంది. చదువుకున్నా తనలో స్త్రీలలో సహజంగా వుండే అసూయ ఉన్నదని తనకు తెలుసు. చనిపోయిన భార్యను కూడా తన భర్త తలుచుకోవడాన్ని తాను భరించలేదు.
కారణం... ఆయన... తన వాడుగానే వుండాలి. కేవలం తనవాడే. అనసూయ ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయింది.
అనసూయ బి.ఏ. పాసయింది. అనసూయకు ఒక అన్న వున్నాడు. అనసూయ తండ్రి తాహసీలుదారుగా ఉద్యోగము చేసేవాడు.
ఆమె చదువుకొనే రోజుల్లో చాలా ఉత్సాహంగా వుండేది. మంచి వక్తగా పేరుపొందింది. వక్తృత్వ పోటీల్లో ఎన్నో బహుమతుల్ని గెలుచుకుంది.