ఆదర్శాలు వినడానికి బాగుంటాయి. ఆచరణ ఎంత కష్టమో మీకు తెలియదు. ఏదో నాలుగురోజులు శలవులు గడపడానికి బాగుంటుంది కాని అమ్మో, అక్కడ వుండటం అంటే... అక్కడ పుట్టి యిరవై ఏళ్ళు పెరిగిన నాకే అమ్మో అనిపిస్తుంది. మీరీ ఆలోచన మానుకోండి. సుఖాన వున్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టడం ఎందుకు..." ఆవేశంగా అంది రాజేశ్వరి.
కేశవరావు విచలితుడై భార్య వంక చూశాడు. తనని అర్థం చేసుకోని ఆమెని ఎలా నమ్మించి వప్పించడం అన్న ఆదుర్దా కనపడింది అతని మొహంలో.
"రాజీ! మన ఇండియాలో, అందులో పల్లెటూర్లలో సదుపాయాలు లేనిమాట నిజమే. అందుకేగదా మనలాంటివారు పూనుకొని బాగుచెయ్యాలనడం! అందరూ తలో చెయ్యివేస్తే మన దేశాన్ని మనం పురోగతి వైపు లేవనెత్తలేమా...ఇది నేను చాలా సీరియస్ గా ఆలోచించి అన్నమాట రాజీ. అర్థం చేసుకో."
"ఏమిటండీ అర్థం చేసుకోడం...ముప్పై ఐదేళ్ళబట్టి యిక్కడ అలవాటయ్యాక మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎలా యిమడమంటారు. నాకీ వాతావరణం, సుఖాలు అలవాటయ్యాక అక్కడికెళ్ళి యిబ్బందులు ఎందుకు పడాలంటారు... మీకు తెలీదు, ఏదో ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు! మీరూ ఉండలేరక్కడ. అది నాకు తెలుసు. సిటీలు చూస్తే నడిచే సందులేని జనం - పొల్యూషన్, నీళ్ళకి, కరెంటుకి యిబ్బంది- ఆ రోడ్లు, ఆ శానిటరీ సిస్టమ్, ఆ లంచగొండితనం, ఆ అలసత్వం... మైగాడ్, నాకు తలుచుకుంటేనే కంపరం ఎత్తుతుంది."
"దేశం అలా వుందనేగగా బాగుచెయ్యాలనుకోడం....రోగగ్రస్థమైన వాళ్ళకే చికిత్సగాని అన్నీ వున్న ఆరోగ్యవంతులకి వైద్యం ఎందుకు. మనదేశమూ యీ అమెరికా స్థాయిలో వుంటే మనం బాధపడడానికి ఏముంది. ఆ స్థాయికి తీసుకురావాలన్నదే గదా ధ్యేయం... ఆంద్రదేశం అదృష్టం అను, ఏదో యిన్నాళ్ళకి పనిచెయ్యాలి, రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడపాలి అన్న యావ వున్న యువకుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అతనికి అన్నివిధాల చేయూత నందించడం పౌరులుగా మన బాధ్యత అనిపిస్తుంది. అతని తపన, ఆరాటం, ఏదో చెయ్యాలన్న కాంక్ష, అది కేవలం ఓట్ల కోసం పడే ఆరాటం కాదు అన్న నమ్మకం నాకు కలగబట్టే యీ విషయాల గురించి ఆలోచించాను. నేను పుట్టి పెరిగిన వూరుని దత్తత చేసుకుని ఆ వూరి అభివృద్ధి కోసం నా చాతనయినంత చెయ్యాలని వుంది. అక్కడ వుండి ఆ ప్రజలని చైతన్యవంతుల్ని చేసి ఆర్థికంగా, సామాజికంగా వారిని పైకితెచ్చి బతికినందుకు ఒక మంచి పని చేశానన్న ఆత్మ తృప్తి నాకు కావాలి" చాలా ఉత్తేజితుడై చెప్తున్న భర్తని ఆశ్చర్యంగా చూసింది.
"ఏమిటి! పల్లెటూరులో ఉంటారా. ఇంకా యిండియా వెడదాం అంటే ఏ హైదరాబాదో, వైజాగో, బెంగుళూరో , ఏ సిటీలోనో వుండి ఇండస్ట్రీ పెడతారనుకుంటున్నాను నేను...వెళ్లి పల్లెటూరిలో ఉండడమా...మైగాడ్ అసలు మీరు ఏం అనుకుంటున్నారు. అక్కడ మనం ఎలా వుండగలం అనుకుంటున్నారు" రాజేశ్వరి కళ్ళల్లో బెదురు. ఇదంతా నిజంగానే చేసేట్టున్నాడు భర్త అన్న అలజడి కలిగింది.
"సిటీలో మనం ఏం చెయ్యగలం! పల్లెలో వుంటే గదా మనం ఏదన్నా చేసినా ఏ సహాయం అందించినా పల్లె ప్రజలకి అందించి వారిని పైకి తేవాలని గదా ఓ పల్లె దత్తత తీసుకోనున్నది. సిటీలో కూర్చుని మన డాలర్లు ఖర్చుపెట్టి ఇండస్ట్రీ పెట్టడానికి నేను రానక్కరలేదు అక్కడికి."
"అయ్యాబాబోయ్ ఏమిటండీ మీరు! వెధవ పల్లెటూరిలో ఎలా వుంటాం...ఓ రోడ్డా, ఓ నీళ్ళా, కరెంటా, కాలక్షేపమా! ఎలా వుంటామండీ. మీకేదో మతిపోయింది."
"రాజేశ్వరీ... రోడ్లు లేకపోతే వేయిద్దాం... నీళ్ళు లేకపోతే బోర్లు తవ్విస్తాం, కరెంటు లేకపోతే జనరేటర్ పెట్టుకుందాం...అయినా నీవనుకున్నంత మరీ కరెంటు కూడా లేని పల్లెలు ఏం లేవు! ప్రతి పల్లెలోనూ టీ.వీ.లు వచ్చాయి. కాలక్షేపం కోసం అనేక వ్యాపకాలు పెట్టుకోవచ్చు. నేను డాక్టరుగా ఉచితంగా వైద్యం చేస్తాను పల్లె ప్రజలకి. నీవు చదువు చెప్పు. ఆడవాళ్ళకి స్వయంఉపాధి లాంటి మార్గాలు చెప్పు... డబ్బుంటే సుఖాలెక్కడయినా అమర్చుకోవచ్చు. మన ఈ కోట్లు ఎవరికోసం కావాలి యిక్కడ. యిదే యీ డబ్బు అక్కడ సద్వినియోగపడితే ఎంత ఆత్మతృప్తి కలుగుతుందో ఒక్కక్షణం ఆలోచించు. మన యిల్లు బాగుచేయిస్తాను..."
"ఏమిటి ఆ పడిపోయే పెంకుటింట్లో వుండాలా..."రాజేశ్వరి కోపంతో మాట పూర్తిచెయ్యలేకపోయింది.
"రాజేశ్వరీ! అన్నీ ఏర్పాట్లూ నేను చేస్తాను...ఒక్క ఆరు నెలల టైములో నేనేం చేస్తాను, చేశాక వచ్చి చూద్దువుగాని. నీకిక్కడ వున్న సౌకర్యాలు అన్నీ వుండేలా చూస్తాను. నేను మాత్రం సౌకర్యాలు లేనిచోట వుండగలనా...నేను ముందు ఒకసారి వెళ్లి చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేసి వస్తాను. ఆరునెలల తరువాత నీవు రా... అప్పుడు చూసి నీకింకేం కావాలో చెప్పొచ్చు. మనం ఆరునెలల వీసామీద వెళ్లి వుందాం. అంతగా నీవు అక్కడా వుండలేనంటే అప్పుడే ఆలోచిద్దాం...మన ఈ దేశం, మన ఈ ఇల్లు ఎక్కడికీ పోదు..." రాజేశ్వరి ఏమనాలో తోచక తలపట్టుకుకూర్చుంది.
"విక్రమ్! నీవు వెంటనే యీ వీక్ ఎండ్ కి రావాలి. అర్జంట్. చాలా మాట్లాడాల్సిన పని వుంది. వినతిని కూడా రమ్మంటున్నాను. శనివారం సాయంత్రానికి ఉండాలి మీరిద్దరూ..." రాజేశ్వరి కొడుకుతో చెప్పింది.
"మమ్మీ! ఏమిటి, ఏమయిందో కొంచెం చెప్పు... సాటర్ డే వరకూ మేం టెన్షన్ లో ఉండాలా... డాడీ ఆరోగ్యం..." ఆరాటంగా అన్నాడు కొడుకు
"టెన్షన్ ఏమీ వద్దు...మీ డాడీకి, నాకు ఏం కాలేదు. అనవసరంగా వర్రీ వద్దు. మాట్లాడాల్సిన పని ఉందని రమ్మంటున్నాను అంతే. టేకిట్ ఈజీ.. వినతితో చెప్పాను, వస్తానంది... డిన్నర్ టైములోగా వచ్చేయ్" రాజేశ్వరి ఫోను పెట్టేసింది. బోస్టన్ లో ఉంటున్న కొడుకు విక్రమ్ కి, న్యూజెర్సీలో ఉన్న కూతురికి ఫోను చేసింది రాజేశ్వరి. కేశవరావుకి పట్టిన 'జన్మభూమి' పిచ్చిని పిల్లలైనా వదిలిస్తారేమోనని ఆమెకి ఆశగా వుంది. అందరూ కల్సి నచ్చచెప్పి కన్విన్స్ చేయవచ్చని ఆమె ఆలోచించింది.
విక్రమ్ బోస్టన్ మెమోరియల్ హాస్పిటల్లో ఆర్దోపెడిక్ సర్జన్. కోడలు మహారాష్ట్ర అమ్మాయి. గైనకాలజిస్టు. తన జూనియర్ అయిన డాక్టర్ సునీతని ప్రేమ వివాహం చేసుకున్నాడు విక్రమ్. వాళ్ళకి ఐదేళ్ళ కొడుకు. ఏడేళ్ళ కూతురు. అక్కడ నార్త్ బరోలో పెద్ద ఫోర్ బెడ్ రూమ్ ఇల్లు కట్టుకుని ఉన్నారు బోస్టన్ కి దగ్గరలో.
కూతురు వినతి. అల్లుడు సందీప్. ఇద్దరూ కంప్యూటర్ ఇంజనీర్లే. వాళ్ళది పెద్దలు కుదిర్చిన పెళ్ళే. న్యూజెర్సీలో కాస్త దగ్గిరగా ఉంటారు కనక నెలకి ఒకటి రెండుసార్లయినా న్యూయార్క్ లో వున్న తల్లిదండ్రుల దగ్గిరకి వచ్చిపోతుంటుంది వినతి. ఆమెకి పదేళ్ళ కొడుకు, ఎనిమిదేళ్ళ కూతురు ఉన్నారు.
పిల్లలిద్దరికి మంచి చదువులు చెప్పించి, మంచి ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు అయ్యాక ఎవరి సంసారాల్లో వాళ్ళున్నారని డాక్టర్ కేశవరావు చాలా నిశ్చింతగా వుండి, యీ మధ్య కాస్త రిలాక్స్ డ్ గా వుండి ప్రాక్టీసు తగ్గించుకుని తన జూనియర్లకి పని కాస్త కాస్త అప్పజెప్పడం మొదలుపెట్టాడు అతను. పెద్ద బంగళా- ఇంటిలోనే స్విమ్మింగ్ ఫూల్, సకల సదుపాయాలున్నాయి. బ్యాంకులో మిలియన్లున్నాయి. జీవితంలో సాధించడానికి ఏమీ మిగలలేదు అన్న తృప్తి వుంది ఆయనకీ.
అందుకే అతని ఆలోచనల్లో ఏదో కొత్త పనిచేసి జీవితంలో ఏదో సాధించాలన్న తృప్తి ఆనందం పొందాలనిపించిన తరుణంలో శలవులో ఇండియా రావడం, నాన్ రెసిడెన్స్ ఇండియన్లని ముఖ్యమంత్రి ఇండియాలో మదుపుపెట్టి పరిశ్రమలు స్థాపించమని, ఒక్కొక్కరు ఒక గ్రామం దత్తత తీసుకుని గ్రామాభివృద్ధి సాధించి జన్మభూమి రుణం తీర్చుకోమని చేసిన ప్రసంగం అతనికి బాగా నచ్చింది. ఆలోచన క్రమంగా రూపుదాల్చి అతనిలో నూతనోత్సాహాన్ని కల్గించింది. భార్య యీ రోజు అర్థం చేసుకోకపోయినా ఒకసారి అక్కడికి వచ్చి తను చేసింది, చేసేది చూస్తే మనసు మార్చుకుంటుంది అన్న నమ్మకం వుంది.