అయినా చెప్పుకోవడానికి నాకెవరున్నారు?
తల్లా?
తండ్రా?
అమ్మే బ్రతికుంటే?
నాన్నే ఉండివుంటే?
నా బ్రతుకు ఇలా బండలపాలవుతుంటే చూస్తూ ఊరుకుంటారా ?"
సత్యనారాయణ చేతివ్రేళ్ళు వణికాయి. చేతుల్లో కాగితాలు రెప రెపలాడాయి.
మెదడులోకి రక్తం చిమ్మింది.
దీర్ఘంగా నిట్టూర్చి ముందుకు చదవసాగాడు -
"ఏమిటో నాపిచ్చి! అమ్మా నాన్నే బ్రతికుంటే అసలు ఈ పెళ్ళికి ఒప్పుకునేవారా! నేను వాళ్ళకు బరువైపోయేదాన్నా! ఎలాగో ఒకలా బరువు దించుకోవాలనుకునేవారా?
ఉన్నదాంట్లోనే తల తాకట్టు పెట్టయినా మంచి సంబంధం చేసేవాళ్ళుకారా? నా ఇష్టా ఇష్టాలతో సంబంధం లేకుండా తాడూ బొంగరం లేనివాడికి ఇచ్చి చేసేవాళ్ళా?
కానీ నువ్వేం చేశావ్ ?
కట్నం ఇవ్వాల్సి వస్తుందని వదిన మాటలు విని నాకు నచ్చిన సంబంధం కాకుండా చేశావు! కనీసం చదువుకున్నా నా కాళ్ళమీద నేను నిలబడి నాకు నచ్చినవాణ్ని చేసుకునే దాన్ని. గాని నా చదువుకూడా మాన్పించావు.
వదిన బి .ఏ చదువుకుంది.
అయినా నేను చదువుకోవటం ఆమెగారికి నచ్చలేదు. లేనిపోనివన్నీ కల్పించి చెప్పింది. నువ్వూ నమ్మావు.
చివరకు కానీ కట్నం లేకుండా చేసుకుంటాననగానే నీ స్నేహితుడికిచ్చి చేసి నీ బరువు దించుకున్నావు"
సత్యనారాయణ మనసుకు ఒక్కొక్కవాక్యం తుమ్మముల్లులా గుచ్చుకున్నది. ముందుకు చదవలేకపోతున్నాడు.
తను సరోజను బరువుగా భావించాడా? అమ్మా నాన్నా లేని లోటును తీర్చ లేకపోయాడా? కట్నం ఇవ్వాల్సివస్తుందని మాత్రమే సరోజను తన స్నేహితుడికి యిచ్చి చేశాడా?
దిగులుపడి కూర్చున్న సత్యనారాయణ కళ్ళముందు గతం తాలూకు తలుపుల తుప్పుపట్టిన గడియ ఊడిపోయింది.
2
అనుభవం జీవితాన్ని ముందుకు నడిపినప్పుడు జీవితం వికాసం పొందుతుంది. ఇదే మానవజీవితపు రహస్యం.
రెండూ - ప్లస్ - రెండూ కలయికలో వికాసం లేదు...
ఆకర్షణ లేదు.
రెండూ - ప్లస్ - మూడూ కలిసినప్పుడే అందం, ఆకర్షణా వుంటుంది.
ఎరుపు రంగుతో ఎరుపురంగు కలిస్తే ప్రత్యేకత ఏర్పడదు.
ఎరుపూ. ఆకుపచ్చ కలిస్తే మరో ప్రత్యేకమయిన రంగుగా మారి, కొత్త ఆకర్షణ ఏర్పడుతుంది.
అలాగే సమాన వ్యక్తిత్వం, అభిమానం, అహంకారం, తేజస్సు గల ఇద్దరు వ్యక్తులు కలయిక సుఖప్రదం కాదు.
రెండుకత్తులు ఒక ఒరలో ఇమడనట్టే అభిమానం, అనురాగం ఒక హృదయంలో ఇమడవు. ప్రేమిస్తున్న వ్యక్తిముందు కొంత అభిమానం తగ్గించుకోక తప్పదు.
పోరాటం వ్యక్తులమధ్య జరగదు. వ్యక్తులు విభిన్న ఆదర్శాల మధ్య జరుగుతుంది. భిన్న ఆదర్శాలూ, అభిరుచులూ గల ఇద్దరు వ్యక్తులు ప్రాణస్నేహితులుగానో ప్రేమికులుగానో ఉండగలుగుతున్నారంటే వారిలోని మానవత, తమ తమ అభిరుచులను ఆశయాలను కొంతవరకు అదుపులో పెట్టగలుగుతుందన్న మాట.
అలాంటి వ్యక్తులు జీవితంలో రాజీపడగలరు.
పరిస్థితులతో రాజీపడడం మానవవికాసానికి గొడ్డలి పెట్టే కావచ్చును. కాని తను ప్రేమించే వ్యక్తిముందు తన ఆదర్శాలనూ, అభిరుచులనూ కొంతవరకు అదుపులో పెట్టుకోక తప్పదు. అలా కానప్పుడు వారిద్దరూ ఎంత దగ్గర కావాలనుకున్నా దూరంగానే వుండిపోతారు.
కొందరు వ్యక్తులు తమ ఆనురాగాన్ని పైకి తెలియపరచటానికి అభిమానపడతారు. ఎదుటివాళ్ళు తమ ప్రేమను వ్యక్తం చేయాలని కోరుకుంటారు.
భార్యభర్తకి తన ప్రేమను ప్రకటించాలని కోరుకుంటుంది.
భర్త భార్యనుంచి కూడా అదే ఆశిస్తాడు.
ఇద్దరూ అలాంటివాళ్ళే అయినప్పుడే వచ్చేది చిక్కు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూనే దూరంగా వుండిపోతారు. తమ మనసుల్లోని ఆనురాగాన్ని లక్ష్యం లేనట్టు ప్రవర్తిస్తారు.
పెంపుడుకుక్క యజమాని ఇంటికి రాగానే ఎదురుపరుగెత్తుకెళుతుంది. ముందు రెండుకాళ్ళూ ఎత్తి పైపైకి ఎగురుతూ ఆవేశంగా తన ప్రేమను ప్రకటిస్తుంది. ఆ యజమాని దాన్ని ఆప్యాయంగా కొంతసేపు నిమురుతూ పాలకరిస్తే గాని శాంతపడదు.
మనసులోని ఆనురాగాన్ని అణచుకున్న వ్యక్తి పైకి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తాడు.
సత్యనారాయణకు అభిమానం ఎక్కువ.
తన అభిప్రాయాలు ఇతరులతో కలవనప్పుడు రాజీ పడడం చేతకాదు అతనికి.
పద్మకూ అభిమానం ఎక్కువే.
ఆమె కలిగిన కుటుంబంలో పుట్టింది. కష్టం, సుఖం తెలియకుండా పెరిగింది. ముగ్గురు మగపిల్లల తర్వాత పుట్టిన పద్మను తల్లిదండ్రులు అల్లారుముద్దుగా, ఆమె ఆడింది ఆటగా, పాడింది పాటగా పెంచారు.
తనను ప్రేమించేవారి సంఖ్య పెంచుకోవడం మాత్రమే తెలిసిన పద్మకు, తన మనసులోని ప్రేమను వ్యక్తం చేయడం తెలియదు.
"కలిగిన కుటుంబంలోంచి వచ్చింది కదూ? కట్నం కూడా తెచ్చింది! అందుకే అంత పొగరు తలబిరుసు మాటకుమాట ఎదురు చెబుతోంది! తనంటే బొత్తిగా లక్ష్యంలేదు"
భార్యను గురించి అనుకుంటాడు సత్యనారాయణ.
"అమ్మతో, చెల్లెలితో అంతఆప్యాయంగావుంటాడు తనంటేనే నిర్లక్ష్యం! పెళ్ళాం అంటే చెప్పుకింద తెలులా పడివుండాలని కాబోలు అతని అభిప్రాయం. పొరపాటుగా నైనా "పద్మా నువ్వు నా ప్రాణనివి! నువ్వు లేని ఈ జీవితం నిస్సారం" అన్నాడా?"
"ఎందుకంటాడు? అనడు! తన కేనా ఏం అంత వ్యక్తిత్వం లేనిది?"
భర్తను గురించి పద్మావతి అనుకుంటూ వుంటుంది.
ఆ రోజు సత్యనారాయణ ఆఫీసు నుంచి వస్తూనే, "సరూ! సరూ!" అంటూ కేకలు పెట్టాడు.
ఎందుకో చెల్లెల్ని పిలుస్తున్నాడు?
పద్మ బయటికి వచ్చింది.
అప్పటికే సరోజ పరిగెత్తుకుంటూ అన్న దగ్గరకు వచ్చింది.
"ఏంటన్నయ్యా!" అంది సరోజ సాగదీస్తూ.
"మల్లెపూలు? నీకు ఇష్టం అని తెచ్చాను! వదినా నువ్వు పెట్టుకోండి" అంటూ దవనంతో కలిపిపెట్టి మల్లె పూల చెండును చెల్లెలికి అందించాడు సత్యనాయణ.
"అప్పుడే మల్లెపూలువస్తున్నాయా?" ఉత్సాహంగా అంటూ అందుకుంది సరోజ.
బోడి మల్లెపూలు! చెల్లెలికిచ్చి తనక్కూడా ఇవ్వమంటాడా? తనేం పూలకోసం మొహం వాచి వుందా? ఎప్పుడూ ఇంతే? ఈ మనిషి వాలకంఏమిటో తనకుబొత్తిగా అర్థం కావడంలేదు.
సరోజ పూలచెండు దారాన్ని మునివేళ్ళతో మధ్యకు కొరికి రెండు చేసింది.
"ఇదిగో వదినా!" అంటూ అందివ్వబోయిందిపద్మకు.