Next Page 
బంధితుడు పేజి 1

                                 

  

                                                                         బంధితుడు
                                                -వాసిరెడ్డి సీతాదేవి


    "వడ్డించాను. రండి!" అంటూ పద్మ మెల్లగావంట ఇంట్లోనుంచి హాల్లోకి వచ్చింది.
    భర్త సత్యనారాయణ అక్కడలేడు.
    బయటకువచ్చి చూసింది.
    పోస్టుమాన్ కు సంతకంచేసి కాగితం ఇచ్చి, కవరు చింపుతూ లోపలకు వచ్చాడు! అదుర్దాగా పడక కుర్చీలో కూర్చుని కవరు విప్పసాగాడు.
    కవరు లావుగానేవుంది.
    ఇంకెవరు ముద్దుల చెల్లెలే రాసివుంటుంది. పని లేకపోతేసరి! పదిహేను రోజులన్నా కాలేదు వెళ్ళి ఇంతలోనే ఏ మొచ్చిందో?
    అసలు ఈ మనిషికీ బుద్దుంటేగా?
    ఎవరి సంసారాలు వాళ్ళకు అయాక కూడా ఇంత నెత్తిన పెట్టుకోవడం ఎక్కడా చూళ్ళేదు! అబ్బో చాలా కాగితాలే వున్నాయ్? ఇవ్వాళ ఈ మనిషి సమయానికి ఆఫీసుకు వెళతాడా?
    పద్మ లోలోపల అక్కసు పడిపోసాగింది.
    "మీ చేల్లెలేనా రాసిందీ?" వుండబట్టలేక రాగం తీస్తూ అడిగింది భర్తను పద్మ.
    సత్యనారాయణ తలెత్తి భార్య ముఖంలోకి చిరాకుగా చూశాడు.
    ఈ మనిషికీ బొత్తిగా నామటంటేనే చిరాకు. చెల్లెలి పేరెత్తితేచాలు ముఖం ధుమ ధుమలాడిపోతుంది.
    "మాట్లాడరేం? ఎవరూ? మీ చెల్లెలేనా?" పద్మ కంఠం తీవ్రంగా వుంది.
    సత్యనారాయణకు వళ్ళు మండిపోయింది.
    కవరు పూర్తిగా విప్పక ముందే ఎవరు రాశారో చెప్పాలట. తన చెల్లెలంటే దీనికి బొత్తిగా గిట్టదు! ఏం తన  చెల్లెలు తనకు ఉత్తరం రాయకూడదా?
    తను మాత్రం అన్నలకు ఉత్తరాలు రాయదా?
    అసలు ఇంతకీ ఏడుపు ఏమిటో తనకు తెలియదా ఏం?
    సత్యనారాయణ భార్య మాటలు విననట్టేఉత్తరం చదవసాగాడు.
    "మాట్లాడరేం? ఎవర్రాశారూ?"
    "ఎవరో ఒకరు రాశారు! ఈ ఉత్తరం నీక్కాదు వచ్చింది. వెళ్ళి నీ పని చూసుకో?"
    విసురుగా అన్నాడు సత్యనారాయణ భార్య ముఖంలోకి చూడకుండానే.
    "మీ ముద్దుల చెల్లెలు మీకు రాస్తుంది. మధ్యలో నే నెవర్తిని నాకు రాయడానికి? మొన్ననేగా వెళ్ళింది. ఇంతలోనే ఏం కొంపలు ముంచుకుపోయాయంట? అంత పెద్ద ఉత్తరం రాసింది?" సాగదీస్తూ అన్నది పద్మ.
    "నీ  గొడవ తగలెయ్యా! ఉత్తరం చదవకముందే ఏమిటే నీ ఏడుపు?"
    తీవ్రంగా భారీ ముఖంలోకి చూశాడు సత్యనారాయణ.
    "అవున్లే, మధ్యలో నా ఏడు పెందుకు? ఆ ఏడ్చేదేదో మీ అన్నా చెల్లెళ్ళే ఏడవండి?"
    నడుం తిప్పుకుంటూ విసవిసా లోపలకు వెళ్ళిపోతున్న భార్య సత్యనారాయణ కళ్ళకు పుట్టలోకి జరజర పాకిపోతున్న నాగినిలా కన్పించింది.
    భార్యమీద ఎక్కడలేని కోపం వచ్చింది.
    కోపాన్ని దిగ మింగుకొని ఉత్తరం చదవసాగాడు.
    "ప్రియమైన అన్నయ్యకు.
    నమస్కారాలు. పోయిన శుక్రవారమే అక్కడినుండి వచ్చాను. ఇంత త్వరలో ఈ ఉత్తరం రాయాల్సి వస్తుందని నేను అనుకుంటూనే వున్నాను. కానీ నువ్వే అనుకొని వుండవు. అందుకే నన్ను అనేక విధాల ఒప్పించి పంపించావు అవున్లే నువ్వుమాత్రం ఏం చేస్తావ్? నువ్వు స్వతంత్రుడివా ఏమన్నానా? నేను నీ దగ్గర వుండడం వదినకు బొత్తిగా ఇష్టం వుండదు."
    అంతవరకు చదివిన సత్యనారాయణ కనుబొమల ముడి పడ్డాయి.
    ఈ ఆడవాళ్ళు చస్తే మారరు?
    సరోజకు బొత్తిగా పద్మ పోడ గిట్టదు.
    ఆమాటకొస్తే పాపం పద్మేనయం.
    "మళ్ళీ ఉత్తరం చదవడం ప్రారంభించాడు.
    "నాకు ఈ ఉత్తరం రాయడం బొత్తిగా ఇష్టం లేదు కాని పరిస్థితులు అంత అధ్వాన్నం అయిపోయాయి. నేను నెత్తిన నోరు పెట్టుకొని కొట్టుకున్నా నా మాటల్ని నువ్వు పట్టించుకో లేదు. నా గోడు నీకు అర్థం కాదు. నా బాధను పట్టించుకోవు.
    పైగా చిలిపి తగాదాలు పట్టించుకోవద్దంటావు.  నీ బావమర్ది నీ లాంటివాడనే అనుకుంటావు.
    వదిన ఎలా ప్రవర్తించినా నువ్వు సర్దుకు పోవడం లేదా?
    నీతో ఆయనకు పోలికేమిటి?
    నా బాధాలు నీకేం తెలుసు? చెప్పినా నీకు చీమకుట్టినట్టయినా అనిపించదు. వదిన అదృష్టవంతురాలు.
    చెప్పుచేతల్లోవుండే మొగుడు దొరికాడు."
    సత్యనారాయణ మనసు కలుక్కుమంది. తను భార్య చెప్పుచేతల్లో ఉన్నాడా? చెల్లెలికోసం  పద్మను ఎన్నిసార్లుఎన్ని విధాలుగా బాధలుపెట్టాడు? ఎన్నెన్ని మాటలన్నాడు? సరోజకు తెలియదా ఆ విషయం?
    మళ్ళీ ఉత్తరం చదవ సాగాడు.
    "అన్నయ్యా! ఏం చెప్పమంటావ్? ఆ మనిషి ఇది వరకటి మనిషికాదు. నువ్వెరిగిన మనిషికాదు. పూర్తిగా మారిపోయాడు. అతను నాజీవితాన్ని ఉద్దరిస్తాడనుకున్నావుగదూ?
    నా బ్రతుకును స్వర్గధామం చేస్తాడనుకున్నావు గదూ?
    కాని నా బ్రతుకు నరకం అయింది.
    నా జీవితాన్ని అందరూ కలసి నాశనం చేశారు.
    నాపాలిటి యముడయిపోయాడు, లోకానికి మంచివాడే.
    కొందరు మంచివాళ్ళు మంచిపేరుకోసం మంచికోసం ప్రవర్తిస్తారు. వాళ్ళనే లోకం మంచివాళ్ళుగా గుర్తిస్తుంది. అందరిదగ్గరా మంచితనం ప్రకటించి, నటించి చివరకు అసలు  రూపం ఇంట్లో పెళ్ళాం దగ్గర చూపిస్తున్నాడు.
    ఎందుకులే అన్నయ్యా? నీకు చెప్పి ప్రయోజనం ఏమిటి? ఏమిటో ఉండబట్టక గాని.....

Next Page