కుర్చీలోంచి లేచి అసహనంగా అతనివేపు చూసింది.
అతనికి దాదాపు నలభయ్యేళ్ళ వయస్సు వుంటుంది. పక్కన ఒక ఆడమనిషి కూడా ఉంది, భార్యేమో? ఆమెనానుకొని మరో కుర్రాడు వున్నాడు. కొడుకు కాబోలు రాధను చూసి నవ్వుతున్నాడు అతను. ఖద్దరు జుబ్బా, ఖద్దరు పంచె, పేటంచు కండువా. దర్జాకేమీలోటు లేదు వెధవకి అనుకుంది.
బాగా రష్ గా వుండడంతో బయటికి వెళ్ళటానికి వీలులేక కుర్చీల్లోనే వుండిపోయారిద్దరూ. హౌస్ ఫుల్ కావటంతో సీటు మారే అవకాశం కూడా లేకపోయింది వాళ్ళకు.
మళ్ళీ లైట్లు ఆరిపోయి, ప్రారంభమయ్యే వరకూ స్లయిడ్స్ వేశారు, సినిమా ఆరంభమైంది.
పది నిమిషాలు గడవగానే మళ్ళీ చేయి వేశాడతను.
విసురుగా వెను తిరిగి. "మీ చేయి తీసుకోండి" అంది కోపంగా రాధ.
"సారీ!" అన్నాడతను.
ఏమిటేమిటని అడిగిన సరితకు అంతా చెప్పింది రాధ.
"బ్రూట్!" అంది సరిత.
తిరిగి తెరపై దృష్టి మరల్చారు ఇద్దరూ.
సినిమా ముగిసే వరకూ అతనింకేమీ అనలేదు.
పిక్చర్ ముగియగానే ఇద్దరూ కదిలారు. వాకిలి దాటి మెట్లు దిగుతూన్న రాధను మళ్ళీ చేయిపట్టి లాగాడతను. రష్! మనుషుల తొక్కిడి. దిగి వెళ్ళే తొందర, మెట్లు దిగేవరకూ రాధ ఏమీ చేయలేక పోయింది.
చివరి మెట్టు మీద ఉండగా మళ్ళీ జబ్బమీద చేయివేశాడతను. అతనిచేయి అలాగే అదిమి పట్టుకుని మరో చేత్తో లాగి లెంపకాయ వేసింది రాధ.
సరిత విజృంభించింది.
"రాస్కెల్! సినిమాకి ఇందుకట్రా వచ్చింది? మేం ఎవరనుకున్నావ్? యూనివర్సిటీ స్టూడెంట్స్, నిన్ను నిలువునా చీరేస్తాం. సినిమాకి వచ్చిన ఆడపిల్లల్ని అల్లరిచేస్తావా? నీకు చెల్లెళ్ళులేరూ? నీ పక్కనున్న భార్యని ఎవరయినా అలా చేస్తే నువ్వు సహిస్తావా? ఈ హాలుకి వచ్చిన మగాళ్ళలో ఎవరినయినా న్యాయం చెప్పమను." ఒక్కోమాట అంటూ శాండల్ విడిచి బాదుతూ తిట్టసాగింది సరిత.
రాధ మండిపడుతూ తిట్టసాగింది.
అంతలో అటుగా వచ్చిన గోపీ విషయం అర్ధం చేసుకుని, అతని చొక్కా పట్టుకుని లాగి, ధన్ ధన్ మని బాదసాగాడు.
"ఏమిటేమి"టని నలుగురూ అడగకనే విషయం అర్ధమైంది.
అందరూ తోచినట్లుగా చివాట్లు వేయసాగారు. ఆ వ్యక్తికి చచ్చిన చావై వంచిన తల ఎత్తలేదు. అతని భార్య కూడా మౌనమే వహించింది.
"ఇలాంటి వ్యక్తుల్ని ఊరికే వదలకూడదు. పోలీసులకే అప్పగిస్తే సరి, బుద్ధివస్తుంది. మళ్ళీ ఇలా చెయ్యరు" అన్నారెవరో.
పోలీసులు అన్నమాట వినగానే ఆ వ్యక్తి ముఖం మాడిపోయింది. నలుగురూ నాలుగు విధాల మాట్లాడుకుంటూ వుండడంతో మెల్లగా తప్పించుకుని వెళ్ళిపోయాడు.
ఉన్నట్టుండి 'ఏడీ?' అనుకున్నారంతా.
"వెధవ! తప్పించుకుని పోయాడు. పోనీలెండి చచ్చేట్టుగా కొట్టారు. బాగా బుద్ధి వచ్చింది. ఇంకోసారి ఇలా చేయడు" అన్నాడు అతను జారుకోవటం గమనించిన వ్యక్తి.
అంతలో దగ్గిర పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. ముగ్గురు కానిస్టేబుల్స్ వచ్చారు. ఏమిటంటూ ఎవరో అటుగా వెళ్ళుతున్న ప్రేక్షకులు సినిమా ధియేటర్ వద్ద గొడవ జరుగుతూందని చెప్పటంతో హుటాహుటి వచ్చారు వాళ్ళు.
గోపీ విషయం అంతా వివరించి చెప్పాడు. "స్టేషన్ కి వచ్చి ఉంటే బొక్కలో తోసి నాలుగు బాది ఉంటే బుద్ధి వచ్చి ఉండేది" అన్నాడు ఎస్.ఐ.
ఇంతలో ధియేటర్ మేనేజర్ వచ్చి వాళ్ళకు క్షమాపణ చెప్పుకున్నాడు.
పోలీసులు దగ్గర వుండి రిక్షా ఎక్కించి పంపారు ఇద్దర్ని.
* * *
ఆ సంఘటన జరిగిన తరవాత రాధ, గోపీ కనుపించినపుడెల్లా కళ్ళతో 'కులాసా? అని పలుకరించేది. గోపీ కూడా నేత్రావధానం చేసేవాడు.
ఒకరోజు బీచివైపు వెళ్ళినరాధ, సరితలకు అల్లంతదూరంలో సముద్రం ఒడ్డున కూర్చున్న గోపీ కనుపించాడు.
"అడుగోనే మీ హీరో" అంది సరిత.
"ఛ! నోర్ముయ్! ఆ రోజు అతను సహజంగా చొరవ చేసుకున్నట్టుగ ఉంది" అంది రాధ.
"ఓహో! మీ హీరోకి ఎవరైనా కాలేజీ స్టూడెంట్స్ పై చేయి వేస్తే శిక్షించటం సహజమన్నమాట! పాపం! అతని కిదేనా డ్యూటీ?"
ఉరిమి చూసింది రాధ.
"ఇదిగో, రాధా! ఇలాగే చూశావంటే మీ హీరోకాస్తా బెదిరిపోగలడు."
చెవి పట్టుకుని, "మళ్ళీ అలా అంటావా?" అంది రాధ.
"సారీ!" అంది సరిత.
"నమస్కారం" అన్నాడు వాళ్ళను చూసిన గోపి.
ప్రతి నమస్కారం చేశారు వాళ్ళు.
"కూర్చోండి" అన్నాడతను.
"పాపం! తన హాస్టలు రూము అనుకుంటున్నాడేమోనే? అతిధి మర్యాద చేస్తున్నాడు" అంది సరిత.
సరిత తొడ గిల్లింది రాధ.
'అమ్మోయ్!'
"ఏమిటండీ? గాభరాగా అడిగాడు గోపీ.
సిగ్గుపడింది సరిత.
రాధ జవాబు చెప్పలేదు.
"ఫస్టియర్ పరీక్షలు రాబోతున్నాయి. ఎలా చదువుతున్నారు?" అడిగాడు గోపీ.
"గోపీగారూ! పరీక్షలకూ, పుస్తకాలకూ కాస్త దూరంగా ఉందామనే బీచికి వచ్చాం. మళ్ళీ ఆ గొడవ ఎందుకు, చెప్పండి? కులాసాగా నాలుగు కబుర్లు చెప్పండి"
"హల్లో! సరితగారూ? ఎలా ఉన్నారు? సినిమాలకు వెళుతున్నారా? వీక్లీలు చూస్తున్నారా, ఈ మధ్య? ఏదైనా స్పెషల్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారా? డాన్సా, మ్యూజిక్కా?" సీరియస్ గా అడుగుతూన్న అతన్ని చూసి ఫక్కున నవ్వింది రాధ. గోపీ కూడా జత కలిపాడు.
సరిత కూడా నవ్వింది.
ఆ మువ్వురి నవ్వుల్లో బీచి అందాన్ని సంతరించుకుంది.
* * *
"సరోజా! మీ అన్నయ్యొచ్చారు కాఫీ పట్రా."
రమణయ్య కేకకు సమాధానంగా కాఫీ తీసుకుని వచ్చింది సరోజ. ఆ సరికి తీరికగా కూర్చుని సిగరెట ముట్టించాడు రామశేషు.
"ఒదినా పిల్లలూ బాగా ఉన్నారా అన్నయ్యా?" అని అడిగింది సరోజ.
"మీరు అమెరికాలో ఉంటున్నారు మేము ఆఫ్రికాలో ఉంటున్నాము, రానుపోను విమానం ఖర్చులు వేలకు మించుతాయి. ఏం చేద్దాం?" అన్నాడు శేషు. "ఏం దెప్పి పొడవనక్కర్లే! ఆడబిడ్డని ఇంటికి తీసుకెళితే రానా? రానన్నానా? సిగ్గులేక దెప్పి పొడుస్తున్నావా? ఒక్క పండుగ కాకుంటే ఒక్క పండుగకయినా మమ్మల్ని రమ్మని పిలిచావా?" అంది సరోజ.
"చూశావా, బావా నీ భార్య ఎలా అంటూ వుందో?"
"నాదేం తప్పు, బావా? నీ చెల్లెల్ని అలా పెంచావు."
"బాగుమ్ది౧ మేము పెంచి పెద్దచేసి, నీ చేతిలో పెట్టాం. అదుపులో పెట్టుకోవలసింది నీవు."
"అంత మనిషిని చేతిలో పెట్టుకోవటం ఎలా? అయినా నా అదుపు మించి ఏనాడూ చరించలేదు."
"నీ ఎదుటే నన్నెలా అందో చూశావా?"
"అది మీ పుట్టింటి వ్యవహారం - నేనేం చేయను?"
"సరోజా నన్ను దెప్పుతున్నావ్ కానీ - ఏ పండుగకు పిలిచినా నీవు రానని అనలేదటే?"
"అన్నూ మరి, ఆయన్ని వదిలి ఎలా రాను?"
"ఆయనతో సహా రావద్దన్నానా?"
"ఆయన పండుగ రోజున తల్లికీ, తండ్రికీ పెట్టుకోనిది వుండరు. మరి ఎలా వస్తారు?"
"ఆయన రారు, ఆయన రారని నీవు రావు - మళ్ళీ నన్ను దెప్పుతావేం మరి!"
"అన్నయ్యా?"
"ఏం చెల్లాయ్?"
"పండుగకి కాకపోతే ఉట్టప్పుడు పిలవకూడదట్రా!"
"నలుగురూ నవ్విపోవటానికా?"
"ఇప్పుడు సంతోషిస్తారు కాబోలు!"
"అబ్బబ్బ! మీ వాదన ఇంక చాలించండి, ఇప్పుడు మనకేం తక్కువైందని ఆయన పెట్టాలి? సరోజా, నీవు వెళ్ళి పని చూసుకో" అన్నాడు రమణయ్య.